డబ్బులు ఇస్తామన్నా ఎవ్వడూ రావట్లేదు....

  వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఆ పాదయాత్ర వైసీపీ నేతలకు పెద్ద తలనొప్పిగా తయారైంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఏదో కష్టపడి పాదయాత్రను లాక్కొచ్చారు కానీ.. ఇప్పుడు అదే చాలా కష్టమైపోయింది వారికి. రోజూ లారీల కొద్దీ జనాలని, వారికి భోజనాలు, మంచినీళ్లు అన్ని చూసుకోలేక నానా కష్టాలు పడుతున్నారు. ఇక ఇదే విషయంపై ఓ వైసీపీ నాయకుడికి కోపం వచ్చినట్టుంది.. అందుకే లోటల్ పాండ్ సిబ్బందికి చీవాట్లు పెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జగన్ ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నాడు. ఈనేపథ్యంలో... లోటస్ పాండ్ నుండి ఓ సిబ్బంది అక్కడ నియోజక వర్గానికి చెందిన వైసీపీ నేతకు ఫోన్ చేశారంట. ఫోన్ చేసి ఈరోజు ఎంతమంది జనాన్ని తరలిస్తున్నారు, ఎక్కడి నుండి వస్తున్నారు, ఎన్ని వెహికిల్స్ లో తీసుకువస్తున్నారు అన్ని ప్రశ్నల మీద ప్రశ్నల మీద వేయగా... అప్పటికే ఎండలో తిరిగి, తిరిగి ఉన్న సదరు వైసీపీ నేతకు సుర్రున కాలి... మేం కింద ఫీల్డ్ లో నానా చావు చస్తున్నాం.. మీకేం మీరూ చక్కగా ఏసీ గదుల్లో కూర్చున్నారు... ఏసీ గదుల్లో కూర్చుని లెక్కన అడగటానికి మీకు బ్రెయిన్ ఉందా...? ఏంటి మీకు చెప్పేది లెక్కలు..? అని చీవాట్లు పెట్టాడట. అంతేకాదు.. మీరు ఇక్కడికి వచ్చి ఎండలో ఒకరోజు పని చేయండి తెలుస్తుంది...డబ్బులు ఇస్తామన్నా ఎవ్వడూ రావట్లేదని తిట్టిపోశాడట. దీంతో సదరు సిబ్బంది ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో ఫోన్ పెట్టేశాడట. మొత్తానికి జగన్ పాదయాత్రకు జనాల్ని తీసుకురావడానికి బాగానే వైసీపీ నేతలు బాగానే కష్టపడుతున్నట్టున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే.. జగన్ అన్న పాదయాత్ర ఏంటో... మాకు ఈ గతి పట్టడం ఏంటో అని బహిరంగంగానే కామెంట్ చేసుకుంటున్నారట.

అమ్మను అవమానించినట్టేనా...

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత డిసెంబర్ 5వతేది 2016 న మరణించిన సంగతి తెలిసిందే కదా. ఇక అప్పటినుండి తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూనే ఉన్నాయి. సంవత్సరంపాటు ప్రభుత్వమే ఏర్పాటు కాలేదంటే... జయలలిత స్థానం ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అంతేకాదు జయలలిత మరణానంతరం... ఆమె మృతిపై ఎన్నో అనుమానాలు.. మరెన్నో సందేహాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా జయలలిత నిచ్చెలి అయిన శశికళపైనే అనుమానం వ్యక్తం చేశారు. ఇక జయలలిత చనిపోయిన తరువాత ఆమె స్థానంలో సీఎం పదవి చేపట్టాలనుకున్న శశికళకు పన్నీర్ సెల్వం చివరి క్షణంలో ఝలక్ ఇవ్వడం... ఆ తరువాత అక్రమాస్తుల కేసులో ఆమెకు జైలుశిక్ష పడటం.. ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే ఇప్పుడు తాజాగా మరో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది.    అదేంటంటే...చెన్నైలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో జయలలిత విగ్రహం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ విగ్రహం కూడా వార్తల్లో నిలిచింది. విచిత్రం ఏంటంటే... అసలు సంగతేంటంటే విగ్రహంలో జయ రూపురేఖలు లేవని అసలు గొడవ. ఆ విగ్రహంలో జయ రూపురేఖలు లేవని... శశికళ, సీఎం పళనిస్వామి భార్య, అన్నాడీఎంకే సీనియర్ నాయకురాలు వలర్మతిల రూపురేఖలు ఉన్నాయని విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక దీనిపై స్పందించిన నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో అన్నాడీఎంకే సీనియర్ నేత డి.జయకుమార్ మాట్లాడుతూ, విగ్రహంలో లోపాలు ఉన్నమాట వాస్తవమేనని... వీలైనంత త్వరగా విగ్రహంలో మార్పులు చేయిస్తామని తెలిపారు. మొత్తానికి జయలలిత చనిపోయిన తరువాత ఇన్ని రోజులకు విగ్రహం పెట్టారు. మరి ఇన్ని రోజుల తరువాత పెట్టిన విగ్రహంలో కూడా లోపాలు. నిజానికి తమిళనాడులో జయలలితను తమ అమ్మలాగే కొలుస్తారు. ఆమె స్థానాన్ని ఎవరితో భర్తీ కూడా చేయలేరు. అలాంటి.. జయలిలత విగ్రహాన్ని ఇంత నిర్లక్ష్యంతో లోపాలతో తయారుచేయడం అంటే ఆమెను అవమానించినట్టే...

జగన్‌కు "బాణం" గుచ్చుకుంటుందా..?

వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించిన కొత్తల్లో అధినేత జగన్ జైలు పాలైతే.. కార్యకర్తలు చేజారకుండా.. పార్టీ బాధ్యతలు భుజానికెత్తుకున్నారు వైఎస్ షర్మిల. మరో ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేసి శ్రేణుల్లో నైతిక స్థైర్యాన్ని నింపారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ చంద్రబాబు నాయుడిపై బహిరంగ సభల్లో నిప్పులు చెరిగారు. ఆమె పాదయాత్ర ఫలితంగానే జగన్ జైలులో ఉన్నప్పటికీ.. వైసీపీ కోలుకోగలిగిందనేది ఓపెన్ సిక్రెట్. షర్మిల 2014 ఎన్నికల్లో మల్కాజ్‌గిరి, ఖమ్మం లేదా మరో సిటీ నుంచి పోటీ చేస్తుందని ప్రచారం జరిగింది.   అయితే ఆమెను సరిగ్గా ఎన్నికలకు ముందు పక్కనపడేయటంతో.. షర్మిల, అనిల్‌లు తర్వాత వార్తల్లో కనిపించలేదు. పార్టీకి ఇంత చేస్తే.. కనీసం ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వడా అంటూ షర్మిల కాస్త మనస్తాపానికి గురయ్యారు. అప్పటి నుంచి వైసీపీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. ఎన్నికల సీజన్ దగ్గరపడుతుండటం.. పార్టీలో తాను తప్ప మరో స్టార్ క్యాంపెయినర్ లేకపోవడంతో.. జగన్‌కు మళ్లీ షర్మిల అవసరం పడింది.   ఈ నేపథ్యంలో అమ్మ విజయమ్మ సాయంతో షర్మిలను తిరిగి పార్టీలోకి తీసుకొచ్చేందుకు వైసీపీ అధినేత తీవ్రంగా శ్రమిస్తున్నారట. అయితే ఈసారి తనకు కడప ఎంపీ టిక్కెట్ కావాల్సిందేనని గత ఎన్నికల్లో లాగా వాడుకుని వదిలిస్తే.. ఊరుకునేది లేదని అల్టీమేటం జారీ చేసిందట. ప్రస్తుతం బాబాయ్ కొడుకు అవినాష్ రెడ్డి కడప ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ సారి అతన్ని జమ్మలమడుగుకు పంపించి.. తమకు కడపని ఫిక్స్ చేయాలని షర్మిల దంపతులు ఇప్పటికే జగన్‌తో చెప్పారట. అన్న నుంచి స్పష్టమైన హామీ వస్తేనే గానీ ఎన్నికల ప్రచారానికి వెళ్లకూడదని షర్మిల గట్టిగా.. ఫిక్సయ్యారని లోటస్ పాండ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక "అవిశ్వాసం" అటకెక్కినట్లేనా..?

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గత కొద్దిరోజుల నుంచి వేడెక్కిస్తోన్న అంశం అవిశ్వాస తీర్మానం. రాష్ట్రప్రయోజనాలను దెబ్బతీస్తోన్న కేంద్ర ప్రభుత్వం ఇక ఎంత మాత్రం అధికారంలో ఉండటానికి వీలు లేదన్నట్లుగా.. తాము అవిశ్వాసం పెడుతున్నాం.. మద్దతిస్తారా అని వైసీపీ అధినేత జగన్ సవాలు విసిరారు. అవిశ్వాసం బంతి అన్ని పార్టీల కాంపౌండ్‌లను చుట్టి వచ్చి.. చివరకు జగన్ దగ్గరే ఆగింది. మరి ఆయన మోడీ మీద నో కాన్పిడెన్స్ మోషన్‌కి సాహసిస్తారా...? అంటూ రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేసుకుంటూ ఉండగానే.. జగన్ అక్రమాస్తుల కేసులో మారిషస్ ప్రభుత్వం ప్రధానికి నోటీసులు పంపడంతో.. రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. ఈ వ్యవహారంతో ప్రధానితో పాటు బీజేపీ పెద్దలు జగన్‌పై గుర్రుగా ఉన్నారు.   మార్చి 4న అవిశ్వాస తీర్మానం ఇస్తే.. అది ఎలాగూ నిలబడదని జగన్మోహన్‌రెడ్డికి తెలుసు.. కాకపోతే.. దొరికిందే సందుగా ప్రతిపక్షాలు మోడీపై ఉన్న మంటను తీర్చుకుంటాయి. అది బడ్జెట్‌ ఆమోదంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అదే జరిగితే ప్రధాని.. జగన్‌పై కన్నెర్ర చేయకమానరు. అందుకే మార్చి 4కి బదులు మార్చి 21న అవిశ్వాసం ఇవ్వడానికి ప్రతిపక్షనేత సన్నాహాలు చేసుకుంటున్నారు. అలా అయితే ఇటు అవిశ్వాసం ఇచ్చినట్లు ఉంటుంది.. మరోవైపు కేంద్రప్రభుత్వానికి ఇబ్బంది లేకుండానూ ఉంటుందన్నది వైసీపీ అధినేత ప్లాన్.   ఇదంతా మారిషస్ గవర్నెమెంట్ నోటీసులు పంపడానికి ముందు మాట. అవిశ్వాసం పెట్టకముందే తనపై బీజేపీ నేతలు ఇంత సీరియస్‌గా ఉంటే.. అదే అవిశ్వాసం పెడితే జగన్ తిప్పలు మామూలుగా ఉండవన్నది విశ్లేషకులు మాట. ప్రస్తుతానికి నోటీసుల నుంచి ఎలా స్పందించాలో.. దీని నుంచి ఎలా బయటపడాలనే దానితోనే సరిపోతున్న వేళ.. అవిశ్వాసం గురించి పట్టించుకోవడం.. దానికి ఇతర పార్టీల మద్దతు కూడగట్టడానికి అంత తీరక లేదు.. సో.. అవిశ్వాసం అటకెక్కినట్లే..?

అమరావతా..? మయసభా..?

ఏపీలో బీజేపీకి నూకలు చెల్లిపోయే కాలం దగ్గరపడింది. అందుకే ఆ పార్టీ నేతలు ఏం.. మాట్లాడుతున్నాం.. ఎలా మాట్లాడుతున్నాం అన్న ఇంగిత జ్ఞానం కూడా మరిచిపోయి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏపీకి కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం చేసింది కాక.. మళ్లీ అనవసరమైన ప్రేలాపనలకు కూడా దిగుతున్నారు. ఒక పక్క మాకు అన్యాయం జరిగింది.. మా రాష్ట్రం అభివృద్ది చేసుకుంటాం.. మాకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వండ్రా బాబు అంటే దానిని కూడా ఎగతాళి చేస్తారు.   ఇప్పుడు తాజాగా మరో బీజేపీ ప్రతినిధి కూడా అలాంటి మాటలే మాట్లాడారు. అమరావతి నిర్మాణానికి 43 వేల కోట్ల రూపాయలతో ఒక నివేదిక తయారు చేసి పంపించింది రాష్ట్రప్రభుత్వం. మరి దానికి నిధులు ఇస్తామో..? లేక..? ఇవ్వలేమో చెప్పాలి.. అలా కాకుండా... అమరావతిలో మయసభ ఏమన్నా కడ్తున్నారా..? 43 వేల కోట్లు రాజధానికి అవసరమా బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అవహేళనగా మాట్లాడి ఏపీ ప్రజలను మరింత ఆగహ్రానికి గురిచేశారు. దీంతో నరసింహారావు పై అందరూ మండిపడుతున్నారు.  అంతేకాదు...అహ్మదాబాద్లో ఒక కన్వెన్షన్ సెంటర్ కు 1500 కోట్లు, పటేల్ విగ్రహానికి 2500 కోట్లు, శివాజీ విగ్రహానికి 4 వేల కోట్లు, అవసరమైన మీకు ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఎంత అవసరమో తెలియదా ? అని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ ఇంకా ఇలానే మాట్లాడితే కాంగ్రెస్ కు పట్టిన గతే ఈ పార్టీకి కూడా పడుతుందని అంటున్నారు. ఆనాడు తలుపులు మూసేసి అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ కు ఏపీ ప్రజలు ఎలా బుద్ది చెప్పారో ఎవరూ మర్చిపోరు. ఇలానే విర్రవీగి ఇప్పుడు పాతాళంలో ఉంది. ఇప్పుడు మీ వంతు వచ్చింది అని అంటున్నారు. మరి నిజంగానే బీజేపీకి టైం దగ్గర పడినట్టు ఉంది... అందుకే ఇలాంటి కూతలు కూతున్నారు పార్టీ నేతలు..

సెల్‌ నంబర్‌కి 13 అంకెలా? డోన్ట్ వర్రీ!!

ఇప్పుడు మనం ఉపయోగించే సెల్‌ఫోన్లకి 10 అంకెలున్న నంబర్లుంటాయి కదా... ఇకపై ఆ అంకెలు పదమూడుకి పెరగనున్నాయా? డిసెంబర్ 31, 2018 లోపు మన సెల్‌ఫోన్ల నంబర్లని 13 అంకెల నంబర్లకి మార్చుకోవాలా? దీనివల్ల మన పాత నంబర్లన్నీ మారిపోతాయా? పది అంకెలున్న నంబర్లే గుర్తుంచుకోలేని పరిస్థితిలో వున్న మనం 13 అంకెలున్న నంబర్లు గుర్తుంచుకోవాలంటే బుర్ర వాచిపోతుందా? లేటెస్ట్‌గా ఇండియన్ టెలీకాం డిపార్ట్‌మెంట్ కొన్ని రకాల సెల్‌ఫోన్ నంబర్లను 10 నుంచి 13 నంబర్లకు మార్చుకోవాలని ఆదేశాలను జారీ చేసింది. డిసెంబర్ 31 లోగా నంబర్లను మార్చుకోవాలని టెలీకం కంపెనీలకు ఆదేశాలు కూడా ఇచ్చేసింది.   ఈ విషయం బయట పడినప్పటి నుంచి దేశంలో సెల్‌ఫోన్లను వినియోగిస్తున్న కోట్లాదిమంది టెన్షన్లో పడిపోయారు. ఈ నంబర్లు పెంచుడేందిరో అని అనుకోవడం ప్రారంభించారు... అయితే మనలాంటి సెల్‌ఫోన్ కస్టమర్లు ఎవరూ టెన్షన్ పడాల్సిన పనిలేదు... మన నంబర్లని మార్చుకోవాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. అదేంటీ? 10  నంబర్ల నుంచి 13 నంబర్లకు మారాలని కేంద్ర టెలీకం శాఖ నిజంగానే ఆదేశాలు జారీ చేసింది కదా అనుకుంటున్నారా?   నిజమే.. ఆదేశాలు జారీ చేసిన మాట నిజమే... అయితే ఆ ఆదేశాలు వర్తించేది మనం వాడే సెల్ నంబర్లకు కాదు.. ఎం టు ఎం సెల్‌ఫోన్ నంబర్లకు.. ఎం టు ఎం అంటే... మెషిన్ టు మెషిన్ సెల్‌ఫోన్ నంబర్లకు. ఇంతకీ మెషిన్ టు మెషిన్ సెల్‌ఫోన్లు అంటే ఏమిటి? సెల్ ఫోన్ ద్వారా మిషన్లను అంటే... టీవీలు, ఏసీలు... తదితర మిషన్లను ఆపరేట్ చేస్తూ వుంటారు కదా... అలాంటి సెల్ ఫోన్లకు మాత్రం 10 అంకెలకు బదులు 13 అంకెలున్న నంబర్లు ఉపయోగించాల్సి వుంటుంది. దాని వల్ల సదరు మిషన్ టు మిషన్ సర్వీసులు ఎలాంటి అంతరాయం లేకుండా వినియోగించుకోవచ్చట. అంచేత మన సెల్ నంబర్లు నిక్షేపంగా 10 నంబర్లతోనే వుంటాయి... వాటిని 13 నంబర్లకు మార్చుకోవాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు.. అంచేత డోన్ట్ వర్రీ.. బీ హ్యాపీ!.

పవన్ ఇలా చేస్తే మోడీ దిగిరావాల్సిందే..?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలన్నీ అవిశ్వాస తీర్మానం చుట్టూనే తిరుగుతున్నాయి. మీరు పెట్టండి అంటే కాదు మీరే పెట్టండి అంటూ అవిశ్వాసం బంతిని పక్క పార్టీ కోర్టుల్లోకి నెడుతున్నారు పార్టీల అధినేతలు. అవిశ్వాసానికి మీరు మద్దతిస్తారా అంటూ వైసీపీ అధినేత జగన్ విసిరిన సవాల్‌ను స్వీకరించిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్..ముందు మీరు నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టండి.. కావాలంటే ఇతర పార్టీలను నేను ఒప్పిస్తానంటూ జనసేనాని మీడియా సాక్షిగా ఆన్సర్ ఇచ్చారు. అయితే అవిశ్వాసం వల్ల మోడీకి చీమ కుట్టినట్లు కూడా ఉండదని.. దీని వల్ల సభలో చర్చ జరిగి బీజేపీ మీద ఉన్న మంటను అన్ని పార్టీలు పార్లమెంట్ సాక్షిగా తీర్చుకుంటే మాత్రం.. మోడీ ఆగ్రహానికి గురికావాల్సిందే తప్ప రాష్ట్రానికి ప్రయోజనం అన్నది శూన్యమేనన్నది విశ్లేషకుల మాట.   అయితే పవన్ ఇలా చేయాలి.. అలా చేస్తే ఉపయోగం ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో ఆయన అభిమానులు కొన్ని ఐడియాలను ఇస్తున్నారు. హైదరాబాద్‌లో కూర్చొని ప్రెస్‌మీట్లు పెట్టకుండా ఏపీ రోడ్ల మీదకు పవన్‌ రావాలని కోరుతున్నారు. రాష్ట్రప్రజలకు ఇబ్బంది కలగకుండా... ఏపీ మీదుగా దక్షిణాదిని, ఉత్తరాదిని కనెక్ట్ చేసే రవాణా వ్యవస్థను స్తంభింపజేసి.. ఆంధ్రుల ఆవేదనను జాతీయ స్థాయిలో తెలియజేయాలనే వాదనలు వినిపిస్తున్నాయి. కళ్యాణ్ లాంటి ప్రజాకర్షణ ఉన్న వ్యక్తి పిలుపునిస్తే.. లక్షల్లో జనం తరలివస్తారు. వారి అండతో ప్రభుత్వ ఆస్తులకు ఏ మాత్రం నష్టం కలగని రీతిలో.. శాంతియుత పద్దతుల్లో రోడ్లు, రైల్వే వ్యవస్థను స్తంభింపజేస్తే.. ఈ నిరసన సెగ ఇతర రాష్ట్రాలను తాకుతుంది. మన ఆవేదనకు.. ఆందోళనలకు ఎలాంటి విలువ ఇవ్వకపోయినా.. కనీసం పక్క రాష్ట్రప్రభుత్వాల మాటనైనా కేంద్రప్రభుత్వం లెక్కలోకి తీసుకుంటుందని పలువురు వాదిస్తున్నారు.   మార్చి 5 నుంచి ఆంధ్రా-ఒడిషా, ఆంధ్రా-తెలంగాణ, ఆంధ్రా-తమిళనాడు, ఆంధ్రా-కర్ణాటక సరిహద్దుల్లోని.. కీలక ప్రాంతాల్లో రహదారుల దిగ్భంధనం, రైల్‌రోకోలు చేయాలని పవన్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో తమ డిమాండ్ల సాధనం కోసం అక్కడి వారు ఇలాంటి పద్దతుల్నే పాటించారు.. పటేల్, జాట్ రిజర్వేషన్ల ఉద్యమంలో పాల్గొన్న ప్రజలు రోజుల తరబడి రహదారుల మీద.. రైల్లే ట్రాకుల మీదే గడపడంతో రవాణా వ్యవస్థకు తీవ్ర విఘాతం కలిగి.. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు దిగి రాక తప్పలేదు. మరి పవన్ అభిమానుల మాటను పట్టించుకుంటాడా లేక హైదరాబాద్‌లో ఉండే ప్రెస్‌మీట్లు, ట్వీట్‌లతో కాలక్షేపం చేస్తాడా అనేది వేచి చూడాలి.

10 అంకెలే కష్టం.. ఇప్పుడు 13

సాధారణంగా ఫోన్ నెంబర్లో ఎన్ని అంకెలు ఉంటాయని అడిగితే టక్కున 10 అంకెలు అని చెప్పేస్తారు. అయితే ఇకపై 10 కాదు.. 13 అంకెలు అని చెప్పాల్సిందే. అదేంటీ అనుకుంటున్నారా.. అదంతే... ఇకపై 13 అంకెలు చెప్పాల్సిందే. అసలు సంగతేంటంటే... కేంద్ర టెలికాం శాఖ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. జూలై 1వ తేదీ నుంచి కొత్తగా సిమ్ కార్డ్ తీసుకునే వారికి 13 అంకెల నెంబర్ ఇస్తామని... అన్ని మొబైల్ కంపెనీలకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయని కేంద్ర టెలికాం శాఖ తెలిపింది. అయితే మరీ పాత నెంబర్ల సంగతి ఏంటీ..అని సందేహం రావచ్చు. దీనికి కూడా టెలికాం శాఖ.. ఈ ఏడాది అక్టోబర్ ఒకటో నుంచి డిసెంబర్ 31వ తేదీలోపు పాత కస్టమర్లు అందరూ నెంబర్ పోర్టబులిటీ చేసుకోవాలని... అంటే టెలికాం శాఖ తీసుకొచ్చే నిబంధనలకు లోబడి.. వీరికి మరో మూడు అంకెలు యాడ్ అవుతాయని. పాత కస్టమర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించింది. డిసెంబర్ 31వ తేదీ వరకు పాత నెంబర్లు యథావిధిగా పని చేస్తాయని...పాత నెంబర్ చెప్పినా.. అది కొత్త 13 అంకెల నెంబర్ లోకి మారుతుందని.. ఇందులో టెన్షన్ పడాల్సిన అవసరం లేదని ప్రకటించింది. దీంతో అసలు ఉన్న పది నెంబర్లు గుర్తుపెట్టుకోవడమే కష్టంగా ఉందిరా బాబు అంటే ఇప్పుడు 13 అంకెలు ఎలా గుర్తుపెట్టుకోవాలని కస్టమర్లు కామెంట్లు విసురుతున్నారు. ఇప్పుడు 10 అంకెలతో వచ్చిన నష్టం ఏంటీ.. 13 అంకెలతో వచ్చే లాభం ఏంటీ అని అనుకుంటున్నారు. మరి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో వారికే తెలియాలి.

"మిస్టర్ పీఎం" తప్పా... గుడ్డలూడదీసి కొడతాం తప్పు కాదా..!

బీజేపీ-టీడీపీ ల మధ్య దూరం రోజు రోజుకు పెరిగిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రెండు పార్టీలు ఎప్పుడు విడిపోతాయా అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారడంలో కూడా ఎలాంటి అనుమానం లేదు. మరోపక్క రెండు పార్టీ నేతలు ఒకరిపై ఒకరు పోటాపోటీగా విమర్శలు గుప్పించుకుంటున్నారు. అయితే తాజాగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విచిత్రమైన విమర్సలు చేశారు. ఇప్పుడు రాజు గారికి దొరికిన సాకు ఏంటంటే... మోడీ గారిని 'మిస్టర్‌ ప్రైమ్‌మినిస్టర్‌' అని అన్నారట.   కేంద్ర బడ్జెట్ విషయంలో ఏపీకి అన్యాయం జరిగిన నేపథ్యంలో టీడీపీ ఎంపీలు పార్లమెంట్లో పెద్ద ఎత్తున నిరసనలు చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ క్రమంలోనే ఎంపీ గల్లా జయదేవ్ రాజ్యసభలో ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే ఆయన మోడీని 'మిస్టర్‌ ప్రైమ్‌మినిస్టర్‌' అని సంబోధించారు. ఇప్పుడు ఇదే రాజు గారికి సాకుగా దొరికింది. టిడిపి నేత ఒకరు ప్రధాని మోడీనీ...'మిస్టర్‌ ప్రైమ్‌మినిస్టర్‌' అని అన్నాడని తెగ గుంజుకున్నారు ఆయన. దీంతో మిస్టర్‌ప్రైమ్‌ మినిస్టర్‌ అంటే తప్పేంటి..అదేమీ అగౌరమైన పదమేమీకాదు కదా అని అంటున్నారు. అంతేకాదు..గతంలో వైసీపీ నేతలు మోడీని ఇంతకన్నా దారుణంగా మాట్లాడారు... 'భూమన కరుణాకర్‌రెడ్డి'  అయితే ప్రధాని రాష్ట్రానికి ప్రత్యేకహోదా...ప్రకటించకపోతే..గుడ్డలూడదీసి కొడతామని  చాలా పరుషమైన పదజాలాన్నే వాడారు. మరి అప్పుడు ఈయనగారు ఎక్కడికి వెళ్లారో.. ఈ వ్యాఖ్యలపై బిజెపి నేతలు ఎవరూ స్పందించలేదు. మరి గుడ్డలూడదీసి కొడతామనడం వారి దృష్టిలో సభ్యతేమో...? అందుకే స్పందించలేదేమో...? తమతో వైకాపా నేతలు లాలూచీ పడ్డారు కనుక..వారు ఎంతటి అసభ్య మాటలు మాట్లాడినా...బిజెపి నేతల దృష్టిలో అవి తప్పు కాదు...? గౌరవ సూచికంగా మిస్టర్‌ ప్రైమ్‌మినిస్టర్‌ అంటే...తప్పట..? ఏదో కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్టు.. ఒకపక్క బీజేపీ ఏపీకి అన్యాయం చేసిందని ప్రతిఒక్కరూ మండిపడుతుంటే... వీళ్లేమో మోడీని 'మిస్టర్‌ ప్రైమ్‌మినిస్టర్‌' అన్నారని.. సిల్లీ రీజన్స్ తో ఉన్న పరువు కూడా పోగొట్టుకుంటున్నారు. ఏది ఏమైనా... ఇష్టమైన వాళ్లు ఏం చేసినా తప్పులేదు.. ఇష్టం లేని వాళ్లు ఏం చేసిన తప్పే అన్నట్టు ఉంది బీజేపీ వ్యవహారం..

జగన్ బదులు చంద్రబాబు అవిశ్వాసం పెడితే..?

ఆంధ్రప్రదేశ్‌కి బడ్జెట్‌లో అన్యాయం జరిగిందన్న బాధతో ఎంపీలు చేసిన నిరసన కాస్తా అటు తిరిగి ఇటు తిరిగి.. విభజన హామీల మీదుగా ప్రత్యేకహోదా దిశగా టీడీపీ-బీజేపీ చీలికలకు.. చివరకు ప్రధాని మోడీ ప్రభుత్వం మీద అవిశ్వాసం వరకు వెళ్లింది. తాము పెట్టే అవిశ్వాస తీర్మానానికి టీడీపీ మద్ధతు ప్రకటించాలని... ఒకవేళ తెలుగుదేశమే నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే తాము.. సహకరిస్తామంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పడంతో ఇప్పుడు రాజకీయాలన్నీ.. అవిశ్వాసం అన్న మాట చుట్టూ తిరుగుతున్నాయి. ఇవాళ జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలోనూ ఈ విషయం చర్చకు వచ్చింది.   దీనిపై స్పందించిన టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. అవిశ్వాస తీర్మానానికి 54 మంది ఎంపీల మద్దతు కావాలని.. అయినా కేంద్రప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పుడు అవిశ్వాసం పెడితే.. రాష్ట్రప్రయోజనాలు నెరవేరుతాయా అంటూ ప్రశ్నించారు. దీనికంటే అన్ని పార్టీల మద్దతు కూడగట్టి కేంద్రంపై ఒత్తిడి పెంచితేనే మంచిదని సూచించారు. సరిగ్గా ఇలాంటి సమయంలో ఒకవేళ రాష్ట్రం కోసం మోడీపై చంద్రబాబు అవిశ్వాసం పెడితే అంటూ సోషల్ మీడియాలో ఒక డిష్కసన్ నడుస్తోంది. ఇది జరిగే పని కాదు.. ఒకవేళ జరిగితే మాత్రం దానికి బీజేపీ భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందట. ప్రతిపక్షం నుంచి రావాల్సిన అవిశ్వాసం మిత్రపక్షం నుంచి ఎదురైతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెలువడతాయి.   సమయం కోసం ఎదురుచూస్తోన్న దేశంలోని ఇతర రాజకీయ పక్షాలు కమలానికి ఎదురుతిరగడంతో పాటు.. ఆ పార్టీకి వ్యతిరేకంగా జట్టుకట్టే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో కేంద్రంలోని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కంటే చంద్రబాబుకు గుర్తింపు వస్తుందని... ఇప్పటికే మోడీని ఢీ కొట్టగల సత్తా ఉన్న నేత బాబేనని వివిధ పార్టీల అధినేతలు అంచనా వేస్తున్న పరిస్థితుల్లో.. బీజేపీయేతర పక్షాలన్నీ తెలుగుదేశంతో కలిసి పనిచేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. అయితే పరిస్థితి అంతవరకు వస్తే చంద్రబాబును ఆపడం అసాధ్యమని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట. అక్కడిదాకా తెచ్చుకోకుండా బాబును శాంతింపజేసేందుకు సిద్ధమవుతున్నారట. సీనియర్ నేతలను రంగంలోకి దించాలని వారి మాట టీడీపీ అధినేత వినిపించుకోని పక్షంలో.. ఆయనకు అత్యంత ఆప్తుడైన వెంకయ్యనాయుడు ద్వారా చంద్రబాబును కూల్ చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.

ప్రధాని పీఠం కోసం.. ఓ కేంద్రమంత్రి క్షుద్రపూజలు...

మనుషులు తాము అనుకున్న దానిని సాధించడానికి ఎంత కష్టమైనా పడతారు.. ఇంత శ్రమించినా... ఫలితం దక్కకుంటే.. అందుకు వేర్వేరు మార్గాలు వెతుకుతారు. వీలైతే రాజమార్గం లేదంటే దొడ్డి దారిలో వెళ్లైనా సరే లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నంలో దేవుడిని నమ్మేవారు కొందరైతే.. అతీత శక్తుల అండతో అగ్రస్థానాలను చేరుకోవాలనే వారు మరికొందరు. ఇందులో ఎంతవరకు వాస్తవముందో తెలియదు కానీ.. వీటిని నమ్మే వారు నేటి సాంకేతిక యుగంలోనూ ఎక్కువవుతున్నారు. ఈ అతీత శక్తులను నమ్మిన ఓ కేంద్ర మంత్రివర్యులు తనకు రాజయోగం కలగాలని కోరుతూ పూజలు జరిపించారట. రాజయోగమంటే ఏదో కాదు.. దేశంలోని అత్యున్నత పదవి.. దేశానికి రాజు లాంటి ప్రధానమంత్రి పదవి కోసమే.   కేంద్ర మంత్రివర్గంలో కీలకపాత్ర పోషిస్తున్న ఈ మంత్రిగారికి.. ఎన్డీఏలోని పెద్దలందరితో సన్నిహిత సంబంధాలున్నాయట. నిధుల కోసం పార్లమెంట్‌ వేదికగా పోరాటం చేస్తున్న ఏపీకి ఈయనగారు ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రిత్వ శాఖ నుంచే ఫండ్స్‌ వస్తున్నాయట. సీనియర్ రాజకీయవేత్తగా ఎన్నో హోదాల్లో పనిచేసిన ఆయన చూపు ప్రస్తుతం ప్రధాని పీఠంపై ఉందట. అయితే అది అంత తేలికకాదని ఆయనకి తెలుసు.. అందుకే అతీత శక్తుల సాయంతో తన పని చేసుకోవాలని భావించి.. తెలుగు రాష్ట్రాల్లోని ఓ స్వామిజీని ఆశ్రయించాడట.   అతను అలాంటి.. ఇలాంటి వ్యక్తి కాడట.. అప్పట్లో కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన నేతకు పూజలు చేసిన అనుభవం ఉందట. సాక్షాత్తూ కేంద్రమంత్రి అంతటి వ్యక్తి తనను నమ్మి వస్తే.. ఆ స్వామిజీ గారు ఊరుకుంటారా..? ఆయన గారిని సింహాసనం ఎక్కించడానికి ఏ పూజలు చేయాలో.. అవి చేసేశారట. అయితే సదరు స్వామిజీ గారి చేత గతంలో పూజలు చేయించుకున్న ముఖ్యమంత్రి తర్వాత జరిగిన ఎన్నికల్లో.. పదవిని.. తన ఛరిష్మాను కోల్పోయి ప్రస్తుతం సోదీలో లేకుండా పోయారు. మరి ఆ విషయం తెలిసి కూడా కేంద్రమంత్రిగారు ఆ స్వామిజీని ఎందుకు నమ్మారంటే..? పదవి మీద మోజు.. అదొక్కటి చాలు. ఏదైనా జరగడానికి..!!

గేమ్ స్టార్ట్ చేసిన చంద్రబాబు..!!

విభజన సమస్యలతో పాటు ప్రత్యేకహోదాపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవడానికి చంద్రబాబు రెడీ అయ్యారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తమ డిమాండ్లకు కేంద్రం దిగిరాకపోతే ఏప్రిల్ 6న తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని వైసీపీ అధినేత జగన్ ప్రకటించగా.. తాము ఏపీకి ఎంతో చేశామని కేంద్ర పెద్దలు.. ఏపీ బీజేపీలోని కొందరు నేతలు లెక్కలు చెబుతూ అధికారపక్షాన్ని ఒత్తిడిలోకి నెట్టారు. ఇలాంటి వాటిలో ఆరితేరిపోయిన టీడీపీ అధినేత.. ఇక ఊపేక్షించి లాభం లేదని.. బీజేపీ-వైసీపీలకు ఏకకాలంలో కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. దీనిలో భాగంగా ఏం చేయాలో.. ఎలా చేయాలో ఓ యాక్షన్ ప్లాన్‌ రెడీ అయిపోయిందట.   బడ్జెట్ చివరి విడత సమావేశాల తొలి రోజే టీడీపీకి చెందిన కేంద్రమంత్రులు రాజీనామాలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక రాష్ట్రవిభజన హామీలపై త్వరలోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అన్ని పార్టీలతో చర్చించి.. తగిన విధంగా ముందుకు వెళతామని ఆయన తెలిపారు. విభజన హామీలపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని ఎప్పటి నుంచో పలు పార్టీలు, ప్రజా సంఘాలు కోరుతున్నాయి.   ఇప్పుడు చంద్రబాబు వారి డిమాండ్‌ను తీర్చడంతో పాటు కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు.. ఆల్ పార్టీ మీటింగ్‌ను ఎంచుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రప్రయోజనాలు అంటూ వాదించే వారికి దీనిలో జాయిన్ అవ్వడం తప్ప వేరే దారి లేదు.. సాక్షాత్తూ ముఖ్యమంత్రి సారథ్యంలో ఇది జరుగుతుంది కాబట్టి.. దీని విలువను అంత తక్కువగా అంచనా వేయరాదనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి వైసీపీ నేతలు కానీ.. ఏపీ బీజేపీ నాయకులు కానీ అఖిలపక్ష సమావేశంలో పాల్గొంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

మోడీ మీద అవిశ్వాసం నిలబడుతుందా..?

ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఏమాత్రం రాజీపడేది లేదని.. అందుకోసం ఎక్కడిదాకా అయినా వెళ్తానంటున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. తెలిసి అన్నాడో.. తెలియక అన్నాడో తెలియదు గానీ.. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడతానని.. తాను ఆ పనిచేస్తే టీడీపీ సహకరించాలని.? లేదంటే చంద్రబాబు నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే .. తాను ఆయన వెంట నడుస్తానంటూ సవాల్ విసిరి రాజకీయాలను వేడెక్కించాడు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఇదే చర్చ. గత ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మేజిక్ ఫిగర్‌ను క్రాస్ చేసి.. దీనికి అదనంగా ఎన్డీఏ మిత్రపక్షాలతో బలంగా ఉన్న నరేంద్రమోడీపై అవిశ్వాసం పెడితే.. అది ఎంత వరకు నిలబడుతుందనేదే ఇక్కడ క్వశ్చన్.   కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే మొత్తం సభ్యుల్లో 10 శాతం మెంబర్ల సపోర్ట్ కావాలి.. అందుకు జగన్‌ బలం సరిపోదు.. ఇక చంద్రబాబు మద్ధతిస్తారా..? లేదా అన్నది పక్కనబెడితే.. సపోర్ట్ చేశారనే అనుకుందాం.. అయినా తీర్మానం సాధ్యం కాదు.. మోడీ అంటే మండిపడుతున్న శివసేన, తృణమూల్ కాంగ్రెస్, అకాలీదళ్, వామపక్షాలు అందరినీ కలుపుకుంటే కానీ స్పీకర్‌కు నోటీసు ఇవ్వడం వరకు వెళుతుంది. దీనిని స్పీకర్ అంగీకరించి సభలో చర్చ చేపట్టి ఓటింగ్ చేపట్టిన పక్షంలో.. మోడీ మీద పీకలదాకా ఉన్న ఆగ్రహం బయటపడుతుందే కానీ... ప్రభుత్వం పడిపోయేంత సీన్ లేదన్నది విశ్లేషకుల మాట. జగన్ సవాల్‌కు చంద్రబాబు స్పందిస్తారనుకుంటే.. ఆశ్చర్చకరంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రీయాక్ట్ అయ్యారు.   రాష్ట్ర విభజనతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ భూస్థాపితమైంది. ఇప్పటి వరకు కనీసం సోదిలో కూడా లేదు..  అయితే, ఈ స్థితి నుంచి బయటపడేందుకు కాంగ్రెస్‌కు అద్భుతమైన అవకాశం దొరికింది. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితికి కారణం కాంగ్రెసే అని సగటు ఆంధ్రుడు నమ్ముతున్న తరుణంలో.. విభజన సమస్యలపై స్పందించాలని రాహుల్ భావిస్తున్నారు. అందుకే అవిశ్వాసానికి తాము సిద్ధమన్న సంకేతాలు ఇచ్చారు యువనేత.. అయితే ఆ పార్టీకి లోక్‌సభలో తగినంత సంఖ్యాబలం లేదు. కాబట్టి భాగస్వాముల మద్దతును కూడగట్టాల్సిన అవసరం ఉంది. ఎలాగూ పార్లమెంట్ సమావేశాలు మార్చి 5న ప్రారంభమవుతాయి కాబట్టి.. ఈ లోగా మిత్రులందరితో ఓ మీటింగ్ పెట్టే ఛాన్స్ ఉంది. అయితే రాహుల్ కలిసినా.. అందరూ ఏకమైనా మోడీ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదన్నది రాజ్యాంగ నిపుణుల మాట.

కేసీఆర్ వ్యూహం.. టీఆర్ఎస్‌లోకి దానం, ముఖేశ్..?

రాబోయే ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు రెడీ చేస్తున్నారు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటికే సామ,దాన,భేద, దండోపాయాలతో ప్రతిపక్షాన్ని బలహీనం చేసిన గులాబీ బాస్. ఆ దిశలో అక్కడక్కడా మిగిలి ఉన్న కీలకనేతలకు గాలం వేస్తున్నారు. రాష్ట్రం మొత్తం టీఆర్ఎస్ బలంగా ఉన్నప్పటికీ... రాజధాని హైదరాబాద్‌లో మాత్రం బలహీనంగానే ఉంది. గత ఎన్నికల్లో గ్రేటర్‌లో పోలైన ఓట్లలో కారుపై సైకిల్‌ పైచేయి సాధించింది. ఆ లోటును పూడ్చటానికి ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని ఇతర పార్టీలకు చెందిన కీలకనేతలను కారులోకి ఎక్కించుకున్నారు కేసీఆర్.   అయితే కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రులు దానం నాగేందర్, ముఖేశ్ గౌడ్‌లకు ఇప్పటికే భారీ అనుచరగణం, కిందిస్థాయిలో అభిమానులు ఉన్నారు.. వారిని టీఆర్ఎస్ వైపుకి లాగితే.. రాజధానిలో ఇక తిరుగుండదని సీఎం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే వారితో అధికారపార్టీలోని కీలకనేతలు చర్చలు జరుపుతున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. కేసీఆర్ వ్యూహం ఫలిస్తే గనుక పాతబస్తీ మినహా మిగిలిన గ్రేటర్ ఏరియా మొత్తం టీఆర్ఎస్ కంట్రోల్‌లోకి వచ్చినట్లేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

జేఎఫ్ఎసీని నడిపేదెవరు..?

రాష్ట్ర విభజన చట్టంలోని హామీలతో పాటు.. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎన్డీఏ సర్కార్, ఆంధ్రప్రదేశ్‌కు ఎంత కేటాయించింది.. దానిని రాష్ట్రప్రభుత్వం ఏ మేరకు వినియోగించిందో తేల్చడానికి జనసేన అధినేత ‌పవన్ కళ్యాణ్ ఒక నిజనిర్థారణ కమిటీని ఏర్పాటు చేశాడు. రాజకీయవేత్తలు, ఆర్థిక వేత్తలు, మేధావులకు ఈ కమిటీలో స్థానం కల్పించాడు. తొలుత జయప్రకాశ్ నారాయణ్, ఉండవల్లి అరుణ్ కుమార్‌ల పేర్లు మాత్రమే వినిపించడంతో.. ఇంకా దీనిలో యాక్టివ్ మెంబర్స్ ఎవరు అన్న క్లారిటీ లేదు.. అయితే జెఎఫ్‌సీ కమిటీ‌ ఫస్ట్ మీటింగ్‌లో మిగతా సభ్యులు ఎవరో తేలింది. అంతా బాగానే ఉంది..   ఇంతకు ఈ కమిటీకి సారథి.. అదే ఛైర్మన్ ఎవరు..? ఈ స్థానానికి ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు ఉండవల్లి అరుణ్ కుమార్, జయప్రకాశ్ నారాయణ్. పవన్ కళ్యాణ్‌కు తొలి నుంచి జేపీ అంటే ఇష్టం. సిద్ధాంతాలు.. పనితీరు.. విషయ పరిజ్ఞానం అన్నింట్లోనూ జేపీపై ఎవ్వరికీ అనుమానాలు లేవు. పైగా పవన్ మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో జయప్రకాశ్‌కు మంచి సంబంధాలే ఉన్నాయి. దానికి తోడు రాజకీయపార్టీని.. ఒక స్వచ్చంధ సంస్థను నడిపిన అనుభవం జేపీ సొంతం.   ఇక ఉండవల్లి విషయానికి విషయానికి వస్తే.. లాయర్‌గా, ఎంపీగా.. మేధావిగా ఆయనకు పేరుంది. కాకపోతే చంద్రబాబు అంటే కాస్తంత కోపం ఉంది.. ఎంత కాదనుకున్నా కాంగ్రెస్‌ వాసనలు పోవు కదా..! పైగా వైఎస్సార్‌కు నమ్మిన బంటు. జేఎఫ్‌సీని భుజాలపై మోసి.. ఇంత చేసిన తర్వాత, రేపు పవన్.. చంద్రబాబుకు మద్ధతుగా వెళ్తాడేమోనన్న భయం ఉండవల్లిని వెంటాడుతోంది.. అందువల్లే పూర్తిగా జేఎఫ్‌సీలో ఇన్వాల్స్ అవ్వలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైతే జేపీకే ఎక్కువ ప్లస్‌లు కనిపిస్తున్నాయన్నది ఓపెన్ సీక్రెట్. మరి పవన్ మనసులో ఏముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

అతనితో ఇతనికి పోలికా..?

  తండ్రి, కొడుకులు ఒకే రంగంలో ఉంటే తండ్రి పనితీరును కొడుకు సమర్థతను పోల్చడం కామన్. ధీరుభాయ్ అంబానీ.. ముఖేశ్ అంబానీ, ఎన్టీఆర్.. బాలకృష్ణ, కరుణానిధి.. స్టాలిన్ ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఎన్నెన్నో. రాజకీయాల్లో జనం మధ్యలోకి వచ్చే వారిని పోలుస్తూ ప్రతి నిత్యం కథనాలు వస్తూనే ఉంటాయి. తండ్రులు వాళ్లకంటూ ఓ స్టైల్ ఏర్పరచుకున్నారు.. కానీ వారసుడిగా జనం ముందుకు వస్తే పోలిక తప్పదు. ఆంధ్రప్రేదేశ్ ప్రతిపక్షనేతగా.. వైసీపీ అధినేతగా రాజకీయాలు నడుపుతున్న జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు ఆయన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పోలుస్తున్నారు జనాలు.   తెలుగు రాష్ట్రాల్లో శ్రీకాకుళం నుంచి అదిలాబాద్ వరకు.. వైఎస్‌ను పేరు పెట్టి అప్యాయంగా పిలవగల మనుషులు.. కనుసైగ చేస్తే చాలు వెనుక ముందు చూసుకోకుండా దూకగల నేతలు.. అవసరమైతే ప్రాణాలిచ్చేంత అభిమానులు.. ఇది వైఎస్‌కు గల ఛరిష్మా.. ఏం మాట్లాడితే ఏమంటాడోననే భయం.. ఎదురుచెబితే బతకనిస్తాడా అనే బెరుకు.. చివరకు ఒక్కొక్కరుగా వీడిపోతున్న అనుచరులు ఇదీ ప్రస్తుతం జగన్ వర్తమానం. ఎందుకిలా..? ఎక్కడుంది లోపం.. ఏమిటీ తేడా..? ప్రతిపక్షనేతగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో వైఎస్ శైలి భిన్నమైనది. సబ్జెక్ట్‌పైనా.. సమస్యలపైనా ఆయనకున్న అవగాహన.. వాగ్ధాటి రాజశేఖర్ రెడ్డిని అసలు సిసలు ప్రతిపక్షనేతను చేసింది. కుదిరితే వాకౌట్‌లు.. కుదరకపోతే స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టడం.. సమస్యలపై మాట్లాడకుండా ముఖ్యమంత్రితో పాటు అధికార సభ్యుల వ్యక్తిగత జీవితాన్ని ప్రశ్నించడం జగన్ అవగాహనా రహిత్యాన్ని తెలుపుతోంది.   నాయకుడు అనేవాడు టీమ్‌ని నడిపించగలగాలి.. టీమ్‌లోని మిగతా సభ్యుల మాటకు విలువనివ్వాలి.. పీసీసీ చీఫ్‌గా, ప్రతిపక్షనేతగా.. ముఖ్యమంత్రిగా వైఎస్ తన సహచరుల సూచనలను వినేవారు. తనకు పనికొస్తుందంటే దానికి అమలు చేసేవారు లేదంటే మరో ఐడియా చెప్పమనేవారు. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలనే.. ముక్కుసూటితనం జగన్‌ది. ఒకరు చెప్పేది వినడం సంగతి దేవుడెరుగు.. అసలు ఎదుటివాడిని మాట్లాడనిస్తే కదా..? జగన్ చుట్టూ ఉన్నవారిలో ఇప్పుడు ఇద్దరు ముగ్గురే మిగలడానికి అసలు కారణం అదే.   ఆనాడు సుధీర్ఘ పాదయాత్రలో ఆయన ఏనాడూ నన్ను ముఖ్యమంత్రిని చేయండని వైఎస్ అనలేదు.. కేవలం ప్రజాసమస్యలను వినేందుకే రాజశేఖర్ రెడ్డి ప్రాధాన్యత ఇచ్చారు. ఇడుపులపాయలో పాదయాత్ర ప్రారంభించినది మొదలు నేటి వరకు.. తమ సమస్యలు చెప్పుకుందామని వచ్చిన వారికి నన్ను సీఎంని చేయండి.. మీ సమస్యలు పరిష్కరిస్తానని చెబుతున్నారు జగన్. వైఎస్ ఒక ఎత్తు వేశారంటే ఖచ్చితంగా అది టార్గెట్ కొట్టాల్సిందే.. ఫెయిల్ అవ్వడమన్నది వైఎస్ చరిత్రలో లేదు. రాజకీయ నాయకుడు మంచి వ్యూహకర్త కావాలి.. అతను వేసే వ్యూహాలు ఎదుటివారి ఎత్తులను చిత్తు చేయగలగాలి.. అంతేకాని అతని వ్యూహాలే పక్కవాడికి ఆయుధం కాకూడదు. ప్రతిపక్షనేతగా ప్రస్థానం ప్రారంభించిన నాటి నుంచి జగన్ ఈ విషయంలో ఘోరంగా విఫలమయ్యారు.   జగన్ వైఖరి మారితే తప్ప, పార్టీని నిలబెట్టుకోవడం కష్టం. డబ్బులు ఖర్చు చేయాలి.. నాయకుల్ని స్వంతంగా తయారుచేసుకోవాలి.. వాళ్లతో మమేకం కావాలి. తన కోసం వాళ్లు ప్రాణాలిచ్చేంతగా బంధం ఏర్పాటు చేసుకోవాలి. పకడ్బందీ రాజకీయం చేయడం జగన్ నేర్చుకోవాలి.. అప్పుడే జగన్... వైఎస్ జగన్ అవుతారు.. తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకుంటారు.

'మోడీ' ఆంధ్రాని మోసం చేశారు...నిజమేనట..

మోడీకి ఏపీ మీద చిన్నచూపు ఉందన్నసంగతి కాస్త రాజకీయానుభవం ఉన్న ఎవరిని అడిగినా చెబుతారు. ఇక పార్లమెంట్లో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఏపీకి అన్యాయం జరిగిన తీరుపై సామాన్య ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. ఈ విషయాన్ని ఎవర్ని అడిగినా చెబుతారు. ఆంధ్రా ప్రజలను ప్రధాని మోడీ నమ్మించి మోసం చేశారని బల్లగుద్దిమరీ చెబుతారు. ఇక ఈ విషయంపై ఆంధ్రా అక్టోపస్‌ 'లగడపాటి రాజగోపాల్‌' ఇటీవల ఓ సర్వే కూడా నిర్వహించారట. ఈ సర్వేలో కూడా ఆంధ్రా ప్రజలను మోసం చేశారని 93శాతం మంది చెప్పారట. ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చకుండా.. ప్రధాని మోడీ మోసం చేశారా...? ఎన్డీఎ నుంచి చంద్రబాబు తప్పుకోవాలా..? ఎంపీలు రాజీనామాలు చేయాలా..? ప్రస్తుత పరిస్థితుల్లో ఎపిని గట్టెక్కించేవారు ఎవరు..? మోడీ,జగన్‌లు ఒప్పందం చేసుకోవడం వల్లే..హామీలను నెరవేర్చడం లేదా..? వంటి పన్నెండు ప్రశ్నలకు ప్రజలకు 'లగడపాటి' టీమ్‌ సంధించిందట. దీనిలో భాగంగా 'మోడీ' ఆంధ్రాని మోసం చేశారా..? అన్న ప్రశ్నకు 93శాతం మంది అవుననే సమాధానం ఇచ్చారట. కేంద్రంతో పోరాడినా లాభం లేదని 47శాతం మంది చెప్పారట. అదే సమయంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రాను గట్టెక్కించేదెవరన్న ప్రశ్నకు 78శాతం మంది 'చంద్రబాబు' పేరు చెప్పారట. అదే విధంగా..కేసుల కోసం బిజెపితో 'జగన్‌' లాలూచీ పడ్డారా అన్న ప్రశ్నకు 66శాతం మంది అవునని సమాధానం చెప్పారట. ఎన్డీఎ నుంచి తక్షణమే మంత్రులు తప్పుకోవాలని 82శాతం మంది చెప్పారట.   అయితే ఈ సర్వే వివరాలు ఇంకా అధికారికంగా అయితే బయటకు రాలేదు. 'లగడపాటి' స్వయంగా సర్వే వివరాలు బయటపెట్టే అవకాశాలు ఉన్నాయని.. ఒకటి రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని అంటున్నారు. మరి లగడపాటి చేసిన సర్వేలు దాదాపు ఇప్పటివకూ నిజమయ్యాయనే అంటారు. అయినా లగడపాటి సర్వే చెప్పినా.. చెప్పకపోయినా.. మోడీ మాత్రం ఏపీ ప్రజలకు మోసం చేశారన్నది అందరి అభిప్రాయం.. చూద్దాం..మరి ఏం జరుగుతుందో..!?

మాల్యానే మించిపోయాడుగా...వీళ్లు కనబడరు..

  బ్యాంకులకు వేల కోట్ల రూపాయల ఎగనామం పెట్టి కింగ్ పిషర్ అధినేత విజయ్ మల్యా ఎంచక్కా విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు తాజాగా మరో కుంభకోణం చోటుచేసుకుంది. గుజరాత్ రాష్ట్రానికి చెందిన నీరవ్ మోడీ  11వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి ఎంచక్కా ఆయన కూడా విదేశాలకు చెక్కేశాడు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన నీరవ్ మోడీ.. వజ్రాల వ్యాపారి. దేశంలోని అతిపెద్ద రెండో ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి.. రూ.11వేల కోట్లను విదేశాలకు తరలించినట్టు వెలుగు చూసింది. దీంతో దర్యాప్తు సంస్థలు విచారణ వేగవంతం చేశాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు బ్రాంచీలతో పాటు.. ఆ బ్యాంకు నుంచి పెద్ద ఎత్తున అప్పులు తీసుకుని ఎగ్గొట్టిన నీరవ్ మోడీ ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీ చేశారు. 11 వేల 300 కోట్లకు పైగా డబ్బును తప్పుడు లావాదేవీలతో దారి మళ్లించినట్టు గుర్తించారు. అంతేకాదు ఇతర బ్యాంకులు కూడా నీరవ్ మోడీ …ఆయన కుటుంబ సభ్యులకు అప్పులిచ్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే 10 మంది దాకా బ్యాంకు ఆఫీసర్లను సస్పెండ్ చేశారు. వాళ్లనుంచి వివరాలు రాబడుతున్నారు.   ఇదిలా ఉండగా... ఈ కుంభకోణం వెలుగు చూసినప్పటి నుంచి ప్రధాన నిందితుడు నీరవ్ మోడీ కనిపించటం లేదు. ఆచూకీ లేదు. ఇతను కూడా విదేశాలకు పారిపోయి ఉంటాడని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. స్విట్జర్లాండ్ దేశం వెళ్లి ఉంటాడని భావిస్తున్నాయి. మొత్తానికి నీరవ్ మోడీ.. విజయ్ మాల్యానే తలదన్నాడు అని అందరూ కామెంట్లు చేస్తున్నారు. లండన్ లో ఉన్న మాల్యానే ఇండియాకు రప్పించడానికి మనవాళ్లు నానా కష్టాలు పడుతున్నారు... ఇంక నీరవ్ మోడీ ఎక్కడున్నాడో కూడా తెలీదు. ఆయన ఆచూకి కనిపెట్టి...ఇండియాకు రప్పించి.. ఆయనకు శిక్ష పడేవరకూ పుణ్యకాలం కాస్త పూర్తవుతుంది. ఇక కేంద్ర ప్రభుత్వాలకు మాత్రం ఇవేమీ కనిపించవు.. ఎన్నికోట్ల కుంభకోణాలు జరిగినా చాలా సింపుల్ గా వీళ్లు దోషులు కాదు తీర్పులిచ్చేస్తుంటారు. సామాన్య ప్రజలపై మాత్రం తమ ప్రతాపాలు చూపిస్తుంటారు.

జగన్ పై తిరుగుబాటు మొదలైంది...

  ప్రత్యేక హోదా కోసం మేము కూడా పోరడతామని.. ఏప్రిల్ 6 వ తేదీన ఎంపీలందరూ రాజీనామా చేస్తారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేసిన సంగతి తెలిసిందే కదా. దీనివెనుక జగన్ ప్లాన్ కూడా అందరికీ అర్దమైంది. అయితే ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకు వచ్చింది. ఎంపీలు అందరూ రాజీనామా చేస్తారంట కానీ.. విజయసాయిరెడ్డి మాత్రం రాజీనామా చేయరంటా. ఈ మాట చెప్పింది ఎవరో కాదు స్వయంగా జగనే.   దీంతో మిగిలిన ఎంపీలు జగన్ పై తిరుగుబాటు చేశారు. ఎంపీలు రాజీనామా అంటే విజయసాయిరెడ్డి కూడా చేయాల్సిందే అని ఎంపీలు ఎస్పీ సుబ్బారెడ్డితో సహా అందరూ పట్టుబట్టారట. అయితే దీనికి జగన్.. ఢిల్లీలో మన తరపున లాబీయింగ్ కి సాయన్న అవసరం ఉందని అన్నారట. ఆ విషయం మనకు తెలుసు కానీ..ప్రజలకు చెప్పలేం కదా... ఎంపీలందరూ రాజీనామా చేసి విజయసాయిరెడ్డి ఎందుకు చేయలేదు అని ప్రశ్నిస్తే ఏం చెబుతాం అని జగన్ కు గట్టిగానే సమాధానం చెప్పారంట. అంతేకాదు.. ఇప్పటికే విజయసాయిరెడ్డి బీజేపీ నేతలతో కలుస్తూ ఫొటోలు దిగుతున్నారు.. దాంతో అందరూ మనం బీజేపీతో మ్యాచ్ ఫిక్స్ చేసుకున్నామనే అంటున్నారు.. ఇప్పుడు ఆయన రాజీనామా చేయకపోతే మనంతట మనమే అది నిజం చెప్పినట్టు అవుతుంది.. అని అన్నారట. మరి ఇప్పటికే జగన్ తన మోనార్క్ తెలివితేటలు చూపించి... చాలా మంది నేతలను దూరం చేసుకున్నాడు. ఇప్పుడు ఉన్న ఈ కొంతమందిని కూడా దూరం చేసుకుంటే... పార్టీ చేతులెత్తేసినట్టే. మరి అందరికీ ఒక న్యాయం.. ఇంటి వాళ్లకు ఒక న్యాయం అంటే రాజకీయాల్లో కుదరదు కదా మరి..