ఇంత అరాచకమా...లైవ్ టెలీకాస్ట్ పై కేంద్రం ఆదేశాలు..

  కేంద్ర బడ్జెట్ విషయంలో ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ టీడీపీ ఎంపీలు గత నాలుగు రోజులుగా పార్లమెంట్లో నినాదాలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఇన్ని రోజులు టీడీపీ ఎంపీలు నిరసనలు చేస్తున్నా... కేంద్ర ప్రభుత్వం కూడా అంటి అంటనట్టుగానే వ్యవహరిస్తుంది. ఇక సభలో ప్రసంగించిన మోడీ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు కానీ... ఏపీకి ఏం చేస్తామో మాత్రం చెప్పలేదు. ప్రసంగం మొత్తం కాంగ్రెస్ అన్యాయం చేసిందని.. కాంగ్రెస్ వల్లే ఇదంతా జరిగిందని... కాంగ్రెస్ వల్లే ఏపీకి సమస్యలని ఏకిపారేశారు. కాంగ్రెస్ న్యాయం చేయలేదు అని అంత చెప్పిన మోడీ తాము ఏం చేస్తామన్నది మాత్రం సెలవివ్వలేదు. దీంతో ఏపీ ప్రజలు ఇంకా ఆగ్రహానికి గురయ్యారు. ఇక దీనిలో ఆజ్యం పోసినట్టుగా ఉన్నాయి నిన్న జైట్లీ వ్యాఖ్యలు.. నిన్న సభలో ప్రసంగించిన ఆయన కూడా పాత పాటే పాడారు.   మా రాష్ట్రం గురించి మీరు మాట్లాడండి... మా సమస్య గురించి చెప్పిన తరువాత, మీరు మిగతా స్పీచ్ ఇవ్వండి అంటూ, జైట్లీని మన ఎంపీలు చుట్టుముట్టారు. దీనికి గాను జైట్లీ, ఒక్క 15 నిమషాలు మీరు ఓపిక పట్టండి అంటూ, మీ గురించే చెప్తాను నాకు టైం ఇవ్వండి అంటూ, సముదాయించారు... దీంతో మన ఎంపీలు జైట్లీ పక్కనే నుంచున్నారు... జైట్లీకి మధ్య మధ్యలో గుర్తుచేస్తూనే ఉన్నారు.. చివరిలో ఏపీకి నిధులు ఇవ్వాలని అడుగుతున్నారు కానీ కొద్దిగా భారం తగ్గితే ఏపీలాంటి రాష్ట్రాలకు నిధులు ఇచ్చే అవకాశముంటుందన్నారు. ఏపీ విభజన సమస్యలపై తనకు సానుభూతి ఉందని.. అన్ని సమస్యలు పరిష్కరిస్తాం అంటూ సెలవిచ్చారు. దీంతో టీడీపీ ఎంపీలు ఇంకా నిరసనలు ఉదృతం చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అదేంటంటే...  పార్లమెంట్లో జరిగిన సంఘటనలు మొత్తం టీవీ చానెల్స్ లైవ్ టెలీకాస్ట్ ద్వారా దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు చూస్తున్న నేపథ్యంలో ఉభయసభల్లో తెలుగుదేశం పార్టీతో పాటు మిగతా పార్టీల ఎంపీలు చేస్తున్న నిరసనలు ప్రసారం చేయొద్దని లోక్‌సభ టీవీ, రాజ్యసభ టీవీ వర్గాలకు ఆదేశాలు జారీ చేశారట. వెల్‌లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్న దృశ్యాలను టీవీల్లో చూపించవద్దని ఉభయసభల ఉన్నతాధికారులు ఈ రెండు చానళ్ల చీఫ్‌లను ఆదేశించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.  ఎంపీల ఆందోళన చూసి రాష్ట్రంలో మరింత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా, ఈ చర్యలు తీసుకునట్టు తెలుస్తుంది...మరి టీవీ ఛానెళ్ల ప్రసారాలు ఆపినంత మాత్రాన ఏం జరుగుతుందో జనాలకు తెలియదా. ఇలా చేస్తే ప్రజల్లో ఇంకా వ్యతిరేకత పెరుగుతుందే తప్పా.. బీజేపీకి లాభం ఏం లేదు.  కేంద్రం ఏపీకి చేసిన అన్యాయం గురించి అందరికీ తెలుసు.. ప్రసారాలు ఆపినంత మాత్రాన ఒరిగేది ఏం లేదన్న సంగతి తెలుసుకుంటే మంచిది కేంద్రం ఇప్పటికైనా..

టీడీపీ ఎంపీలతో సోనియా.. మాడిపోయిన బీజేపీ మొహాలు..

  కేంద్ర బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయానికి గాను టీడీపీ ఎంపీలు గత నాలుగు రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈ విషయంపై ప్రధాని మాట్లాడిన చాలా తెలివిగా మాట్లాడి టాపిక్ ను పక్కదారి పట్టించడానికి ప్రయత్నించారు కానీ... ఆపప్పులేం ఉడకలేదు. ఏదో తెలుగు ప్రజలకు అన్నాయం జరిగిందని... మధ్యలో ఎన్టీఆర్ పేరును తీసుకొచ్చి నాలుగు పొగడ్తలు పొగిడి..పోరాటాన్ని తెలివిగా పక్కదారి పట్టించాలనుకున్నారు. తన ప్రసంగం మొత్తంలో కాంగ్రెస్ ను దుమ్మెత్తిపోసిన మోడీ..తాము మాత్రం ఏపీకి ఏం చేస్తామో అన్న విషయం చెప్పకుండానే ముగించారు ప్రసంగాన్ని. దీంతో టీడీపీ ఎంపీలు మరింత దూకుడుని పెంచారు.  మోడీ ప్రసంగం తర్వాత కూడా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కేంద్రాన్ని ఓ రేంజ్ లో కడిగిపారేశారు.  అయితే ఆ మాటలతో సమస్య చల్లారిపోతుందని బీజేపీ భావించింది. కానీ టీడీపీ పోరాటంలో ఏ మార్పు లేదు. ప్లకార్డులు పట్టుకొని సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ డెమోక్రసీ అని నినాదాలు చేస్తూ తీవ్ర స్థాయిలో ఆందోళనలు గుప్పించారు. ఇక ఎప్పుడూ వినూత్నంగా నిరసనలు తెలిపే చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఇంకో అడుగు ముందుకెళ్లి సెక్రటరీ జనరల్ టేబుల్ మీదున్న పుస్తకాల్ని లాక్కోడానికి ప్రయత్నం చేశారు.   ఇదంతా ఇలా జరుగుతుంటే... మరోపక్క సోనియా గాంధీ టీడీపీ ఎంపీల ఆవేశం చూసి ఆశ్చర్యపోయారట. ఇంతలా ఆవేశం పడటానికి కారణం ఏంటో తెలుసుకోవాలని కేశినేని నానిని పిలిచి ఆంధ్రాలో పరిస్థితి గురించి అడిగారట. దీనికి నాని...విభజన హామీల అమలు చేయకపోవడం మీద ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారని తెలిపారట. అంతేకాదు.. ఇంకా ఏపీలో పరిస్థితుల గురించి నాని తో పాటు ఎంపీలు తోట నరసింహం, రామ్మోహన్ నాయుడు, రవీంద్రబాబు ఆమెకు వివరించారట. ఇదిలా ఉంటే సోనియాతో ఎంపీలు భేటీ అవ్వడం చూసి బీజేపీ నేతల మొహాలు మాడిపోయాయట. అంతేకాదు.. ఏపీ ఎంపీలతో మాట్లాడిన తరువాత  నాలుగు రోజులుగా స్పందించని కాంగ్రెస్ రూట్ మార్చింది.  ఏపీకి మద్దతిస్తూ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఏపీ విభజన చట్టం, హోదాపై చర్చ జరపాలంటూ లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ నోటీసును ఇచ్చింది. రూల్ 184 కింద ఏపీకి స్పెషల్ స్టేటస్ పై చర్చతో పాటు ఓటింగ్ జరపాలంటూ లోక్ సభ సెక్రటరీ జనరల్ కు కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మల్లికార్జున ఖర్గే నోటీసులు అందించారు. మరి అంతలా బాధపడేవాళ్లు ఏపీకి న్యాయం చేయాలని మాత్రం తెలియదు. పాపం బీజేపీ ఊహించకపోవచ్చు కాంగ్రెస్ ఏపీ ఎంపీలకు మద్దతిస్తుందని. మొత్తానికి సోనియా కూడా మద్దతివ్వడంతో   భవిష్యత్ రాజకీయ పరిణామాలు వేగంగా మారేలా కనిపిస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో...

దుమ్ముదులిపిన గల్లా.. షాక్ లో మోడీ.. పూల్స్‌లా కనిపిస్తున్నామా..?

  గుంటూరు మిర్చి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మిరపకాయలకు ఎంత ఘాటు ఉంటాయో.. అంతే ఘాటుగా స్పందించారు మన ఎంపీ లోక్ సభలో ఇంతకీ ఆ ఎంపీ ఎవరునుకుంటున్నారా...? ఇంకెవరు గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్. చూడటానికి ఎంతో సౌమ్యుడిగా... సైలెంట్ గా ఉండే గల్లా.. నిన్న లోక్ సభలో కేంద్ర బడ్జెట్ విషయంలో ఏపీకి జరిగిన అన్యాయంపై మాట్లాడిన విధానం చూసి అందరూ ఖంగుతిన్నారు. ప్రధాని మోడీ దగ్గర నుండి మిగిలిన ఎంపీలందరూ గల్లా నిలదీసిన విధానం చూసి షాకయ్యారు. అసలు గల్లాయేనా ఇలా మాట్లాడింది అని ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు తెలుగు ప్రజల మనసులో ఏముందో గల్లా అదే తమ మాటాల్లో చెప్పారని... తెలుగువాడు ఏలాంటి ఆవేదనతో ఉన్నాడో.. తన మాటల ద్వారా అడిగారని ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.   తమ మాటలతో 'మోడీ' ప్రభుత్వాన్ని ఉతికి ఆరేశారు...! అసలు మీరేమనుకుంటున్నారూ...ఆంధ్రా ప్రజలు..పూల్స్‌లా కనిపిస్తున్నారా..? ఎన్నాళ్లు ఇలా మోసం చేస్తారు..? అని మండిపడ్డారు. కొంత మందిని ఎప్పుడూ మోసం చేయవచ్చు. కొంత మందిని అప్పుడప్పుడు మోసం చేయవచ్చు. కానీ ఎప్పుడూ అందరినీ మోసం చేయలేరు. ఏపీ ప్రజలు కానీ..టీడీపీ కానీ మోసపోయే జాబితాలో ఉండరు.మా ముఖ్యమంత్రి ఎన్ని సార్లు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేశారు...? మేము మిత్రధర్మం పాటిస్తుంటే..మీరు దాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు... విభజిత ఆంధ్రాకు ఇచ్చిన హామీల్లో ఏవి అమలు అయ్యాయో..చెప్పండి..అంటూ నిలదీసి అడిగారు. కర్ణాటక మెట్రో కి 17 వేలు కోట్లు ఇచ్చారు..అలాగే ముంబై కి 51 వేల కోట్లు ఇచ్చారు..మరి ఏపీ ఏం పాపం చేసిందని.. అంటే కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్నాయి అని నిధుల వర్షం కురిపించారా..? ఏపీలో ఎన్నికలు వస్తేగానీ ఇవ్వరా అంటూ ఫైర్ అయ్యారు.   గడిచిన నాలుగేళ్లలో మా ముఖ్యమంత్రి 29సార్లు ఢిల్లీ వచ్చి ప్రధాని - ఆర్థిక మంత్రిని - ఇతర కేబినెట్ మంత్రులను కలిశారు. సవిరమైన నివేదికలు ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం కూడా ప్రధానిని కలిసి సమగ్ర నివేదిక అందజేశారు. ఇంత చేసినా ఇంకా సమాచారం కావాలని కోరడం.. పరిశీలిస్తున్నామనడం సిగ్గుచేటు.. అమరావతిని ఆదుకోవాలి.. అది మీరు ఇచ్చిన హామీ కాదు యాక్ట్ ప్రకారం చేయాలి.. గవర్నమెంట్ బిల్డింగ్స్ నిర్మాణం కోసం 40 వేల కోట్లు అవసరం అవుతుందని చెప్పాం.. కానీ ఇప్పటికి మీరు ఇచ్చింది కేవలం రెండు వేల కోట్లు ఇలా అయితే మా రాజధాని నిర్మాణం ఎప్పటికి జరుగుతుందని ప్రశ్నించారు. మాకు మీరు బడ్జెట్ లో ఇచ్చిన మొత్తం బాహుబలి సినిమా కలెక్షన్లు అంత కూడా లేవు అంటూ ఘాటుగా సెటైర్లు విసిరారు. తెలుగు ప్రజలు ఫూల్స్ కాదు... రాష్ట్రాన్ని విభజించి రాజకీయ లబ్ది పొందాలని చూసిన కాంగ్రెస్ పార్టీకి తెలుగు ప్రజలు ఎలాంటి గతి పట్టించారో తెలుసుకదా... అలాంటి పరిస్థితి బీజేపీకి రాకుండా చూసుకోవాలని అన్నారు.  కాంగ్రెస్ మాకు సున్నా ఇచ్చింది మీరు మాకు ఇప్పటికి ఏమి ఇచ్చారు.. ఎందుకు మీతో కలిసి ఉన్నామా అని అనిపిస్తోంది...మిత్ర ధర్మాన్ని పాటించకపొతే మాత్రం మీకు కాంగ్రెస్ గతే పడుతుంది.. ఇదే చివరి అవకాశం. ఇప్పుడైనా ఆలోచించుకోండి.. అని వార్నింగ్ ఇచ్చారు. మొత్తానికి ఇన్నిరోజులు ఏదో సహనంగా ఉన్న మన కోపాన్ని గల్లా తన స్వరం ద్వారా మోడీకి వినిపించారు. మరి ఇప్పటికైనా మోడీ ఆలోచించుకుంటారా..? లేక లైట్ తీసుకుంటారా..?చూద్దాం ఏం జరుగుతుందో...

రాహుల్ గాంధీయే నా బాస్.. పుత్రోత్సాహమా.. ?నమ్మకమా..?

కొత్తగా పార్టీ బాధ్యతలు స్వీకరించిన రాహుల్ గాంధీ మాంచి జోష్ లోనే ఉన్నట్టు కనిపిస్తోంది. రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టిన తరువాతే గుజరాత్ ఎన్నికలు వచ్చాయి. ఇక ఈ ఎన్నికలే రాహుల్ భవితవ్యాన్ని నిర్ణయిస్తాయని కూడా అనుకున్నారు. అయితే రాహుల్ కు కాలం బాగానే కలిసొచ్చింది. రాహుల్ బాధ్యతలు స్వీకరించిన తరువాతే 2జీ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ కు ఊరట కలిగింది. దీంతో రాహుల్ వచ్చిన వేళా విశేషం అనుకున్నారు. ఆతరువాత గుజరాత్ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ బీజేపీకి గట్టి పోటీనే ఇచ్చింది. దాదాపు 15 రోజుల పాటు రాహుల్ అక్కడే మకాం వేసి ప్రచారంలో మోడీపైన సెటైర్లు వేస్తూ జనాల్లోకి బాగానే వెళ్లాడు. దాని ప్రభావం ఎన్నికల్లో కూడా కనిపించింది. మోడీ కంచుకోట అయిన గుజరాత్ లోనే మోడీ చచ్చీ చెడీ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో కాంగ్రెస్ రాహుల్ గాంధీని హీరో చేసింది. తాజాగా జరిగిన రాజస్థాన్ ఎన్నికల్లో అయితే బీజేపీ ఓడిపోయి... కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. దీంతో రాహుల్ పై గతంలో ఉన్న ముద్ర పోయింది.   మరి గతంలో రాహుల్ అంటే పప్పు అనుకునే వాళ్లు ఇప్పుడు ఆయన్ని హీరో అంటుంటే.. సోనియా గాంధీకి ఎలా ఉంటుంది. అసలు ఎప్పుడో ఇవ్వాల్సిన పార్టీ భాధ్యతలు ఇంత లేట్ అయిందంటే దానికి గతంలో రాహుల్ పై ఉన్న అభిప్రాయమే. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ నేపథ్యంలోనే తన కొడుకు గురించి సోనియా గాంధీ కూడా ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 19 సంవత్సరాలు సోనియా గాందీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు మోసింది. తన కనుసన్నల్లోనే పార్టీని నడిపించింది. అలాంటి సోనియా ఆ బాధ్యతలను స్వీకరించిన తన కుమారుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై తనకు రాహుల్ గాంధీయే బాస్ అని ఆమె అన్నారు. "నా బాస్ కూడా రాహుల్ గాంధీయే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మీరంతా ఆయనతో కలసి నడుస్తారని నాకు తెలుసు. నాపై చూపించిన నమ్మకాన్ని, విశ్వాసాన్నే రాహుల్ పైనా చూపుతారని అనుకుంటున్నా" అని కాంగ్రెస్ ఎంపీలతో పార్లమెంట్ లో సమావేశమైన సోనియా వ్యాఖ్యానించారట. రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారాన్ని అందుకుంటుందన్న విశ్వాసం తనకుందని అన్నారట. మొత్తానికి సోనియాకు రాహుల్ పై గట్టి నమ్మకమే ఏర్పడింది. తన కొడుకును చూసుకొని పుత్రోత్సాహంతో మురిసిపోతున్నట్టు ఉంది సోనియా.. అందుకే రాహుల్ పై అంత నమ్మకం పెట్టుకున్నారు. మరి సోనియా నమ్మకాన్ని రాహుల్ ఏం చేస్తాడో చూద్దాం...

ఏపీ కోసం పవన్ నిరాహార దీక్ష..?

విభజన హామీలను గాలికొదిలేసింది గాక.. బడ్జెట్‌లో సంతృప్తికరమైన కేటాయింపులు లేకపోవడంతో బీజేపీపై ఆంధ్రప్రదేశ్ భగ్గుమంటోంది. తమకు న్యాయం చేయాలంటూ గత కొద్దిరోజులుగా ఏపీ ఎంపీలు పార్లమెంటు ఉభయసభలను స్తంభింపచేస్తున్నారు. ప్రధాని దిగి వచ్చి స్పష్టమైన హామీ చేస్తారనుకుంటే.. నిన్నటి ఆయన ప్రసంగం "ఆ ఒక్కటి తప్ప" అన్నట్లుగా సాగింది. ఇక ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలకు నష్టం కలిగితే ఏ మాత్రం సహించేది లేదు అంటూ పెద్ద పెద్ద మాటలు డైలాగ్స్ కొట్టే.. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్.. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన వారం తర్వాత తీరిగ్గా నిన్న ప్రెస్‌మీట్ పెట్టారు. అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించారని.. కేంద్రప్రభుత్వం విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని.. తాను ప్రశ్నించాలని కాకినాడలో సభ పెడితే నన్ను కూల్ చేశారని పవన్ చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి మేలు చేసే డిమాండ్ల సాధనపై చేసే పోరాటానికి తన ఒక్కడి బలం సరిపోవడం లేదని.. ఉండవల్లి అరుణ్‌కుమార్, జయప్రకాశ్ నారాయణ్ లాంటి మేధావులను కలుపుకుని జాయింట్ యాక్షన్ కమిటీగా ముందుకు వెళ్తానని చెప్పారు. సినిమాలకు దూరమై పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా అడుగులు వేస్తోన్న పవన్.. నిన్న మొన్నటి వరకు రెండు రాష్ట్రాల్లో బస్సు యాత్రలు చేశారు. మరో విడత యాత్రకు సన్నద్ధమవుతున్న దశలో.. ఆయనకు బడ్జెట్‌‌లో కేంద్ర ప్రభుత్వ తీరు ఒక అస్త్రంగా దొరికింది. దీనిపై అటెన్ష‌నైన జనసేనాని.. బీజేపీ వైఖరిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ‌ఆందోళన నిర్వహించాలని పవన్ భావిస్తున్నారు. కుదిరితే నిరాహారదీక్ష కూడా చేస్తారని జనసేన కాంపౌండ్‌లో టాక నడుస్తోంది. మరి పవన్ కళ్యాణ్ ఆలోచన ఎలా ఉండబోతుందా అన్న దానిపై.. త్వరలోనే స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

కేవీపీ వల్ల మేలెవరికి..? కాంగ్రెస్‌కా.. జగన్‌కా..?

రాజకీయాల్లో నెగ్గుకు రావడమంటే మామూలు విషయం కాదు. ఎత్తులు.. పై ఎత్తులు, అసంతృప్తులు వీటన్నింటిని తట్టుకుని నిలబడగలగాలి. అవతలి పక్షం వారు ఏం చేస్తున్నారో ముందుగానే ఊహించి దానికి చెక్ పెట్టాలి. అప్పుడే రాజకీయ వైకుంఠపాళిలో పాము మింగకుండా ఉంటుంది. వైరి పక్షం ఎత్తుగడలను తెలుసుకునేందుకు తన అనుకున్న కొందరిని ఆ వర్గంలో ఉంచడమో.. లేదంటే ప్రత్యర్థి వర్గంలోని కీలకవ్యక్తిని తమకు అనుకూలంగా మార్చుకుని రహస్యాలను రాబట్టేవారు రాజులు. అదే రాజతంత్రాన్ని ఆధునిక కాలంలోనూ ఘనత వహించిన నేతలు ఎందరో ఉపయోగించినట్లు మనకు చరిత్ర చెబుతోంది.   వైఎస్ రాజశేఖర్ రెడ్డి జమానాలో ఒక వెలుగు వెలిగిన కేవీపీ రామచంద్రరావు.. వైఎస్ మరణం తర్వాత ఒంటరిగా మిగిలిపోయారు. రాజశేఖర్ రెడ్డి అనుచరుల్లో ఎక్కువ మంది జగన్ బాటలో నడుస్తుండగా.. మరికొందరు మాత్రం తెలుగుదేశం వైపు వెళ్లిపోయారు. రాష్ట్ర విభజనలో ప్రధాన భూమిక పోషించిన కాంగ్రెస్ పార్టీ చేసిన పాపానికి ప్రతిఫలంగా.. ఆంధ్రప్రదేశ్‌లో భూస్థాపితం అయిపోయింది. ఇప్పటికే మునిగిపోయిన కాంగ్రెస్ నావను తీరానికి చేర్చే బాధ్యతను రఘవీరారెడ్డికి అప్పగించారు. పేరుకి ఆంధ్రప్రదేశ్ పీసీపీ అధ్యక్షుడు రఘువీరా అయినప్పటికి పెత్తనమంతా కేవీపీదేనన్నది బహిరంగ రహస్యం. ఎంపీ పదవి చేతులో ఉండటం.. హైకమాండ్‌తో రెగ్యులర్‌గా టచ్‌లో ఉండటం వల్ల కేవీపీ మాటకు ఎదురు లేకుండా పోతోంది.   అయితే ఆయన కాంగ్రెస్‌కు పూర్వవైభవం తెచ్చే ఆలోచనల కన్నా.. తన మిత్రుడి కొడుకు జగన్‌కు మేలు చేసేందుకే.. నిత్యం వ్యూహాలు రచిస్తున్నాడంటూ పొలిటికల్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉండవల్లి అరుణ్ ‌కుమార్ ఉన్నపళంగా జగన్‌కు అనుకూలంగా మాట్లాడటం వెనుక.. మల్లాది విష్ణుతో పాటు మరికొందరు హస్తాన్ని వీడి జగన్ పంచన చేరడం వెనుక కేవీపీ ఉన్నారనే టాక్ 10 జెన్‌పథ్‌లో వినిపిస్తోంది. సోనియా అధినేత్రిగా ఉన్నంత కాలం కేవీపీ హవా నడిచినప్పటికీ.. రాహుల్ జమానాలో ఆయన ఆటలు సాగవని.. వీలైనంత త్వరలోనే రామచంద్రరావుకి చెక్ పెట్టేందుకు రాహుల్ గాంధీ చర్యలు తీసుకుంటారని ఏపీ కాంగ్రెస్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మోడీకి వీహెచ్ పంచ్.... అది కూడా తెలీదా...!

  నిన్న జరిగిన లోక్ సభలో మోడీ ప్రసంగిస్తూ కాంగ్రెస్ పై దుమ్మెత్తిపోసిన సంగతి తెలిసిందే కదా. బడ్జెట్ పై ఏపీకి అన్యాయం జరిగిన నేపథ్యంలో టీడీపీ ఎంపీలు గత నాలుగు రోజులుగా పార్లమెంట్ ఉభయసభల్లో నిరసనలు ప్రదరిస్తున్నారు. ఈ క్రమంలో లోక్ సభలో ప్రసంగించిన మోడీ..కాంగ్రెస్ నే టార్గెట్ చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే మోడీ కాంగ్రెస్ పై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆ పార్టీ సీనియర్ నేత వీహెచ్ మోడీకి మంచి పంచ్ ఇచ్చారు. కాంగ్రెస్ వల్లే ఏపీకి ఇప్పుడు సమస్యలు వచ్చాయని... గతంలో వాజ్ పేయి మూడు రాష్ట్రాలు విభజిస్తే ఎలాంటి వివాదాలు రాలేదు... కానీ ఆంధ్రప్రదేశ్‌ విషయంలో అలా జరగలేదు. రాజకీయ లబ్ధి కోసం పార్లమెంటు తలుపులు మూసివేసి విభజన బిల్లు ఆమోదింపజేసుకున్నారు.. కాంగ్రెస్‌ పార్టీ ఒక్క రాష్ట్రాన్ని విభజిస్తే నాలుగేళ్లుగా విభజన సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయని మోడీ ప్రసంగంలో కాంగ్రెస్ ను తిట్టిపోశారు. అంతేకాదు హైదరాబాద్‌లో ఏపీ దళిత ముఖ్యమంత్రిని రాజీవ్‌గాంధీ అవమానించారు. నీలం సంజీవరెడ్డి, అంజయ్యను, పీవి నరసింహారావును కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా అవమానించింది అని అన్నారు.   ఇక ఈవ్యాఖ్యలపై స్పందించిన వీహెచ్.. మోడీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అంజయ్య వంటి దళిత ముఖ్యమంత్రిని  బేగంపేట విమానాశ్రయంలో రాజీవ్ గాంధీ అవమానించారని మోడీ గారు అంటున్నారు.. అసలు అంజయ్య ఎస్సీ కాదన్న సంగతి కూడా తెలియని ప్రధాని, ఆయన గురించి ఎందుకు మాట్లాడారని విమర్శించారు. అంజయ్య రెడ్డి వర్గానికి చెందిన వాడని, ఆయనేమీ షెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యక్తికాదన్న సంగతి మోదీ తెలుసుకోవాలని అన్నారు. అంజయ్య భార్య కూడా రెడ్డి వర్గం మహిళేనని అన్నారు. రాజీవ్ గాంధీ ఆయన్ను ఎన్నడూ ఇన్ సల్ట్ చేయలేదని... నిజాలు తెలియకుండా కామెంట్లు ఎలా చేస్తారని నిప్పులు చెరిగారు. పాపం మరి మోడీ గారు ఇన్ఫర్మేషన్ లేకుండా మాట్లాడి బుక్ అయ్యారు.

మోడీ గారు ఈ చిన్న లాజిక్ ఎలా మరిచిపోయారు...

  ఉరుము ఉరిమి మంగలం మీద పడింది అన్న సామెత గుర్తుంది కదా.. అలా ఉంది ఇప్పుడు ప్రధాని మోడీ చేసింది. కేంద్ర బడ్జెట్ విషయంలో ఏపీకి అన్యాయం జరిగిన నేపథ్యంలో టీడీపీ ఎంపీలు గత మూడు రోజులుగా పార్లమెంట్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ రోజు కూడా ప్లకార్డులు పట్టుకుని ఏపీకి న్యాయం చేయాలంటూ.. విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అయితే ఈరోజు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. అయినా కూడా ఎంపీలు మాత్రం ఏమాత్రం కూడా వెనక్కితగ్గకుండా నినాదాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ ప్రసంగంలో ముఖ్యంగా మోడీ కాంగ్రెస్ నే టార్గెట్ చేశారు.   ఒకపక్క ఏపీ ఎంపీలు ఆందోళనలు చేస్తుంటే.. దానికి సమాధానం చెప్పకుండా.. కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించే పనిలో పడ్డారు. ఏపీ విభజన సమయంలో కాంగ్రెస్ తీరు వల్లే రాష్ట్రానికి ఇప్పుడు సమస్యలు వచ్చాయని, రాష్ట్రాన్నే కాదు.. దేశాన్ని కూడా కాంగ్రెస్ మోసం చేసిందని మోదీ మండిపడ్డారు. వాజ్‌పేయి హయాంలో మూడు రాష్ట్రాలు విభజిస్తే ఎలాంటి వివాదాలు రాలేదని.. కానీ ఆంధ్రప్రదేశ్‌ విషయంలో అలా జరగలేదు. రాజకీయ లబ్ధి కోసం పార్లమెంటు తలుపులు మూసివేసి విభజన బిల్లు ఆమోదింపజేసుకున్నారు.. కాంగ్రెస్‌ పార్టీ ఒక్క రాష్ట్రాన్ని విభజిస్తే నాలుగేళ్లుగా విభజన సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయని.. అన్నారు. అప్పుడు వారు చేసిన తప్పుల వల్లనే ఈనాడు ప్రతిపక్షంలో కూర్చున్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్‌ పార్టీకి లేదని మండిపడ్డారు. అంతేకాదు హైదరాబాద్‌లో ఏపీ దళిత ముఖ్యమంత్రిని రాజీవ్‌గాంధీ అవమానించారు. నీలం సంజీవరెడ్డి, అంజయ్యను, పీవి నరసింహారావును కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా అవమానించింది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ చేసిన రాజకీయ అరాచకాలు అనేకం. అలాంటివారా ఆ రాష్ట్రం గురించి మాట్లాడేది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ ప్రసంగం మధ్యలో మోదీ.. ఎన్టీఆర్‌ పేరు ప్రస్తావించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందన్నారు. దీనికోసమే తెలుగు ప్రజల ఆరాధ్యదైవం ఎన్టీఆర్‌ సినిమాలు వదిలి రాజకీయ ప్రవేశం చేశారని.. ప్రజలు ఆయనకు పట్టంగట్టారని అన్నారు.   ఇక ఇంత చెప్పిన మోడీ తాను ఏపీకి ఏం చేస్తానన్న విషయం మాత్రం చెప్పలేదు. విభజన చట్టంలోని హామీల ఊసే ఎత్తలేదు. విభజన పాపం కాంగ్రెస్ దే అని...ఏపీకి ఎలాంటి హామీ ఇవ్వకుండానే చేతులు దులిపేసుకున్నారు. అయితే ఇక్కడ మోడీ గారు అర్దం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే... కాంగ్రెస్ చేసిన పాపానికి  వారికి తగిన బుద్ది చెప్పడం అయిపోయింది. ఏదో రాజకీయ ప్రయోజనం కోసం.. రాష్ట్రాన్ని విభజించింది కాంగ్రెస్. రాష్ట్రం విడగొట్టినందుకు ఏపీలో మట్టికొట్టుకుపోయింది. పోనీ రాష్ట్రం ఇచ్చినందుకు తెలంగాణలో అయినా కాంగ్రెస్ ను ఆదరించారా అంటే అదీ లేదు. ఈ ఒక్క పాపానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కోలుకోవడం చాలా కష్టం.. తెలంగాణలో ఏమో కానీ.. ఏపీలో అయితే కాంగ్రెస్ ను ఎట్టిపరిస్థితిలో క్షమించరు. మరి ఈ విషయం మోడీ గారు మరిచిపోయారేమో...? కాంగ్రెస్ పాపానికి శిక్ష అనుభవిస్తూనే ఉంది. మోడీ గారు ఇలానే చేస్తే కాంగ్రెస్ కు పట్టిన గతే బీజేపీకి కూడా పడుతుందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఏదో ఏపికి అన్యాయం గురించి మాట్లాడుతూ....ఎన్టీఆర్ గురించి, తెలుగు ఆత్మ గౌరవం అంటూ, నాలుగు ఎమోషనల్ డైలాగ్స్ చెబితే సరిపోదు కదా..జరిగిన అన్యాయానికి ఏం న్యాయం చేస్తారో చెప్పాలి కదా. ప్రస్తుతం పూర్తిస్థాయి మెజార్టీతో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ చేసిన తప్పులను ఎలా సరిదిద్దుతుందో, ఏపీకి ఏ విధంగా న్యాయం చేస్తుందో మాత్రం చెప్పలేదు. ఎలాగూ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మరి దానికి ఆయనేం చేస్తారో మాత్రం సెలవివ్వలేదు. ఇలానే మాటలతో సరిపెడితే రాష్ట్రంలో పార్టీకి అదోగతే. మోడీ గారు ఈ చిన్న లాజిక్ ఎలా మరిచిపోయారో పాపం...  

రాహుల్ కూడా మొదలెట్టాడు...

  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే... లేక ఏపీలో ఎన్నికలు జరిగితే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి.. ఎవరి అధికారం చేపడతారు... ఈ విషయాలపై అబ్బో ఇప్పటికే ఎంతో మంది ఎన్నో సర్వేలు చేశారు. ఇక్కడే కాదు...ఓ జాతీయ ఛానెల్ కూడా ఏపీ రాజకీయాలపై ఇంట్రస్ట్ తో సర్వే చేయించింది. ఇక సర్వేల్లో  మాకు ఇన్ని సీట్లు వస్తాయి.. వాళ్లకి  ఇన్ని సీట్లు వస్తాయి అంటూ ఎవరికి వాళ్లు వారి పార్టీలకు ఫెవర్ గా చెప్పుకున్నారు. ఇక ఇప్పుడు అందరూ అయిపోయారు.. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మిగిలారు. ఆయన కూడా ఇప్పుడు ఏపీ రాజకీయాలపై సర్వే చేయించారట.   గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ కి కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఏదో చచ్చీ చెడీ గెలిచింది ఆ ఎన్నికల్లో బీజేపీ. ఓ రకంగా పార్టీ బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీకి గుజరాత్ ఎన్నికలు బాగానే జోష్ ఇచ్చాయి.  ఇక మొన్నీమధ్య రాజస్థాన్ లో రెండు లోక్‌సభ, ఒక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం మూటగట్టుకుంది. కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే రెండు నెల‌ల్లో క‌ర్నాట‌క‌లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను కూడా రాహుల్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల‌ను టార్గెట్‌గా చేసుకున్న రాహుల్ జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద రాష్ట్రాల్లో రాజ‌కీయ ప‌రిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు త‌న టీంతో స‌ర్వేలు చేయించారట. ఈ క్రమంలోనే సాధార‌ణ ఎన్నిక‌ల‌కు రెడీ అవుతోన్న ఏపీ, తెలంగాణ‌లో సైతం జ‌నాల మూడ్ ఎలా ఉందో తెలుసుకునేందుకు రాహుల్ స‌ర్వే చేయించారట. ఈ స‌ర్వేలో ఏపీలో అధికార టీడీపీ వైపు జ‌నాలు మ‌రోసారి మొగ్గు చూపుతున్న‌ట్టు తేలింద‌ట. మొత్తం 13 జిల్లాల్లోని 175 స్థానాల్లో టీడీపీకి ఎంత క్లిష్టంగా చూసుకున్నా క‌నిష్టంగా 95, గ‌రిష్టంగా 110కు త‌గ్గ‌వ‌ని తేలింద‌ట‌. ఇక విప‌క్ష వైసీపీ గ‌త ఎన్నిక‌ల కంటే దిగ‌జారి 55 -60 సీట్ల‌కే ప‌రిమిత‌మ‌వుతుంద‌ని తేలింద‌ట‌. అంతేకాదు.. గ‌త‌ ఎన్నికల్లో వైసీపీకి కర్నూలు, కడప జిల్లాలు కంచుకోటలుగా వచ్చే ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో వైసీపీకి పెద్ద షాకే త‌గులుతుంద‌ని రాహుల్ స‌ర్వేలో తేలింద‌ట‌.   మరి ఎవరు ఎన్ని సర్వేలు చేసినా ఆఖరికి పార్టీల భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంటుందన్నది మాత్రం అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. ఎంత మంది ఎన్ని సర్వేలు చేసుకున్నా ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి పట్టం గడతారో వారిదే అధికారం. పాపం ఏదో రాజకీయ నేతలు తమ సంతృప్తి కోసం ఇలా సర్వేలు చేసుకుంటూ హ్యాపీగా ఫీలవుతారు అంతే తప్పా.. సర్వేలను నమ్ముకుంటే అంతే సంగతి. మరి చూద్దాం ఆఖరికి ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి... ఎవరు అధికారం చేపడతారో...

ఇంత జరుగుతుంటే చిరంజీవి ఎక్కడ..?

విభజన హామీలను ఏమాత్రం పట్టించుకోకపొగా.. బడ్జెట్‌లో చిల్లిగవ్వ విదిల్చని కేంద్రప్రభుత్వ తీరుపై ఆంధ్రప్రదేశ్ ఎంపీలు నిరసన గళం వినిపిస్తున్నారు. రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాత్రం మన ఎంపీలందరూ ఒక్కతాటిపై నడుస్తున్నారు.. అందరూ చేతులు కలపకపోయినప్పటికీ.. అందరూ ఒక్కతాటిపై నిలబడి కేంద్రానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్‌ ఇలా అన్ని పార్టీలకు చెందిన ఎంపీలు.. తమ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని పార్లమెంట్‌లో వినిపించే ప్రయత్నం చేస్తున్నారు.   కుదిరితే లోపల.. లేదంటే బయట అన్నట్లుగా "సేవ్ ఆంధ్రప్రదేశ్.. హెల్ప్ ఆంధ్రప్రదేశ్" అంటూ ఫ్లకార్డులు పట్టుకొని కథం తొక్కుతున్నారు. లోక్‌సభ, రాజ్యసభ అన్న తేడా లేకుండా ఏపీ ఎంపీలంతా.. ఢిల్లీలో మకాం పెడితే ఒక ఎంపీ మాత్రం పత్తా లేకుండా పోయాడు. ఆయనే మెగాస్టార్ చిరంజీవి. రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్ర ప్రయోజనాలపై పోరాడాల్సిన చిరు.. ఇంత గందరగోళ పరిస్థితుల్లో సైలెంట్‌గా ఉండటం రాజకీయ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. భూస్థాపితం అయిపోయిన కాంగ్రెస్ పార్టీ ఈ బడ్జెట్ సందర్భంగానైనా పోరాడి జనాల్లో కాస్తంత చోటు సంపాదించాలని తహతహలాడుతోంది.   మరి అదే కాంగ్రెస్ సభ్యుడైయుండి చిరు ఏం చేస్తున్నట్లు. పార్టీ సంగతి వదిలేసినా.. ఏదో ఒకటి చేస్తాడని మెగాస్టార్‌పై ప్రజల్లో కాస్తో కూస్తో పాజిటివ్‌నెస్ ఉంది. అలాంటిది ఎంపీ హోదాలో బడ్జెట్ వంటి కీలక వ్యవహారంపై కనీస స్పందన లేకుండా.. మీడియా కంటికి దొరక్కుండా తప్పించుకుని తిరుగుతూ.. చివరికి పార్లమెంట్‌కు కూడా వెళ్లడం లేదు చిరంజీవి. కేవీపీ రామచంద్రరావు వంటి వయసు పైబడిన వ్యక్తి కూడా రాజ్యసభలో ఫ్లకార్డులతో నిరసన తెలుపుతుంటే.. సినీనటుడిగా జనాకర్షణ ఉన్న వ్యక్తి ఇంట్లో ఉండటమేంటీ..? ఒకవేళ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడా అంటే అదీ లేదు.. మరి చిరంజీవి ముడుచుకుని కూర్చోవడం వెనుక అసలు రీజన్ ఏంటీ..? అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో సెటైర్లు పేలుస్తున్నారు.

ధర్మరాజును మించిపోయిన చంద్రబాబు...

  ధర్మరాజు... మహాభారతం తెలిసిన వారికి ఈయన గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. పాండవులలో పెద్దవాడైన ఈయన సహనానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకొవచ్చు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా.. ఎంతటి ఆపదలు ఎదురైనా....ఎంతో సహనంతో ఉండగల వ్యక్తిత్వం అతనిది.. అలా అని అన్ని సందర్బాలలో అలానే ఉంటాడని కాదు. శత్రువును ఎలా దెబ్బకొట్టాలో కూడా ఆయనకి బాగా తెలుసు. తిక్కన అంతటి కవి బ్రహ్మ ధర్మరాజును "మెత్తని పులి" అని అన్నాడంటే అది చాలా ఆలోచించాల్సిన విషయం.. ఎందుకంటే...  పైకి మెత్తగా, శాంతియుతంగా కనిపిస్తాడు.. కానీ కాదు. ప్రతీకారవాంఛ వుంటుంది. కానీ సమయం,సందర్భం చూసుకోవాలి. సహనం వహిస్తాడు. కానీ ఎలా దెబ్బ కొట్టాలో అలా కొడతాడు. ఇంతకీ ఈ ధర్మరాజు కథ ఎందుకనుకుంటున్నారా... అయితే ఆ యుగంలో ధర్మరాజుకి ఎంత సహనం ఉందో.. ఇప్పుడు ఈ రాజకీయాల్లోకి వస్తే చంద్రబాబుకు అంత సహనం ఉందని చెప్పొచ్చు.   నిజానికి అందరి నాయకులతో పోల్చుకుంటే చంద్రబాబుకి సహనం కాస్త ఎక్కవే. ప్రస్తుత పరిస్థితులు చూస్తూనే అర్ధం చేసుకోవచ్చు. యూపీఏ హయాంలో రాష్ట్రాన్ని రెండుగా చీల్చినా.. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఏపీకి ఏదో చేస్తామని.. పొడిచేస్తామని మాటలు చెప్పినా ఇప్పటివరకూ ఏపీకి జరిగింది ఏం లేదు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా.. బీజేపీతో టీడీపీ మిత్రపక్షంగా ఉన్నా ఏపీని ఎప్పుడూ చిన్నచూపు చూశారు తప్పా... మోడీ ఏపీకి చేసింది ఏం లేదు. అలా అని చంద్రబాబు వారిపై కోప్పడటం కానీ.... మిత్రుత్వాన్ని తెచ్చుకోవడం చేయలేదు. ఎదురుచూస్తూనే వచ్చారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని తనపై ఎన్ని విమర్శలు గుప్పించినా... చాలా సహనంతో ఉన్నారే తప్పా.. తిరిగి ఒక్క మాట అనకుండా ఉండేవారు. బీజేపీ పెద్దలు కూడా ఎన్ని మాటలు అన్నా...ఇప్పటికే ఎన్నోనిధులు ఇచ్చాం అని అంటున్నాం... రాష్ట్రాభివృద్దికోసం కాస్త తగ్గి.. కేంద్రం చుట్టూ తిరుగుతూ.. వారిని అడుగుతూనే ఉన్నాయి. ఆఖరికి కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత ప్రతిఒక్కరూ బీజేపీ తీరును ఎండగడుతున్నారు. అయినా చంద్రబాబు మాత్రం ఇంకా ఎదో ఆశతోనే ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకే ఎంపీలనైతే పార్లమెంట్లో నిరసనలు చేయమన్నారు కానీ... బీజేపీతో తెగదెంపులు చేసుకుంటున్నామని మాత్రం చెప్పలేకపోతున్నారు.   ఇక విషయంపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కూడా స్పందిస్తూ చంద్రబాబు నాయుడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా... నిర్మొహమాటంగా చెప్పడంలో దిట్ట అయిన జేసీ పార్లమెంట్ ప్రాంగణంలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ....రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నదొకటి, ఈరోజున అమలు పరుస్తామంటున్నది మరోటి అని మండిపడ్డారు. ఏపీకి ఏదో ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని అన్నారని, ఇప్పుడు, ఆ ప్యాకేజీ లేదూ, పీకేజీ లేదంటూ విమర్శించారు. బీజేపీతో  ‘‘మేము మిత్రపక్షంగా ఉండాల్సిన అవసరముందా?’ అని పునరాలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ముఖ్యమంత్రి గారికి సహనం ఎక్కువ. ఇంకా, ఏదో జరుగుతుందనే ఆశలో ఉన్నారు. ఆ మహానుభావుడు ఇంకెంత కాలం చూస్తాడో! ఈ సహనమే కొంపముంచుతోంది. సహనానికి కూడా హద్దుండాలి! ధర్మరాజు కంటే సహనపరుడెవరూ లేరు. ఆయన అడుగుజాడల్లో ఈయన నడుస్తున్నారు..నాడు ధర్మరాజు అంతటి వాడే యుద్ధానికి ‘సై’ అన్నాడు, మరి, ఈయన (చంద్రబాబు) ఎప్పుడంటారో చూడాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరి రాజకీయ చాణక్యుడని చంద్రబాబుకి మాములుగా పేరు రాలేదు. ఆయన ఇంకా సహనంగా ఉన్నారంటే... ఆయన స్ట్రాటజీ ఏంటే ఆయనకే తెలుసు. ఎన్నో ఏళ్ల రాజకీయానుభవం ఉన్న చంద్రబాబుకి తెలుసు కదా అన్నీ.. చూద్దాం ఏం జరుగుతుందో...

బాబు మైండ్‌గేమ్‌కి మోడీ దిగివస్తారా..?

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పార్లమెంటేరియన్లంతా మూకుమ్మడిగా పార్లమెంటు ముందు నిరసనకు దిగారు. ఆ పార్టీ.. ఈ పార్టీ అని లేకుండా అన్ని పార్టీలకు చెందిన ఎంపీలు ఇందులో భాగస్వాములు అయ్యారు. వీరందరిలో తెలుగు దేశానికి చెందిన సభ్యులపై ఒత్తిడి తారాస్ధాయిలో ఉంది. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి రాష్ట్రానికి ఏం సాధించలేకపోయారని ఇప్పటికే టీడీపీపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి బయటకు వద్దాం అని ప్రయత్నిస్తే.. అటువైపు నుంచి రాయబారాలు రావడంతో.. ముఖ్యమంత్రి చంద్రబాబు మరో అవకాశం ఇచ్చి చూద్దాం అని శ్రేణులకు సర్ది చెప్పారు.   కానీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడకుండా.. ఏపీకి జరిగిన అన్యాయాన్ని పార్లమెంట్‌ సాక్షిగా తెలియజేయాలని ఎంపీలకు తెలియజేశారు. అధినేత ఆదేశాలతో కదిలిన టీడీపీ ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు నిరసనకు దిగారు. ఇప్పుడు ఏపీకి ఏమైనా లాభం జరిగితే అది తెలుగుదేశం ఖాతాలోకి వెళ్లిపోతుందని గ్రహించిన.. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కూడా తన ఎంపీలను రంగంలోకి దించింది.   వీరిద్దరూ పోటాపోటీగా స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి.. ఏపీకి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. అరుపులు.. గోలలు.. గందరగోళం మధ్య సభను నడపలేక స్పీకర్ సభను వాయిదా వేశారు. ఈ రచ్చ జరుగుతుండగానే.. కేంద్ర మంత్రి సుజనా చౌదరిని ప్రధాని వద్దకు పంపించారు చంద్రబాబు. సభ వాయిదా పడిన అనంతరం మోడీని కలిసిన సుజనా సుమారు అరగంట పాటు భేటీ అయినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఏపీకి ఎలాంటి అన్యాయం జరగదని.. తొందరపడవద్దని ప్రధాని స్పష్టమైన హామీ ఇచ్చారట. సమస్యల పరిష్కారానికి చర్చలే మార్గమని.. ఆందోళనలతో ఏం సాధించలేమని ప్రధాని చెప్పినట్లు టీడీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఒకవైపు నిరసనలతో ఒత్తిడి పెంచుతూనే.. మరోవైపు చర్చల ద్వారా చంద్రబాబు కేంద్రాన్ని డిఫెన్స్‌లో పడేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏదైనా ఒకటి అనుకుంటే ఆరునూరైనా దాని నుంచి డైవర్ట్ అవ్వని మోడీ.. చంద్రబాబు మైండ్‌గేమ్‌కే ఏ రకంగా చెక్ పెడతారా అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

గొర్రెల పథకంలో గందరగోళం

ఆరు నూరైనా 2019 ఎన్నికలలో కూడా మరోసారి అధికారంలోకి వచ్చి తీరాలని, తన కుమారుడు కేటీఆర్‌ని ముఖ్యమంత్రి సీటు మీద కూర్చోపెట్టి తాను రెస్టు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టి పట్టుదలతో వున్నట్టున్నారు. అందుకే అన్ని కులాల, మతాల ప్రజలను ఆకర్షించడానికి రకరకాల పథకాలు ప్రవేశపెడుతున్నారు. అలాంటి అనేకానేక పథకాలలో గొల్ల కురుమలకు గొర్రెలను పంపిణీ చేసే పథకం ఒకటి. తెలంగాణ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడం మానేసి, గొల్ల కురుమలను గొర్రెలను కాసుకోవడానికే పరిమితం చేస్తున్నారన్న  ప్రతిపక్షాల విమర్శలను సీఎం కేసీఆర్ ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు.   తెలంగాణ వ్యాప్తంగా చకచకా గొర్రెలను పంపిణీ చేస్తూనే వున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా 45 లక్షల గొర్రెలను 2 లక్షల గొల్ల కురుమ కులం వారికి పంపిణీ చేశారు. మరికొన్ని లక్షల గొర్రెలను పంపిణీ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ పథకం అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారిపోయిందనే విమర్శలు జోరుగా వినిపిస్తు్న్నాయి. గొర్రెల పంపిణీలో గందరగోళం, అక్రమాలు చోటు చేసుకోవడం వల్ల ప్రజాధనం వృధా అవుతున్నట్టు తెలుస్తోంది.   ప్రభుత్వ నియమాల ప్రకారం గొర్రెలను పొందినవారు వాటిని కొంతకాలం మేపాల్సి వుంటుంది. వాటి ద్వారా కలిగే పిల్లల ద్వారా తమ మందలను పెంచుకోవాల్సి వుంటుంది. అయితే చాలామంది అలా చేయడం లేదు. తమకు అందిన గొర్రెలను ఎంచక్కా వెంటనే అమ్మేసుకుంటున్నారు. అలా అమ్మిన గొర్రెలు మళ్ళీ ప్రభుత్వం దగ్గరకే చేరుతున్నాయి. మళ్ళీ ప్రభుత్వం వాటిని పంపిణీ చేస్తోంది. అంటే ప్రభుత్వం తాను ఉచితంగా అమ్మిన గొర్రెలనే మళ్ళీ తానే కొనుగోలు చేస్తోందన్నమాట. ఈ పథకంలో జరుగుతున్న అక్రమాలను ప్రభుత్వం పసిగట్టింది. ఈ అంశం మీద వెంటనే విచారణ కమిటీ వేసి నిజాలు నిగ్గు తేల్చి, పథకాన్ని కొనసాగించాలా వద్దా అనేది నిర్ణయించాలని అనుకుంది. అయితే విచారణ కమిటీ వేస్తే అవకతవకలు బయటపడతాయి. అవి ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనంగా నిలుస్తాయి.   ఈ నేపథ్యంలో పథకాన్ని ఆపేయాల్సిన అవసరం కూడా రావచ్చు. దాంతో గొల్ల కుర్మ ఓటు బ్యాంకుకు గండి పడే ప్రమాదం వుంది. దాంతో విచారణ కమిటీని వేసే విషయంలో ప్రభుత్వం వెనుకడుగు వేసింది. కష్టమైనా, నష్టమైనా ఈ పథకాన్ని వచ్చే ఎన్నికల వరకూ కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా వుంటే తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలకు తెలంగాణలో మేత దొరకడం లేదట.. చాలామంది ఆంధ్రప్రదేశ్‌కి సదరు గొర్రెలను తోలుకుని వెళ్ళి అక్కడ మేపుకుంటున్నారట. సహేతుకమైన ఆలోచన లేకుండా పథకాలు ప్రవేశపెడితే పరిస్థితి ఇలాగే తయారవుతుంది.

నెటిజన్లు దెబ్బకి ఆప్షన్లు బ్లాక్ చేసుకున్న బీజేపీ...

  అసలే కేంద్రంలో బీజేపీపై ప్రజల్లో వ్యతిరేక భావన పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత బీజేపీ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. కేంద్ర బడ్జెట్ విషయంలో బీజేపీ తీరును ప్రతిపక్షాలు ఎండగడుతున్నాయి. ఇక నెటిజన్లు కూడా బీజేపీపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఏ నెటిజన్ల ఫాలోయింగ్ తో గత ఎన్నికల్లో అధికారం చేపట్టిన బీజేపీ..ఇప్పుడు అదే నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు. సోషల్ మీడియాతో అద్భుతాలు సృష్టించిన బీజేపీని ఇప్పుడా సోషల్ మీడియా... బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత అదో సోషల్ మీడియావల్ల బెంబేలెత్తిస్తోంది. దీంతో బీజేపీ ఆఖరికి ఆప్షన్లు బ్లాక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.   బీజేపీ అధికార ఫేస్ బుక్ పేజ్ కు డిస్ లైక్ లు కొడుతూ ‘నువ్వు మాకు నచ్చలేదు’ అని నెటిజన్లు సూటిగా చెబుతున్నారు. బడ్జెట్ కు ముందు ఆ పార్టీ ఫేస్‌ బుక్‌ పేజ్ కి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చిన వాళ్లు 17వేల మంది ఉండగా ఇప్పుడు సింగిల్‌ స్టార్‌ రేటింగ్ ఇచ్చిన వారి సంఖ్య 35 వేలు దాటింది. దీంతో వ్యతిరేకతను అర్ధం చేసుకున్న బీజేపీ సోషల్‌ మీడియా... తమ ఫేస్‌ బుక్‌ పేజీలో ‘డిస్‌ లైక్‌’ ఆప్షన్‌ ను, రేటింగ్‌ కోరడాన్ని బ్లాక్‌ చేశారు. మరి ఆప్షన్లు బ్లాక్ చేసినంత మాత్రన నెటిజన్లు ఊరుకుంటారా... ‘‘హోదా ఇవ్వలేదు... ప్యాకేజీ అంటూ ఆ నిధులూ మంజూరు చేయలేదు.. రైల్వే జోన్‌ ప్రకటించలేదు. చివరికి.. తాజా బడ్జెట్‌ లో మొండిచేయి చూపారు’’ అంటూ కామెంట్లతో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. మరి అన్యాయం చేసిన బీజేపీకి ఈ భజన తప్పదుమరి...

బాబు ర్యాంకుల వెనుక మర్మం ఏంటీ..?

దేశంలోని మిగిలిన ముఖ్యమంత్రులందరితో పోలిస్తే.. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు రూటే సెపరేటు అంటారు రాజకీయ విశ్లేషకులు. పరిపాలనలో టెక్నాలజికీ పెద్ద పీట వేసి.. మొత్తం సెక్రటేరియేట్‌‌ను ప్రజల ముందుకు తీసుకువచ్చి.. హైటెక్ సీఎంగా గుర్తింపు తెచ్చుకున్నారు బాబు. 23 జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశైనా.. 13 జిల్లాల నవ్యాంధ్రప్రదేశైనా చంద్రబాబులో మాత్రం అదే ఉత్సాహం.. కొత్తగా ఇంకేదో చేయ్యాలనే తపన. గతంలో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ సర్వే చేయించి.. ప్రభుత్వ పనితీరును తెలుసుకునేవారు నాయుడు గారు.   ఇప్పుడు అదే ఫార్ములాను ఉపయోగించి మంత్రులు, శాసనసభ్యుల పనితీరుపై సర్వే చేయించి.. ర్యాంకులు ఇస్తున్నారు. తాజాగా తమ మంత్రిమండలి సభ్యుల పనితీరుపై ర్యాంకులు ప్రకటించారు ముఖ్యమంత్రి. దీనిలో పురపాలక శాఖ మంత్రి నారాయణకు మొదటి ర్యాంక్ ఇవ్వగా.. నారా లోకేష్‌కు సెకండ్ ప్లేస్ ఇచ్చారు సీఎం. మూడవ స్థానంలో సుజయ కృష్ణరంగారావు, చివరి రెండు స్థానాల్లో ఆదినారాయణ రెడ్డి, గంటా శ్రీనివాస్ ఉన్నారు. ఫైల్స్ క్లియరెన్స్, శాఖలపై పట్టు తదితర అంశాల ఆధారంగా ముఖ్యమంత్రి ఈ ర్యాంకులను ప్రకటించారు.   అసలు చంద్రబాబు ఈ ర్యాంకులను ఎందుకు ప్రకటించారు అంటూ.. సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ నడుస్తోంది. రాబోయేది ఎలక్షన్ సీజన్.. ఈలోగా మంత్రుల్లో ఎవరి సమర్థత ఏంటనేది.. జనంలోకి వెళ్లాలి. దానితో పాటు బాగా కష్టపడేవారికే నెక్ట్స్ ఛాన్స్ అన్న భయం మంత్రుల్లోనూ ఉండాలి.. అందుకే చంద్రబాబు ఈ ర్యాంకుల విధానాన్ని ప్రవేశపెట్టారనే కథనాలు వస్తున్నాయి. తోటి వారు మంచి ర్యాంకులు సాధించి.. తాము వెనుకబడిపోవడంతో.. తమపై అధినేత ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని కొందరు మంత్రులు సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు పోలిటికల్ వర్గాల్లో డిస్కషన్ నడుస్తోంది.

రోజాకి జగన్ సారీ... ఇప్పటికైనా అర్ధమయిందా..!

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ అయినా నగరి ఎమ్మెల్యే రోజాకు సారీ చెప్పారట. జగన్ ఏంటీ.. రోజాకి సారీ చెప్పడం ఏంటీ..? అనుకుంటున్నారా...? అసలు సంగతేంటంటే.. వైసీపీ పార్టీలో కాస్త యాక్టివ్ గా ఉండేవాళ్లలో రోజా కూడా ఒకరు అని చెప్పొచ్చు. టీడీపీ పై విమర్శలు గుప్పించాలన్నా..  ముఖ్యమంత్రి అని కూడా  చూడకుండా చంద్రబాబునాయుడి పై  విమర్శలు చేయాలన్నా జగన్ తరువాత స్థానం రోజాకే దక్కుతుంది. అంతలా విరుచుకుపడుతుంది రోజా. మైకు దొరికితే చాలు పూనకం వచ్చినట్టు ఏం మాట్లాడుతున్నామో కూడా తెలయకుండా.. కాస్త కూడా నోరు కంట్రోల్ లో లేకుండా మాట్లాడుతుంటారు రోజాగారు. ఇప్పుడు ఆ తొందరపాటే ఆమెకు చిక్కులు తెచ్చిపెడుతుంది.   గతంలో ఆమె వల్లే నంద్యాల ఉపఎన్నికల్లో ఓడిపోయామని సొంత పార్టీ నేతలే ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు తన నోటి దూల వల్ల నియోజక వర్గ ప్రజల్లో కూడా ఆమెపై వ్యతిరేక భావన ఏర్పడింది. ఈ విషయాన్నే ఆ పార్టీ ఎన్నికల వ్యహకర్త ప్రశాంత్ కిశోర్ జగన్ కు చెప్పారట. దీంతో... రాబోయే ఎన్నికల్లో ఆమెకు ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇచ్చేది లేదని రోజాకి తేల్చి చెప్పారట జగన్. 'అమ్మా...! ఇప్పుడు మీకు నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తోందని 'పికె' సర్వేలో తేలింది...! అక్కడ మీరు ఓడిపోవడం ఖాయం...మీకు ఈసారి టిక్కెట్‌ ఇవ్వలేను..అని ఆయన 'రోజా'ను పిలిపించుకుని చెప్పారట. దీంతో...'రోజా' నివ్వెరపోయిందట. పార్టీ కోసం తానెంత కష్టపడింది వివరించినా..'జగన్‌' పట్టించుకోకుండా...'తానేం చేయలేనని..సారీ..'అన్నాడట. దానిపై 'రోజా' తన వాదనను వినిపిస్తూ...'పికె' సర్వే చేసి ఇస్తే...సీనియర్‌ అయిన తనకు 'టిక్కెట్‌' ఇవ్వకుండా వేరే ఎవరికో..ఇవ్వడం ఏమిటని మండిపడ్డారట. దీనిపై 'జగన్‌' మళ్లీ కలుగ చేసుకుంటూ...'అమ్మా..మీరు పార్టీ కోసం..ఎంత కష్టపడిందీ నాకు తెలుసు..! మీ కష్టాన్ని మర్చిపోను..రాబోయే ఎన్నికల్లో మనకు ప్రతి సీటు..గెలవాలి..కానీ..'నగరి'లో మీపై వ్యతిరేకత ఉంది...ఇక్కడ మీకు సీటు ఇస్తే పార్టీ ఖాయంగా ఓడిపోతుంది. మీరు చేసిన కష్టానికి మీకు ఎమ్మెల్సీ ఇస్తాను..సర్దుకుపోండి..పార్టీ అధికారంలోకి రావడంతోనే అందరికీ న్యాయం చేస్తాను...అని ముగించారట. దీంతో..ఎమ్మెల్యే 'రోజా' ఖంగుతిన్నారట. ఇప్పుడీ విషయం పార్టీలో సంచలనం సృష్టిస్తోంది.   రెంటికి చెడ్డ రేవడిలా..జగన్ ఇస్తున్న షాకులకు తట్టుకోలేక..పోనీ టీడీపీలోకి వెళదామంటే...టీడీపీపై ఆమె చేసిన వ్యాఖ్యలకు ఆమెకు నో ఎంట్రీ...పోనీ జనసేన వైపు చూద్దామన్నా... ఇంకా పూర్తిస్థాయి నిర్మాణం కూడా కానీ పార్టీ అని కూడా చూడకుండా పవన్ పై కూడా ఆమె చాలా దారుణంగా విమర్శలు గుప్పించారు. అక్కడ కూడా ఆమెకు నో ఎంట్రీ.. మరి పాపం రోజాకు రాజకీయాల్లో శాశ్వత శత్రువులను ఏర్పరుచుకోకూడదన్న విషయం ఇప్పటికైనా అర్దమైఉండొచ్చు. ఎంత కోపం ఉన్నా.. ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. రాజకీయ నాయకులు ఆచితూచి ఎందుకు మాట్లాడుతారో ఇప్పుడు తెలిసుంటది. ఏది ఏమైనా..పార్టీ కోసం, నమ్మిన నాయకుని కోసం కష్టపడిన 'రోజా'కు ఇటువంటి పరిస్థితి రావడం బాధాకరమైన విషయమే..

రాజుగారు కాస్త తగ్గండి...

  ఒకపక్క అందరూ కేంద్ర బడ్జెట్ విషయంలో ఏపీకి అన్యాయం జరిగిందని మాట్లాడుకుంటుంటే.... బీజేపీ తీరును ఎండగడుతుంటే మరోపక్క బీజేపీ నేత సోము వీర్రాజు గారు మాత్రం ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడంలేదు. కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టిన రోజు కేంద్రం ఏపీకి మొండిచేయి చూపించిందని రాజకీయ నాయకులతోపాటు అటు సామాన్యప్రజలు కూడా బీజేపీపై రగిలిపోతున్నారు. గుజరాత్ లో బీజేపీ గెలుస్తుంది అని తెలుస్తున్న టైంలోనే, ప్రెస్ మీట్ పెట్టి, నేను గుజరాత్ లో బీజేపీని గెలిపించా అన్నంత హడావిడి చేసారు... అలాగే కేంద్ర బడ్జెట్ పై కూడా వెంటనే స్పందిస్తారు అని అందరూ అనుకున్నారు... ఒక పక్క తెలుగుదేశం విమర్శలు చేస్తున్నా, వీర్రాజు మాత్రం, బయటకు రాలేదు...అయితే ఏ చిన్న విషయమైనా హంగామా చేసే వీర్రాజు గారు మాత్రం కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన మూడు రోజుల వరకూ మీడియా ముందుకు రాలేదు. పోనీ వచ్చి ఏపీకి అన్యాయం జరిగిందని చెప్పకపోయినా.. అలాంటి మాటలు నాలుగు మాటలు మాట్లాడినా బాగానే ఉండేది. అది కాకుండా...  ఏదేదో మాట్లాడుతున్నాడు పాపం.   ఒకపక్క అమిత్ షా ఏపీ ప్రజల కోపాన్ని పోగొట్టడానికి.. పోలవరం ప్రాజెక్ట్ పక్కగా జరుగుతుంది అని, నవయుగ వచ్చిన తరువాత పనులు స్పీడ్ అందుకుంటాయని, నవయుగని మేమే తెచ్చాం అని కవరింగ్ ఇస్తుంటే, ఇక్కడ వీర్రాజు మాత్రం, పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటి వరకు ఇచ్చిన నిధుల్లో ఎంతమేర పనులు జరిగాయని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రానికి అప్పజెప్పేస్తామని ప్రకటించిన చంద్రబాబు... ఇప్పుడు మరో కంపెనీని తెరపైకి ఎందుకు తెస్తున్నారని సందర్భంలేకుండా మాట్లాడుతున్నారు. అంతేకాదు.. బడ్జెట్ పై అసహనం ఉంటే అడగాలి కాని, విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. మిత్రపక్షంగా ఉన్న తమపై విమర్శలు గుప్పించడం సరికాదని అన్నారు. ఒక పక్క, అమిత్ షా, ఢిల్లీ నుంచి కంట్రోల్ కంట్రోల్ అంటుంటే, సోము వీర్రాజు మాత్రం, వీర ప్రతాపం చూపిస్తున్నారు. మరి రాజుగారు ఇలా మాట్లాడితే పార్టీ పెద్దలనుండే ఆయనకు వార్నింగ్ లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు...

లగడపాటికి చంద్రబాబు ఆప్ష‌న్లు...!

  గత కొద్ది కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న లగడపాటి రాజగోపాల్ మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. 2004, 2009 ఎన్నిక‌ల్లో రెండుసార్లు ఎంపీగా గెలిచిన లగడపాటి పదేళ్లపాటు విజయవాడను ఏలారు. ఆ తరువాత రాష్ట్రవిభజన అనంతరం... రాజకీయాలకు దూరమైపోయారు. ఐదేళ్ల పాటు రాజ‌కీయంగా సైలెంట్‌గా ఉన్న ఆయ‌న‌కు తిరిగి రాజ‌కీయాల్లోకి రావాల‌న్న కోరిక బ‌లంగా ఉన్నట్టు ఉంది. అందుకే మళ్లీ రాజకీయాల్లోకి రావాలని అందులో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీలోకి రావాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.   అంతేకాదు లగడపాటి సర్వేలు చేయడంలో కూడా దిట్ట అని చెప్పొచ్చు. లగడపాటి చేసిన సర్వేలు కూడా దాదాపు చాలావరకూ కరెక్ట్ గానే నిలిచాయి. అందుకే ఇటీవల ఓ జాతీయ ఛానల్ చేసిన సర్వేపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం లగడపాటి సలహా తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఏ పార్టీ అధికారంలోకి వ‌స్తుందో సులువుగానే త‌న స‌ర్వేల‌తో అంచ‌నా వేసుకునే ల‌గ‌డ‌పాటికి ఏపీలో వ‌చ్చే ప‌దేళ్ల‌లోనూ టీడీపీయే ఫామ్‌లో ఉంటుంద‌ని తేల‌డంతో ల‌గ‌డ‌పాటి చూపుల‌న్నీ టీడీపీ మీదే ఉన్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..  ఇటీవ‌ల ఏపీ సీఎం చంద్ర‌బాబును ప‌దే ప‌దే క‌లుస్తోన్న ల‌గ‌డ‌పాటి ఏపీలో పార్టీ ప‌రిస్థితి మీద చేయించిన స‌ర్వే ఫ‌లితాల‌ను కూడా చంద్ర‌బాబుకు ఇస్తున్న‌ట్టు స‌మాచారం.   ఈ నేపథ్యంలోనే చంద్రబాబు లగడపాటికి ఓ ఆఫర్ కూడా ఇచ్చారట. అదేంటంటే... మీకు స్టేట్ పాలిటిక్స్‌లో చోటు క‌ష్టం… ఏపీలో ఏదో ఒక ఎంపీ సీటును ఇచ్చేందుకు ట్రై చేస్తాను… ఎంపీగా పోటీ చేస్తారా ? అని లగడపాటికి చంద్రబాబు ఆప్ష‌న్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. అంతేకాదు.. విజ‌య‌వాడ ఎంపీ సీటు కుద‌ర‌ని ప‌క్షంలో ల‌గ‌డ‌పాటికి వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత చంద్ర‌బాబు నుంచి రాజ్య‌స‌భ సీటు కూడా ఆఫ‌ర్ వెళ్లింద‌ట‌. మొత్తానికి లగడపాటికి ఎంట్రీఏ కాదు.. మంచి ఆఫర్ కూడా వస్తున్నట్టే కనిపిస్తోంది. మరి లగడపాటి ఏం నిర్ణయం తీసుకుంటారో చూద్దాం...

చంద్రబాబు గారికి కోపం ఎందుకు వస్తుంది...!

  కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై తెలుగు రాష్ట్రాలు మండిపడుతున్న సంగతి తెలిసిందే కదా. రాజకీయ నేతలతో పాటు.. సామాన్య ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మిత్రపక్షమైన టీడీపీ కూడా బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే దీనిపై మాత్రం అరుణ్ జైట్లీ పాతపాటే పాడారు. ఇక ఇన్ని రోజులు మౌనంగా ఉన్నా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కేంద్రం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో విభజన హామీలను అమలు చేయలేదని, నిధులు ఇవ్వలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారన్న వ్యాఖ్యలపై అరుణ్ జైట్లీ స్పందించారు. ఆంధ్రాకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం..ఆయన మాపై ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణమేమిటో..అంటూ..'అరుణ్‌జైట్లీ' ఓ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.   ఆంధ్రాకు ఇచ్చిన ప్రతిహామీకీ కట్టుబడి ఉన్నాం..విద్యాసంస్థలను పెద్ద ఎత్తున్న కేటాయించాం..వాటికి నిధులు ఇచ్చాం..ఇంకా ఇంత కన్నా ఏమి కావాలి..ఇన్ని ఇచ్చిన మాపై 'బాబు'కు కోపమెందుకు ఉంటుందని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇక ఇప్పటికే కేంద్రంపై రగిలిపోతున్న జనాలు ఇప్పుడు అరుణ్ జైట్లీ వ్యాఖ్యలకు మరింత మండిపడుతున్నారు. అంతేకాదు.. ఇచ్చిన హామీల్లో ఏమి నెరవేర్చారో చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరి అరుణ్ జైట్లీ గారు వ్యాఖ్యలు మరీ కామెడీ కాకపోతే.. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని చెప్పడంలో ఎలాంటి అర్దం లేదు. జనాలు మరీ అంత అమాయకంగా కనిపిస్తున్నారా ఏంటీ అని అంటున్నారు.