మాల్యానే మించిపోయాడుగా...వీళ్లు కనబడరు..

  బ్యాంకులకు వేల కోట్ల రూపాయల ఎగనామం పెట్టి కింగ్ పిషర్ అధినేత విజయ్ మల్యా ఎంచక్కా విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు తాజాగా మరో కుంభకోణం చోటుచేసుకుంది. గుజరాత్ రాష్ట్రానికి చెందిన నీరవ్ మోడీ  11వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి ఎంచక్కా ఆయన కూడా విదేశాలకు చెక్కేశాడు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన నీరవ్ మోడీ.. వజ్రాల వ్యాపారి. దేశంలోని అతిపెద్ద రెండో ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి.. రూ.11వేల కోట్లను విదేశాలకు తరలించినట్టు వెలుగు చూసింది. దీంతో దర్యాప్తు సంస్థలు విచారణ వేగవంతం చేశాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు బ్రాంచీలతో పాటు.. ఆ బ్యాంకు నుంచి పెద్ద ఎత్తున అప్పులు తీసుకుని ఎగ్గొట్టిన నీరవ్ మోడీ ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీ చేశారు. 11 వేల 300 కోట్లకు పైగా డబ్బును తప్పుడు లావాదేవీలతో దారి మళ్లించినట్టు గుర్తించారు. అంతేకాదు ఇతర బ్యాంకులు కూడా నీరవ్ మోడీ …ఆయన కుటుంబ సభ్యులకు అప్పులిచ్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే 10 మంది దాకా బ్యాంకు ఆఫీసర్లను సస్పెండ్ చేశారు. వాళ్లనుంచి వివరాలు రాబడుతున్నారు.   ఇదిలా ఉండగా... ఈ కుంభకోణం వెలుగు చూసినప్పటి నుంచి ప్రధాన నిందితుడు నీరవ్ మోడీ కనిపించటం లేదు. ఆచూకీ లేదు. ఇతను కూడా విదేశాలకు పారిపోయి ఉంటాడని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. స్విట్జర్లాండ్ దేశం వెళ్లి ఉంటాడని భావిస్తున్నాయి. మొత్తానికి నీరవ్ మోడీ.. విజయ్ మాల్యానే తలదన్నాడు అని అందరూ కామెంట్లు చేస్తున్నారు. లండన్ లో ఉన్న మాల్యానే ఇండియాకు రప్పించడానికి మనవాళ్లు నానా కష్టాలు పడుతున్నారు... ఇంక నీరవ్ మోడీ ఎక్కడున్నాడో కూడా తెలీదు. ఆయన ఆచూకి కనిపెట్టి...ఇండియాకు రప్పించి.. ఆయనకు శిక్ష పడేవరకూ పుణ్యకాలం కాస్త పూర్తవుతుంది. ఇక కేంద్ర ప్రభుత్వాలకు మాత్రం ఇవేమీ కనిపించవు.. ఎన్నికోట్ల కుంభకోణాలు జరిగినా చాలా సింపుల్ గా వీళ్లు దోషులు కాదు తీర్పులిచ్చేస్తుంటారు. సామాన్య ప్రజలపై మాత్రం తమ ప్రతాపాలు చూపిస్తుంటారు.

జగన్ పై తిరుగుబాటు మొదలైంది...

  ప్రత్యేక హోదా కోసం మేము కూడా పోరడతామని.. ఏప్రిల్ 6 వ తేదీన ఎంపీలందరూ రాజీనామా చేస్తారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేసిన సంగతి తెలిసిందే కదా. దీనివెనుక జగన్ ప్లాన్ కూడా అందరికీ అర్దమైంది. అయితే ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకు వచ్చింది. ఎంపీలు అందరూ రాజీనామా చేస్తారంట కానీ.. విజయసాయిరెడ్డి మాత్రం రాజీనామా చేయరంటా. ఈ మాట చెప్పింది ఎవరో కాదు స్వయంగా జగనే.   దీంతో మిగిలిన ఎంపీలు జగన్ పై తిరుగుబాటు చేశారు. ఎంపీలు రాజీనామా అంటే విజయసాయిరెడ్డి కూడా చేయాల్సిందే అని ఎంపీలు ఎస్పీ సుబ్బారెడ్డితో సహా అందరూ పట్టుబట్టారట. అయితే దీనికి జగన్.. ఢిల్లీలో మన తరపున లాబీయింగ్ కి సాయన్న అవసరం ఉందని అన్నారట. ఆ విషయం మనకు తెలుసు కానీ..ప్రజలకు చెప్పలేం కదా... ఎంపీలందరూ రాజీనామా చేసి విజయసాయిరెడ్డి ఎందుకు చేయలేదు అని ప్రశ్నిస్తే ఏం చెబుతాం అని జగన్ కు గట్టిగానే సమాధానం చెప్పారంట. అంతేకాదు.. ఇప్పటికే విజయసాయిరెడ్డి బీజేపీ నేతలతో కలుస్తూ ఫొటోలు దిగుతున్నారు.. దాంతో అందరూ మనం బీజేపీతో మ్యాచ్ ఫిక్స్ చేసుకున్నామనే అంటున్నారు.. ఇప్పుడు ఆయన రాజీనామా చేయకపోతే మనంతట మనమే అది నిజం చెప్పినట్టు అవుతుంది.. అని అన్నారట. మరి ఇప్పటికే జగన్ తన మోనార్క్ తెలివితేటలు చూపించి... చాలా మంది నేతలను దూరం చేసుకున్నాడు. ఇప్పుడు ఉన్న ఈ కొంతమందిని కూడా దూరం చేసుకుంటే... పార్టీ చేతులెత్తేసినట్టే. మరి అందరికీ ఒక న్యాయం.. ఇంటి వాళ్లకు ఒక న్యాయం అంటే రాజకీయాల్లో కుదరదు కదా మరి..

పవన్ ను ఏమనొద్దు..ఇద్దరి దారి ఒకటే..

  ఏపీ రాజకీయాలు రోజు రోజుకి కొత్త మలుపులతో.. వాడి వేడిగా సాగుతున్నాయి. ఇంకా ఎన్నికలకు ఏడాది టైం ఉన్నా... ఇప్పుడే ఆ కాక మొదలైంది. ఎవరి ఎవరు పొత్తులు పెట్టుకుంటారు... ఎవరు ఒంటరిగా బరిలో దిగుతారు అన్న ప్రశ్నలు మాత్రం అప్పుడే సమాధానాలు దొరకని ప్రశ్నలు. ఇక గత సార్వత్రిక ఎన్నికల్లో మిత్రపక్షంగా పోటీ చేసిన టీడీపీ-బీజేపీ పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అవకాశం లేదని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ క్రమంలోనే ఈసారి బీజేపీ-వైసీపీ కలిసి పోటీ చేస్తారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. కలిసి పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక కాంగ్రెస్ పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు.ఆ పార్టీతో మేం పొత్తుకు రెడీ అన్నా ఎవరూ రారు.   మరి అన్ని పార్టీలు ఓకే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి. పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని బరిలో దిగుతాడా.. లేక ఒంటరిగా ఎన్నికల్లో దిగుతాడా.. ఒకవేళ పొత్తు పెట్టుకుంటే ఏ పార్టీతో పెట్టుకుంటాడు..?అన్నది పెద్ద కన్ఫ్యూజన్ స్టేట్. కానీ వచ్చే ఎన్నికల్లో పవన్-చంద్రబాబు కలిసి ఏకమై ఎన్నికల బరిలో దిగుతారు అన్న వాదన కూడా వినిపిస్తుంది. ఈ వాదనను తప్పు పట్టడానికి కూడా లేదు. ఎందుకంటే.. పవన్ పై చంద్రబాబు కానీ... చంద్రబాబుపై పవన్ కానీ విమర్సలు గుప్పించుకున్న సందర్భాలు లేవు. కాస్త అప్పుడప్పుడు పవన్ కళ్యాణే చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజా సమస్యలపై స్పందించి ప్రశ్నిస్తుంటాడు. అంతేకానీ చంద్రబాబుపై గట్టిగా విమర్శించిన దాఖలాలు లేవు. ఇక చంద్రబాబు కూడా పవన్ చేసిన పనిని సమర్ధిస్తారు కానీ... పవన్ పై ఎప్పుడూ విమర్శలు గుప్పించలేదు.   అందుకే ప్రతిపక్షాలు సైతం.. కేంద్ర ప్రభుత్వాన్ని, విపక్షం మీద అయితే విరుచుకుపడతారు.. మరి రాష్ట్రప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించరు అని పవన్ పై రివర్స్ కౌంటర్లు వేస్తుంటారు. అంతేకాదు పవన్ చేపట్టనున్న జేఎఫ్సీ కమిటీ పై కూడా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ చేసే పోరాటంలో అర్ధం ఉందని అన్నారు.. ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేయాలనే యోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారని చంద్రబాబు తెలిపారు.. పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన కమిటీ వల్ల మనకు ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. అంతేకాదు...పవన్ విషయంలో టీడీపీ నాయకులకు కొన్ని సూచనలు కూడా చేశారంట. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడరాదని.. రాష్ట్రానికి మంచి చేయాలనేది పవన్ అభిమతమని... మనం కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోరాడుతున్నామని... ఈ నేపథ్యంలో, ఇద్దరి దారీ ఒకటేనని చెప్పారట. అవసరమైన సమయంలో టీడీపీకి ఆయన అనుకూలంగా ఉంటారని చెప్పారు. పవన్ ప్రకటించిన జేఎఫ్సీతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. నిధుల గురించి పవన్ శ్వేతపత్రం అడిగితే సున్నితంగా సమాధానం చెప్పాలని సూచించారట. మొత్తానికి చంద్రబాబు మాటలను బట్టి చూస్తుంటే... వచ్చే ఎన్నికల్లో పవన్-చంద్రబాబు కలిసి బరిలో దిగొచ్చని స్పష్టంగా అర్ధంచేసుకోవచ్చని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి అవసరమైనప్పుడు అనుకూలంగా ఉంటాడు అంటే అర్ధం ఇంకేమై ఉంటుంది మరి...

వైసీపీ రాజీనామాల ప్లాన్ మోడీదే!

  ఎవరు నమ్మినా, నమ్మకపోయినా వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, బీజేపీ బంధం తెగిపోవడం ఖాయం. బీజేపీ, వైసీపీ కొత్త స్నేహితులుగా మారి ఎన్నికల పొత్తుతో పోటీలోకి దిగడమూ ఖాయం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ సెమీఫైనల్స్‌గా చెప్పుకోవచ్చు. రెండు పార్టీలు విడిపోయే ముందు... రెండు పార్టీలు స్నేహం ప్రారంభించే ముందు ఏర్పడే సంధికాలం ఇది. ఈ సంధికాలంలో రాజకీయాల్లో ఎన్నెన్నో వింతలూ, విడ్డూరాలూ జరుగుతూ వుంటాయి. వ్యూహప్రతి వ్యూహాలు కనిపిస్తూ వుంటాయి. ఇలాంటి వాటిని గమనిస్తూ వుండటమే పౌరులుగా మన కర్తవ్యం. ఏపీలో అధికారంలో భాగస్వామిగా వున్న బీజేపీ క్రమంగా టీడీపీ మీద విమర్శల దాడిని పెంచడం ఇలాంటి సంధికాలపు చర్యల్లో భాగమే. ఇటు వైసీపీ వైపు నుంచి రాజీనామాల అస్త్ర ప్రయోగం కూడా ఇలాంటి సంధికాలపు చర్యేనని రాజకీయ పరిశీలకులు కూడా విశ్లేషిస్తున్నారు. వైసీపీ రాజీనామాల బెదిరింపు వెనుక ప్రధానమంత్రి మోడీ ప్లాన్ వుందని అనుమానిస్తున్నారు.   నాలుగేళ్ళుగా ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర ప్రభుత్వం మొండిచెయ్యి చూపిస్తూ వచ్చింది. బీజేపీ ప్రభుత్వం చివరి బడ్జెట్‌లో కూడా సదరు మొండిచెయ్యిని ప్రధాని మోడీ కంటిన్యూ చేశారు. దాంతో ఇప్పటి వరకూ ఓర్పు వహిస్తూ వచ్చిన టీడీపీ నాయకత్వం మోడీ ప్రభుత్వంతో ప్రత్యక్ష పోరాటానికి దిగింది. టీడీపీ పార్లమెంటు సభ్యులు పార్లమెంటులో చేసిన నిరసన మోడీకి ముచ్చెమటలు పట్టించింది. గతంలో మాదిరిగానే కుక్కిన పేనుల్లా పడి వుంటారని అనుకున్న మోడీ ఈ ధిక్కారాన్ని భరించలేకపోయారు. ఏపీలో వైసీపీతో పొత్తు అనధికారికంగా ఎలాగూ ఖాయమైపోయింది కాబట్టి, టీడీపీమీద పైచేయి సాధించడానికి వైసీపీని పావులా వాడుకోవాలని మోడీ భావిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల చేత ఢిల్లీలో నిరసన ప్రదర్శనలు చేయించి, వారి చేత అక్కడే రాజీనామాలు చేయించే వ్యూహం మోడీదేనని పరిశీలకులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కోసం టీడీపీ ఎంపీలు చేసిన పోరాటం రాజకీయంగా వారికి ఉపయోగపడకుండా చేయాలన్నదే మోడీ పెద్ద ప్లాన్. టీడీపీ ఎంపీలో ఏపీ కోసం పార్లమెంటులో గొడవ మాత్రమే చేశారు... వైసీపీ ప్రజా ప్రతినిధులు ఏకంగా రాజీనామాలే చేసేశారన్న కలరింగ్ రావడం కోసమే వైసీపీ నాయకుడు జగన్ మోడీ వ్యూహంలో తాను కూడా భాగస్వామి అయ్యాడని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

పవన్ డెడ్ లైన్ ఓవర్... నెక్స్ట్ టార్గెట్ ఏంటి?

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీకి ఇచ్చిన డెడ్ లైన్ డేట్ ముగిసింది. పవన్ టీడీపీకి పెట్టిన డెట్ లైన్ ఏంటో మీకు తెలిసే ఉంటుంది. 15 వ తారీకు లోపు విభజన హామీలు, ఇంకా ప్రత్యేక హోదాపై పూర్తి వివరాలు ఇవ్వాలని టీడీపీకి డెడ్ లైన్ పెట్టారు. పోలవరం ప్రాజెక్టు శ్వేతపత్రాన్ని తెలుగుదేశం పార్టీ ఇంతవరకు ఇవ్వలేదు... కనీసం ఇప్పుడు అయినా రాష్ట్ర ప్రజల మంచి కోసం కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధుల వివరాలను అందివ్వాలిని పవన్ టీడీపీకి  డెడ్ లైన్ పెట్టారు. అయితే ఈ రోజు 15వ తేది. పవన్ ఇచ్చిన డెడ్ లైన్ అయిపోయింది. కానీ టీడీపీ మాత్రం ఎలాంటి వివరాలు అందించలేదు. దీంతో పవన్ నెక్ట్స్ ఏం చేయబోతున్నాడు అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఉద్దానం విషయంలో కూడా పవన్ ఇలానే ప్రభుత్వానికి డెడ్ లైన్ ఇచ్చాడు. అయితే అప్పుడు ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి.. ఉద్దానం సమస్యపై పరిష్కార చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే ఇప్పుడు పరిస్థితి వేరు. అసలు ఈ విషయంలో టీడీపీకే క్లారిటీ లేదు.. వాళ్లే కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి దిగారు. పాపం ఇంక పవన్ కు ఏం చెబుతారు.   ఇక ఇప్పటికే లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్, కాంగ్రెస్ మాజీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ లతో చర్చలు జరిపిన పవన్, ఇంకా వామపక్ష నేతలను, జేఎఫ్సీ ప్రతినిధులను కలసి వారితో చర్చించనున్నారు. రఘువీరా రెడ్డి వంటి కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలతోనూ ఆయన మాట్లాడే ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. మరి ఈరోజుతో పవన్ ఇచ్చిన డెడ్ లైన్ పూర్తవుతుంది. ఇక తాను పెట్టిన డెడ్ లైన్ ముగిసేలోగా, ప్రభుత్వం నుంచి వచ్చే స్పందన ఆధారంగా భవిష్యత్ కార్యాచరణను పవన్ కల్యాణ్, రేపే ప్రకటిస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూద్దాం.... పవన్ ఏం డెసిషన్ తీసుకుంటారో చూద్దాం..

జగన్ మోనార్క్ ప్లాన్ బయటపడింది...

  తాడిని తన్నేవాడు ఉంటే.. వాడి తలను తన్నేవాడు ఉండాటు అన్నసామెత గుర్తుంది కదా. జగన్ ను చూస్తుంటే అదే గుర్తొస్తుంది ఇప్పుడు. నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చిన జగన్ కే అన్ని తెలివితేటలు ఉంటే.. రాజకీయాల్లో తలలు పండిన పెద్ద మనుషులు ఎంతో మంది ఉన్నారు. వాళ్లకి ఎన్ని తెలివితేటలు ఉండాలి. జగన్ రాజకీయ ఎత్తులు ఆ మాత్రం అర్ధంచేసుకోలేరా...   అసలు సంగతేంటంటే.. ఏపీకి కేంద్ర బడ్జెట్ లో జరిగిన అన్యాయం నేపథ్యంలో అందరూ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్లో టీడీపీ ఎంపీలు నిరసనలు.. ఇక్కడ బంద్ లు చేసి నిరసన వ్యక్తం చేస్తే.. ఇప్పుడు తాపీగా జగన్ గారు ప్రత్యేక హోదా కోసం పోరాడ‌తామ‌ని లేదంటే... ఏప్రిల్‌ 6న త‌మ పార్టీ లోక్ స‌భ స‌భ్యులు రాజీనామా చేస్తార‌ని ఓ ప్రకటన చేశారు. ప్రకటన చేసేశాం...ఒక పని అయిపోయింది.. ఇప్పుడు ఎవరూ మనల్ని ఏం అనరు అని అనుకున్నట్టు ఉన్నాడు. కానీ జగన్ ప్లాన్ ఏంటో సామాన్యులకు సైతం అర్ధమైపోయింది. ఏప్రిల్ లో కనుక రాజీనామా చేస్తే.. వాటి ఆమోదానికి రెండు మూడు నెలల టైం పడుతుంది... ఈ లోపు 2019 ఎన్నికలకు సమయం కూడా దగ్గరపడుతుంది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం ఉపఎన్నికలు నిర్వహించకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే జగన్ చాలా తెలివిగా.. కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్టు మూహుర్తం ఏప్రిల్ లో పెట్టారని అంటున్నారు.   అంతేకాదు... ఇంకో రీజన్ కూడా చెబుతున్నారు. త్వరలో త్రిపుర, కర్ణటాక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. ఇప్పటికిప్పుడు రాజీనామా చేస్తే బీజేపీకి ఆ ఎన్నికల్లో ఇబ్బంది అవుతుందని దానిని ఏప్రిల్ వరకు పొడిగించినట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి బీజేపీకి ఇబ్బంది అయితే వైసీపీకి వచ్చిన నష్టం ఏంటంటా అని అనుకుంటున్నారా..? ఎందుకు లేదు... బీజేపీతో చేతులు కలపాలని వైసీపీ ఎప్పటినుండో తహతహలాడుతుంది కదా. అందుకే.. బీజేపీకి ఇబ్బందైతే తనకు కూడా ఇబ్బందని జగన్ గ్రహించినట్టు ఉన్నాడని అంటున్నారు. ఏది ఏమైనా జగన్ కు మాత్రం ఎన్నికలంటే భయపట్టుకుందన్నది దీనిబట్టి అర్ధమైపోతుంది. ప్రస్తుతం ఏపీలో తమ పార్టీ పరిస్థితి ఏంటో జగన్ కు కూడా అర్దమైపోయినట్టుంది. అందుకే ఇలాంటి సాకులు వెతుకున్నాడు. రాజీనామాలు చేస్తే అప్పటివరకూ ఆగడమెందుకు.. ఇప్పుడే రాజీనామాలు చేయోచ్చు కదా అని జగన్ కు రివర్స్ లో కౌంటర్ ఇస్తున్నారు. ఇక్కడ జగన్ తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే.. బీజేపీకి ఏపీలో అంత సీన్ లేదన్న విషయం. బీజేపీతో కంటే ఇంక పవన్ తో చేతులు కలిపినా కాస్త ఉపయోగమైనా ఉంటది. పాపం జగన్ మాత్రం ఏం చేస్తాడు.. పవన్ తో చేతులు కలిపితే కేసులు నుండి బయటపడేయలేడు కదా. మొత్తానికి జగన్ తన మోనార్క్ తెలివి తేటలు ప్రదర్శించి బుక్ అయ్యాడు..

చంద్రబాబు పీఎం... పవన్ ఏపీ సీఎం...

  ‘‘చంద్రబాబు లాంటి సమర్థుడైన నాయకుడు ‘‘మరింత పెద్దహోదా’’లో వుంటే అద్భుత ఫలితాలు ఒనగూరుతాయి’’ ఇప్పుడు ఈ మాటల చుట్టే రాజకీయాల్లో తెగ వాడి వేడిగా చర్చలు నడుస్తున్నాయి. ఇంతకీ ఆ మటాలు ఎవరన్నారు... అంతలా చర్చించుకోవాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటున్నారా..? అక్కడే ఉంది మరి అసలు మ్యాటర్. చెప్పింది ఎవరో అల్లా టప్పా మనిషి కాదు.. దేశ రాజకీయాలను శాసించగల వ్యక్తి ముకేష్ అంబానీ. అందుకే ఈ మాటలు అంత హాట్ టాపిక్ అయ్యాయి.   అమరావతి సందర్శించడానికి వచ్చిన ముకేష్ అంబానీ నోటి నుండి వచ్చిన మాటలివి. ఇక మరింద పెద్ద హోదా అంటే అందరూ ప్రధాని మంత్రి హోదా అనే ఎవరికి ఎలా నచ్చితే అలా ఊహించుకుంటున్నారు. ముకేష్ అంబానీ భావిస్తున్న ‘‘పెద్ద హోదా’’ ప్రధానమంత్రి పదవేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కొంతమంది వాదన మాత్రం వేరేలా ఉంది. ప్రస్తుతం మోడీ, చంద్రబాబు ల మధ్య దూరం పెరిగిన నేపథ్యంలో.. వీరిద్దరి మధ్య రాయబారిగా ముకేష్ అంబానీ వచ్చారన్న వార్తలు వినిపిస్తున్నాయి.   ఇవన్నీ ఒకత్తైతే ఇంకో ఆశ్చర్యకరమైన విషయం కూడా బయటకొస్తుంది. అదేంటంటే.. ప్రధానిగా చంద్రబాబు ఇక్కడ ఏపీ సీఎంగా పవన్ కళ్యాణ్ ను కూర్చోబెడతారేమో అని కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే.. ఏదో రాజబారానికి వస్తే ముకేష్ అంబానీ ఇలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదని.. పెద్ద హోదా లాంటి పెద్ద పదాలు వాడారంటే.. ఆయన మాటల్లోని అంతర్గతం ఏంటి రాజకీయ విశ్లేషకలు బుర్రలు బద్దలుకొట్టికొని ఈ ప్రతిపాదనకు వచ్చారు. మోడీ హవా తగ్గిపోయింది. ఆయన చేస్తున్న స్వయంకృతాపరాధనలే ఆయన్ని ముంచేస్తున్నాయి. అందుకే ముకేష్ అంబానీ కూడా చంద్రబాబు లాంటి సమర్ధుడైన నాయకుడు పెద్దహోదాలో ఉండాలని అన్నట్టు భావిస్తున్నారు. ఇక ఇక్కడ ఎలాగూ చంద్రబాబు, పవన్ మధ్య సన్నిహత సంబంధాలే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని అయితే పవన్ ప్రశ్నించడానికి ఎలాంటి సందేహపడరు కానీ... చంద్రబాబు విషయంలో మాత్రం కాస్త ఎందుకో పవన్ కు సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టే కనిపిస్తుంటుంది. అంతేకాదు పవన్ ఏదైనా ప్రభుత్వాన్ని కోరినా... చంద్రబాబు కూడా వెంటనే రెస్పాండ్ అవుతారు. వచ్చే ఎన్నికల్లో కూడా రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ క్రమంలోనే ఒకవేళ ప్రధాని పదవి కనుక చంద్రబాబును ఆశ్రయిస్తే.. ఇక్కడ పవన్ ను సీఎం చేస్తారని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి.   చంద్రబాబుకు ప్రధాని మంత్రి అయ్యే అవకాశం గతంలో కూడా వచ్చింది కానీ అప్పుడు ఆయన దానికి సున్నితంగా తిరస్కరించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. రాజకీయాల్లో కూడా మార్పులు వచ్చాయి కాబట్టి. ఈసారి ఆ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. దేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో.... ముందు చూపుతో ఆలోచించే చంద్రబాబు లాంటి సమర్ధవంతమైన నాయకుల అవసరం ఎంతైనా వుంది. ఈ విషయాన్ని గ్రహించే ముకేష్ అంబానీ తన ఆకాంక్షను వ్యక్తం చేసి వుంటారు. మరి అదే జరిగితే పాపం మోడీ పరిస్థితి ఏంటో...

ప్రేమికుల రోజుని విడాకుల రోజుగా ప్రచారం చేస్తున్న జీహెచ్‌ఎంసీ

  టైటిల్ చూసి ఆశ్చర్య పోకండి. జీహెచ్‌ఎంసీ ఈ ప్రేమికుల రోజుకి షాకింగ్ నిర్ణయాలు ఏం తీసుకోకపోయినా, ప్రేమికులకు మాత్రం కాస్త ఇబ్బంది కలిగించే పని పెడుతుంది. సాధారణంగా, వాలెంటైన్స్ డే అంటే ప్రేమికులంతా పార్కులు, సినిమాలు అంటూ ఈ రోజు గడిపేస్తారు. అలా పార్కులకి వచ్చే జంటలకు, జీహెచ్‌ఎంసీ క్లాస్ లు ఇవ్వనుంది. అదేదో, మీరు చేసేది తప్పు అని చెప్పడానికి కాదు లెండి, మంచి ఉద్దేశ్యం తోనే వాళ్ళు ఈ పని చేస్తున్నారు.   ఇక అసలు విషయానికి వస్తే, ప్రేమికుల రోజుని వ్యర్ధాలకి విడాకుల రోజుగా జరిపేందుకు జీహెచ్‌ఎంసీ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా పార్కులకొచ్చే ప్రేమికులకు అవగాహన కల్పించే కార్యక్రమం పెట్టుకున్నారు.   అయితే, ఇంత హంగామా ఎందుకంటారా! స్వచ్ఛ సర్వేక్షణ్‌-2018 సర్వే లో మంచి ర్యాంక్ పొందడానికి. 2017 లో జరిగిన సర్వే లో 500ల నగరాలతో పోటీపడి హైదరాబాద్‌ 19వ ర్యాంకు దక్కించుకుంది. అయితే, ఈ సారి పోటీలో 4,041 నగరాలు పాల్గొంటున్నాయి.   నిపుణుల బృందం హైదరాబాద్‌లో రేపటి నుండి మొదలుకొని 22వరకు పర్యటించి స్వచ్ఛతకు మార్కులు వేస్తుంది. ఇందులో భాగంగా నగర పౌరులని స్వచ్ఛత విషయంలో స్పందన కోరుతారు. ఒకవేళ, ప్రజలు పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తే మంచి మార్కులు పడతాయి, లేదంటే మైనస్ మార్కులు పడే అవకాశం ఉంది. అందుకని నగర ప్రజల్లో అవగాహనా పెంచేందుకు నడుం బిగించారు జీహెచ్‌ఎంసీ పెద్దలు. అందుకు, ప్రేమికుల దినోత్సవాన్ని ఎన్నుకున్నారు.   అంతే కాకుండా, జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటి నుండి జరిగే ప్రతి శుభకార్యాల అనంతరం వ్యర్థాలను తడి, పొడిగా వేరు చేయాలనీ... వేరుచేసిన తడి చెత్తతో ఎరువు తయారు చేయాలని రూల్ పెట్టారు.   జీహెచ్‌ఎంసీ చేస్తున్న ఈ మంచి కార్యక్రమానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నారు. అయినా, నగరం స్వచ్చ్చంగా ఉండడం మించి మనకు కావాల్సింది ఏముంది. హైదరాబాద్ కి మంచి ర్యాంక్ వస్తే మనకూ గర్వకారణమే కదా.

ఆనాడు చంద్రబాబు చెప్పబట్టే...నోర్లు మూయించిన అంబానీ..

  మన గొప్పతనాన్ని మనం  చెప్పుకోవడం కంటే.. పక్కన వాళ్లు చెబితేనే దానికో అర్దం ఉంటుంది. అందులో ప్రపంచంలోనే గొప్ప వ్యక్తులైన వాళ్లు.. మన గొప్పతనాన్ని చెబితే.. ఎలా ఉంటుంది... అబ్బో అది చెప్పడానికే మాటలుండవు. అలాంటి పరిస్థితే ఎదురైంది చంద్రబాబుకి. ఇంతకీ పొగిడిన వ్యక్తి ఎవరనుకుంటున్నారా..? ఎవరో కాదు ముకేష్ అంబానీ. అసలు మ్యాటరేంటంటే.. ముకేష్ అంబానీ అమరావతిని సందర్శించిన సంగతి తెలిసిందే కదా. ఈ క్రమంలో ఆయన చంద్రబాబు గురించి పొగిడారు. 1999లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు జామ్‌నగర్‌లోని మా రిఫైనరీని సందర్శించారు. అప్పుడు మా నాన్న ధీరూబాయ్‌ అంబానీతో మాట్లాడారు. టెలికాం రంగంలోకి వస్తే బాగుంటుందని మాకు సలహా ఇచ్చారు. ఆ రంగం ఊహించనంత ఎదుగుతుందని చెప్పారు. ఆ సలహాతోనే మా నాన్న టెలికాంవైపు అడుగు వేశారు. ఆ రకంగా రిలయన్స్‌ కంపెనీ చంద్రబాబుకు రుణ పడి ఉండాలి’’ అంటూ ప్రశంసలు కురిపించారు.   దీంతో చంద్రబాబు స్థాయి ఏంటో మరోసారి అర్దమైంది. గతంలో మైక్రో సాఫ్ట్ హైదరాబాద్ తెచ్చింది నేనే అంటే ఎగతాళి చేసారు... చివరకు స్వయానా మైక్రో సాఫ్ట్ అధినేతే వైజాగ్ వచ్చి, ఆ రోజుల్లో చంద్రబాబు పడిన కష్టం చెప్పి, హైదరాబాద్ రావటానికి చంద్రబాబు ఏమి చేసింది చెప్పారు. దాంతో అప్పుడు విమర్శించిన వాళ్ల నోర్లు మూతపడ్డాయి. ఇక హైదరాబాద్ ఐటీ గురించి చెప్పక్కర్లేదు. ఈరోజు హైదరాబాద్ ఐటీ హబ్ గా మారిందంటే.. దానికి కారణం చంద్రబాబే అని ఏ ఒక్క ఐటీని అడిగినా చెబుతారు. కానీ నిజాన్ని ఒప్పుకోలేని కొంతమంది ఉంటారు కదా. దానికి కూడా వాళ్లు చంద్రబాబుపై కామెంట్లు చేస్తారు. చివరకు ప్రత్యర్ధి అయిన తెలంగాణా ఐటి మంత్రి కేటీఆర్ స్వయంగా ఈరోజు హైదరాబాద్ ఐటీలో ఇలా ఉందంటే ఆ ఘనత చంద్రబాబుదే అని చంద్రబాబును విమర్శించే వాళ్ల చెంపమీద కొట్టినట్టు సమాధానం చెప్పారు. ఇప్పుడు తాజాగా ముకేష్ అంబానీ మరోసారి అలాంటి వాళ్ల నోరు మాయించారు. ఆ రోజుల్లో టెలికాం రంగంలో రెవల్యుషన్ గురించి వాజ్ పేయ్ కి నేనే సలహా ఇచ్చా అంటే.ఎగతాళి చేశారు. నిన్న ముకేష్ అంబానీ... ఈరోజు టెలికాం రంగంలో ఇలా ఉన్నామంటే దానికి చంద్రబాబే కారణమని చెప్పారు. అది చంద్రబాబు స్థాయి. మరి అంబానీ ప్రశంసలు చూసిన తరువాత చంద్రబాబుపై ఎటకారంగా కామెంట్లు చేసేవాళ్లు తలలు ఎక్కడ పెట్టుకుంటారో మరి. కొంతమంది నాయకులు ప్రజలకు ఉపయోగపడే పనులు వాళ్లు చేయరు...ఇతరులు చేస్తే  పనికి మాలిన విమర్శలు చేస్తూ కాలక్షేపం చేస్తుంటారు. అలాంటివాళ్లకు ఇప్పటికైనా చంద్రబాబు కెపాసిటీ ఎంటో అర్ధమై ఉండాలి.. అర్దంకాకపోతే ఇలానే వేరే వాళ్లు నోరు మూయిస్తారు. మరి చంద్రబాబుపై ఆలోచించకుండా ఇప్పటికైనా విమర్శలు గుప్పించడం ఆపేస్తే బెటర్.

ముద్రగడ పవన్‌ని అంత మాటనేశాడేంటీ?

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలు ముమ్మరం చేశారు. రాజకీయ నిరుద్యోగులుగా వున్నవారికి ఆయన ఇప్పుడు కల్పవృక్షంలా కనిపిస్తున్నారు. అలాంటి వారందరూ ఇప్పుడు జనసేన నీడన చేరడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఏ పార్టీకి సన్నిహితంగా వుండాలా అని ఎదురుచూస్తున్న ఉండవల్లి, జయప్రకాష్ నారాయణ లాంటి వారు కూడా పవన్ కళ్యాణ్‌కి చేరువవుతున్నారు. వాళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్‌ని కలసి మంతనాలు జరిపారు. ఇద్దరు ప్రముఖులు తమ నాయకుడికి చేరువ కావడం పట్ల పవన్ కళ్యాణ్ అభిమాన జనాలు, జనసేన కార్యకర్తలు హ్యాపీగా ఫీలవుతున్నారు. అయితే ఇలా హ్యాపీగా ఫీలవటం సూది దొరికిందన్న ఆనందంలో గడ్డపలుగు పోయిందనే విషయాన్ని పట్టించుకోనట్టుగా వుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇద్దరు ప్రముఖులు పవన్ కళ్యాణ్‌కి దగ్గరవుతున్నారు ఓకే.. బాగానే వుంది.. కానీ మరో ప్రముఖుడు పవన్ కళ్యాణ్‌కి దూరమవుతున్నారు.. ఆ విషయాన్ని జనసేన వర్గాలు లైట్‌గా తీసుకుంటున్నాయి.   ఎవరు అవునన్నా, కాదన్నా పవన్ కళ్యాణ్ కాపు కులాన్ని తన ప్రధాన బలంగా భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మద్దతుదారుల్లో ఆ సామాజికవర్గానికి చెందిన వారి సంఖ్య చాలా ఎక్కువ. గతంలో ఈ సామాజికవర్గం వారు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ మీద ఆశలు పెట్టుకుని భంగపడ్డారు. ఇప్పుడు పవన్ మీద ఆశలు పెట్టుకున్నారు. గతంలో మాదిరిగా పవన్ కళ్యాణ్ కూడా తమను భంగపడేలా చేస్తాడా అనే అనుమానాలు వీరిని బలంగా పీడిస్తున్నాయి. అలా అనుమానిస్తూనే, పవన్ వెంట నడుస్తున్నారు. అయితే కాపు సామాజిక వర్గంలో పవన్ కళ్యాణ్ కంటే సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభాన్ని కలుపుకుని వెళ్ళడంలో పవన్ కళ్యాణ్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. దాంతో ముద్రగడ పవన్ కళ్యాణ్‌తో కలసి నడవటానికి విముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన ఇటీవల ఒక బలమైన స్టేట్‌మెంట్ ఇచ్చారు. కాపులకు పవన్ కళ్యాణ్ వల్ల ఒరిగేదేమీ వుండదని, కాపులకు పవన్ కళ్యాణ్ కంటే చంద్రబాబే న్యాయం చేస్తారన్న నమ్మకం వుందని ముద్రగడ ప్రకటించారు. ముద్రగడ చేసిన ఈ ప్రకటన కాపు సామాజిక వర్గం మీద తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. అయితే ఈ విషయం పవన్ కళ్యాణ్‌కి, జనసేన వర్గాలకి ఇంకా అర్థమైనట్టు లేదు.

టీడీపీలోకి కొడుకును పంపుతున్న పురంధేశ్వరి..?

ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరికి.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఉన్న వైరం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. తన తండ్రిని గద్దె దించి.. ఆ పీఠాన్ని చంద్రబాబు చేజిక్కించుకున్నారనే.. అసంతృప్తితో బయటకు వెళ్లిపోయారు దగ్గుబాటి దంపతులు. చంద్రబాబును ఎదిరించలేక.. కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్న ఈ జంట కాంగ్రెస్‌లో చేరింది. ఎంపీగా, కేంద్రమంత్రిగా పురంధేశ్వరి.. పర్చూరు ఎమ్మెల్యేగా దగ్గుబాటి వెంకటేశ్వరరావుల హవా కాంగ్రెస్‌లో బాగానే నడిచింది.  రాష్ట్ర విభజన అనంతరం రాజకీయ భవిష్యత్తు కోసం.. తండ్రి స్థాపించిన టీడీపీలోకి రీఎంట్రీ ఇద్దామని పురంధేశ్వరి భావించారు. అయితే బాబు ఇందుకు ససేమిరా అన్నారు.. బీజేపీలో చేరి బెజవాడ ఎంపీ సీటును ఆశించినప్పటికీ.. దానికి చంద్రబాబు అడ్డు చెప్పారని ప్రచారం జరిగింది.   కమలదళంలో పురంధేశ్వరి హవా నడవకపోవడంతో ఆమె టీడీపీలో చేరుతారని కూడా వార్తలు వచ్చాయి. కానీ వీటిలో వాస్తవం లేదని తేలిపోయింది. ఈ నేపథ్యంలో ఆమె కొత్త ఎత్తు వేశారు.. తన కొడుకు చెంచురామ్‌ను తెలుగుదేశంలోకి పంపాలని ఆమె భావిస్తున్నారట. తమ్ముడు బాలకృష్ణ ద్వారా పురంధేశ్వరి తెరవెనుక నుంచి.. ఈ వ్యవహారం నడుపుతున్నట్లు పొలిటికల్ టాక్. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం మొదటి నుంచి దగ్గుబాటి కుటుంబానికి అడ్డా.. 1985, 89, 2004, 2009లలో ఆ నియోజకవర్గం నుంచి దగ్గుబాటి ప్రాతినిధ్యం వహించారు. తర్వాత ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా సామాజిక వర్గ సమీకరణలతో టికెట్ దక్కలేదు. ఈలోగా రాష్ట్ర విభజన జరగడం.. కాంగ్రెస్‌ను జనం చీదరించుకోవడంతో ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు వెంకటేశ్వరరావు.   2014లో టీడీపీ నుంచి ఏలూరి సాంబశివరావు గెలుపొందారు.. అయితే ఆయన పనితీరుపై స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో.. ఏలూరిని పోటీ నుంచి తప్పించాలని చంద్రబాబు భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో టీడీపీలో ఎలాగైనా క్రీయాశీలకంగా వ్యవహరించాలని భావిస్తున్న దగ్గుబాటి కుటుంబం.. కుమారుడు చెంచురామ్‌ను ఇక్కడి నుంచి బరిలోకి దించాలని పావులు కదుపుతున్నట్లు పొలిటికల్ టాక్.   ఎట్టి పరిస్ధితుల్లోనూ టిక్కెట్ మేనల్లుడికి దక్కేలా చేయాలని బాలయ్య పట్టుదలతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు, లోకేశ్‌ల వద్ద ఈ విషయాన్ని బాలయ్య ప్రస్తావించినట్లు.. దీనికి వారిద్దరూ సానుకూలంగా స్పందించినట్లు పచ్చ కండువాలు గుసగుసలాడుకుంటున్నాయి. మరోవైపు పురంధేశ్వరితో జట్టుకట్టి టీడీపీపై విరుచుకుపడుతున్న నందమూరి హరికృష్ణకు.. అదే పురందేశ్వరితో చెక్ పెట్టాలని చంద్రబాబు యోచిస్తున్నారట. రాజకీయంగా.. వ్యక్తిగతంగా అన్ని రకాలుగా లాభం చేకూర్చే ఈ సువర్ణవకాశాన్ని టీడీపీ అధినేత వదులుకోరని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ముఖ్యమంత్రి ఎలాంటి స్టెప్ వేస్తారో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

డిల్లీ అయిపోయింది... ఇప్పుడు గల్లీకి చేరింది...

  టీడీపీ -బీజేపీ మధ్య గతకొద్దికాలంగా కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. కానీ మిత్రపక్షం కాబట్టి.. చంద్రబాబుకు ఉన్నసంహనంతో ఒకపక్క బీజేపీ నేతలు ఎన్ని విమర్శలు గుప్పిస్తున్నా ఇన్నిరోజులు బీజేపీతో కలిసుంది. ఇక కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ విషయంలో ఏపీకి మొండిచేయి చూపడంతో  ఈ వివాదం కాస్త ముదిరి పాకాన పడింది. దీంతో రెండు పార్టీలు తెగదెంపులు ఖాయమని తెలుస్తోంది. దీంతో రెండు పార్టీలు బహిరంగంగానే గొడవలకు దిగుతున్నాయి.   ఇప్పటికే విభజన హామీల మీద పార్లమెంట్ వేదికగా టీడీపీ ఎంపీలు చేశారు పోరాటం ఉదృతం చేశారు. బీజేపీ ఏపీకి చేసిన న్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇక దీంతో బీజేపీ నేతలు కూడా టీడీపీ మీద కౌంటర్ అటాక్ చేశారు. చివరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు సైతం టీడీపీ అవినీతి మీద పోరాటం చేస్తాం అనే ప్రకటన చేశారు. దీనికి టీడీపీ నేతలు కూడా ఎక్కడా తగ్గకుండా బీజేపీకి గట్టిగా సమాధానం చెబుతుంది. దీనికి తోడు ఇప్పుడు తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం , అందలూరులో బీజేపీ, టీడీపీ మధ్య గొడవ చోటుచేసుకుంది. అందలూరులో బీజేపీ ఎంపీ గోకరాజు రంగరాజు వున్న విషయం తెలుసుకున్న టీడీపీ స్థానిక నాయకులు , కార్యకర్తలు ఆయన దగ్గరకు వెళ్లారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్రం మీద ఒత్తిడి తేవాలని ఆయనకు వినతిపత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులపై గోకరాజు రంగరాజు విసుక్కున్నారు. ఇక టీడీపీ నాయకులు కూడా అసహనానికి గురి కావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకా విచిత్రం ఏంటంటే.. ఈ వ్యవహారం సాగుతున్నప్పుడు భీమవరం టీడీపీ ఎమ్మెల్యే అంజిబాబు అక్కడే ఉన్నప్పటికీ మౌనంగా ఉండిపోయారు. మరి నిన్నటివరకూ ఢిల్లీకే పరిమితమైన ఈ గొడవ.. ఇప్పుడు గల్లికి చేరింది. మరి చూడబోతే త్వరలోనే రెండు పార్టీలు విడాకులు తీసుకునే రోజులు దగ్గరపడినట్టే కనిపిస్తోంది.

ఆయనకి కూడా ఆ పిచ్చి మొదలైందా..

  అక్రమాస్తుల కేసులో వాళ్లు  A1, A2 నిందితులు..ఒకళ్లేమే లేచినదగ్గర నుండి కాబోయే సీఎం నేనే.. కాబోయే సీఎం నేనే అంటూ పగటి కలలు కంటుంటే.. మరొకరు మాత్రం నేనే కాబోయే కేంద్ర మంత్రి అంటూ చెప్పుకోవడం మొదలు పెట్టాడు. ఇంతకీ వాళ్లేవరో తెలిసే ఉండి ఉంటుంది. ఎవరో కాదు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఇంకోకరు ఆయనకు కుడిభజంగా ఉండే విజయసాయిరెడ్డి.   ఇప్పటికే జగన్ ఎక్కడ బహిరంగ సభలు జరిగినా.. నెక్స్ట్ నేనే సీఎం అంటూ.. ఎక్కడ ఏ బహిరంగ సభలు జరిగినా ఊదరగొట్టుకోవడం చూస్తూనే ఉన్నాం. అంతేనా ప్రజలు ఏ చిన్నసమస్య చెబుతున్నా దానికి నన్ను సీఎం చేయండి అప్పుడు మీ సమస్యలు తీరుస్తా అని చెబుతండటంతో మొదట ప్రజలు షాక్ తిన్నా.. ఆ తరువాత జగన్ పదే పదే ఈ మాటే అంటుంటే విసుగుచెందారు. ఇప్పుడు జగన్ సీఎం అవుతాడో లేదో తెలియదు కానీ... ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా పగలి కలలు కనడం మొదలుపెట్టారు. వైసీపీ ఎంపీ గా కేంద్ర మంత్రివర్గంలో చేరడంతో కొందరి పని పడతానని విజయసాయి రెడ్డి కామెంట్స్ చేశాడు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ పై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ,టీడీపీ మధ్య దూరం పెంచడానికి తాను చేసిన ప్రయత్నాలు విజయవంతం అయ్యాయని , త్వరలో చంద్రబాబు కమలనాథులకు గుడ్ బై కొట్టడం ,తాము కేంద్ర మంత్రివర్గంలో చేరడం లాంఛనం అని  తన సన్నిహితుల దగ్గర పదేపదే చెబుతున్నారట.   దీంతో విజయసాయి చేస్తున్న కామెంట్స్ తో ఆయన సన్నిహితులే ఆశ్చర్యపోతున్నారట. ఎందుకంటే విజయసాయి రెడ్డి టార్గెట్ చేస్తుంది  టీడీపీ నాయకులను కాదు. ప్రభుత్వ అధికారులను. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే.. ఈ మాటలు విన్న అధికారులు నవ్వుకుంటున్నారట. ఓ ఐఏఎస్ అధికారి అయితే  ఇంకో అడుగు ముందుకేసి  A 1 సీఎం , A 2 సెంట్రల్ మినిస్టర్ అయితే ఇక్కడ మేము ఉద్యోగాలు చేయములే అని అన్నారట. మరి దీనిపై విజయసాయిరెడ్డి ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. ఏది ఏమైనా పాపం జగన్ ఒక్కడే అనుకున్నారు.. కానీ ఇలా పగటి కలలు కనే నాయకులు జగన్ పక్కన చాలా మంది ఉన్నారన్నమాట...

పవన్ విషయంలో ఏం చేద్దాం...!

  ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విభజన హామీలపై పోరాడేందుకు గాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జేఏసీ కమిటీ ఏర్పాటు చేసి.. నిజాలు బయటకు తేవాలని చూస్తున్న సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే ఆయన ఇప్పటికే లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్ ను కలవడం జరిగింది. ఇక నిన్న రాజకీయవేత్త అయిన ఉండవల్లిని కూడా జరగడం జరిగింది. అయితే మొన్నటి వరకూ పవన్ పై కాస్త అటూ, ఇటూగా ఉన్న ఉండవల్లి ఇప్పుడు పవన్ కి ఫిదా అయినట్టే కనిపిస్తోంది. చూద్దాం, చూద్దాంలే అని అన్న ఉండవల్లి..పవన్ అప్రోచ్ తనకు నచ్చిందని.. తన విధానాలు నచ్చాయని చెప్పడంతో పవన్ తో కలిసి పనిచేసేందుకు ఉండవల్లి సిద్దంగా ఉన్నట్టే కనిపిస్తోంది. కానీ క్లారిటీ మాత్రం ఇవ్వలేదు.   అంతేకాదు దీనిపై జయప్రకాశ్ నారాయణతో చర్చించాలని కూడా ఉండవల్లి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉండవల్లి, జయప్రకాశ్ కలవడం కొత్త చర్చలకు తెరలేపింది. పవన్ విషయంలో ఎలా ముందుకు సాగాలన్న అంశంపై జయప్రకాశ్ తో చర్చించాలని ఉండవల్లి నిర్ణయింకున్నట్టు తెలుస్తోంది. పవన్ తనతో మాట్లాడిన అంశాలను జేపీ దృష్టికి తీసుకు వెళ్లనున్న ఉండవల్లి, ఆయనతో మాట్లాడిన తరువాతనే జేఏసీలో చేరాలా? వద్దా? అన్న విషయమై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.   మరి జేపీ, ఉండవల్లి మాటలను బట్టి చూస్తే పవన్ మీద పాజిటివ్ ఒపినీయన్ తోనే ఉండట్టు తెలస్తోంది. అయితే పాజిటివ్ గా ఉన్నా..పవన్ ను  రాజకీయ నాయకుడిగా ఒప్పుకోలేకపోతున్నారు. జేపీ అయితే ఏకంగా పవన్ ఏరి కోరి కష్టాలు తెచ్చుకుంటున్నాడు అని డైరెక్ట్ గానే అన్నాడు. ఇలాంటి నేపథ్యంలో వీరిద్దరి భేటీ మరింత ఆసక్తికరంగా మారింది. మరి భేటీ తరువాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? పవన్ తో కలిసి పని చేస్తారా..? లేదా..? అన్నది తెలియాలంటే భేటీ ముగిసే వరకూ ఆగాల్సిందే.

'మోడీ'ని దుర్యోధనుడు.. అమిత్‌షాను దుశ్శాసనుడు.. రేణుకా చౌదరి ద్రౌపది...

  రాజ్యసభలో మోడీ ప్రసంగిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రేణుకాచౌదరి పెద్దగా నవ్విన నేపథ్యంలో ఆమెపై మోడీ సెటైర్లు విసిరిన సంగతి తెలిసిందే కదా. ..అప్పట్లో రామాయణంలో ఇలాంటి వికటాట్టహాసాలు వినేవాళ్లమని, ఇప్పుడు మరోసారి వింటున్నామని చురకలు అంటించారు. ఇక మోడీ వ్యాఖ్యలపై కూడా స్పందించిన రేణుకా చౌదరి గతంలో ప్రధాని మోదీ ఆధార్‌ కార్డు అవసరం లేదని పెద్ద ప్రసంగమే చేశారని... అలాంటి మోదీ ఇపుడు ఆధార్‌ ను పుట్టించినదే తాము అని చెబితే నవ్వకుండా ఉండగలమా? ప్రధాని స్థాయి వ్యక్తి మాట్లాడే పద్దతి అదేనా ? అని ఆమె ప్రశ్నించారు. రాజ్యసభలో కాబట్టి ఆయన సేఫ్, ఇదే వ్యాఖ్య ఆయన బయట చేసి ఉంటే ఈపాటికి ఆయనపై చట్టప్రకారం కేసు నమోదై ఉండేదని ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.   అయితే ఇప్పుడు ఈ ఘటనపై కాంగ్రెస్ కు చెందిన ఓ నాయకుడు మరో అడుగు ముందుకేసి ఏకంగా ఓ పోస్టర్ నే తయారు చేశాడు. ప్రధాని నరేంద్రమోడీ, ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా..బిజెపి మంత్రులు, ఇతర నాయకులు కౌరవులట. కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యురాలు,మాజీమంత్రి రేణుకాచౌదరి ద్రౌపది అట...! ఎల్‌.కె.అద్వానీ.. దృతరాష్ట్రుడట. ఇంతకీ ఆపోస్టర్ పోస్ట్ చేసింది ఎవరనుకుంటున్నారా..?ఆయన ఎవరో కాదు హసీబ్‌ అహ్మద్‌'. ఆ పోస్టర్ లో  'మోడీ'ని ఆయన బృందాన్ని కౌరవులుగా వర్ణిస్తూ..ఓ పోస్టర్‌ వేశారు. దానిలో 'మోడీ'ని దుర్యోధనుడిగా..అమిత్‌షాను దుశ్శాసనుడుగానూ.. మిగతా..మంత్రులను కౌరవులుగానూ చిత్రీకరించారు. 'రేణుకాచౌదరి'ని ద్రౌపదిగా చిత్రీకరించి..ఆమె వస్త్రాలను కౌరవులు లాగుతుంటే..కాంగ్రెస్‌ అధ్యక్షుడు 'రాహుల్‌గాంధీ' కృష్ణుడుగా ఆమెకు వస్త్రాలను అందిస్తున్నట్లుగా చిత్రీకరించారు. ఈ పోస్టర్‌ ఇప్పుడు సోషల్‌మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. మరి దీనిపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

చెల్లెలు కవితకు అన్నయ్య పవన్ థ్యాంక్స్...

  కేంద్ర బడ్జెట్ విషయంలో ఏపీకి మోడీ ప్రభుత్వం ఎంత అన్యాయం చేసిందో ఏ ఒక్కరినీ అడిగినా చెబుతారు. ఇక మోడీ ప్రభుత్వం ఏపీ ప్రజలకు చూపింటిన మొండిచేయిని చూసి జనాలు రగిలిపోతున్నారు. మరో పక్క టీడీపీ ఎంపీలు మా రాష్ట్రానికి న్యాయం చేయండిరా బాబు అంటూ పార్లమెంట్ లోపల, బయట కూడా నిరసనలు చేస్తూ తమ బాధను చెబుతున్నారు. ఇక ఏపీ ఎంపీల బాధను చూసిన కాంగ్రెస్ కూడా మా మద్దతు మీకు ఇస్తున్నాం అని తమ మద్దతు ఇప్పటికే తెలిపింది. పాపం ఈ రకంగా అయినా రాష్ట్రాన్ని విభజించి చేసిన పాపానికి కాస్త అయిన ప్రాయశ్చితం చేసుకోవాలని చూస్తున్నట్టు ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కాదు ఇంకా పలు పార్టీలు కూడా ఏపీకి అండగా ఉంటామని ముందుకు వచ్చాయి. అందులో తెలంగాణలోని టీఆర్ఎస్ పార్టీ కూడా ఒకటి. ఆ పార్టీ ఎంపీ కవిత రాజ్యసభలో ఏపీకి ఇచ్చిన విభజన హామీలన్నీ నెరవేర్చాలని... ఏపీ టీడీపీ ఎంపీలు చేస్తున్న పోరాటానికి మా మద్దతు ఉంటుందని.. అంతేకాదు జై ఆంధ్ర అని కూడా అన్నారు ఆమె.   ఇప్పుడు కవిత ఇచ్చిన మద్దతుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించి.. అన్నవరంలోని అన్నయ్య పాత్ర పోషించాడు. తన ట్విట్టర్ ద్వారా... 'రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలపై పార్లమెంటులో మాట్లాడిన చెల్లెలు కవిత గారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నా' అంటూ ఆయన ట్వీట్ చేశారు. మరి గతంలో పవన్ తెలంగాణ పర్యటన చేయడం... పర్యటనలో కేసీఆర్ ప్రభుత్వంపై ఒక్క మాట కూడ అనకపోవడ... ఆతరువాత పవన్ కళ్యాణ్ కు తెలంగాణలో పోటీ చేసే అవకాశం ఉందని కవిత చెప్పడం... ఇప్పుడేమో కవితను పవన్ చెల్లెలు అనడం చూస్తుంటే.. రాబోయే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి చూద్దాం ఏం జరుగుతుందో....  

అమ్మ జగన్ ఇంత స్టోరీ నడిపావా...!

  వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గుట్టు బయటపెట్టారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం. కావాలని అన్నారో... లేక ఫ్లోలో వచ్చిందో తెలియదు కానీ... నిజాన్ని మాత్రం బయటపెట్టాడు. జగన్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని వీడి..కొత్త పార్టీ ఎప్పుడైతే పెట్టాడో.. వెంటనే అవినీతి కేసులో ఇరుక్కున్నాడు. జగన్ కాంగ్రెస్ పార్టీ వీడినందుకే కాంగ్రెస్ పార్టీ జగన్ పై ఉన్న అవినీతి కేసును బయటకుతీసిందన్న వార్తలు కూడా వచ్చాయి ఇక ఈ కేసులో పాపం జగన్ ఏకంగా 16 నెలలు జైలుశిక్ష అనుభవించాడు. ఇక ఈ కేసులో జగన్ కు బెయిల్ ఎలా వచ్చిందనే విషయాన్ని జేడీ శీలం బయటపెట్టారు.   తాజాగా ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాంగ్రెస్, వైఎస్సాఆర్ కాంగ్రెస్ మధ్య 2014 ముందు జరిగిన చీకటి ఒప్పందం గురించి బయట పెట్టారు. జగన్ జైలులో ఉన్న సమయంలో సోనియా గాంధీ వద్దకు ఒక దూతను పంపి, తనకు బెయిలు వచ్చేందుకు సహకరిస్తే రాష్ట్ర విభజనకు అడ్డు పడను అని హామీ ఇచ్చారట. దీనితో ఆయనకు సోనియా కనికరించడం, జగన్ కు బెయిలు రావడం జరిగిపోయిందట. 16 నెలల జైలు జీవితం తరువాత ఆయన బయటకు వచ్చారు. అందుకే సోనియాకు ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక హోదా పోరాటంలో ఏదో నామ్ కే వాస్త్ విభజనకు వ్యతిరేకం అన్నట్టు కలరింగ్ ఇచ్చారు. చీకట్లో చేయాల్సింది చేసి మళ్లీ ఏం తెలియనట్టు అమాయకపు మొహాలు పెట్టడం. ఇంకేముంది ఈ మాటలు కాస్త టీడీపీ చెవిన పడ్డాయి. అంతే..జేడీ మాటలు ఉన్న వీడియో తీసి చిన్న వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చి పడిందంటే చాలు.. దాదాపు అందరికీ రీచ్ అయిపోనట్టే. దీంతో ఏపీ విభజనలో జగన్ హ్యాండ్ కూడా ఉన్నట్టు అందరికి తెలిసిపోయింది. అసలే జగన్ పై జనాల్లో వ్యతిరేకత ఉంది.. ఇప్పుడు ఇలాంటి నిజాలు బయటపడితే సీఎం పదవి సంగతేమో... ముందు పార్టీ పరువు పోకుండా చూసుకోవాలి...

లోక్‌సభ వాయిదా.. మోడీ ఎస్కేప్ అయ్యారోచ్..!!

ఏపీకి న్యాయం చేయాలని.. ఆంధ్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ఏపీ ఎంపీలు చేస్తోన్న నిరసనలతో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆందోళన విరమించాలని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ విజ్ఞప్తి చేసినప్పటికి వినిపించుకునే పరిస్థితి లేదు. సస్పెండ్ అయినా సరే పార్లమెంట్ గేట్ దగ్గర నిరసనను కొనసాగించాలని చంద్రబాబు.. తన ఎంపీలకు చెప్పడంతో వారు ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఏం చేయాలో పాలుపోక.. సభను ఎలా నడిపించాలో అర్థంకాక నరేంద్రమోడీ కొత్త ఎత్తు వేశారు.   ఇవాళ సాయంత్రం వరకు జరగాల్సిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేశారు. ఉదయం సభ ప్రారంభమైన కొద్దిసేపటికే.. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని టీడీపీ, వైసీపీ ఎంపీలు ఫ్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు.. సభా వ్యవహారాలకు ఆటంకం కలగడంతో.. ఐదు నిమిషాల్లోనే సభను మధ్యాహ్నానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. ఆ తర్వాత కూడా పరిస్థితిలో ఏ మార్పు లేకపోవడంతో లోక్‌సభను నిరవధిక వాయిదా వేయాలని స్పీకర్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ లోక్‌సభ సమావేశాలు మార్చి 5న మొదలవుతాయి. ఈ నిర్ణయం ద్వారా ఇప్పటి వరకు పార్లమెంట్ వేదికగా సాగుతున్న నిరసన కార్యక్రమం.. జంతర్‌మంతర్ లేదా మరో వేదికకు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

బీజేపీ గతుక్కుమంది.. వెతుకులాటలో పడింది

నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నాయకులది ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగింది. అధికారాన్ని ఆస్వాదిస్తూనే మిత్రధర్మాన్ని విస్మరించింది. అధికారంలో వుంటూనే అధికార పార్టీని విమర్శిస్తూ వచ్చింది. బీజేపీతో స్నేహాన్ని కొనసాగించడం మినహా మరో గత్యంతరం లేని టీడీపీ నాయకులు బీజేపీ నాయకుల వ్యవహారశైలిని మౌనంగా భరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను కోరుకుంటూ వారి దూకుడును సహించారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొండిచెయ్యి చూపడంతో టీడీపీ నాయకుల సహనం కట్టలు తెంచుకుంది. బీజేపీకి, మోడీకి వ్యతిరేకంగా టీడీపీ నాయకులు గళం విప్పడం ప్రారంభించారు.   టీడీపీ ఎంపీలు గత కొద్ది రోజులుగా పార్లమెంటులో వ్యక్తం చేస్తున్న నిరసన బీజేపీ నాయకత్వం ఎంతమాత్రం ఊహించని పరిణామం. అలాగే ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంటులో వినిపించిన నిరసన గళం బీజేపీకి తిరుగులేని వార్నింగ్. మోడీ సర్కార్ ఆంధ్రప్రదేశ్ విషయంలో అవలంబిస్తున్న నిర్లక్ష్య ధోరణిని, మిత్రద్రోహాన్ని ఆ ప్రసంగం ప్రశ్నించింది. ఇప్పటి వరకూ టీడీపీ నాయకులు కుక్కిన పేనుల్లా పడి వున్నారని అనుకుంటూ వచ్చిన బీజేపీ నాయకులను ఈ పరిణామాలన్నీ గతుక్కుమనిపించాయి. ఇప్పుడు టీడీపీని ఎలా ఎదుర్కోవాలా అనే వెతుకులాటలో బీజేపీ నాయకులు పడిపోయారు.   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటికే బోలెడన్ని నిధులు ఇచ్చాము. ఫలానా ఫలానా పథకాలకు వినియోగిస్తున్న డబ్బు కేంద్రం ఇచ్చిందే అని చెప్పడానికి ఏపీ బీజేపీ నాయకులు సమాయత్తం అవుతున్నారు. విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో పడిన ఏపీని బీజేపీ ప్రభుత్వం అనేక రకాలుగా ఆదుకోవడం వల్లే ప్రస్తుత పరిస్థితి ఇలాగైనా వుందని చెప్పడానికి బీజేపీ నాయకులు సన్నాహాలు చేసుకుంటున్నారు. మొత్తమ్మీద వచ్చే ఎన్నికల నాటికి ఈ రెండు పార్టీల మధ్య స్నేహం అటూ ఇటూ అయినా జనంలో బీజేపీ పలుచన కాకుండా వుండేలా చూసుకోవాలి. దీనికోసం ఏం చేయాలనా అని బీజేపీ నాయకులు సమాలోచనలు చేస్తున్నారు. ఏపీ ప్రజల్లో ఇప్పటికే బీజేపీ మీద బాగా వ్యతిరేకత పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో తమ పార్టీ మీద ప్రజలకున్న వ్యతిరేకతను టీడీపీ వైపు మళ్ళించడానికి ఏం చేయాలన్న చర్చలు కూడా బీజేపీలో జరుగుతున్నాయి.