తెలంగాణా విద్యుత్ సమస్యలకు పరిష్కారమేది?
posted on Aug 29, 2014 @ 2:55PM
తెలంగాణాలో ప్రస్తుత విద్యుత్ సంక్షోభానికి ఇంతవరకు అవిభాజ్య రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, తెదేపాలే కారణమని తెరాస నేతలు ఆరోపిస్తున్నారు. అయితే అంతకంటే ముందు ఇన్నేళ్ళుగా తెలంగాణాకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణా ప్రజాప్రతినిధులందరినీ కూడా నిందించవలసి ఉంటుంది. వారికే కనుక తమ తెలంగాణాను అభివృద్ధి చేసుకోవాలనే తపన ఉండి ఉంటే, తమ మద్దతుతోనే నడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణాకు అన్ని సాధించుకొనే అవకాశం ఉంది. కానీ వారు ఎంతసేపు తమ పదవులు, అధికారం, పార్టీల రాజకీయ ప్రయోజనాల గురించే చూసుకొన్నారు తప్ప తెలంగాణా గురించి పట్టించుకోలేదు.
అయితే ఇప్పుడు గతం త్రవ్వుకొని విమర్శలు చేసుకోవడంకంటే, ఈ సమస్య నుండి బయటపడేందుకు ఇకపై ఏమి చేయాలని ఆలోచించడమే ఉత్తమం. తెలంగాణా ప్రభుత్వం ఆ దిశగా గట్టిగా కృషి చేస్తోంది కానీ ఈ విద్యుత్ సమస్యల నుండి బయటపడేందుకు కనీసం మరో రెండేళ్ళు పట్టవచ్చని చెపుతోంది.
రాష్ట్ర విభజన తరువాత ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన తరువాత చేప్పట్టిన అనేక చర్యల మూలంగా క్రమంగా రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎత్తివేయబడటం కళ్ళెదుటే కనబడుతోంది. కేంద్ర విద్యుత్ గ్రిడ్ నుండి అదనపు విద్యుత్ సంపాదించడమే కాకుండా కేంద్రప్రభుత్వం అక్టోబరు రెండు నుండి ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతున్న ‘నిరంతర విద్యుత్ సరఫరా’ పైలట్ ప్రాజెక్టును కూడా రాష్ట్రానికి ఆయన సాధించుకొన్నారు.
ఇవ్వన్నీ కేంద్రప్రభుత్వంతో చంద్రబాబు సత్సంబంధాలు నెలకొల్పుకోవడం వలననే సాధ్యమవుతోందని వేరే చెప్పనక్కరలేదు. కానీ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మూడు నెలలలో అటు కేంద్రం, ఇటు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాలతో నిత్యం ఘర్షణ వైఖరే అవలంబించడం అందరూ చూస్తూనే ఉన్నారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగా ద్వేషిస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి నుండి కూడా కేసీఆర్ కు స్నేహహస్తం అందిస్తూనే ఉన్నారు. ఆయనతో కలిసి పనిచేసేందుకు సిద్దమని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకొందామని సూచిస్తూనే ఉన్నారు. కానీ గవర్నర్ నరసింహన్ కలుగ జేసుకోనేంతవరకు కేసీఆర్ ఏనాడు సానుకూలంగా స్పందించిన దాఖలాలు లేవు.
కానీ ఇప్పటికయినా కేసీఆర్ అటు కేంద్రంతో, ఇటు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంతో సత్సంబంధాలు పెంచుకొనే ప్రయత్నం చేస్తే, బహుశః రెండు వైపుల నుండి కూడా సహాయం లభించే అవకాశం ఏర్పడుతుంది. పరిశ్రమలు, పంటలు ఏ రాష్ట్రానికి చెందినవయినా వాటివల్ల అన్ని రాష్ట్రాల ప్రజలు ఏదోవిధంగా ప్రయోజనం పొందుతుంటారు. కనుక ఆంధ్రా, తెలంగాణా ప్రభుత్వాలు రెండు కూడా తమ రాష్ట్రాల ప్రజల శ్రేయస్సు కోసం తమ విభేదాలు, బేషజాలు, అహం అన్నీపక్కనబెట్టి ఒకదానికొకటి అన్ని విధాల సహకరించుకొంటూ సమస్యల నుండి బయటపడేందుకు కృషి చేస్తే అందరూ హర్షిస్తారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో మిగులు విద్యుత్ ఉంటే దానిని మొట్ట మొదట తెలంగాణాకే ఇస్తానని ప్రకటించారు. ప్రస్తుతం మిగులు విద్యుత్ లేకపోయినా, రాష్ట్రంలో విద్యుత్ కొరత అంతగా లేదు కనుక వీలుంటే తెలంగాణా రాష్ట్రానికి కొంత విద్యుత్ కేటాయించగలిగితే అక్కడి పరిశ్రమలు, పంటలను కాపాడుకోవచ్చును. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వానికి సహాయపడితే, రేపు తెలంగాణా ప్రభుత్వం కూడా అదేవిధంగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరించే అవకాశం ఉంటుంది.