వైఎస్ జగన్‌కి అభిమానుల లేఖ
posted on Aug 27, 2014 @ 11:33AM
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డి గారికి మిమ్మల్ని ఎంతగానో అభిమానించే మీ అభిమానుల బృందం హృదయపూర్వకంగా నమస్కరిస్తూ రాయుచున్న లేఖ. మీరు మా అభిమాన నాయకుడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎలాంటి రాజకీయ నాయకుడు వుండాలని మేము మనస్పూర్తిగా కోరుకుంటూ వుంటామో మీరు కచ్చితంగా అలాంటి రాజకీయ నాయకుడే. ఎప్పటికైనా మీలాంటి నాయకుడిని చూస్తామా లేదా అనుకునేవాళ్ళం... మిమ్మల్ని చూశాక మా కోరిక తీరింది.. మా జన్మలు ధన్యమైపోయాయి.
అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు మొదలైనప్పటి నుంచి మిమ్మల్ని టీవీలో రెగ్యులర్‌గా చూస్తున్నాం. మీరు మాట్లాడే తీరు మాకెంతో నచ్చుతోంది. శాంతి భద్రతల సమస్య మీదగానీ, బడ్జెట్ మీద గానీ స్పీకర్ వద్దు అంటూ ఆపుతున్నప్పటికీ మీరు పట్టుబట్టి మాట్లాడుతున్న తీరు చాలా బాగుంది. అధికారపార్టీని ఇబ్బందులు పెట్టడానికి మీరు అనుసరిస్తున్న వ్యూహం మా అందరికీ చాలా నచ్చింది. మా మనసులలో ఏయే భావాలు, ఆలోచనలు వున్నాయో మీరు ప్రతిపక్ష నాయకుడిగా వాటిని కచ్చితంగా అలాంటి భావాలనే ప్రదర్శిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే అసెంబ్లీలో మాట్లాడుతున్న మిమ్మల్ని చూస్తూ వుంటే, మమ్మల్ని మేం చూసుకుంటున్నట్టే వుంది.
మాక్కూడా అప్పుడప్పుడు రాజకీయాల్లోకి రావాలని అనిపిస్తూ వుంటుంది. అయితే మేం రావాల్సిన అవసరం లేకుండానే ఆ లోటు మీరు తీర్చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా వుంది. మేం ప్రతిపక్ష నాయకుడు అయితే ఎలా వుంటామో, ఎలా మాట్లాడతామో, ఎలా ప్రవర్తిస్తామో మీరు కూడా అచ్చం అలాగే చేస్తున్నారు. మిమ్మల్ని చూస్తుంటే మీరే మేము మేమే మీరు అనిపిస్తూ వుంటుంది. మీరు మా మనసులకు అంతగా దగ్గరైన నాయకుడు. మీలాంటి ప్రతిపక్ష నాయకుడు వున్న రాష్ట్రంలో పౌరులం అయినందుకు మాకెంతో గర్వంగా వుంది. మిమ్మల్ని ఎంతగానో అభిమానించే మేం మీ పేరు మీద అభిమాన సంఘాన్ని కూడా ఏర్పాటు చేశాం. మీరెప్పుడైనా వీలు చూసుకుని మా దగ్గరకి వస్తే మిమ్మల్ని ఘనంగా సత్కరించి మమ్మల్ని మేం సత్కరించుకున్నట్టుగా ఫీలవుతాం.
ఇట్లు,
వైఎస్ జగన్మోహనరెడ్డి అభిమాన సంఘం సభ్యులు,
ఇన్ పేషెంట్ వార్డ్, మెంటల్ హాస్పిటల్, వైజాగ్.