తెలంగాణాకి హైకోర్టు ఏర్పాటుపై అందరూ తొందరపడ్డారా?
posted on Mar 24, 2015 @ 2:23PM
తెలంగాణా రాష్ట్రం ఏర్పడినందున దానికి ప్రత్యేక హైకోర్టు కావాలనుకోవడం సహజమే. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విజ్ఞప్తికి కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ కూడా చాలా సానుకూలంగా స్పందించారు. కేసీఆర్ స్వయంగా ఈ విషయం గురించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ సేన్ జ్యోతి గుప్తాతో చర్చించారు కూడా. హైకోర్టు కోసం గచ్చిబౌలీలో ఉన్న ఒక విశాలమయిన భవనాన్ని కేటాయించేందుకు తెలంగాణా ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు కేంద్ర న్యాయశాఖా మంత్రికి ఒకలేఖ అందజేశారు.
ఇక నేడో రేపో తెలంగాణా రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు అవుతుందని అందరూ భావిస్తున్న తరుణంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ సేన్ జ్యోతి గుప్తా, న్యాయమూర్తి సంజయ్ కుమార్ లతో కూడిన ధర్మాసనం ఆ ప్రతిపాదనను నిర్ద్వందంగా వ్యతిరేకించడమే కాక అది ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని (సెక్షన్ 31) ఉల్లంఘన చేసినట్లు అవుతుందని కుండబ్రద్దలు కొట్టినట్లు చెప్పారు. విభజన బిల్లులో తెలంగాణా రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయమని ఎక్కడా పేర్కొనలేదని, ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే ఏర్పాటు చేయవలసి ఉందని, అంతవరకు ఉమ్మడి హైకోర్టునే కొనసాగించవలసి ఉంటుందని విస్పష్టంగా పేర్కొన్నారు.
ఒకవేళ తెలంగాణా రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు చేయదలిస్తే ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని సవరించవలసి ఉంటుందని, దానిని సవరించకుండా అందుకోసం ఎటువంటి ప్రయత్నాలు చేసినా అది చట్టాన్ని ఉల్లంఘించినట్లే అవుతుందని ధర్మాసనం తేల్చి చెప్పింది. అంతేకాక తెలంగాణా రాష్ట్రానికి హైకోర్టు కోరుతూ న్యాయవాదులను ఎటువంటి ఆందోళనలు చేయవద్దని, ఎవరయినా ఇందుకు విరుద్దంగా వ్యవహరిస్తే దానిని కోర్టు ధిక్కారంగా పరిగణించి కటిన చర్యలు చేపడతామని హెచ్చరించారు కూడా. హైకోర్టు విభజనపై ఆంద్ర, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాలను కౌంటర్ ఫైల్ చేయమని ధర్మాసనం ఆదేశించింది. అవి చూసిన తరువాతే తన నిర్ణయం ప్రకటిస్తానని తెలిపింది.
విభజన చట్టంలో ఉన్న ఈ అంశాలనన్నిటినీ గమనించకుండానే హైకోర్టు కోసం తెలంగాణా న్యాయవాదులు ఉద్యమించడం, అందుకోసం తెలంగాణా ప్రభుత్వం శాసనసభలో ఒక తీర్మానం చేయడం, తెలంగాణా అడ్వకేట్ జనరల్ కూడా ఈ అంశాన్ని విస్మరించడం, కేంద్రన్యాయశాఖ మంత్రిగా ఉన్న సదానంద గౌడ హైకోర్టు ఏర్పాటుకి హామీ ఇవ్వడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. హైకోర్టు ఏర్పాటుకి చట్టంలో సాంకేతిక సమస్యలున్నప్పుడు వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతూ తమ ప్రయత్నాలకు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నారని తెలంగాణా మంత్రులు ఆరోపణలు చేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి లేఖ వ్రాసే ముందు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ సేన్ జ్యోతి గుప్తాని కలిసి మాట్లాడారు. కనుక చట్టంలో ఉన్న ఈ సాంకేతిక సమస్యల గురించి ఆయన ముఖ్యమంత్రికి అప్పుడే తెలియజేసే ఉంటారని అనుకొంటే, మరి ఈవిషయంలో తెలంగాణా ప్రభుత్వం ఎందుకు ముందడుగు వేసినట్లు? ఇప్పటికే తెలంగాణా ప్రభుత్వానికి హైకోర్టులో చాలా సార్లు ఎదురు దెబ్బలు తగిలాయి. అయినా కూడా ఎందుకు ముందుకు వెళ్ళినట్లు? ఇప్పుడు ఇంత వరకు వచ్చిన తరువాత తెలంగాణా ప్రభుత్వం ఈ విషయంలో ముందుకు వెళ్లగలదా? వెళ్ళలేకపోతే అందుకు ఎవరిని నిందిస్తుంది?