మెగాస్టార్ కి అభిమానులే శ్రీరామరక్ష
posted on Mar 23, 2015 @ 11:39PM
చిరంజీవి తనకున్న విశేష జనాధారణను చూసుకొనే ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రాజకీయాలలో ప్రవేశించారు. కానీ ఏ అభిమానుల అండతో ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి అవుదామనుకొన్నారో వారినే ఎన్నికల సమయంలో విస్మరించడంతో ఆయన అభాసుపాలయ్యారు. ఆ తరువాత నుండి చేసినవన్నీ స్వయంకృతాపరాదాలే. కనీసం కేంద్రమంత్రిగా నిలద్రొక్కుకొన్నప్పుడయినా ఆయన మళ్ళీ తన అభిమానులకు దగ్గరయ్యే ప్రయత్నం చేసి ఉండి ఉంటే నేడు ఆయన పరిస్థితి వేరేలా ఉండేదేమో! కానీ చేతులు కాలే వరకు కూడా ఆయన మేల్కొనలేదు. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ మీద ఆంద్రప్రదేశ్ ప్రజలు కోపంతో రగిలిపోతున్నారనే సంగతిని గ్రహించకుండా లేదా గ్రహించనట్లుగా నటిస్తూ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసి వారి ఆగ్రహానికి గురయ్యారు.
ఆ కారణంగానే చాలా మంది అభిమానులు కూడా ఆయనకి దూరమయ్యి, కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకే కంకణం కట్టుకొన్న పవన్ కళ్యాణ్ వైపు మళ్ళారు. కనీసం అప్పుడయినా చిరంజీవి మేల్కొని తమ్ముడితో చేతులు కలిపి ఉండి ఉంటే నేడు వారిరువురి రాజకీయ భవిష్యత్ మరియు రాష్ట్ర రాజకీయాలు మరోలా ఉండేవేమో? కానీ ఒకప్పుడు లక్ష్మణుడిలా తన వెన్నంటి సేవ చేసిన తమ్ముడితో చేతులు కలిపే బదులు అతని జనసేన పార్టీకి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేయడంతో ప్రజలు పూర్తిగా ఆయనకు దూరమయ్యారు.
రాజకీయాలపై ఎటువంటి అవగాహనలేకపోయినా చిరంజీవి కేంద్రమంత్రి స్థాయికి ఎదగగలిగారు. కానీ ప్రజాధారణ కోల్పోతే రాజకీయాలలో రాణించలేరనే సంగతి తెలుసుకొనేందుకు ఆయనకి చాలా కాలమే పట్టింది. ఒకప్పుడు రాజకీయ ఆరంగ్రేటం చేయడానికి అభిమానుల భరోసాయే కారణం. ఇప్పుడు మళ్ళీ తన ప్రతిష్టని పునరుద్దరించుకోవడానికీ మళ్ళీ ఆయనకి వారి సహాయసహకారాలే అవసరమయ్యాయి.
ఆయన ఇంతకాలం తన అభిమానులతో ఎలా వ్యవహరించినప్పటికీ, వారు మాత్రం మళ్ళీ ఆయనకు అండగా నిలబడేందుకు సిద్దమయ్యారు. ఆయనకు సోషల్ నెట్ వర్క్ సైట్ల ద్వారా మద్దతు కూడగట్టి ఆయన పుట్టిన రోజునాడు పెద్ద ఎత్తున సమాజసేవా కార్యక్రమాలు చేయాలని నిశ్చయించుకొన్నట్లు తెలుస్తోంది. ఆయన కూడా పోయిన చోటే ఉంగరం వెతుక్కోవాలన్నట్లు రాజకీయాలలో చేరిన తరువాత తను దూరం చేసుకొన్న అభిమానులను, పోగొట్టుకొన్న ప్రతిష్టను మళ్ళీ సినీపరిశ్రమ ద్వారానే పొందాలనుకొంటున్నారు.
అయితే ఒక రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల కోసం పార్లమెంటులో మాట్లాడాలనే చిన్న విషయం విస్మరించి, సినిమాల ద్వారా ప్రజలను మెప్పించాలనుకోవడం చాలా హాస్యాస్పదం. రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించవలసిన తరుణంలో ఆయన తన భవిష్యత్ గురించి ఆలోచించడమే కాకుండా అందుకు తను ఒకనాడు దూరంగా ఉంచిన అభిమానుల సహాకారం కూడా కోరుతున్నారు. ఆయన సినిమాలలో ఉన్నప్పుడు వేసుకొన్న మేకప్ రాజకీయాలలోకి వచ్చిన తరువాత పూర్తిగా తొలగిపోవడంతో ఆయన అసలు వ్యక్తిత్వం ఎటువంటిదో అర్ధం చేసుకొనే అవకాశం ప్రజలకి దక్కింది. మళ్ళీ ఇప్పుడు ఆయన మేకప్ వేసుకొని ప్రజలను మెప్పించేందుకు వస్తున్నారు.