మోదీతో సఖ్యం.. షాతో సమరం.. కేసీఆర్ వ్యూహం!
posted on May 26, 2017 @ 10:06AM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్ని కలిశారు. అదీ అత్యవసరంగా. ఎందుకు? ముస్లిమ్ లకు, ఎస్టీలకు ప్రత్యేక రిజర్వేషన్ల కోసం టీ అసెంబ్లీ పాస్ చేసిన బిల్లును కేంద్రానికి పంపాలని ఆయన కోరారు. కాని, గవర్నర్ ని కలిసిన కేసీఆర్ మాటలు వింటే మనకు చాలా తత్వమే బోధపడుతుంది. కేంద్రంతో, బీజేపితో ఆయన ఇప్పుడప్పుడే ఏ విధంగానూ కిరికిరి వద్దనుకుంటున్నారని ఇట్టే చెప్పేయోచ్చు. అందుకే, అమిత్ షా పై అమితమైన కోపం ప్రదర్శిస్తూ మోదీని మాత్రం ఫుల్లుగా ఆమోదిస్తున్నారు. ఏక కాలంలో కాషాయదళానికి అనుకూలంగా, వ్యతిరేకంగా వెరైటీ రాజకీయం చేస్తున్నారు గులాబీ బాస్!
అమిత్ షా నల్గొండకు వచ్చి సభలు పెట్టి హడావిడి చేసేదాకా కేసీఆర్ అసలు ఆ సంగతి పట్టించుకున్నటే కనిపించలేదు. ఇతర టీఆర్ఎస్ లీడర్లు కూడా తీవ్రంగా ఏం స్పందించలేదు. కాని, ఒక్కసారి షా వచ్చి నల్గొండలో కాలుమోపాక సీన్ మారిపోయింది. అసలు అమిత్ షా తెలంగాణ పర్యటన మొత్తం హైద్రాబాద్ కి కాక నల్గొండకి ఎందుకు పరిమితం చేశారు? మరెక్కడా వుండకుండా పూర్తిగా ఒకే జిల్లాలో ఎందుకు వున్నారు? ఈ ప్రశ్నలకి సమాధానంగా కొంత మంది నల్గొండలో భారీగా వలసలు వుండబోతున్నాయని అంటున్నారు. ఎప్పుట్నుంచో వినిపిస్తోన్న కోమటిరెడ్డి బ్రదర్స్ మొదలు చాలా మంది కాషాయ కండువాలు కప్పుకోనున్నారట. 2019కి ప్రిపరేషన్లో భాగంగా నల్గొండ నుంచీ వేట మొదలుపెట్టాలని బీజేపి భావిస్తోంది!
బీజేపి టార్గెట్ తెలంగాణ వ్యూహంపై ఎంత వరకూ క్లారిటీకి వచ్చారో మనకు తెలియదుగాని… కేసీఆర్ అమిత్ షాని బాగానే టార్గెట్ చేశారు. లక్ష కోట్ల విషయంలో రాజీనామా చేస్తానంటూ సవాల్ కూడా విసిరారు. అయితే, అదే సమయంలో తనని ఏమన్నా ఫర్వాలేదు తెలంగాణను అవమానించవద్దంటూ కామెంట్ చేశారు! అమిత్ షా ఎక్కడా యాంటీ తెలంగాణ కామెంట్స్ చేయలేదు. కాని, కేసీఆర్ మాత్రం తన బ్రహ్మాస్త్రామైన తెలంగాణ సెంటిమెంట్ను ప్రయోగించారు? ఇదంతా ఆయనలోని టెన్షన్ ను చూపిస్తోందంటున్నారు బీజేపి అభిమానులు,కార్యకర్తలు. ఎన్నికల లోపు బీజేపి భారీగా బలపడే సూచనలు వున్నట్టు కేసీఆర్ గ్రహించారని వారంటున్నారు!
బీజేపి వాళ్లు షా ఇచ్చిన జోష్ లో కేసీఆర్ తమ పార్టీని చూసి భయపడుతున్నారని అనవచ్చు. కాని, నిజంగా టీఆర్ఎస్ కు బీజేపి గండం వుందా? అలాంటిదేం లేదనదే ప్రస్తుతానికి వున్న పరిస్థితి. కాని, ముందు ముందు వార్ మొత్తం గులాబీ, కమలం మధ్యే వుండేలా వుంది. అమిత్ షాకు కావాల్సింది కూడా అదే! కాని, కేసీఆర్ వద్దనుకంటోందీ అదే! కేంద్రంలో అధికారంలో లేని రాహుల్ నేతృత్వంలో నడుస్తోన్న కాంగ్రెస్ ఢీకొట్టడం టీఆర్ఎస్ కు సులువు. అలా కాకుండా దిల్లీని బిగించి పట్టిన మోదీ సారథ్యంలో , వరుసగా రాష్ట్రాల్ని కొల్లగొడుతోన్న షా నేతృత్వంలో… ఎదురులేకుండా దూసుకుపోతోన్న బీజేపిని నియంత్రించాలంటే కష్టం! అసాధ్యమేం కాదు.
అందుకే, గవర్నర్ ని కలిసిన కేసీఆర్, షా పద్ధతేం బాగాలేదని నిరసన వ్యక్తం చేస్తూనే తాము నోట్ల రద్దు లాంటి నిర్ణయాలకు కూడా అండగా నిలిచామని, మోదీకి నైతిక మద్దతిస్తూ వస్తున్నామని చెప్పారు. పనిలో పనిగా తమని నానా మాటలు అన్న బీజేపి వారు… త్వరలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవర్ని నిలబెడితే వారికి మద్దతంటూ సంకేతాలిచ్చారు! ఇది ఖచ్చితంగా బీజేపితో ఫుల్ టైం వార్ కోరుకునే నేతలు చేసే పనైతే కాదు! మమత, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ లాంటి వారి మాదిరిగా ఏటికి ఎదురీదాలని కేసీఆర్ భావించటం లేదు. తప్పనిసరైతే తప్ప కమలంతో కదనం చేయవద్దనేది ఆయన వ్యూహంలా కనిపిస్తోంది!