రజినీకి బీజేపిలో చేరోద్దని సలహా ఇస్తోన్న బీజేపి ఎంపీ!
posted on May 26, 2017 @ 10:31AM
రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తాడా? ఎన్నో ఏళ్లు ఈ ప్రశ్న జనాల్ని వేదించింది. ఇప్పుడు దాదాపుగా అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. రజినీ రాజకీయాల్లోకి వస్తాడు! అయితే, ఇప్పుడు మరో మిలియన్ డాలర్ ప్రశ్న అందరి మనసుల్నీ తొలిచేస్తోంది. తలైవా స్వంత పార్టీ పెడతాడా? లేదా మన బాబా… కాషాయం కప్పుకుంటాడా? కాని, ఇంకా సూపర్ స్టార్ నుంచి మాత్రం ఎలాంటి రిప్లై రావటం లేదు. దిల్లీకి వెళ్లి ఇండియన్ పొలిటికల్ సూపర్ స్టార్ మోదీని కలిశాక ఆయన ఏమైనా చెప్పవచ్చు. కాని, అంతలోనే జరగాల్సిన హంగామా జరిగిపోతోంది! మరీ ముఖ్యంగా సినిమా వాళ్లు రజినీ రాజకీయ ఎంట్రీ ఎగ్జైట్మెంట్ అస్సలు ఆపుకోలేకపోతున్నారు!
బీజేపి నాయకులు పై నుంచి కింద దాకా… పడయప్పని తమ పార్టీలోకి తెచ్చేందుకు నానా తంటాలు పడుతున్నారు. అమిత్ షా లాంటి అగ్రనేతలు పరోక్షంగా స్వాగతం పలుకుతుంటే తమిళనాడు నుంచి కేంద్ర కేబినేట్ లో వున్న బీజేపి నేత పొన్ రాధకృష్ణన్ లాంటి వారు నేరుగానే వెల్ కమ్ చెప్పేస్తున్నారు. ఆయన ఈ మధ్యే రజినీకాంత్ బీజేపిలోకి వస్తే తమిళనాడు సీఎం అవ్వటం గ్యారెంటీ అనేశారు! ఇక పొలిటీషన్స్ సంగతి ఎలా వున్నా సినిమా వాళ్లు మాత్రం … తమ శివాజీ, ది బాస్ నిర్ణయం కోసం అల్లాడిపోతున్నారు. ముత్తుతో ఒకప్పుడు ఆన్ స్క్రిన్ రొమాన్స్ చేసిన ముద్దుగుమ్మ మీనా తాను ఆల్రెడీ రజినీ టీమ్ అని చెప్పేసింది. ఆయన పార్టీ పెట్టినా, బీజేపీలో చేరినా తాను ఆయన వెంటేనని తేల్చేసింది. తమిళ భక్తుల చేత గుడి కట్టించుకున్న గుజరాతి భామ నమిత కూడా రజినీకాంత్ కి తన గ్లామర్ తో పూర్తిగా సాయం చేస్తానని ప్రకటించింది. మీనా లాగే నమిత కూడా తలైవా వెంట ఎట్ ఎనీ కాస్ట్ వుంటానని శపథం చేసింది!
మీనా , నమితా లాంటి వారు రజీనికాంత్ అండతో రాజీకాయాల్లోకి వద్దామని ఆరాటపడుతోంటే… వయస్సులో, ఇండస్ట్రీలో, పాలిటిక్స్ లో అన్నిట్లో సీనియర్ అయిన శత్రుఘ్న సిన్హా మాత్రం వివాదాస్పదమైన సలహా ఇచ్చాడు సూపర్ స్టార్ కి! ఆ మధ్య వచ్చిన లింగాలో తన కూతురు సోనాక్షితో కలిసి నటించిన రజినీకి తమిళనాడులో వున్న క్రేజ్ ఏంటో ఆయనకు బాగా తెలుసు. అందుకే, తలైవాని టైటానిక్ ఆఫ్ తమిళనాడు అన్నాడు ట్వీట్స్ లో! అక్కడితో ఆగకుండా శత్రుఘ్న సిన్హా రాజకీయాల్లోకి రావటానికి ఇదే సరైన సమయం అన్నాడు. కాని, అసలు ట్విస్ట్ వెంటనే ఇస్తూ… బీజేపి టికెట్ మీద ఎంపీగా గెలిచిన ఆయన… రజినీకాంత్ ని స్వంత పార్టీ పెట్టుకొమ్మన్నాడు! ఒకవైపు కమలదళం నేతలు అందరూ నరసింహని తమ టీమ్ లో చేర్చుకోవాలని తలకిందులు తపస్సు చేస్తుంటే ఆయన ఎందుకు అలా అని వుంటాడు? ఖచ్చితంగా రజినీ క్షేమం కోరి మాత్రం కాదని విమర్శిస్తున్నారు మోదీ భక్తులు!
అద్వానీ, వాజ్ పేయ్ టైంలో ఒక వెలుగు వెలిగిన శత్రుఘ్న సిన్హా మోదీ, అమిత్ షాల కాలంలో పూర్తిగా ఆరటిపండు అయిపోయాడు. ఆయన్ని పెద్దగా పట్టించుకోవటం లేదు. మోదీ వ్యతిరేక, బీజేపి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తుండటమే కారణం. మొన్నటికి మొన్న ఆయన లాలుని, నితీష్ ని, అరవింద్ కేజ్రీవాల్ ని కూడా పొగిడాడు! ఆ మధ్య బీహార్లో బీజేపి ఓడిపోతే కూడా మోదీ, షా ద్వయంపై ఒంటికాలు మీద లేచాడు! ఇదంతా తనని పక్కకు పెట్టినందుకే అనేది పబ్లిక్ సీక్రెట్! ఇప్పుడు ఇక రజినీకాంత్ ని కూడా తన పార్టీలోకి రావద్దంటూ ఇండైరెక్ట్ గా బీజేపిలోకి వస్తే అంతే సంగతులు అంటూ హింట్ ఇచ్చాడు!
శత్రుఘ్న సిన్హా చెప్పినందుకు కాదు గాని… రజినీ తన స్వంత పార్టీ పెట్టే ఛాన్సులే ఎక్కువని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉత్తరాది పార్టీ అని ఆరోపణలు ఎదుర్కొనే కమలదళంలో చేరితే ఎంతో కొంత డ్యామేజ్ సూపర్ స్టార్ కి తప్పదు. అదే స్వంత కుంపటి పెట్టి కమలంతో దోస్తీ చేస్తే బెటర్ రిజల్ట్స్ వుంటాయి. అందుకే, ఆల్రెడీ పార్టీ జెండా, ఎజెండా రెడీ చేసే పని కూడా స్టారైందని తమిళ మీడియా చెబుతోంది!