ఆ ‘రెండే’ వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అధికారం నిలబెట్టేవి
posted on May 30, 2017 @ 11:05AM
మహానాడు ముగిసింది. తెలుగు దేశం పార్టీ మహా సంబరం కూడా అయిపోయింది. యధావిధిగా ఘుమఘుమలాడే వంటకాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. కాని, అదే రేంజ్లో ఘాటైన రాజకీయ ఉపన్యాసాలు చెవిన పడలేదని కొందరు బాధపడ్డారు. అయితే, టీడీపీ అభిమానులు మాత్రం మహానాడు ఘనంగా ముగియటంతో హ్యాపీగా ఫీలయ్యారనే చెప్పాలి. కాకపోతే, అధికారంలోకి వచ్చిన మూడో ఏడు నడుస్తున్న ఈ కీలక సమయంలో జరిగిన మహానాడు సారాంశం ఏంటి?
మహానాడులో బోలెడు మాటలు, ఇంకా చాలా తీర్మానాలు వినిపించి వుండవచ్చు. కాని, మొత్తం సంబరం అంతా ఒక్క వాఖ్యంలో మాట్లాడేసుకోవాలంటే… అది చంద్రబాబు చెప్పిన ‘’ అమరావతి, పోలవరం … రెండు నాకు రెండు కళ్లు! ‘’ అన్నది. ఈ ఒక్క స్టేట్మెంట్ వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశానికి మళ్లీ అధికారం ఎలా వస్తుందో చెప్పగలదు. అదే సమయంలో ఏ అంశాలు నిర్లక్ష్యం చేస్తే జనం మనసులో మార్పు ఆలోచన చోటు చేసుకుంటుందో ఆ రహస్యం కూడా అందులోనే దాగుంది!
నవ్యాంధ్రగా ఏర్పడ్డ ఏపీ ఇప్పుడు అస్థిత్వ పోరాటంలో వుంది. అసెంబ్లీ, సెక్రటేరియట్ కూడా లేని స్థితిలో సరికొత్త ప్రస్థానం మొదలు పెట్టాల్సి వచ్చింది. అందుకు కారణమైన జాతీయ కాంగ్రెస్ ను ఆంధ్రా ప్రజలు సున్నా సీట్లతో కోలుకోలేని విధంగా శిక్షించారు. అదే సమయంలో నవ్యాంధ్రకు నవ్యమైన ఆత్మవిశ్వాసం కలిగించే గొప్ప బాధ్యత కూడా అనుభవం, దూరదృష్టీ వున్న చంద్రబాబుపై పెట్టారు. జగన్ని కాదని అధికారం ఇచ్చారు. అందుకే, అమరావతి తన రెండు ప్రాధాన్యాల్లో ఒకటని చెప్పారు బాబు. అయితే, కేవలం ఒక రాజధాని నిర్మాణం మాత్రమే అమరావతి అనిపించుకోదు. అమరావతి రూపంలో ఆంధ్రులకి ఎంతో అవసరమైన అవకాశల వెల్లువ మొదలవ్వాలి. అదంత తేలికైన విషయం కాకున్నా పని చేసే సత్తా వున్న ప్రతీవారికీ ఉద్యగం ఇప్పించగలగటమే సీఎంకు అతి పెద్ద సవాల్! ఆ ఛాలెంజ్ కాని సమర్థంగా ఎదుర్కొంటే రానున్న ఎన్నికలు నల్లేరు పై నడకే!
చదువుకున్న యువత ఉద్యోగం కోరితే రైతులు కన్నీరు తుడిచే సాగునీరు కోరతారు. అందుకే, చంద్రబాబు పోలవరం కూడా ప్రస్తావించారు. ఒక్క పోలవరం పూర్తైతే యావత్ ఆంధ్ర రాష్టం స్థితి, గతే మారుతుంది. ఇది అందరూ ఒప్పుకునేదే. సాగునీరు, తాగు నీరు రెండూ జనానికి అంది సస్యశ్యామలం అవుతుంది తెలుగు నేల. కరువు రహిత రాష్ట్రం కూడా అవుతుంది. కాని, పోలవరం పూర్తి అసాధ్యం కాకపోయినా అసాధారణ విషయమే. చంద్రబాబు ఎంతో పట్టుదలతో భగరీథ ప్రయత్నం చేస్తే తప్ప అది సాకారం కాదు. కాని, ఒక్కసారి పోలవరం పూర్తి అయితే మాత్రం అది టీడీపీకి ఖచ్చితంగా పెద్ద వరమే అవుతుంది!
సీఎం చంద్రబాబు మహానాడులో చెప్పినట్టు వచ్చే ఎన్నికల లోపు అమరావతి, పోలవరం ఎంత వరకూ సాకారం అవుతాయో తెలియదుగాని … ఆయన కార్యదక్షతతో వాటిని నిర్మిస్తే మాత్రం సరికొత్త ఆంధ్ర రాష్ట్రం నిర్మాణం జరిగినట్టే! అలాగే, తెలుగు దేశం కూడా మరిన్నేళ్లు తెలుగు దేశానిదే!