మదీనాలో ఘోర బస్సు ప్రమాదం.. 42 మంది సజీవదహనం
posted on Nov 17, 2025 8:59AM
మృతులంతా ఇండియన్సే
అత్యధికులు హైదరాబాదీయులే
సౌదీలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 42 మంది సజీవదహనమయ్యారు. మృతులంతా భారతీయులే. మరణించిన వారిలో అత్యధికులు హైదరాబాద్ వాసులని తెలుస్తోంది. మక్కా నుంచి మదీనాకు భారతీయ యాత్రికులతో వెడుతున్న బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
మక్కాలో ఉమ్రా యాత్రను ముగించుకుని మదీనాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో వారు గాఢ నిద్రలో ఉన్నారు. మక్కా నుండి మదీనాకు భారతీయ యాత్రికులను తీసుకెళ్తుండగా బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. సోమవారం (నవంబర్ 17) తెల్లవారు జామున ఈ ఘోర దుర్ఘటన సంభవించింది. మృతులలో 11 మహిళలు, 10 మంది పిల్లలూ ఉన్నారని తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయ కార్యక్రమాలను చేపట్టారు. ఆయిల్ ట్యాంకర్ ను ఢీ కొనడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. మృతదేహాలను గుర్తించడం కూడా కష్టంగా మారింది.
సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
సౌదీ అరేబియాలో భారతీయ యాత్రికులతో ఉన్న బస్సు ఘోర ప్రమాదానికి గురై పలువురు మరణించడం పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులలో అత్యధికులు హైదరాబాద్ వాసులు ఉండటంతో వెంటనే పూర్తి వివరాలు తెలుసుకోవాలని డీజీపీని ఆదేశించారు. కేంద్ర విదేశాంగ శాఖ, సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడి సహాయక చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
సీఎం అదేశాలతో సీఎస్ రామకృష్ణారావు ఢిల్లీ లో ఉన్న కోఆర్డినేషన్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్ ను అప్రమత్తం చేశారు. ప్రమాదం లో తెలంగాణకు చెందిన వారు ఎంత మంది ఉన్నారనే వివరాలు సేకరించి వెంటనే అందించాలని అదేశించారు. కాగా ఈ ప్రమాద ఘటనకు సంబంధించి సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.