తెలుగు వారికి కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు ఆయన : సీఎం చంద్రబాబు

posted on: Dec 15, 2025 8:21PM

 

తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టిశ్రీరాములు ఆత్మార్పణ దినాన్ని ఇకపై అధికారికంగా 'డే ఆఫ్ శాక్రిఫైస్' (త్యాగాల దినం)గా  నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు  ప్రకటించారు. ఆయన త్యాగానికి గుర్తుగా రాజధాని అమరావతిలో ‘స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్’ నిర్మిస్తామని వెల్లడించారు. 

సోమవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన పొట్టిశ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పొట్టిశ్రీరాములు కుటుంబ సభ్యులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, “బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం, ఆ తరువాత తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పోరాడిన మహనీయుడు పొట్టిశ్రీరాములు అని ముఖ్యమంత్రి అన్నారు.

 పాలకుల వివక్షకు గురైన తెలుగు జాతికి ప్రత్యేక రాష్ట్రం సాధించేందుకు 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించారు. ఆయన త్యాగ ఫలితంగానే 1953 అక్టోబర్‌ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం, 1956 నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాయి. కొందరు ఈ తేదీలపై అనవసర రాజకీయాలు చేస్తున్నందునే, ఆయన ఆత్మార్పణ చేసిన రోజునే త్యాగాలకు గుర్తుగా నిర్వహించాలని నిర్ణయించాం” అని స్పష్టం చేశారు. పొట్టిశ్రీరాములు ఏ ఒక్క కులానికి చెందిన వ్యక్తి కాదని, యావత్ తెలుగు ప్రజల ఆస్తి, గుండె చప్పుడు అని ఆయన కొనియాడారు.


 

google-ad-img
    Related Sigment News
    • Loading...