హిజ్రాలు బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు : సీపీ సజ్జనర్
posted on Dec 15, 2025 @ 6:45PM
ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ట్రాన్స్‌జెండర్ల ను హెచ్చరించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండి, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని సిపి వారికి సూచించారు.
హైదరాబాద్ అమీర్‌పేటలోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ ఆడిటోరియంలో హైదరాబాద్ సిటీ పోలీసులు ట్రాన్స్‌జెండర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్ నగర సీపీ సజ్జనర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఐడీ, మహిళా భద్రతా విభాగ అదనపు డీజీపీ చారు సిన్హా, ఐపీఎస్ పాల్గొని ట్రాన్స్ జెండర్లతో నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ సజ్జనర్ మాట్లాడుతూ... ట్రాన్స్‌జెండర్ల మధ్య తరచూ చోటుచేసుకునే గ్రూప్ తగాదాలు, ఆధిపత్య పోరు శాంతిభద్రతలకు భంగం కలిగిస్తూ ప్రాణనష్టానికి దారితీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ట్రాన్స్‌జెండర్లపై ప్రజల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు పెరిగాయని తెలిపారు.ముఖ్యంగా
“శుభకార్యాల పేరుతో ఇళ్లపైకి వెళ్లి యజమా నులను వేధించడం సరికాదు. ఇలాంటి బలవంతపు వసూళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎంతటి వారినైనా కటకటాల వెనక్కి పంపిస్తాం. మీపై నమోదయ్యే కేసులు మీ భవిష్యత్తును నాశనం చేస్తాయి. అమాయక ప్రజలను ఇబ్బంది పెడితే జైలు శిక్షలు తప్పవు,” అంటూ సిపి సజ్జనార్ హెచ్చరించారు.
ట్రాన్స్‌జెండర్ల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సీపీ గుర్తు చేశారు. వారి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని త్వరలోనే సమగ్ర పాలసీ తీసుకురానున్నట్లు తెలిపారు. పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ట్రాన్స్‌జెండర్లకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో అదనపు డీజీపీ సిన్హా మాట్లాడుతూ.... ట్రాన్స్‌జెండర్ల సమస్యల పరిష్కారానికే మహిళా భద్రతా విభాగంలో ‘ప్రైడ్ ప్లేస్’ అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎవరి నుంచి వేధింపులు ఎదురైనా నిర్భయంగా ఈ వింగ్‌ను సంప్రదించవచ్చని ఆమె పేర్కొన్నారు.
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండి సమాజంలో హుందాగా జీవించాలని సూచించారు.హైదరాబాద్ జిల్లా ట్రాన్స్‌జెండర్ సంక్షేమ అదనపు డైరెక్టర్ రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణలో దాదాపు 50 వేల మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు పొందాలంటే కేంద్ర ప్రభుత్వం జారీ చేసే గుర్తింపు కార్డులు తప్పని సరిగా పొందాలని సూచించారు. ట్రాన్స్‌జెండర్లకు కార్పొరేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో జాయింట్ సీపీ లా అండ్ ఆర్డర్ తఫ్సీర్ ఇకబాల్, ఐపీఎస్, నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్, ఐపీఎస్, వెస్ట్ జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్, మహిళా భద్రతా విభాగ డీసీపీ లావణ్య నాయక్ జాదవ్, సైబరాబాద్ డీసీపీ సృజన, తదితర ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు మరియు అధికారులు పాల్గొన్నారు.