పాతబస్తీలో మత్తు ఇంజక్షన్ల దందా.. ముగ్గురు యువకుల మృతి
posted on Dec 15, 2025 @ 5:54PM
పాతబస్తీలో మత్తు ఇంజక్షన్ల అక్రమ దందా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. చాలామంది యువకులు అనస్థీషియా డ్రగ్స్‌ను మత్తుగా వినియో గిస్తున్న ఘటనలు పెరుగు తుండటంతో పోలీసులు ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే అనస్థీషియా మత్తు ఇంజక్షన్లు తీసుకున్న ముగ్గురు యువకులు మృతి చెందినట్లు పోలీసులు అధికారికంగా వెల్లడించారు. మత్తు ఇంజక్షన్ల ఓవర్‌డోస్ కారణంగానే ఈ మరణాలు సంభవించాయని పోలీసులు స్పష్టం వ్యక్తం చేశారు.
డబ్బుల కక్కుర్తితో కొందరు డాక్టర్లు అనస్థీషియా మత్తు ఇంజక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ఒక్కో ఇంజక్షన్‌ను వెయ్యి రూపాయల చొప్పున యువకులు కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. ఆటో డ్రైవర్లు, విద్యార్థులు ఎక్కువగా ఈ మత్తు ఇంజక్షన్లను కొనుగోలు చేసి వినియోగిస్తున్నారని అధికారులు గుర్తించారు.
ఈ అక్రమ దందా వ్యవహా రాన్ని పోలీసులు నిర్వహిం చిన ప్రత్యేక ఆపరేషన్‌లో వెలుగులోకి వచ్చింది. మత్తు ఇంజక్షన్లు తీసుకుంటూ పలువురు యువకులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. పోలీసులు, డ్రగ్ కంట్రోల్ అధికారులతో కలిసి నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో ఈ మత్తు మందుల నెట్‌వర్క్‌ను ఛేదించారు.ఈ కేసులో ఇప్పటికే అనస్థీషియా డ్రగ్స్ ఇంజక్షన్లు విక్రయిస్తున్న ఇద్దరు డాక్టర్లు, నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
మత్తు ఇంజక్షన్ల సరఫరా వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు ఎవరు, ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ముఖ్యంగా పాతబస్తీలో ఈ దందా జోరుగా సాగుతుందని... మత్తు ఇంజక్షన్ల దందాను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఏది ఏమైనప్పటికి ఈ మత్తు ఇంజక్షన్ల అధిక మోతాదులో తీసుకోని ముగ్గురు యువకులు మృత్యువాత పడడంతో ఆ కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి...ఈ ఘటనపై సీరియస్ అయినా పోలీసులు డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి... నిందితు లను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.