కన్హా శాంతివనాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు
posted on Dec 15, 2025 @ 7:15PM
సీఎం చంద్రబాబు హైదరాబాద్ నగర శివార్లలోని ఆధ్యాత్మిక కేంద్రమైన కన్హా శాంతివనం ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కన్హా ధ్యానమందిరం అధ్యక్షులు దాజీతో కలిసి దాదాపు నాలుగు గంటల పాటు ఆశ్రమాన్ని సందర్శించారు. కన్హాశాంతి వనంలో ఆధ్యాత్మిక, పర్యావరణ, విద్య, ఆరోగ్యపరమైన సదుపాయాలను గురించి సీఎంకు దాజీ వివరించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరం, వెల్‌నెస్ సెంటర్, యోగా సదుపాయాలు, హార్ట్‌ఫుల్నెస్ ఇంటర్నేషనల్ స్కూల్, పుల్లెల గోపీచంద్ అంతర్జాతీయ శిక్షణ అకాడమీని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పరిశీలించారు. అదే విధంగా చెట్ల సంరక్షణ కేంద్రం, వర్షపు నీటి సంరక్షణ, వ్యవసాయ క్షేత్రాలను కూడా చంద్రబాబు సందర్శించారు. ధ్యాన మందిరం సందర్శన అనంతరం దాని రూపకల్పన, సామర్థ్యం, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి సీఎం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దాజీ నివాసానికి వెళ్లిన చంద్రబాబు దేశ విదేశాల్లో ఆశ్రమం ద్వారా అందుతోన్న సేవలు, నిర్వహిస్తున్న కార్యకలాపాలను గురించి తెలుసుకున్నారు.