కర్రాబిళ్ళా (బిళ్ళంగోడు) ఆటకూడా పిల్లలు వీధుల్లో ఆడేవాళ్ళు. ఏ కారణంచేతో సుందరానికి ఈ ఆట కాస్త బాగానే వచ్చేది. ఇందులో వాడు "అవుటు" కాకుండా తప్పించుకునేవాడు.
రాఘవాయిని గురించి సుందరానికి ఆటలవిషయంలో చాలా గొప్ప అభిప్రాయం ఉండేది. కాని చదువు విషయంలో వాడు వఠ్ఠిమొద్దని తెలుసుకుని ఆశ్చర్యపడ్డాడు.
"నాకు చదువురాదు. పాఠం చదువుతా, అంతా వప్పజెప్పుతా వప్పజెప్పిన తరువాత ఒక్కమాట జ్ఞాపకం ఉండదు... నా కసలు చదువక్కర్లా.... ఏమోయ్? ఏం, చదువులేకపోతే?" అనేవాడు రాఘవాయి,చదువు రానందుకు గర్వించేవాడల్లే. వాడికి చదువు రాకపోవటమూ, రానందుకు వాడు విచారించక పోవటమూ కూడా సుందరానికి విడ్డూరంగానే కనిపించేవి. కాని, ఈ చదువురాని రాఘవాయి పక్కనఉంటే సుందరానికి ఎంతో ధైర్యంగా ఉండేది; ఎక్కడికైనా ఏ ఆటకైనా ఉపక్రమించేవాడు సుందరం__ రాఘవాయి అండ చూసుకుని.
సుందరం అప్పుడప్పుడూ తన కొత్త స్నేహితులతో కలసి రైలుకట్టుకు షికారు వెళ్ళేవాడు. దారిలో మామిడి పిందెలు దొంగతనం చేసేవాళ్ళు. సుందరానికది తప్పల్లే తోచేదికాదు; అల్లరల్లేనూ, సరదాగానూ ఉండేది. రైలు వచ్చేసమయానికి పట్టాలమీద చిన్నచిన్న కంకరరాళ్ళూ అవీ పెట్టేవాళ్ళు. ఒకసారి ఒకడు కానీకూడా పెట్టాడు. కంకరరాళ్ళు రైలుకింద నలిగి మెత్తగా, తెల్లని పిండి అయేవి. "వీభూది " అని దాన్ని నలుగురూ మొహాలకు రాచుకునేవాళ్ళు. పొద్దూకి చీకటిపడి సుందరం ఇంటి కొచ్చేవాడు.
* * * *
సీతమ్మ మహాసముద్రంలో ఉన్నది. ఒకవంక మొగుడు పోయిన చింతా, వైధవ్యంమూలంగా ఎవరికీ మొహం కనిపించరాని పరిస్థితీ, చంటిపిల్లా, ఇతర ఆడతోడు లేకపోవటమూ, ఆవిడకు చాలా మనస్తాపం కలిగించాయి. పిల్లల చదువులు చెడతాయని శేషగిరిభార్య వెళ్ళిపోయింది. శేషగిరిమాత్రం మూడునెల్లు శలవుపెట్టి ఉండి పోయినాడు.
సీతమ్మకు రాగల కాలంగురించి అనేక దిగుళ్ళు. ఈ ఇద్దరు పిల్లలూ తన చేదిమీదిగా పెద్దవాళ్లై వాళ్ళ రెక్కలమీద వాళ్ళు ఆధారపడేరోజు రావాలి. శ్రీమన్నారాయణ మరణం మూలంగా కుటుంబం ఆర్దికంగా దెబ్బతిన్నది. ఆయన సంపాదన మూలంగానే ఇంతకాలమూ బెట్టుగా జరిగింది. పొలం ఉన్నదిగాని అది ఏ అయిదారేకారాలో ఉన్నది. దానిమీద రెండు మూడు వందలు మాత్రం వస్తుంది. ఉండటానికి ఇల్లున్నది.
"ఇకముందు ఈ సంసారం ఎట్లా ఈదుతాను? అన్ని ఖర్చులూ తగ్గించాలి 'పిల్లలిద్దరూ అమాయకులు కావటం చూసి ఆడముండ డబ్బు అలాములూ, పలాములూ చేసిందంటారు. ఆ మాట పడకుండా ఎట్లా నెగ్గుకొస్తానో" అన్నదావిడ శేషగిరితో.
"ఏం ఫరవాలేదు. వొట్టిపుణ్యానికి కంగారుపడకు. మీ ఇల్లు పెద్దభాగం అద్దెకిచ్చి చిన్నభాగంలో ఉండండి. ఎనిమిది పదిరూపాయలు అద్దెరావచ్చు. తూర్పుపక్క ఖాళీస్థలంలో చిన్న పాకా వేయిద్దాం. బోలెడంత చోటవుతుంది. బావపేర బాంకులో ఉన్న మూడొందల్లో ఉన్న బాకీలు తీర్చటానికి ఒక వంద తీద్దాం. మిగిలింది నీపేర ఉండనీ. ఎప్పటికైనా అవసరానికి అక్కరకొస్తుంది. ఏ నగలుచేసినా, నాణాలుచేసినా ఆ చంటి ముండకే కదా. అది పెద్దదయ్యేనాటికీ చూసుకోవచ్చు. నన్నడిగితే నీ నగలన్నీ అమ్మేసి, అదికూడా డబ్బు చేసి బాంకులో వేసుకో. లేదా ఎవరికైనా వడ్డీకిచ్చుకో. నన్ను ఇవ్వమంటే ఇచ్చేస్తాను. కళ్ళకద్దుకు తీసుకునే వాళ్ళున్నారు" అన్నాడు శేషగిరి.
"ఆయన ఎంత దర్జాగా బతికి, మమ్మల్ని ఎటువంటిస్థితిలో పెట్టిపోయినారో చూడు" అని సీతమ్మ ఏడిచింది.
శ్రీమన్నారాయణ బాగా ఖర్చుచేసి బాగా బతికినవాడు. నేతిగిన్నెలో గరిటె ఉండరాదు. చిన్నవిస్తట్లో అన్నంతినరాదు. పొట్టిపంచెలు కట్టరాదు."విస్తరిహీనం వస్రాహీనం పనికిరాదు" అనేవాడాయన. అందుకనే ఆయన సంపాదించిన సంపాదనకు తగ్గట్టుగా డబ్బు మిగలలేదు. అదే మరొకరయితే హాయిగా ఇంకో ఇల్లు కట్టించిఉందురు.
సీతమ్మ విచారాలలో సుందరాన్ని గురించిన విచారం ఒకటి అయింది. వాడు ఎక్కడెక్కడ తిరిగేదీ, ఏం చేసేదీ, ఆవిడకు తెలీదు అన్నం తినటానికిమాత్రం ఇంటికొచ్చేవాడు. ఒక్కోరాత్రి ఏడు, ఎనిమిదిన్నర దాటినతరువాత వచ్చేవాడు. ఆవిడ లెక్కప్రకారం ఇవి చెడిపోయే లక్షణాలు. ఒకరోజు సుందరం రైలుకట్టకు షికారుకెళ్ళి రాత్రి ఏడున్నరకు ఇంటికొచ్చాడు. సీతమ్మ వాణ్ణి గట్టిగా చివాట్లు పెట్టింది.
"నన్ను చాతగాని ముండనుచేసి నువ్వు ఏం తిరుగుళ్ళు తిరుగుతున్నావురా! పొద్దూకి ఇప్పుడు ఇంటికొస్తున్నావా!" అన్నదావిడ.
సుందరం తల్లి మాటలకూ, ధోరణికీ బిత్తరపోయినాడు. ఆవిడ ఆకారణంతో బాటు మాటలూ, మనస్సూ కూడా మారినట్టు వాడికి తోచింది.
"రైలుకట్టకు షికారెళ్ళానమ్మా!" అన్నాడు వాడు.
సీతమ్మ అంతరాత్మ చివుక్కుమన్నది. సుందరం ఇంట్లో ఎక్కువసేపు ఉండకపోయినా వాడిలో వెనక ఎన్నడూలేని ఉత్సాహమూ, పెరుగుదలా చూస్తున్నది. సీతమ్మ. సుందరం ఇప్పుడు వెనకటంత అమాయకుడిగా, అర్భకుడిగా లేడు. ఈ కొద్దిరోజుల్లేనే వాడిలో ఇంత మార్పు వచ్చింది. చచ్చిన తన భర్త అన్నమాటలు ఇప్పుడామెకు జ్ఞాపకం వచ్చాయి. "వాడికి చదువు తప్ప ఇంకేమీ లేకుండా చేస్తున్నావు. భద్రం. వాడు ఎందుకూ పనికి రాకుండా వాజ అయిపోతాడు.... ఆడది తిరిగి చెడిందట. మగవాడు తిరక్క చెడ్డాట్ట! వాణ్ణి ఇతర పిల్లలతో కలసి తిరగనీ, ఆడుకోనీ! నీ కొంగును కట్టేసుకోకు. వాడికి నీమీద ఆపేక్షఉంటే అది కొంగుకు కట్టేసుకు దక్కించలేవు. పెద్ద వాడవుతున్నకొద్దీ వాడు మారుతాడు. ఆ మార్పు అర్ధం చేసుకుంటుంటే నీకూవాడికీ ఉండే సంబంధం చెడకుండా ఉంటుంది" అని ఆయన తనతో అనేవాడు.
