Next Page 
వసుంధర కధలు -2 పేజి 1


                              అర్హతలేని అదృష్టం
                                                                     ---వసుంధర

                     


    ఆ యింట్లో ముగ్గురే వున్నారు, సీతారామయ్య, అతడి భార్య రుక్మిణి, కూతరు మనోరమ. తెల్లవారుఝామున నాలుగింటికి ఎవరో ఆ యింటి తలుపులు తడుతూంటే ముగ్గురికి ముగ్గురూ గాఢనిద్రలో వున్నారు. చివరకు మనోరమే లేచి కళ్ళు నులుముకుంటూ వెళ్ళి తలుపు తీసింది.
    ఒక యువకుడు విసుగ్గా లోపల ప్రవేశించి-"అవతల తెల్లారిపోతూంటే ఇంకా ఇంత నిద్రేమిటి?" అన్నాడు.
    "ఎవరైనా తెల్లవారుఝామునే మంచి నిద్రలో వుంటారు"-అంది మనోరమ ఇంకా కళ్ళు నులుము కుంటూనే.
    "పోనీ తలుపుతట్టిన అరగంటకైనా మెలకువరాదా?" అన్నాడా యువకుడు చిరాగ్గానూ. విసుగ్గానూ.
    అప్పటికి మనోరమకు కాస్త మత్తు విడినట్లుంది. అతడి వంక చూసి ఆశ్చర్యంగా-"ఎవరండీ మీరు?" అంది.
    ఇప్పుడాశ్చర్యపడడం ఆ యువకుడి వంతైంది-"నువ్వు నన్ను-ఎవరని అడుగుతున్నావా?" అన్నాడు.
    "ఇందులో ఆశ్చర్యమేముంది? మీరెవరో నాకు తెలియదు."
    "నేను నీ భర్తను. ఇప్పుడైనా గుర్తొచ్చిందా?" అన్నాడతడు.
    "మీ రెవర్నిచూసి ఎవరనుకుంటున్నారో-నాకింకా పెళ్ళికాలేదు...." అంది మనోరమ అతడినే పరీక్షగా గమనిస్తూ.
    "ఏమయింది నీకు అనూ?" అన్నాడా యువకుడు మళ్ళీ.
    "అనూ ఏమిటి-నా పేరు మనోరమ."
    "కాదు-నీపేరు అనూరాధ" అన్నాడతడు.
    "అయితే నీ పేరు విశ్వంగానీ కాదుకదా!" అంది మనోరమ చటుక్కున.
    "ఇంకేం-నన్ను గుర్తుపట్టావన్న మాట. కలికాలం ఇలా ఏడ్చింది-పుట్టింట్లో నాలుగురోజులుండేసరికి తాళికట్టిన భర్తల్నే మరిచిపోతున్నారు భార్యలు" అన్నాడు విశ్వం.
    అతడి మాటలు పట్టించుకోకుండా -"అక్కేదీ?" అంది మనోరమ.
    "అక్కెవరు?" అన్నాడు విశ్వం.
    "మా అక్కపేరు అనూరాధ. తననుకూడా తెస్తే తప్ప నువ్వు మా బావ వనడానికి సాక్ష్యంలేదు" అంది మనోరమ.
    "నాకు తెలిసిన అనూరాధవు నువ్వే!" అన్నాడు విశ్వం.
    మనోరమకు సిగ్గేసినట్లుంది. ఆమె అతడిని కూర్చోమని లోపలకు వెళ్ళి తల్లిదండ్రులను నిద్రలేపి విషయం చెప్పింది. వాళ్ళిద్దరూ ఒక్క ఉదుటున అతడిని చూడ్డానికి వచ్చారు. రుక్మిణి విశ్వాన్ని చూసి-"అల్లుడు బాగానే ఉన్నాడు" అని భర్త చెవిలో గుసగుస లాడింది. అది విశ్వం విన్నాడు.
    విశ్వం అత్తగారికీ మామగారికీ నమస్కరించి-"నేను అనూరాధను తీసుకెళ్ళాలని వచ్చాను" అన్నాడు.
    సీతారామయ్య తెల్లబోయి-"అనూరాధను తీసుకొని వెళ్ళడమేమిటి? అది నీ దగ్గరే వుందిగా" అన్నాడు.
    "ఎదురుగా అనూరాధ వుంటే-నా దగ్గర ఉందంటా రేమిటి?" అన్నాడు విశ్వం అదోలా.
    "ఇది అనూరాధకాదు. మనోరమ. నువ్వు పొరబడడంలో ఆశ్చర్యం లేదులే.....వాళ్ళిద్దరూ కవలపిల్లలు. ఇద్దరికీ తేడా మాకే తెలియదు" అన్నాడు సీతారామయ్య.
    అప్పుడు తెల్లబోవడం విశ్వం వంతయింది.
    తన ఊళ్ళో ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూండేది అనూరాధ. ఆమెనోసారి సినిమాహాలు దగ్గర చూసి ఆకర్షితుడయ్యాడతడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. అనూరాధ తల్లిదండ్రులకు విశ్వం ఉత్తరం రాశాడు. అందుకు చాలా కఠినంగా బదులిచ్చాడు సీతారామయ్య. ఆ  పెళ్ళి జరిగితే కూతురిముఖం చూడనన్నాడు. తనకు మైనారిటీ తీరింది కాబట్టి తల్లిదండ్రుల అనుమతి అవసరం లేదంది అనూరాధ. ఇద్దరూ ఆ ఊళ్ళోనే గుళ్ళో పెళ్ళి చేసుకున్నారు. విశ్వానికి తండ్రి లేడు. తల్లిమాత్రం ఆ వివాహాని కామోదించింది. ఇద్దరూ కాపురం పెట్టాక సీతరామయ్య కూతురి కుత్తరం రాశాడు. అయిందేదో కాబట్టి జరిగినవన్నీ మర్చిపోదామని ఆయన రాస్తే అనూరాధ పుట్టింటికి వెళ్ళింది.
    నేను దాని కుత్తరం రాసినమాట నిజం. కానీ అందుకది బదులుగా ఏం రాసిందో నువ్వే చూడు".....అంటూ సీతారామయ్య ఓ ఉత్తరం తెచ్చి విశ్వాని కందించాడు. విశ్వం అది చదువుకున్నాడు.
    "పగిలిన అద్దం విరిగిన మనసు-రెండూ అతుక్కోవు. ఇక మీకూ నాకూ ఏ సంబంధమూ లేదు."    
    రెండేరెండు వాక్యాలున్నాయందులో.
    "అయితే పుట్టింటికని బయల్దేరిన అనూరాధ ఏమైంది?" అన్నాడు విశ్వం.
    అందరూ ఒకరిముఖాలొకరు చూసుకున్నారు.

                                    2

    విశ్వం అత్తవారింట్లో రోజంతా గడిపాడు. అనూరాధ తీసుకొని వెళ్ళడం మరిచిపోయిందని అతడు పెళ్ళిఫోటోలు కూడా తెచ్చాడు. అవి చూసి రుక్మిణి యెంతో సంబరపడి-"ఆచ్చం పెళ్ళి చూస్తున్నట్లే వుంది. ఇవి మా కొదిలేసి వెడతావా?" అనడిగింది.
    "నాదగ్గర నెగెటివ్సున్నాయి. ప్రింటుతీసి పంపిస్తాను. కానీ అనూరాధ ఏమయిందీ అన్న విషయం ముందు తేలాలి" అన్నాడు విశ్వం.
    సీతారామయ్య కాసేపాలోచించి-"అనూరాధ నీ యింట్లోనే వుంది. అది మాకు కటువుగా ఉత్తరం రాసిందనీ నీకు తెలుసు. మాతో గొడవపడ్డం నీకిష్టం లేదు. అందుకని అది పుట్టింటికని బయల్దేరినట్లు మాకు అబద్ధం చెబుతున్నావు. నువ్వు మాకు పెళ్ళిఫోటోలు చూపించాలని వచ్చావు. అవునా?" అన్నాడు.
    "మీరేమంటున్నారో నాకర్ధం కావడంలేదు-" అన్నాడు విశ్వం.
    "నేనేమన్నప్పటికీ అనూరాధ క్షేమం కాంక్షించే వాడ్ని. అది మామీద ద్వేషంతో వున్నా నాకు బాధ లేదు. ఎక్కడో అక్కడ క్షేమంగా వుంటే చాలు. అందుకని నువ్విలాంటి అబద్ధాలు చెప్పకు. అందువల్ల మా మనసు క్షోభపడడం మినహాగా మరేమీ ప్రయోజన ముండదు" అన్నాడు సీతారామయ్య.
    "అనూరాధ ఇక్కడికే వచ్చిందని నా నమ్మకం."
    "వస్తే ఎక్కడుందంటావ్?"
    "తను నాకు మనోరమ అనే పేరుగల చెల్లెలుందని నాకు చెప్పలేదు."
    "పోనీ-తన చెల్లెలు పేరేమిటని చెప్పింది?"
    "అసలు తనకు చెల్లెలున్నట్లే చెప్పలేదు."
    "అయితే ఏమంటావ్?"
    "మీరు మనోరమ అంటున్నమ్మాయి అచ్చం నాభార్య అనూరాధలాగే వుంది.....ఆమే...."    
    సీతారామయ్య కళ్ళెర్రబడ్డాయి-"ఏం-కవల పిల్లలు గదా అని అక్కా చెల్లెళ్ళిద్దరితోనూ కాపురం చేద్దామను కొంటున్నావా-ఇలాంటి వేషాలు నా దగ్గర కుదరవు.." అన్నాడు తీవ్రంగా.
    సీతారామయ్య స్వరం మారగానే విశ్వం తడబడ్డాడు-"అబ్బే-నా ఉద్దేశ్యమదికాదు...." అన్నాడు.
    "నీ ఉద్దేశ్యమేమైనా-నా రెండో కూతురి జోలికి రాకు. దానికి సంబంధంకూడా నిశ్చయమైంది. కుర్రాడు బుద్ధిమంతుడు మంచి ఉద్యోగంలో వున్నాడు. పెద్ధమ్మాయి చేసిన పనికి-దీనికి పెళ్ళి సంబంధం కుదిర్చేదెలాగా అని బెంగపెట్టుకున్నాను. కానీ అదృష్టవశాత్తూ ఇదెలాగో కుదిరింది. దయుంచి ఈ సంబంధం చెడగొట్టకు...." అన్నాడు సీతారామయ్య.


Next Page 

WRITERS
PUBLICATIONS