Previous Page Next Page 
చదువు పేజి 17

   

   "వీళ్ళంతా ఏడవడం మానేస్తే బాగుండును... అమ్మ ఎందుకట్లా గొంతుచించుకు ఏడుస్తుంది? ఆవిణ్ణి చూసి అందరూ ఏమనుకుంటారు? నవ్వుకుంటారేమో!"  అనుకున్నాడు సుందరం.

    వాడికి ఉత్సాహం కలిగింనవాడు వాడి మేనమామ శేషగిరి ఒకడే. ఆయన భార్య బిడ్డలతోసహా  దిగేట్టప్పటికి అప్పుడే శ్రీమన్నారాయణ పోయినాడు. ఆయన వస్తూనే జరగవలసిన కర్మకాండలో పడ్డాడు.......

    తన తండ్రి చచ్చిపోయాడన్న విషయాన్ని ఒకసారి ఆమోదించిన తరువాత సుందరం మనసులో ఎటువంటి వైకల్యమూ లేదు. పిల్లలు సాధారణంగా తల్లిదండ్రు లిద్దరిలో ఏ ఒక్కరికో దగ్గరిగా ఉంటారు. సుందరం తల్లి పిల్లవాడు. వాడు తండ్రిని రోజూ చూస్తూకూడా. ఆయన మనస్సు ఏ విధంగా పని చేసేదీ, మానసికంగా ఆయనకూ తన తల్లికీ ఎటువంటి లంకె ఉన్నదీ అర్డంచేసుకోలేదు. ఆ కారణంచేత వాడికి తండ్రి పరాయివాడల్లే ఉండేవాడు. ఏమైనా తండ్రి చావువల్ల తన జీవితంలో ఎన్ని మార్పులు రాబోతున్నదీ సుందరం ఊహించలేదు.

    ఈ మార్పు లన్నిటిలోకీ అతిభయంకరమైనది తల్లి స్వరూపంలో జరిగిన మార్పు. ఆడవాళ్ళలో వితంతువులూ, పునిస్రీలూ  ఉంటారని వాడికి తెలియకపోలేదు. కాని తనఎదుటే పునిస్రీ  వితంతువుకావటం వాడెన్నడూ చూడలేదు. వాళ్ళ బంధువుల్లో ఒకావిడను పునిస్రీగానూ, తరువాత వితంతువు గానూ,చూశాడు. కాని ఆ ఇద్దరూ ఒకే మనిషి అని వాడికి తెలియలేదు. "అమ్మా. సుబ్బమ్మత్తయ్యకిమ్మల్లేనే ఇంకో ఆవిడ ఉండేదే? జుట్టుండేది. బొట్టు పెట్టుకునేది! ఆవిడ కనబడదేం?" అని తల్లిని రెండు మూడు సార్లు అడిగాడు సుందరం. కాని సీతమ్మకు వాడే మడుగుతున్నదీ కూడా అర్ధంకాలేదు.  ఆవిడ వాడి సంశయాన్ని తీర్చనేలేదు. తన తల్లికి జుట్టుతీసి విధవావతారం కలిగించేసరికి సుందరం కడుపులో చెప్పరానిమంట ప్రవేసించింది. కాని ఎవరు చేసిందీ వాడికి అర్డంకాలేదు.

    పదమూడురోజులూ అయిపోయి, సొంతఇల్లు పాడుపెట్టి శంకరంగారింటికి మారినతరువాత సుందరం తల్లిని తప్పించుకుని తిరగసాగాడు. ఆవిడకూడా ఒక గదిలో పడి వుండేది. కొత్తవాళ్ళు చూడరావటమూ. ఏడుపులూ ఉండేవి, కనుక సుందరాన్ని ఇష్టం వచ్చినట్టు తిరగనిచ్చింది.

    తన స్వాతంత్ర్యం హెచ్చటం ఏ ప్రాణి గుర్తించదు? తాడువిప్పగానే లేగదూడలాటిది చెంగుచెంగున పరమానందంతో ఎగురుతుందిగదా! సుందరం తాడు విప్పిన లేగదూడ లాగా ప్రవర్తించాడు. వాడికి ప్రస్తుతం బడికూడా లేదు. చుట్టుపక్కల ఎన్నోఇళ్ళ పిల్లలతో వాడు కొత్తగా సావాసం చేశాడు. ఇటీవలనే వాడి తండ్రి పోవటం చేత ఆ పిల్లలకు వాడిలో ఏదో కొత్త ఆకర్షణ కనబడినట్ట్లయింది.
 
    చిన్నపిల్లల స్నేహాలు బీరకాయ పీచులాంటివి. అవి అతి విచిత్రంగా ఒక వీధినుండి ఇంకో వీధికి. ఒక పేట నుండి ఇంకో పేటకూ విస్తరిస్తాయి. ఒక్కసారిగా పది పన్నెండు మంది పిల్లలతో  సంబంధందం ఏర్పడేటప్పటికి సుందరానికి కొత్త జీవితం ఏర్పడ్డట్టయింది. మామూలు పిల్లలు ఏ ఆటలాడు తారో, ఎటువంటి అల్లరిచేస్తారో సుందరం ఇప్పటిదాకా ఎరగడు. వీధిబడి పిల్లల దారివేరు.  ఈ పిల్లలదారి వేరు. వీళ్ళు పెద్దబడికి పోతారు. సాయంకాలంపూట ఎక్కడెక్కడికో పోతారు. ఏవేవో ఆటలాడతారు.

    ఇతర పిల్లలతో కలసి తిరుగుతున్నా కూడా సుందరానికి, వాళ్ళంతా ఒకటి అనీ, తను ఒక్కడూ వాళ్ళలో వేరనీ అనిపించేది. జీవించటం వాళ్ళకు తెలిసినట్టు తనకు తెలియదనిపించేది. వాళ్ళు గోళీలాడేవాళ్ళు. గోలీలాటలో ఎన్ని రకాలున్నాయో, ఒంటిబిద్దీ ఆటేమిటో, రెండుబిద్దీల ఆటఏమిటో, పందెం అంటేమిటో, దేకుళ్ళేమిటో, ఎన్నిసార్లు కాయను కొట్టినతరువాత గుంటపడాలో తెలుసుకోవడానికి సుందరానికి చాలా రోజులు పట్టింది. సుందరానికి గోలీలాట వచ్చేదికాదు. జానెడు దూరంలో ఉన్న గోలీ గుంటలో వెయ్యటం చాతనయ్యేదికాదు. గోలీని గురిగా కొట్టలేకపోయేవాడు.  కొందరు పిల్లలు అంత దూరాన ఉన్న గోలీని ఠపీమని వేసేవాళ్ళు. మరీ రాఘవాయి అఖండుడు. వాడు గొంతుక్కూచుని, చేతులు రుద్దుకుని, దూరాన ఉన్న గోలీని కాకిచూసినట్టు తల పక్కకి ఒరగేసి చూసి, నాలిక మొన పళ్ళ మధ్య బిగించి, తన గోలీని కుడిచేతి  చూపుడు వేలుకు సందించి ఆ వేలును ఎడమ చేతివేళ్ళతో విల్లువంచినట్లు వెనక్కి వంచి, గోలీ వదిలేవాడు. ఎంత దూరాన ఉన్న కాయనిగానీ అవలీలగా కొట్టేవాడు. పందాల అటఅయితే ఎటువంటివాళ్ళ గోలీలూ కాజేసివాడు. (మూడు తెల్లగోలీలు ఒక బిళ్ళేరుగోలీకి సమానం.) దేకుళ్ళాటయితే అందరిచేతా దేకుళ్ళుపెట్టించేవాడు.
 
    రాఘవాయికి సుందరమంటే ఏదో అభిమానం. అందుచేతవాడు సుందరాన్ని ప్రోత్సహించేవాడు. సుందరం పండేటట్టుగా వాడికి గుంట వదిలేవాడు. లేదా కొట్టటానికి తన గోలీ అందించేవాడు.  అప్పటికీ ఒక్కొక్కసారి సుందరం గెలవలేక దేకుళ్ళు  పెట్టేవాడు.
 
    రాఘవాయి ఒక్క గోలీల్లోనేకాక బచ్చాలాటలోకూడా గట్టివాడే. వాడే స్వయంగా పెంకుముక్కలు గుండ్రంగా కొట్టి ఒకదానికంటే ఒకటి చిన్నదిగా "బిళ్ళలు" తయారు చేసేవాడు. మంచి నాపరాయి ఒకటి గుండ్రంగా చెక్కి దాన్ని బచ్చాగా ఉపయోగించేవాడు. అందరూ లైనులోనిలబడి "బిళ్ళల" మీదకి బచ్చాలు విసిరేటప్పుడు రాఘవాయి రాగానే పిల్లలంతా, ఉండండర్రా, విష్ణుచక్రం! విష్ణుచక్రం!" అని అరిచేవాళ్ళు. పిల్లలు తన ప్రభావాన్ని ఇట్లా గుర్తించటం రాఘవాయి కి చాలా ఇష్టంగా ఉండేది. బచ్చా ప్రయోగించినప్పుడు కూడా వాడు నాలికమొన బయటపెట్టేవాడు. బచ్చాలాటలో వాడు అడిగిన వాళ్ళకి వరాలిచ్చేవాడు. అందరికన్న వాడు తన బచ్చా దూరం విసిరివేసి బిళ్ళలుకొట్టే ఛాన్సు మొదట తీసుకునేవాడు. ఆ తరువాత వాడు ఎవర్ని గెలిపించాలంటే వాళ్ళకు అందుబాటులో వచ్చిందాకా బిళ్ళలు కొట్టేవాడు. ఈ ఆటలోకూడా రాఘవాయి  సుందరానికి అభిమానం చూపేవాడు. రాఘవాయి ఆడుతుంటే వీధిలో పెద్దవాళ్ళుకూడా చూసేవాళ్ళు. గోలీలాట ఎవరి దొడ్లో అయినా ఆడవచ్చు గాని, బచ్చాలాడాలంటే వీధిలోకిపోకతప్పదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS