Next Page 
వసుంధర కధలు-5 పేజి 1

 

                         దొంగతనం ప్రమాదం

                                                                వసుంధర

                    

    జేబు దొంగతనాలు కాస్త కష్టంగానే వుంటోంది నాకు.
    ఇప్పుడొస్తున్న కొత్త మోడల్ బట్టలు జేబు దొంగతనానికి అనుకూలంగా ఉండడం లేదు. పట్టుబడితే చావగొట్టేస్తున్నారు. ఇంతా కష్టపడి ఏ పర్సో కొట్టేస్తే అందులో ఒకసారి ఛిల్లర పైసలు కూడా ఉండడం లేదు.
    నా పద్దతి మార్చాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాను నేను. ఇళ్ళలో దూరి దొంగతనాలు చేయడం సులభం అనిపించింది. అందులోనూ ఈ రోజుల్లో చదువు కున్న ఆడవాళ్ళవి మరీ పిరికి  గుండెలు. ఒంటరిగా ఉన్నప్పుడు కత్తి చూపిస్తే నోరెత్తకుండా మనం చెప్పినట్లు వింటారు.

                                           
    ఈ విషయమై బాగా అలోచించి, నేను రామారావు పేటలోని ఒక వీధిని ఎన్నుకున్నాను. ఆ వీధిలోని ప్రత్యేకత ఏమిటంటే అటూ యిటూ కలిసి పాతికిళ్ళున్నాయి. అన్నిళ్ళ లో మగవాళ్ళు ఉద్యోగానికి పోతాను. ఒక్క ఆడవాళ్ళు మాత్రమే వున్న ఇళ్ళు ఎనిమిది వున్నాయి. అంటే ఆ ఎనిమిదిళ్ళలోనూ మొగుడూ పెళ్లాలిద్దరే  ఉంటున్నారన్నమాట.
    ఆ వీధిలో ఆడవాళ్ళ కేవరింటి పనులు వారు చూసుకోవడమే కానీ -- ఎదురింటి  వాళ్లతో కబుర్లు చెప్పే అలవాటు లేదు. అంతగా అయితే సినిమాలకు పోతారు. ఈ వివరాలన్నీ సంపాదించడం కోసం నేను ఒకరోజు జనాభా లెక్కల వాడి పేరుతొ చాలా వీధులు తిరిగాను. ఈ వీధిలోని వివరాలు నాకు బాగా నచ్చాయి.
    ఇప్పుడు నేను ఆ ఎనిమిదింటి లోనూ ఒక యింటిని యెన్నుకోవలసి వుంది.
    ఇప్పుడు నేను ఆ ఎనిమిదింటిలోనూ ఒక యింటిని యెన్నుకోవలసి వుంది.
    ఒక ఇంట్లో వృద్ద దంపతులుంటూన్నారు. ముసలాయన ఇంకో ఏడాదిలో రిటైర్ కానున్నాడు. పిల్లలు దూరప్రాంతాన వుంటున్నారు. ఈ ఇంటి జోలికి నేను వెళ్ళదలచుకోలేదు. ముసలావిడ మంచి బలంగా వుంది. అందులోనూ ముసల్ది కావడం వల్ల ఏ మనభంగమో జరుగుతుందన్న భయం వుండదు. పెద్ద గొంతు పెట్టి అరిచిందంటే చాలా పెద్ద రిస్కు. నిజంగానే కత్తితో పొడవలసి వుంటుంది. ఏదో నా రోజులు దొంగలా వెళ్ళిపోతే చాలు హంతకుడ్ని కావాలని నాకు లేదు మరి!
    రెండిళ్ళ లో ఆడవాళ్ళకు పిల్లలున్నారు కానీ వాళ్ళు సెలవులకు చుట్టాలిళ్ళకు వెళ్ళారు. వాళ్ళిద్దరికీ నలభై ప్రాంతాల్లో వుంటుంది వయసు. వాళ్ళవి చాలా పెద్ద కంఠలు. ఎవరూ అని అడగడానికోస్తేనే వీధంతా హడావుడి అయిపోతుంది. కాస్త సన్నని కంఠం వాళ్ళుంటే నాకు లాభం. అందుకని వాళ్ళిద్దర్నీ కూడా వదిలేశాను.
    ఇంక అయిదుగురు మిగిలారు. ఈ అయిదుగురు కూడా వయసులో ఉన్నవారే. వాళ్ళ వయసులు పద్దెనిమిది నుండి పాతిక దాకా వుంటాయి. కొందరు కొత్తగా కాపురానికి వచ్చారు. కొందరు అయిదేళ్ళ నుంచి కాపురం చేస్తున్నారు. వీళ్ళలో యెవరికీ సంతానం లేదు. కానీ ఇద్దరు చూడ్డానికి పరమ అసహ్యంగా ఉంటారు. ఒకసారి వాళ్ళ వంక చూసి ఎందుకు చూశాం రా భగవంతుడా అనిపిస్తుంది. మగాళ్ళకు. అలాంటి వాళ్ళ ఇళ్ళకు వెళ్ళడం నాకిష్టం లేదు.
    మిగతా ముగ్గురు చూపులకు బాగుంటారు. కానీ ఒకమ్మాయికి బొత్తిగా పద్దెనిమిదేళ్ళు. చూడ్డానికి ఎంత అమాయకంగా వుంటుందంటే నేను కత్తి చూపిస్తే ఆమెకు గుండె ఆగిపోయినా ఆశ్చర్యం లేదు.
    ఇంక మిగిలిన ఇద్దర్లో ఒకామె నుదుట రూపాయి కాసంత కుంకుమతో చూడ్డానికి పవిత్రంగా వుంటుంది. ఆమెను చూడగానే నాకు గౌరవభావం కలిగింది. అటువంటి ఆమె ఇంట దొంగతనం చేస్తే దేవుడు నన్ను క్షమించాడనిపించింది. నేను దొంగనే కావచ్చు కానీ నాకు దైవభక్తి ఉంది. నా దొంగతానాలకు వెడితే దేవుడే శ్రీరామ రక్షగా ఉంటున్నాడని నా విశ్వాసం.
    ఇంక ఒకే ఒక్కామే మిగిలింది. ఆమె పేరు జానకీ. వయసు ఇరవై కి పాతిక్కి మధ్య వుంటుంది. చూపులు అదోరకంగా -- కవ్విస్తూ వుంటాయి. కావడానికి సంసార స్త్రీ అయినా పురుషుల్ని రెచ్చగొట్టే లక్షణాలు ఆమె శరీరం లోనూ ప్రవర్తనలోనూ కూడా వున్నాయి.
    జానకి ఇల్లు దొంగతనానికి అన్ని విధాల అనువైనదని నాకు అనిపించింది. పైగా ఆమె ఖరీదైన బట్టలు కడుతుంది. మెళ్ళోనూ, చేతులకు బంగారం వుంది. ఆమె ఇంట్లో కాస్త వస్తువులు, డబ్బు కిట్టవచ్చు.
    జానకి భర్త ఆఫీసుకు పది గంటలకు వెడతాడు. తిరిగి సాయంత్రం అయిదున్నరకు వస్తాడు.
    సరిగ్గా పడుకొండు న్నరకు నేను జానకి ఇంటికి వెళ్లాను. తలుపు తట్టాను. గుండెలు కాస్త దడదడలాడుతున్నాయి. ఇంట్లో జానకి ఒక్కర్తే వుండాలి నా లెక్క ప్రకారం. ఇంకెవరైనా వుంటే నా దురదృష్టం.
    లోపలన్లుంచి అడుగుల చప్పుడు మెత్తగానే వినిపిస్తోంది. కాలిగజ్జెల గల గల కూడా వినబడుతోంది. తప్పకుండా జనకే అయుండాలి.
    తలుపులు తెరచుకున్నాయి. అమ్మయ్య-- ఆమె జానకే!
    జానకి నా వంక చూసి -- "కొద్ది రోజుల క్రితం మీరు వచ్చి ఏవో జనాభా లెక్కలడిగారు కదూ?" అంది.
    "అవునండి - " అన్నాను. ఆమె జ్ఞాపకశక్తి ని అభినందించకుండా వుండలేకపోయాను.
    "మళ్ళీ ఏం పని?' అందామె చిలిపిగా నవ్వుతూ.
    పరీక్షించి చూస్తె ఆమె నవ్వు తీరే అంతనీ మనిషి మంచిదని అనిపించింది.
    "నేనొక నిరుద్యోగినండి-- ఏదో చిన్న వుద్యోగం సంపాదించుకుని ఇలా తిరుగుతుంటాను--" అని నవ్వాను. "ఈరోజు పోస్టల్ సేవింగ్స్ పని మీద వచ్చాను. అంతా తీరుబడిగా చెబుతాను. కాసిని మంచినీళ్ళు ఇస్తారా?'
    "దానికేం భాగ్యం-' అంటూ లోపలకు వెళ్ళిందామె. నేను కూడా గుమ్మం లోంచి లోపలకు వెళ్ళాను. అక్కడ చిన్న హలుంది. ఒక సోఫా సెట్టుంది. కుడి పక్కన ఓ గది వుంది. ఆ గదిలోకే జానకి వెళ్ళింది. ఎడమ పక్క ఓ గది వుంది. చూడ్డానికి కొట్టు గదిలా వుంది. గది తలుపులు బార్లా తెరిచి వున్నాయి. లోపల్నుంచి పాత సమాన్లులాంటివి కనబడుతున్నాయి.
    ఎడమ పక్కనే కొట్టు గది నానుకుని మరో గుమ్మం వుంది. ఆ గుమ్మం లోంచి దొడ్డి కనబడుతోంది.
    ఒకడుగు వేసి ఆ గుమ్మం దగ్గరకు వెళ్లాను. దొడ్లో నుయ్యి వుంది. నూతి చుట్టూ పెద్ద పళ్ళెం వుంది. వీధి వైపు ఓ గోడ వుంది. గోడలో గుమ్మం వుంది. బహుశా పనిమనుషులు వచ్చి పోవడాని కనుకుంటాను . అప్పుడు నా కళ్ళు మెరిశాయి. దొడ్డి గుమ్మం తలుపు తీసి వుంది. అంటే తలుపులు బార్లా తెరిచి లేవు. దగ్గరగా వేసి వున్నాయి.
    చాలామంది దొడ్డి తలుపు విషయంలో పగలు ఆశ్రద్దగా వుంటారు. ఇప్పుడు నా మనసులో ఒక పధకం చోటు చేసుకుంటోంది. ఆ దొడ్డి గుమ్మం ద్వారా ఇంట్లో ప్రవేశించి ఈ గుమ్మం లోంచి లోపలకు రావచ్చును. అలా రావడం వల్ల ఒక ఉపాయం వుంది. జానకిని ప్రత్యేకంగా బెదిరించనవసరం లేకుండా ఆమె దృష్టిలో దొంగను కాకుండా ఇల్లు దోచుకుపోవచ్చు.
    అలా చేయాలని ఎందుకనిపించిందంటే జానకి నన్ను గుర్తు పట్టడమే కాకుండా అభిమానంగా పలకరించింది. అంత అభిమానంగా పలకరించిన ఆమెను కత్తితో బెదిరించాలనిపించడం లేదు. జేబులు తడుముకున్నాను. కత్తి తగిలింది.
    జానకి వచ్చే లోగా మళ్ళీ వీధి గుమ్మం చేరుకున్నాను.
    మంచినీళ్ళ గ్లాసుతో వచ్చిన జానకి నన్ను చూసి నొచ్చుకుని-- "అరే -- లోపలకు రాకుండా అలా బైట నిలబడి పోయారేం!నేను రమ్మనమని చెప్పడం మరిచి పోయినట్లున్నాను...." అంది.
    "అబ్బే -- దాన్దేముందండీ-- ఫరవాలేదు --" అన్నాను. ఆమె నాకు మర్యాద చేస్తుంటే నేను కుంచించుకు పోతున్నాను. బహుశా నేను దొంగతనానికి పనికి రానేమో!
    జానకి నాకు మంచినీళ్ళ గ్లాసు అందించింది. ఆ చేతికి నాలుగు బంగారు గాజులున్నాయి. మంచినీళ్ళ గ్లాసు అందించేప్పుడు ఆమె చేతి వ్రేళ్ళు నాకు తగిలాయి. అందులో రెండు వేళ్ళకు బంగారు వుంగారాలున్నాయి. ఆ ప్రయత్నంగా తలెత్తి చూశాను. ఆమె మెడలో నాలుగు పేటల చంద్రహారం , ఒక రాళ్ళ నెక్లెస్ వున్నాయి. అదికాక మంగళ సూత్రాల నానుతాడు వుంది. కానీ దాని జోలికి వెళ్లదలచుకోలేదు నేను. నాకు చాలా సెంటిమెంట్స్ వున్నాయి.
    మంచినీళ్ళు తాగేక -- "మీకు పోస్టల్ సేవింగ్స్ మీద ఇంట్రస్టు వుందా?' అనడిగాను.
    "వినడానికా?" కట్టడానికా?"
    "కట్టడానికే?" అన్నాను.
    "చెప్పండి -- వింటాను -- విన్నాక కట్టాలనిపిస్తే చూద్దాం --" అంది జానకి.
    నేను జేబులోంచి ఓ పాంప్లెట్ తీసి ఆమె కిచ్చాను. ఆమె దానివంక పరీక్షగా చూసి మళ్ళీ నా కిచ్చేసింది. "ఇంగ్లీషు చదవగలను కానీ అంత బాగా అర్ధం కాదు నాకు. అంది.
    ఆమెకు వివరించి చెప్పడం మొదలు పెట్టాను. ఆమె చాలా శ్రద్దగా విని నేను బాగా చెబుతున్నానని మెచ్చుకుంది. "ఒక నెలరోజుల తర్వాత రండి ప్రస్తుతానికి మాకు చాలా ఖర్చులున్నాయి" అంది.
    వెంటనే కత్తి తీసి ఆమెను బెదిరించాలనిపించింది. కాని బలవంతం మీద నిగ్రహించుకున్నాను.
    నేను ఇంట్లోంచి బయటకు వచ్చాను. ఆమె తలుపులు వేసుకుంది. నేను గోడ దగ్గర గుమ్మాన్ని మరోసారి పరీక్షించాను. కొద్ది సేపట్లో ఈ గుమ్మం ద్వారా ఈ యింట్లో అడుగుపెట్టాలి.
    రాత్రయితే దొడ్డి గుమ్మం తలుపు తీసి వుండక పోవచ్చు. అది తీసి వున్నా యింటి తలుపులన్నీ వేసి వుంటాయి.
    లోపల అడుగు పెట్టడం సాధ్యం కాదు. అంతా కష్టపడి లోపల అడుగు పెడితే ఇంట్లో యిద్దరు మనుష్యులు వుంటారు. వాళ్ళలో ఒకడు మగవాడౌతాడు.


Next Page 

WRITERS
PUBLICATIONS