నా నృషిః కురుతే కావ్యం
సి. ఆనందరామం

చిత్రం! నాకు కన్నీళ్లు రావటం లేదు. సృష్టిలోని అన్ని పదార్ధాలకు లాగే మనసుకుకూడా పరిమిత గ్రహణశక్తి మాత్రమే ఉంటుంది కాబోలు! ఆ శక్తి కతీతమైన ఆవేదన ఎదురయినప్పుడు అది చైతన్యాన్నే కోల్పోతుంది. బండబారి పోతుంది. నాకు సమస్తమూ శూన్యంగా తోచసాగింది. ఏదీ అర్ధం కావటం లేదు.
చెవి దగ్గిర గట్టిగా గంట మ్రోగటంతో, అసంకల్పిత ప్రతీకారచర్యా ప్రేరితురాలినయి అయోమయంగా తల తిప్పాను.
నా చూపులు తనమీద పడగానే మా పనిమనిషి సీతాలు గంట వాయించటం మానేసి బెదురుగా నా వైపు చూసింది.
ఆవేశమూ, ఉద్రేకమూ నా చెలికత్తెలు. దానికి తోడు ప్రస్తుతం నా మనసు నా స్వాధీనంలో లేదు.
"గెటవుట్!" అని అరిచాను, ద్వారం వైపు చెయ్యి చూపిస్తూ.
అది వణుకుతూ, "నా తప్పు కాయండమ్మా! ఏటంటే..." అని ఇంకా ఏదో అనబోతూంది.
"ఫో! ముందు నా కళ్ళెదుటినుంచి పో! ఎవడు రమ్మన్నా డిక్కడికి?"
సాధారణంగా నా ఇంటి నౌకర్లు నా ఎదుట పడటానికి జంకుతారు. అందరికంటే ఎక్కువ జీత మిస్తాను కనక నా దగ్గిరుంటున్నారు కాని, లేకపోతే ఎప్పుడో పోయేవారు! నౌకర్లు! కనక డబ్బుతో కొనగలిగాను. కానీ, డబ్బుతో కొనలేనివి, నా కత్యంత ప్రియమయినవి, తెలిసి తెలిసి నాకై నేను పోగొట్టు కున్నవి తిరిగి నా కెలా వస్తాయి? ఎవరిస్తారు?
సీతాలు గడగడ వణుకుతూ అక్కడే నించుంది. బయటికి పోలేదు. ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తూంది. కానీ, దాని నోటినుండి మాట రావటం లేదు. దాని అప్పటి అసహాయ స్థితి చూసి నా మనసులో ఏదో జాలి కలిగింది. కానీ, ఆ జాలి నా కంఠంలో ధ్వనించలేదు. ధ్వనించదు. నా అంత రంగంలో ఎప్పటికప్పుడు రూపులు దిద్దుకొనే వ్యక్తికీ, నాకూ అసలు పోలికే లేదు. ఆ వ్యక్తితో నేను ఎప్పటి కయినా త్వమేకం కాగలిగితే, అదే నా జన్మకు చరితార్ధత అని తెలుసు. కానీ, నా లోని ఆ మూర్తీ, నేనూ సమాంతరరేఖల్లా సాగుతున్నామే కాని, నేను ఒక్క అడుగైనా నాలో మూర్తివైపు వెయ్యలేకపోతున్నాను. ఆవేశమూ, ఉద్రేకమూ నా రెండు పక్కలా నిలిచి, అలసిన మనసును క్షణంలో ఆక్రమించుకుంటున్నాయి.
ఛెళ్ళుమంది సీతాలు చెంప.
కొట్టినందుకు నాకే చెయ్యి మండింది-సీతాలు కెలా ఉందో మరి!
ఒక్క క్షణం దీనంగా, దీనాతిదీనంగా సీతాలుకేసి చూశాను. మరుక్షణం అరిచాను:
"బయటికి ఫో!"
మరొక్కసారి సీతాలు నిలువెల్లా వణికింది.
"పాప దొరికింది, అమ్మగారూ!"
శక్తినంతా కూడదీసుకుని అనేసి పరుగెత్తిపోయింది సీతాలు.
"పాప దొరికింది! పాప దొరికింది!"
పరుగెట్టాను, సీతాలు వెనకాల! ఏ ఆవేశం నా చేత సీతాలు చెంప ఛెళ్ళు మనిపించిందో, ఆ ఆవేశమే ఈ క్షణంలో అహాన్నీ, అంతస్తునీ మరిచిపోయేలా చేసింది.
"పాపా! పాపా!"
గదులన్నీ మార్మ్రోగుతున్నాయి. పాప మాత్రం కనిపించదు. అరుస్తున్నాను. పిలుస్తున్నాను. పిచ్చిదానిలా కలయ తిరుగుతున్నాను.
నా దెబ్బలకో, అవమానానికో ఒక వారకి కూర్చుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తూంది సీతాలు.
దాని రెండు చేతులూ పట్టుకున్నాను.
"నన్ను క్షమించు, సీతాలూ! ఏదీ? పాప ఎక్కడుంది?"
పనిమనిషిని క్షమించమని అడగటం నా జీవితంలో అదే మొదటిసారి. నా కళ్ళు ఆత్రంగా, పిచ్చిగా నాలుగు వైపులా వెతుకుతున్నాయి.
"ఇంటికి రాలేదు, అమ్మగారూ!"
"ఇంటికి రాలేదా? దొరికిందని తెలిసే పాపను ఇంటికి తీసుకురాలేదా? ఏం చేస్తున్నారు మీ రంతా? అయినకాడికి ఇంతింతజీతాలు మీకు పోస్తూంటే, తిని కూర్చోవటమేనా మీ పని? విశ్వాసం ఉంటేగా! వెధవజాతి! నీచజాతి! ఏ కోశానా విశ్వాసం లేని మనుష్యులు!"
విపరీతమైన ఉద్రేకంతో గుండె ఎగురుతూంది. నా కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి. నా గుప్పిళ్ళు బిగుసుకుంటున్నాయి.
చటుక్కున నా చేతుల్లో ఒక టెలిగ్రామ్ కాగితం పడేసి పక్కకు తప్పుకున్నాడు డ్రైవర్ జార్జి. వణుకుతున్న చేతులతో టెలిగ్రామ్ విప్పాను.
"పాప సురక్షితంగా నా దగ్గిర చేరింది.
-పరిమళ."
పరిమళ!....పరిమళ!....పరిమళ!....
నా చేతుల్లోంచి టెలిగ్రామ్ కాగితం జారిపోయింది. నే నే మాత్రం భరించలేని బాధ! మొండికత్తితో మనసును కోస్తున్నలంటి బాధ! తెగదు. విరగదు. కానీ, నలుగుతుంది. విపరీతంగా మెలి తిరుగుతుంది. ఎవ్వరివైపూ చూడకుండా, ఎవ్వరితోనూ ఏమీ మాట్లాడకుండా చరచర నడిచి నా గదిలోకి వచ్చేశాను. సీతాలూ, లచ్చన్నా, జార్జీ నన్ను ఆత్రతతో, కుతూహలంతో, భయంతో గమనిస్తున్నట్లు నాకు తెలుసు.
పాప పరమళ దగ్గిరకు వెళ్ళింది. ఊరుకాని ఊరు! ఆరేళ్ళ పిల్ల ఒంటరిగా వెళ్ళింది!
పాప కనిపించనందుకు క్షణం క్రితం వరకూ తలకిందులవుతున్నాను. ఇప్పుడు పాప క్షేమంగా ఉన్నట్లు తెలిసింది. స్థిమితపడాలి న్యాయానికి. కానీ, ఈ బాధ అసలు భరించలేకుండా ఉన్నాను.
పాప కనిపించనప్పుడు భయంకరమయిన శూన్య ప్రాంతంలో ఒంటరిగా నిలిచినట్లు దిమ్మెరపోయాను.
పాప పరిమళ దగ్గిరకి తానై వెళ్ళిందని తెలుసు కున్నాక కుమ్ములో పడినట్లు ఉడుకుతున్నాను.
తలుపు పైన చిన్న శబ్దం. నేను రమ్మనకుండానే సీతాలు లోపలి కొచ్చింది.
ఎంత సాహసం దీనికి! ఇంటి నౌకర్లందరికీ నా మూడ్స్ తెలుసు. నే నిలా అశాంతిగా ఉన్నప్పుడు నా ఎదట పడటాని కెవరూ సాహసించరు. దీని చెంపమీద నా వేళ్ళ ఆనవాళ్ళు ఇంకా చెరగలేదు. మళ్ళీ లోపలి కొచ్చింది. బితుకుబితుకున నన్ను చూసింది.
"ఫో!" చికాగ్గా అన్నాను.
అది పోలేదు.
"జార్జిని పంపించి పాపను పిలిపించమంటారా. అమ్మగారూ?"
అదిరిపడి కూర్చున్నాను. దాని కళ్ళనిండా నీళ్ళు. పాపని చూడాలని ఆరాటపడిపోతూంది దాని మనసు. వెనుకటి దెబ్బను మరిచి, రాబోయే ఛీత్కారాలకు తయారయి వచ్చి నిర్భయంగా అడుగుతూంది. దీన్ని విశ్వాసఘాతకురాలని తిట్టాను!
ఆలస్యాన్ని భరించలేనిదానిలా - "జార్జిని వెళ్ళమంటాను, అమ్మగారూ!" అంది జాలిగా.
ఒళ్ళు మండింది నాకు.
"నీ పని నువ్వు చూసుకో! వెళ్ళు!" తీవ్రంగా, ఖండితంగా అన్నాను.
ఒక్క క్షణం దాని ముఖంలో ఏదో నిస్పృహ తాండవించింది. మరుక్షణంలో గిర్రున తిరిగి వెళ్ళి పోయింది.
పోతూ పోతూ అది చూసిన చూపు! ఎంత తిరస్కారం, అసహ్యం నిండి ఉన్నాయి ఆ చూపులో!
మధ్యాహ్నం నాకు కాఫీ తెచ్చిన సీతాలు, పుస్తకంలో మునిగిపోయిన నన్ను చూసి నిర్ఘాంతపోయింది.
"సడి లేకపోతే తెలివి తప్పి పడిపోయారనుకున్నాను. అమ్మగారూ! పుస్తకం చదువుకుంటున్నారా?"
దాని నవ్వుతో, నిస్పృహతో పాటు ఎంత అవహేళన!
కానీ, దానిని వెంటనే ఏమీ అనలేకపోయాను. కారణం దానిమీద సానుభూతి కాదు. అప్పటికి నే నున్న రసజగత్తులోనుండి ఇహలోకంలోకి రావటనికి కొన్ని సెకన్లు పట్టింది. అప్పటికి కాఫీ బల్లమీద పెట్టింది, వెళ్ళిపోయింది సీతాలు. రోషంతో భగ్గు మంది నా మనసు.
