వదిన గారి చెల్లెలు
కిరణ్మయి

:సుమీ! సుమీ! మన రాజాకి హైదరాబాద్ ట్రాన్స్ ఫర్ అయిందిట ఉత్తరం రాశాడు.' సారధి సంతోషంగా సుమిత్రని పిలిచాడు.
"ఏదీ ఉత్తరం యిలా యివ్వండి. ఎప్పుడోస్తున్నాడట?' వంటగది లో పని చేసుకుంటున్న సుమిత్ర సంభ్రమంగా వచ్చింది.
"రేపు వస్తున్నాడు. ఏమోయ్! పెద్ద మీ చెల్లాయి, ఉత్తరం వ్రాయగానే వచ్చేసిందని తెగమురిసి పోతున్నావుగా! మా తమ్ముడు నేను ఉత్తరం వ్రాయకుండానే వచ్చేస్తున్నాడు.' ఉత్తరం అందిస్తూ సారధి కవ్విస్తున్నట్లు అన్నాడు.
'మీకు అలాంటి పక్షపాత మేమన్నా ఉందేమో! నాకు సంధ్య వచ్చిందంటే ఎంత సంతోషంగా ఉందొ, రాజా వస్తున్నాదన్నా అంత సంతోషమే!' సుమిత్ర నవ్వుతూ ఎదురుదెబ్బ తీసింది. సారధి కూడా నవ్వేశాడు.
* * * *
రైలు రావడం లేట్ అని తెలియగానే రాజాకి నీరసం వచ్చేసింది. విసుగ్గా ప్లాట్ ఫామ్ మీద పచార్లు చేశాడు. మనసేప్పుడో రెక్కలు కట్టుకొని, అన్న , వదిన ల దగ్గర వాలింది. 'ఉద్యోగం! ఉద్యోగం!' అని దొరకనన్నాళ్ళు తెగ కలవరించాడు. ప్రొబేషనరీ ఆఫీసర్ గా చేరినప్పటి నుండీ ట్రాన్స్ ఫర్ల మీద తిరగడమయిపోయింది. సంవత్సరం తర్వాత అన్న, వదిన లని చూడటమే కాదు, ఇంకో ఆరు నెలలు గ్యారంటీ గా వాళ్ళ దగ్గర ఉండబోతున్నాడు. "ఈ తలంపుతో మనసు ఆహ్లాదకర మయింది రాజాకి! 'వెధవ రైళ్ళు! ఎప్పుడూ లేట్ గానే వస్తాయి. చిరాకు పడ్డాడు. సిగరెట్ వెలిగించుకుంటూ యధాతాపంగా ప్రక్కకి చూసిన రాజా ఉలిక్కిపడ్డాడు. దూరంగా , ఎవరో ఇద్దరు నిల్చొని మాట్లాడు కుంటున్నారు. అందులో అమ్మాయి మొహం రాజాకి స్పష్టంగా కన్పిస్తోంది. అతడు మాత్రం రాజా వైపు వీపు పెట్టి నిల్చోను న్నాడు. 'ఆ అమ్మాయి!....అవును మంజులే! సందేహం లేదు' అనుకోకుండా చూసినందుకు కొంచెం ఆశ్చర్య మన్పించింది. ఇంతలో రాజాకి అనుమానం వచ్చింది. 'తనని మంజుల చూసిందా?' ఎందుకో తనని చూసే వుండచ్చన్పించింది రాజాకి. అక్కడ నిల్చోవడానికి క మనస్కరించ లేదు.బుక్స్ కొనుక్కోవడానికి బుక్ స్టాల్ వైపు నడిచాడు. 'పాపం! అప్పట్లో నన్నుచేసుకోవాలని మహా తాపత్రయ పడ్డాడు లెండి ! పూర్ ఫెలో...' వాళ్ళకి కొంచెం దూరంగా ప్రక్కగా, వెళ్తున్న రాజాకీ మాటలు విన్పించి త్రుళ్ళి పడి తలెత్తాడు. మంజుల నవ్వుతోంది-- అతి నిర్లక్ష్యంగా, గర్వంగా! అతడు రాజా కేసి, కుతూహలంగా చూశాడు. రాజా దిమ్మెర పోయాడు. అతడు దిగ్బ్రమ నుంచి తేరుకునే లోపల, పెద్ద శబ్దం చేసుకుంటూ రైలు వచ్చి ఆగింది. జనం హడావిడిగా పరిగెత్తు తున్నారు. ఆ గుంపులో మంజులా, అతడు ఎక్కడ కలిసిపోయారో రాజాకి కన్పడలేదు. సీటు వెతుక్కొని కొంచెం విశ్రాంతి గా కూర్చొన్న రాజాకి, మంజుల మాటలు గుర్తుకు వచ్చాయి. చిత్ర మైన నవ్వొకటి లీలగా, రాజా పెదాల మీద నర్తించింది. 'మంజుల మారలేదు. అప్పుడెంత గర్వంగా , నిర్లక్ష్యంగా ఉండేదో, ఇప్పుడూ అలానే వుంది. నిజాన్ని మరుగుపరచి, తను వింటుండగానే, తన గురించి హేళనగా మాట్లాడటానికి ఎంత ధైర్యం! మొదటి నుంచి యింతే!...' రాజా మనసు గతంలోకి జారిపోయింది.
* * * *
'ఒరే, కొంచెం జోరు తగ్గించి నడవరా! కబుర్లు చెప్పుకుంటూ సర్దాగా వెళ్ళచ్చు' ముందు విసురుగా వెళ్తున్న మంజులని కవ్విస్తూ అన్నాడు రామకృష్ణ. అప్పటికి రాజా రెండుసార్లు చెప్పి చూశాడు. రామకృష్ణ వినలేదు. నెమ్మదిగా, తమ దారిన తాము వెళ్ళిపోయే ఆడపిల్ల జోలికి వెళ్ళడు కాని, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళంతా, తననే చూస్తారని తన గురించే మాట్లాడు కుంటారని అపోహపడి విరుచుకు పడే మంజుల లాంటి వాళ్ళని కవ్వించట మంటే మహా సర్ధా రామకృష్ణ కి. రాజా ఎదురు చూస్తున్న పిడుగు పడనే పడింది. ఎటొచ్చీ దారి తప్పి రాజా మీదే పడింది.'
'సిగ్గులేదూ! ఆడపిల్లల వెంట పడటానికి ఈసారిలా చేస్తే.....' కాలి చెప్పు వైపు చూపిస్తూ, రామకృష్ణ నేమనటానికి ధైర్యం చాలక , రాజాని బెదిరించింది. మొదట విస్మయం కల్గినా, కోపంతో ఆత్మాభిమానం దెబ్బతిన్నట్ల యి , ముఖం ఎర్ర పడింది రాజాకి.
"నాకాలికే ముందో చూడు!' నల్లగా నిగనిగ లాడే పాయింటేడ్ షూని చూపిస్తూ, అతి నిర్లక్ష్యంగా అన్నాడు రాజా! కదిలి వెళ్ళిపోతున్న రాజాని చూస్తూ ఒక్క క్షణం అలాగే నిర్ఘాంత పోయి నిలబడింది మంజుల! అవమానంతో కృంగి పోతూ నిలబడ్డ మంజులని చూసి, కొంచెం బాధపడ్డాడు రాజా. 'తనలా అనకుండా ఉండాల్సింది ఎంతైనా ఆడపిల్ల!'
* * * *
రాజా అంటే కాలేజీ లో ఆడపిల్లలకి మంచి ఎట్రాక్షన్ , గ్లామర్ ఉండేవి. కాలేజీ ఫంక్షన్స్ లో , అతడి చుట్టూ భ్రమరాల్లా తిరిగే అమ్మాయిల్ని చూసి, అతడంటే, చాలామంది అబ్బాయిలు ఈర్ష్య పడేవారు, అతనంత అందంగా, ఆ కాలేజీ లో ఎవరూ లేరని కాదు. అతడి మాటల్లో, చేతల్లో , చిందులేసే చైతన్యం చిలిపిగా నవ్వే అందమైన అమాయకత్వం అన్నిటికీ మించిన అతడి సిగ్ధ స్వాభావం -- ముఖ్యంగా ఆడపిల్లల పట్ల, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా గానీ అతడి మాటల్లో లొంగి చూసే మృదుత్వం-- అమ్మాయిల హృదయాల్లో, హీరో వర్షిప్' పెంచింది.
తన చిరునవ్వు కోసం , పలకరింపు కోసం అబ్బాయి లందరూ పడిగాపులు పడతారనే అహంకారంతో, మగవాళ్ళందర్నీ దులపరింఛి పారేసే కాలేజీ బ్యూటీ మంజుల ఆత్మ విశ్వాసానికి. రాజా ప్రవర్తన దెబ్బతీసి నట్లయింది.
'ఇంతవరకూ తన వైపు కన్నెత్తి చూడలేదు. కనీసం పలకరించే ప్రయత్నం కూడా చెయ్యలేదు. ఆడపిల్లలలో మాట్లాడని బుద్దావతారమా అనుకుంటే అదీ కాదు. వనజా, శ్యామలా వాళ్ళు పలకరించినప్పుడల్లా ఎంతో చక్కగా మాట్లాడుతాడ ని వాళ్ళు తెగ మెచ్చుకుంటారు. తనే బాగా చదువు తాడని, అందంగా వుంటాడని గర్వం! ఇతగాడి అంతేమిటో . ఆ బెట్టేమిటో చూడాలి?' కసిగా పంతం పట్టినట్లే అనుకుంది మంజుల.
* * * *
ఫంక్షన్ అయిపోయేప్పటికి బాగా చీకటి పడిపోయింది. రోజూ తనకు తోడుగా ఉండే తన జూనియర్ శాంతి ఆరోజు రాలేదు. గేటు దగ్గర నిలబడ్డ రాజాని చూడగానే, మంజులకో ఆలోచన తట్టింది. 'ఇంటి వరకూ తోడు రమ్మని అడిగితె?' అతడితో పరిచయం కల్గించు కోవటా నికీ ఇదే మంచి అదను. నెమ్మదిగా ఆవైపు వెళ్ళబోతున్న మంజుల కి, రామకృష్ణ , రాజా దగ్గరకి వచ్చి ఏదో మాట్లాడటం కన్పించింది. రామకృష్ణ ని చూడగానే సగం నీరసం వచ్చేసింది మంజులకి. 'అంత మంచి తెలివైన వాడు, చాలా హుందాగా , గంబీరంగా ఉండే రాజాకీ , ఆషా మాషిగా , అల్లరిగా గడిపే రామకృష్ణ కి అంతమంచి స్నేహం ఎలా ఏర్పడిందో? ఐనా యితడోకడు! అస్తమానం రాజాని అంటి పెట్టుకునే వుంటాడు కొంచెం చిరాకన్పించింది మంజులకి. మంజుల విసురుకి, తిట్ల కి భయపడని వాడు. తిట్టిన కొద్దీ మరింత కవ్వించే వాడు రామకృష్ణ ఒక్కడే! అందుకే అతడంటే కొంచెం జంకు . 'సరే! ఒక్క దెబ్బ కీ, యిద్దరి పని పట్టాలి?' చిన్నగా నవ్వుకొంది.
"ఎక్స్ క్యూజి మీ?"
ఏదో చాలా సీరియస్ గా మాట్లాడుకుంటున్న రామకృష్ణ, రాజా, ఉలిక్కిపడ్డ్డారు. ఎదుట నిల్చొని చిరునవ్వులు చిందిస్తున్న , మంజులని చూడగానే ఆశ్చర్యంలో మతిపోయి నట్లయింది యిద్దరికీ.
'బాగా చీకటి పడింది.' కొంచెం యింటి వరకూ తోడు వస్తారా...'
అప్పటికి యిద్దరూ తేరుకున్నారు. మృదువుగా ఉన్న మంజుల ధోరణి చూడగానే రామకృష్ణ కి ఉత్సాహం కల్గింది. 'విత్ ప్లజర్ ' వెంటనే అంగీకారం తెలిపేశాడు. రాజా ఏం మాట్లాడలేదు. దారిలో మంజులే మాట్లాడింది.
'మొన్న జరిగిన దానికి ఏమీ అనుకోకండి.' క్షమాపణ కోరుతున్నట్లడిగింది. రాజా కొంచెం తడబడ్డాడు. 'ఫర్వాలేదు లెండి.' నేను కూడా అలా అని వుండాల్సింది కాదు.' చాలా సిన్సియర్ గా అన్నాడు. ఈ ధోరణి మంజులకి చాలా ఎన్ కరేజింగ్ గా అన్పించింది. తర్వాత దారిలో ముగ్గురూ, చాలా కబుర్లు చెప్పుకొన్నారు.
* * * *
రాజా, రామకృష్ణ కాంటిన్ లో కూర్చుని కాఫీ తాగుతున్నారు. మంజుల, శాంతి ని యింకో ఇద్దరినీ వెంట బెట్టుకుని సరాసరి రాజా వాళ్ళ దగ్గరికి వచ్చింది.
'మొన్న జరిగిన కాలేజేడే లో' మీ డాన్స్ చాలా బావుంది. రాజా మనస్పూర్తిగా అభినందించాడు.
"థాంక్స్' నవ్వింది. ఎందుకో రామకృష్ణ కి , ఎక్కడో, లీలగా ఆ నవ్వులో గర్వం గోచరించింది.
