కాగితపు పల్లకి
పురాణం సూర్యప్రకాశరావు

ఇంట్లో చుట్టాల సందడి తగ్గి వాళ్ళు పక్కల మీద నడుములు వాల్చిం తరువాత వీలు చేసుకుని సుభద్రమ్మ మనస్సులో మాట భర్త చెవిలో వేసింది.
ఆమె చేతులు తడుచుకుంటూ గదిలో ప్రవేశించే తీరుని బట్టే రాజశేఖరం కోంత ఊహించాడు. అవతల గదిలోంచి బంధువులు నిద్రకు జారుకొంటున్న సూచనగా ఆవలింతలు వినిపిస్తున్నాయి.

"ఇప్పటికి మేం గుర్తుకు వచ్చాం కాబోలు"
"నయం ఇప్పటికైనా తీరిక దొరికింది. అవతల తెల్లవార్లూ కూర్చున్నా తెమలని పని ఉంది. అవన్నీ అలా ఉంచేసి చక్కా వచ్చాను."
"ఏదో వుంది విశేషం?"
"ఉంది కనుకనే వచ్చాను నా అభిమానం కొద్ది ఊరుకోలేక బయట పడతాను కాని నా మాట చెల్లుబాటు అవుతుందా?"
'అంత మాట అనకు ఇన్నాళ్ళు నీ మాట గాక నా మాట చేలుబాటవుతుందా?'
సుభద్రమ్మ భర్త పాదాల చెంతలో మంచం మీద కూర్చుంది. రాజశేఖరం లేచి కూర్చుని "మనసులో ఉన్నదేదో చెప్పు ఫర్వాలేదు." అన్నాడు.
"ఆహా ఏం లేదు. మా రాధమ్మకు పెళ్ళీడు వచ్చింది కదా చేసెయ్యాలని వాళ్ళు అనుకుంటున్నారు."
"చేసేస్తేనే మంచిది.
"మాట అంటే తేలిగ్గా అనేశారు. పెళ్ళంటే అంత సులువుగా అయిపోతుందా. తగిన సంబంధం కలిసి రావద్దూ.
"నన్ను కూడా కలగజేసుకుని వెతకమంటావు. అంతేనా?"
"పిన్ని పెద్దదయింది వాడూ పెద్ద అరిందా కాడు. మీరు కూడా కాస్త కలగజేసుకోకోకపోతే ఈ అవసరం గట్టెక్కేదేలా?"
"అలాగే తప్పుతుందా?"
"మీ ఎరికను మంచి సంబంధాలున్నాయా?"
"లేకేం? ఉన్నాయి. కాని మనవాళ్ళు తూగవద్దూ?"
"అదీ నిజమే అనుకోండి. ఏదో ఒకటి రెండయితే ఫర్వాలేదు. ఓ పూట తినో తినకో అప్పు చేసయినా తీర్చుకోగలరు."
"ఈ రోజుల్లో స్కూలు ఫైనలు పాసయిన వాడు కూడా ఆ ధరకు పలకటం లేదు. దుర్లభంగా ఉంది." రాజశేఖరం ఈ మాటలని బాధగా ఆమె ముఖంలోకి చూశాడు.
ఆమె ముఖం చిన్న బుచ్చుకునే "అంతకంటే ఎక్కువయితే మాత్రం ఏం చేస్తారు? ఆడపిల్లలను కన్న తర్వాత తల తాకట్టు పెట్టయినా తేక తప్పదు." అంది.
రాధ సుభద్రమ్మ పినతల్లి కూతురు. ఆవిడకు ముగ్గురు ఆడపిల్లలు. పై వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళయి కాపరాలు చేసుకుంటున్నారు. ఒక్కడే కొడుకు. పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు. రెక్కాడితే డొక్కలాడే సంసారాలు. వాళ్ళు తిరుపతి మొక్కు చెల్లించటానికి వెళ్ళి దారిలో ఇక్కడ దిగారు. అతగాడు శలవు లేదంటూ వెళ్ళిపోయాడు. మాటలో మాటగా వాళ్ళ ఉద్దేశం బయట పెట్టి భారం సుభద్రమ్మ మీదకు మోపారు.
కాసేపు తటపటాయించి చివరికి "పోనీ ఓ విధంగా చేస్తే" అంది సుభద్రమ్మ.
రాజశేఖరం ఆసక్తిగా ముందుకు వంగాడు.
"మరిది చలపతి ఉన్నాడుగా. అతనికిచ్చి చేస్తే "సుభద్రమ్మ కొద్ది సంకోచం కనబర్చినట్లుగా అడిగింది.
రాజశేఖరం కొంచెం కంగారు పడ్డట్టు కనిపించాడు. 'ఆహా బాగా ఆలోచించే అంటున్నావా." అన్నాడు తడబడుతూనే..
"ఏం? ఆలోచించటానికి కేముంది?"
"నీకు మనస్పూర్తిగా ఇష్టమేనా? వాడికి ముప్పై యేళ్ళు పైన బడ్డాయి."
"మన రాధమ్మ కి మాత్రం తక్కువ వయస్సా? దగ్గర దగ్గర ఇరవై ఏళ్ళుఉంటాయి. మీకు ఇష్టమేనా?' అది చెప్పండి ముందు."
"అసలు వాడికి ఇష్టం ఉండొద్దూ"
"మరిది మీమాట కాదనరనే నమ్మకం నాకుంది."
"నాకూ ఇష్టమే అనుకో. అయితే వాడు ఎక్కువగా చదువుకోలేదు. అయితే సంపాదన తక్కువ కాదనుకో...."
"ఆ చదువుకొని మీరేం సంపాదిస్తున్నారు."
రాజశేఖరం భార్య తన సంపాదన గురించి తేలిగ్గా అన్నందుకు పౌరుషం కనబరుస్తూ ఆమెను రుసరుసలాడుతూ చూశాడు "నా రాబడి నీకు అలుసుగా ఉందన్న మాట." అన్నాడు.
"మీరే అనుకుంటారు గదండీ మీ సంపాదన గురించి నీరసంగా. మీరే అనుకుంటే లేని తప్పు నేనంటే వచ్చిందా?"
"నేను అనుకోవటం వేరు. నువ్వు అనడం వేరు..."
"మరిది గారి ఉద్యోగం ఏవిటో ఎప్పుడూ చెప్పారు కాదు."
రాజశేఖరం కొంచెం తడబడుతూనే "వాడికి ఉద్యోగం చేసే ఖర్మ ఏం పట్టిందే? రెండు చేతులా సంపాదిస్తున్నాడు వాడు. పెద్ద పెద్ద వాళ్ళు వాడ్ని చూస్తె హడలి పోతుంటారు." అన్నాడు.
"అదేం సంపాదనండి. నెల జీతం అంటూ ఉండదా?"
"నెల జీతం ఏ మూలకు చలుతుంది వాడికి. మన జీతం వాడి సిగరెట్ల కి చాలదు.
'అబ్బా! మరిది గారు అంత ఖర్చు మనిషా? అయినా తెలియక అడుగుతాను. నెలకి ఏపాటి సంపాదిస్తారు?"
రాజశేఖరం తడుముకోకుండా "నెలకి అయిదారొందలు తక్కువ రాబడి ఉండదు" అన్నాడు.
"ఏమైనా వెనకేశారా?"
"అది నాకెలా తెలుస్తుంది?"
"డబ్బు దాచే ఉంటారు. మీకు తెలియకుండా ఉంటుందా? నా దగ్గర దాస్తున్నారు గాని."
"ఇది మరీ బాగుంది. వాడు చిన్నప్పుడే నా వద్ద నుంచి తప్పుకున్నాడు. వాడి వివరాలు నాకెలా తెలుస్తాయి."
"అది సరే అనుకోండి. మరిది గారిని చూస్తె పెద్ద పెద్ద వాళ్ళు భయపడుతున్నారు గదా ఎందుకని?"
"వాడికి భయం లేదు. ముఖం మీద కొట్టినట్లుగా మాట్లాడతాడు."
'అందులో భయపడల్సిందేముంది?"
"కోపం వస్తే ఎవర్నీ లెక్క చెయ్యడు. ఎంత వారైనా సరే కలియ బడతాడు."
"ఓస్ అదా. చాలా కోపిష్టి మనిషి అన్న మాట. పోనీలెండి మన రాధమ్మ తెలివిగానే సమర్ధించుకోగలదు. ఇక సందేహం ఎందుకు? రేపే ఉత్తరం రాయండి."
'అంత తొందర పడకు మరి. ఎంతయినా మొగ పెళ్ళివారం. అంత చులకనగా వ్యవహారం నడిపితే ఎలా? కాస్త బెట్టు సరి...."
"మనలో మనకి అవన్నీ ఎందుకు లెద్దురూ అయినా అబ్బాయిని ఓసారి రమ్మనమని రాస్తే ఇంతలో మీ దర్జాలకి బెట్టుసరికి ఏమీ లోపం రాదు లెండి."
"నీ దగ్గర ఓర్పు లేదనుకో. మీ వాళ్ళ దగ్గర కూడా తెలిపోయావా? అయినా ఇప్పుడు తొందరేం వచ్చింది? తర్వాత మరొకప్పుడు చూద్దాం."
సుభద్రమ్మ కోపంగా "నిన్ననే వాళ్ళు వెళ్తాం అంటే నేనే ఆపాను మీరు నా మాట వింటారనే ధీమాతో" అంది.
కొంపదీసి మీ వాళ్లకు ఈ సంబంధం గురించి ఎలాంటి పూచీ కత్తు ఇవ్వలేదు గదా."
"ఇందులో కొంప తియ్యటాని కేముంది? ఇప్పుడే ఏదో తెల్చేయ్యి. మరి మేమేమీ వత్తిడి చెయ్యలేడుగా" ఒ ఉత్తరం ముక్క రాసి పడేస్తే అతగాడు వచ్చి పిల్లని చూసుకుంటాడు. అనే అభిప్రాయంతో అపాటి చనువు తీసుకున్నాను."
సుభద్రమ్మ ధోరణి చూస్తె ఆవిడ అవతల తన వాళ్ళకి గట్టి హామీలు ఇచ్చి ఇప్పుడు ఇరుకున పడ్డట్టుగా కనిపిస్తుంది. రాజశేఖరం భార్యని అప్పటికి సముదాయిస్తూ "పొద్దున్నే మాట్లాడుకుందాం. ఇంతలో మునిగి పోయిందేముంది? వాళ్ళ దగ్గర మాత్రం ఇక లేనిపోని డాబులు చెప్పకు." అంటూ ఆమెకు కాస్త ఆధారం ఇచ్చాడు.
"ఇప్పుడు చెయ్యలేని నిర్ణయం తెల్లవారే సరికి చేసేస్తారు కాబోలు."
"పెళ్ళంటే మాటలా? నూరేళ్ళ పంట. తొందరపడి నిర్ణయించకూడదు.' అన్నాడు. అనుమానిస్తూనే ఆఖరి మాటలు సగం సగం మింగుతూ , రాజశేఖరం వేళ్ళు నలుపుకుంటూ దుప్పటి మీదికి లాక్కున్నాడు.
సుభద్రమ్మ లేచి వెళ్ళబోతూ "బాగా ఆలోచించండి. తొందరపడి నా సలహా తేలిగ్గా తీసి పారేయ్యకండి." అంది ముఖం ముడుచుకునే. ఆమె ఈ సంబంధం గురించి చాలా పట్టుదలగా ఉంది.
రాజశేఖరం అలొచనలొ పడ్డాడు. సుభద్రమ్మ ఈ ప్రసక్తి అనుకోకుండా తెచ్చింది. ఇంకెవరో అయితే తాముగా ఇలాంటి సూచన చేసినందుకు సంతోషించే వాడే అయితే ఇది మరీ దగ్గర సంబంధం. స్వయానా భార్య పినతల్లి కూతురు. మంచి కుటుంబమే. అయితే నేం? తనిప్పుడు ఇరుకున పడ్డాడు. ఇంకోటి ఇంకోటి కాదు పెళ్ళి! నూరేళ్ళ పంట! తనకి చలపతి ఎంతో రాదమ్మా అంతే. రాధమ్మ అంటేను? పినతల్లి అంటేను. ఆ మాట కొస్తే తన వాళ్ళంటేనూ సుభద్రమ్మ కు అభిమానం ఎక్కువ. వాళ్ళని పరిహాసాని క్కూడా పల్లెత్తు మాట అననివ్వదు. అంటే ఊరంత గొడవ చేసేస్తుంది.
కిటికీ తలుపులు బార్లా తెరిచి వున్నాయి. గాలి చలిగా వుంది. దుప్పటి చెవుల మీద కంటా కప్పుకున్నాడు రాజశేఖరం. అతనిప్పుడు సందిగ్ధంలో పడ్డాడు. సుభద్రమ్మ వంటగదిలో ఇంకా ఏవేవో సర్దుతూనే వుంది కాబోలు చిన్న చిన్న చప్పుళ్ళు అవుతూనే వున్నాయి.
చలపతి అంటే తనకి మాత్రం అభిమానం తక్కువా? రాధామ్మంటే సుభద్రమ్మ కు ఎంత అభిమానమో తనకి చలపతి అంటే అంత అభిమానమూ ఉంది. కాని చలపతి కి రాధమ్మ ని ఇవ్వటం గురించి తన మనస్సు ఖచ్చితంగా తేల్చి చెప్పలేక పోతుంది. స్వార్ధం తనలో ప్రాబల్యం సంపాదించుకోగలిగి వుంది. సుభద్రమ్మ సూచనకి అప్పటికప్పుడే వెంటనే అంగీకరించి వుండేవాడు చూసి చూసి అమాయకంగా బావా....బావా..... అనుకుంటూ తన చుట్టూ తిరిగే పసిపిల్ల రాధమ్మ కు ఈ సంబంధం చెయ్యాలంటే తనకే కూడని పని చేస్తున్నట్టుగా మనస్సు పీకుతుంది.
చలపతి కి ఉద్యోగం లేదు. నిలకడయిన రాబడి లేదు. నిలకడయిన స్థావరం కూడా అతనికి లేదు. ఎవరో సినిమా హాలు వాళ్ళు ఇతగాడిని చేరదీసి హాలు అజమాయిషీ అప్పచెప్పారు. వాళ్ళకి తోచినపుడు డబ్బు ఇస్తుంటారు టాక్సీల వ్యాపారాలలో ఏవో వాటాలున్నాయంటాడు అదెంత వరకూ వాస్తవమో తనకే తెలియదు. ఏం సంపాదిస్తాడో ఏం మిగులుస్తున్నాడో. అంత మాయ అతని రాబడి.... అతని ఖర్చులు ఎవరికీ తెలియవు తెలుసుకుందామన్నా అతను చెప్పడు. గట్టిగా అడిగితె కోపం. మాట సున్నితం లేదు మొరటుగా మాట్లాడతాడు. కొట్టినట్లుగా మాట్లాడతాడు. తనుగా ఓసారి ఓ ఉద్యోగం ఇప్పిస్తే మేనేజరు ని నాలుగు తన్ని ఆ ఉద్యోగం పోగొట్టుకున్నాడు. అధికారిని తంతే వాడు ఊరుకుంటాడా? చలపతి మత్తుగా తాగుతాట్ట. వ్యభిచారిస్తాడు జూదం ఆడతాడు. తప్పతాగి ఏ సినిమా హల్లోనో పడి నిద్రపోతూ వుంటాడుట. అతని మీద అనేక కేసులున్నాయట. ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళెంత వారైనా సరే కొట్టేస్తాడట.అతనికో ముండ కూడా ఉందట? ఇన్ని లక్షణాలు గల చలపతికి రాధమ్మ ను ఇవ్వటం గురించి ఉన్న పళంగా ఓ నిర్ణయం తానెలా చెప్పగలడు? తెలిసి తెలిసి ఈ పాపం తాను మూట కట్టుకోలేడు. తర్వాత బయటపడితే ఆమె జీవితం ఇబ్బందుల పాలయితే అప్పుడు తాను దోషిగా ఈ బంధు వర్గంలో నిలబడి సమాధానాలు చెప్పుకోవలసి ఉంటుంది.
