నేను దిక్కుమాలినదాన్నికానే అయినాను. పాపం వాడన్నా ఉల్లాసంగా ఎందుకుండరాదు?" అనుకున్నది సీతమ్మ అయితే వాడికి బడిలేకుండా అచ్చగా ఆటలే అయినాయే అని ఆమె విచారపడ్డది.
ఆ రాత్రి అన్నంపెట్టి సుందరాన్ని ఆవిడ తన దగ్గరే పడుకోబెట్టుకుని వాడికి వాళ్ళ నాన్నను గురించి ఏవేవో చెప్పింది, సుందరం తాను ఎన్నడూ వినని ఈ విషయాలన్నీ శ్రద్దగావింటూ , ఎప్పుడో నిద్రపోయినాడు. సీతమ్మ చాలాసేపు నిద్రపోలేదు. ఆవిడ తాను భర్తతో గడిపిన మంచిరోజులూ, పొందిన ఆనందమూ జ్ఞాపకం చేసుకోవటానికి ప్రయత్నించింది. కాని ఎంతసేపూ బాధకలిగించే విషయాలే జ్ఞాపకం వచ్చాయి.
"ఆయన ఎప్పుడు ఏం మాట్లాడినా, రేపీ విషయం దీనికి చెప్పేవాళ్లుండరేమో అన్నట్టుగా చెప్పేవాడు. చిత్రమైన మనిషి. ఇన్నాళ్ళు కాపురంచేశాగాని నాకా మనిషి ఇంతవరకు పూర్తిగా అర్ధంకాలేదు. మనిషిని మనిషి అర్ధం చేసుకోవటం మాటలా?నేనింకా నూరేళ్ళు బ్రతికినా ఏవో కొత్తవిషయాలు ఆయన్ను గురించి అర్ధమవుతూనే ఉంటాయి. మనుషుల్ని తెలుసుకోవాలంటే తెలివితేటలు చాలవు. అనుభవంకూడా కావాలి.... వీడు__ ఈ సుందరం__ వెనుక ఏమనుకుంటున్నాడో ఎట్లా ఆలోచిస్తున్నాడో నాకు తెలిసినట్టే ఉండేది. ఇప్పుడట్లా ఉండటంలేదు. ఏముంది? పిల్లలిట్లాగే పెద్దవాళ్ళవుతారు... ఈ చిన్న ముండ ఎట్లా తయారవుతుందో!" అనుకుంటూ సీతమ్మ చాలా పొద్దుపోయి కన్నుమూసింది.
* * * *
వీధి బడిపంతులు సుబ్రహ్మణ్యం చూడటానికి వచ్చాడు. శ్రీమన్నారాయణగారివంటి పెద్ద మనుషులు చాలా అరుదన్నాడు. సుందరం ఈ ఎండల్లో బడికి రాక పోయినా ఇబ్బంది లేదనీ, వాడికి వచ్చిన చదువుతో హైస్కూల్లో చేర్చుకుంటారనీ అన్నాడు. కావలిస్తే తాను ప్రతి రాత్రీ ఇంటికివచ్చి ఒక గంటసేపు చదివిస్తానన్నాడు. శేషగిరి ఈ ఏర్పాటుకు ఒప్పుకున్నాడు.
తీరా వెళ్ళబోతూ సుబ్రహ్మణ్యం సుందరాన్ని మర్నాడు సాయంకాలం మంచిబట్టలు వేసుకుని రైలుస్టేషను దగ్గరికి రమ్మన్నాడు. ఎందుకో ఆయనకూ తెలీదు. బడిపిల్లల్ని మంచి దుస్తులతో తీసుకురమ్మని బడి పంతుళ్ళకు కబురొచ్చిందట.
మర్నాడు సాయంకాలం నాలుగింటికి సుందరం తనకున్న మంచి చొక్కా, లాగూ వేసుకుని స్టేషను దగ్గర గ్రాండుట్రంకు రోడ్డుమీద హాజరైనాడు అక్కడ వందలేసి పిల్లలు చేరారు. చాలామంది చేతుల్లో రంగు కాగితాల జెండాలున్నాయి. కొందరు చమ్కీటోపీలు, మఖ్మల్ కోట్లూకూడా వేసుకున్నారు.
గ్రాండుట్రంకు రోడ్డుమీద పిల్లలందరూ ఒక పక్కగా ఎన్నోగంటలు నిలబడ్డారు. సుందరానికి దాహమయింది. కాళ్ళు తీపుపెట్టాయి. చీకటిపడింది. మేష్టర్లువచ్చి పిల్లల్ని ఇళ్ళకి పొమ్మనీ, మర్నాడు పొద్దున, మళ్ళీ రమ్మనీ అన్నారు.
మర్నాడుదయం సుందరం మళ్ళా స్టేషనుదగ్గర హాజరైనాడు. వాడికిదంతా చూస్తుంటే దసరా జ్ఞాపకం వచ్చింది.
పొద్దెక్కింది. ఎండ తీక్షణమవుతున్నది. చెట్లనీడ ఉన్నప్పుటికీ పిల్లలకు ముచ్చెమటలు పోస్తున్నాయి. తొమ్మిది గంటలవేళ పిల్లల్లో సంచలనం బయల్దేరింది. "వస్తున్నారు, వస్తున్నారు!" ఎవరా వచ్చేది? ఎవరికీ తెలేదు. ఒక అరగంట దాకా ఏమీ జరగలేదు. పటపటమంటూ మోటారు సైకిలు ఒకటిపోయింది. దానిమీద ఒక మీసాలదొర బొమ్మలాగా నిశ్చలంగా కూచుని ఉన్నాడు.
సుందరం పక్కన ఎవడో కుర్రాడు హస్యగాడు చేరాడు.
"వాడి మీసాలు చూశావుట్రా? మొక్కజొన్నకండె పీచల్లే ఎల్లా ఉందో!" అన్నాడు. ఎవరూ నవ్వలేదు. సుందరానికి ఒక్కడికీ నవ్వటానికి ధైర్యం చాలలేదు.
మరికొంతసేపుదాకా ఏమీ జరగలేదు. ఈ సారి ఇంకో పెద్దచప్పుడయింది. ఇంకో మోటారు సైకిలూ, దానికి కాస్త వెనకగా ఒక కారూ పోయింది. అందులో ఆడవాళ్ళూ, మగవాళ్ళూ - అంతా దొరలే__ బొమ్మల్లాగా రంగురంగుల దుస్తులు వేసుకుని ఎటూ చూడకుండా ఎదురుగా చూస్తూ కూచుని ఉన్నారు. ఆకస్మికంగా కనిపించిన ఈ దృశ్యానికి ఆశ్చర్యపడి, పిల్లలు దాన్ని గురించి మాట్లాడుకునే లోపల ఇంకోకారు వెళ్ళింది. మొదటికారే మళ్ళీ వెళ్ళిందనుకున్నాడు సుందరం. మొదటి కారులో ఎక్కడెక్కడ ఏయే మనుషులు కూచుని ఉన్నారో, ఏయే దుస్తులు వేసుకున్నారో రెండోదాన్లోకూడా అటువంటి వాళ్ళే, అదేవిధంగా, అవే దుస్తులతో కూచునిఉన్నారు. మరి కాస్సేపటికి పిల్లలకు ఇళ్లకు వెళ్ళటానికి అనుమతి దొరికింది. ఆ వెళ్ళిన రెండు కార్లలో ఎందులోనో 'వైస్రాయి' ఉన్నాడని సుందరం ఇంటికొస్తూ తెలుసుకున్నాడు.
ఈ వృత్తాంతాన్ని వినగానే శేషగిరి, అసలే యుద్ధం. అందులోనూ వందేమాతరం తరువాత ఇంగ్లీషువాళ్ళు చాలా జాగర్తగా ఉంటున్నారు.... వైస్రాయి ఊటీ వెళ్తున్నాడు గామాలు... ఈ యుద్ధం త్వరగా అయిపోతే బాగుణ్ణు. ధరలు మండిపోతున్నాయి. కిరసనాయిలూ అవీ దొరక్క నానా ఇబ్బందీ అవుతున్నది!" అన్నాడు.
సుందరం యుద్దాన్నిగురించి వినటం ఇది రెండోసారి.
సుబ్రహ్మణ్యం పంతులు రోజూ పొద్దూకుమాట్ల వచ్చి సుందరాన్ని చదివించసాగాడు. సీతమ్మ పూర్తిగా పొరపాటుపడలేదు. సుందరానికి చదువుమీద ఉండిన ఆసక్తి ఎట్లాగైనా కాస్త మందగించింది. వాడు బాగా ఆటలూ, తిరుగుళ్ళూ మరిగాడు. అయితే వాడిలో ఇప్పుడు వెనకలేని ఆత్మవిశ్వాసం ఉన్నది." ఈ పాఠం ఆరుసార్లు చదివి అప్పగిస్తా" అనేవాడు. అప్పగించేవాడు కూడానూ.
౮
ఒళ్ళు పగిలే రోహిణి గడిచి మృగశిర బిందించి ముసలెద్దు రంకెవేసింది. ఆయేడు ఎండలూ, వానలూకూడా విపరీతంగానే ఉన్నాయి. శంకరంగారిది ఎండకిల్లుగాని వానకిల్లుగాదు. ఇల్లంతా జలాజంత్రం. ఇదికూడా తన కష్టాలకు తగ్గట్టే వచ్చిందనుకున్నది సీతమ్మ. అయితే అదృష్టవశాత్తూ సొంత ఇంటికి మారటాని కింకా పదిహేనురోజులే ఉన్నది.
ఒకనాడు వానకురిసి వెలిసిన తరువాత శేషగిరి పాడు పెట్టిన ఇల్లు చూడటానికి బయలుదేరాడు. శేషగిరి వెంట సుందరంకూడా బయలుదేరాడు. ఆ ఇంటో ఏ దయ్యాలో భూతాలో ఉండి, తనను భయపెడతాయని సుందరానికి ఏమూలో అనుమానం తీరా తలవాకిలి తలుపు తాళంతీసి ఆవరణలోకి వెళ్ళేసరికి సుందరానికి నిజంగానే భయంవేసింది. కాని ఏ దయ్యన్నీ, భూతాన్నీ చూసికాదు___ ఇంటి చుట్టూ ఉన్న ఆవరణ కీకారణ్యంలాగా అయింది. ఎక్కడపడితే అక్కడ గడ్డి మొలిచి సుందరం ఎత్తునా పెరిగింది. ఎన్నడూ కనీవినీ ఎరగని పిచ్చిపిచ్చి మొక్కలన్నీ ఎక్కణ్ణుంచి వచ్చాయో, ఏపుగా పెరిగాయి.
