Next Page 
వసుంధర కధలు -3 పేజి 1

                   
                         ఈ తప్పు క్షమించలేను!
                                                                 ---వసుంధర

                      


    అలారం గణగణ మ్రోగింది.
    నాకు మెలకువ వచ్చింది. మంచంమీద నుంచి లేవబోయాను
    కానీ రాధ నన్ను కరిచిపెట్టుకుని పడుకుని ఉంది. అలారం చప్పుడు వినగానే ఆమె నా చుట్టూ తన బంధాన్ని మరింత బిగించింది.
    నేను మృదువుగా ఆమె చేతుల్ని విడిపించుకోబోయాను.
    "అప్పుడే లేవద్దు-...."ముద్దుగా, గారంగా అంది రాధ. ఆమె కనులు మాత్రం యింకా మూతబడే ఉన్నాయి.
    "టైము యేడున్నరయింది-తెలుసా?" అన్నాను.
    "రాత్రి మీరు వచ్చేసరికి పన్నెండున్నర దాటింది-గుర్తుందా?" అంది రాధ ఇంకా ఆమె కళ్ళు తెరవలేదు.
    నేను తడబడి-"అయితే?" అన్నాను.
    "మీ రాలస్యంగా యెందుకొచ్చేరూ అనడగడం లేదు నేను. కనీసం ఎనిమిదిగంటలసేపయినా కలిసి మంచం మీద పడుకుందామంటున్నాను...." అంది రాధ.
    "అయితే?"
    "రాత్రి మనం పడుకునేసరికి ఒంటిగంటయింది. తొమ్మిదిదాకా మనం నిద్ర లేనక్కర్లేదు-...."
    "అయితే నువ్వు పడుకో....."
    "మీరు వెళ్ళిపోతే నాకు నిద్రపట్టదు...." ముద్దుగానే అంది రాధ.
    "నీకేమో ఒకటే నిద్ర. నాకేమో నిద్రపట్టదు....." నేనింకా యేదో అనబోతుండగా-"మీకు మాత్రం నిద్రెందుకు పట్టదు? మీరూ నాతోపాటే కదా నిద్ర పోయింది...." అని యెదురు ప్రశ్నవేసింది రాధ.
    "నాకు నిద్ర తక్కువ-" అన్నాను.
    చటుక్కున లేచి కూర్చుంది రాధ. ఆమె కళ్ళలో మత్తు పూర్తిగా విడిపోయింది-"నాకూ నిద్ర తక్కువే! మీరు ఆఫీసులో నిద్రపోతారు, సినిమా హాల్లో నిద్రపోతారు. నేను మీరు పక్క నున్నప్పుడు మాత్రమే నిద్రపోతాను."
    "నేను ఆఫీసులో నిద్ర పోతానని నీ కెవరు చెప్పారు?"
    "మా నాన్న!"
    కోపాన్ని పళ్ళ బిగువున ఆపుకున్నాను. రాధ తండ్రి రామమోహనరావు ఆస్తిలో, అంతస్థులో నా కంటే ఎన్నో రెట్లు గొప్పవాడు. ఇప్పుడు నాకున్న ఆస్తి, అంతస్థు కూడా ఆయనవల్లే వచ్చాయి. నే నంటున్న యిల్లు ఆయనది. నేను చేస్తున్న ఉద్యోగం ఆయనిప్పించి నది. ఆయనకు నామీద అట్టే సదభిప్రాయం లేదు.
    రాధ నన్ను ప్రేమించింది, రాధ ప్రేమ నాయన ఆమోదించాడు. మాకు పెళ్ళి జరిగింది.
    ఆయనకు రాధ ఒక్కతే కూతురుకాదు. రాధకు ముందు ఇద్దరు. రాధ తర్వాత ఒకరు వున్నారు. ఆయన పెద్దల్లుళ్ళిద్దరూ అన్నివిధాలా ఆయనకు దగినవాళ్ళు. నేనూ వాళ్ళకులా వుండాలని, ఆ ఎత్తున ఎదగాలని ఆయన అభిలాష. అయితే నాకు నేను చేస్తున్న ఉద్యోగమే ఎంతో తృప్తిగా వుంది. నాకు పెద్దగా కోరికలేమీ లేవు. చేతిలో డబ్బుంది. చక్కటి ఇల్లుంది. ఇంతకంటే ఎందుకూ అనిపిస్తుంది.
    "ఇదే సంతృప్తి అన్ని రంగాల్లోనూ వుంటే నిన్ను చేసుకున్నందుకు రాధంత అదృష్టవంతురాలుండదు-"అంటాడు రామమోహనరావు. కానీ నేనంటే ఆయనకేదో అసంతృప్తి వుంది, అది చూచాయగా నేనూ అర్ధంచేసుకోగలను.
    ఆయన నా గురించి రాధ దగ్గర వేళాకోళంగా మాట్లాడుతూంటాడని ఇప్పుడర్ధమయింది నాకు. నేను రాధవంక చూశాను. ఆమె పళ్ళ బిగువున నవ్వుకుంటోంది.
    "నువ్వు మీ నాన్న మాటలు నమ్మావా?" అన్నాను.
    "నిజం చెబితే నమ్మనా?" రాధ తమాషాగా నవ్వింది. ఆ నవ్వులో అమాయకత్వం వుంది. అది నిజంగా అమాయకత్వం కాదు అందం ఆమెకిచ్సిన వరం ఆ అమాయకత్వం అందుకే ఆ అమాయకత్వం నన్ను కవ్విస్తుంది.
    నేనామె చులుకంపై ముద్దు పెట్టుకొని-"నా గురించి నీకీ ఆకారాలన్నీ ఎందుకు?" అన్నాను.
    "ఇందులో ఆరా ఏముంది? నాన్న చెబితే విన్నాను. మీరు ఆఫీసులో నిద్రపోతున్నారంటే నాకు సంతోషం కూడా కలిగింది-" అంది రాధ.
    "ఎందుకు?"
    "ఇంట్లో మీరెప్పుడూ పట్టుమని ఆరేడు గంటలు కూడా నిద్రపొరు. మీకు నిద్ర చాలదని నా భయం. నిద్ర తక్కువైతే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందిట. ఆరోగ్యం చెడిపోతుందిట...." అంది రాధ. మళ్ళీ అదే అమాయకత్వం ఆమె ముఖంలో.
    నన్ను నేను నిగ్రహించుకొని- "ఆఫీసులో నేనేం చేస్తూంటానూ అని ఆరాతీస్తున్నావన్నమాట. అది నాకు సంతోషంగాలేదు-" అన్నాను.
    "అందులో నేను తీసిన ఆరా ఏమీలేదు. ఆరా అంటే రాత్రి మీరు పన్నెండున్నరకొచ్చారూ-అప్పుడు ఎందుకొచ్చారూ అని నిలదీయడం!" అంది రాధ.
    నేను తడబడి-"నిలదీయలేకపోయావా?" అన్నాను.
    "అలాంటివి నా కసహ్యం. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. ఆలస్యంగా వచ్చినప్పుడు కారణం చెప్పడం మీ బాధ్యత. చెప్పలేదంటే అది నేను తెలుసుకోతగ్గ ముఖ్య విశేషం కాదన్నమాట....." అంది రాధ.
    నేనుండబట్టలేక-"ఒకవేళ అది నీకు ముఖ్య విశేషమే అయి-నీనుంచి రహస్యంగా వుంచుతున్నాననుకో-అప్పుడు!" అన్నాను.
    "మీరు నానుంచి రహస్యం దాచినా, అబద్దం చెప్పినా అందులో నా తప్పూ కొంత వుంటుంది....." అంది రాధ-"మీకు నా గురించి పూర్తిగా అర్ధం కాలేదన్నమాట. అర్ధమైతే నా నుంచి రహస్యం దాచరు. నాకు అబద్ధం చెప్పరు....."
    "ఎందుకని?"
    "నాకు పరిస్థితులపట్ల పూర్తి అవగాహన వుంది. మా నాన్న మాలో విశాల భావాలు నూరిపోశాడు. తప్పుచేస్తే సానుభూతితో అర్ధం చేసుకోగలను. తప్పుచేసిన మనిషి పశ్చాత్తాప పడితే క్షమించగలను. ఎందుకంటే తప్పు చేయడం మానవ సహజం. ఏదో బలహీనతలో ప్రతి మనిషికీ తప్పుచేయాల్సిన సందర్భం ఏర్పడుతుంది. బలహీనతను జయించినవాడు మహాత్ముడు. జయించలేనివాడు సామాన్యుడు....."
    "ఇంతకీ యిదంతా నువ్వెందుకు చెబుతున్నావు?"
    "ఉదాహరణకు మీ జీవితంలో నాతో వివాహానికి ముందు మరో స్త్రీ వున్నదనుకోండి. ఇప్పుడు మీ మనసులో ఆ స్త్రీకి స్థానం లేకపోతే-నేను మిమ్మల్ని మీ గతానికి తప్పుపట్టను, ఇప్పుడైనా పొరపాటున ఓ స్త్రీతో తప్పుచేశారనుకోండి. సవివరంగా నాకు తెలియబరిస్తే మిమ్మల్న్ధర్ధం చేసుకుందుకు ప్రయత్నిస్తాను తప్పితే-సాధించను. అలాంటి నా దగ్గర రహస్యాలు దాచి అబద్దాలు చెప్పే భర్తను దురదృష్టవంతుడని అనాలి...."
    "నామీద నీకేదో అనుమానం కలిగింది. నిజం చెప్పించడానికే యిలా మాట్లాడుతున్నావనుకుంటాను-" అన్నాను.
    రాధ నాకు దగ్గరగా జరిగి- "నేను మిమ్మల్ని ప్రేమించి పెళ్ళిచేసుకున్నాను. నా ప్రేమ నన్ను మోసం చేయదని నాకు తెలుసు. నేను మిమ్మల్ని పూర్తిగా నమ్ముతున్నాను. మీరూ నన్ను నమ్మండి-"అంది.


Next Page 

WRITERS
PUBLICATIONS