Next Page 
ఉన్నతశిఖరాలు పేజి 1

 

                         ఉన్నతశిఖరాలు
                                                                  ---కోమలాదేవి

                                

 

    ఫ్లాట్ ఫారం కిటకిటలాడుతోంది.
    ఆ రోజు యూనివర్శిటీ విద్యార్ధులు విద్యార్ధినులతో ప్రొఫెసర్లతో సహా టూర్ కు వెళ్తున్నారు. అంతేకాదు ఇంజనీరింగు ముఠా వెటరనరీ వారు ఢిల్లీవైపుగా పోతున్నారు. ఎవరికి వారు హడావిడిగా తమ తమ సామాను సర్దుకుంటూ కెమెరాలు ఫ్లాస్కులు భుజాలకు వ్రేలాడ వేసికొని ఏవో కబుర్లు చెప్పుకుంటూ పచార్లు చేస్తూ ఆ చోటు నీ గుంపుకేసి పులుకూ పులుకూ చూస్తున్నారు వాళ్ళ ఈర్ష్యకు కారణమైన అమ్మాయిలు తమలో లేనందువల్లనే యీ అసూయ.
    "వెధవది....బోటనీ తీసుకున్నా పోయేది...అంతా డ్రైగావుండే ఈ కోర్స్ తీసుకున్నాం....ప్చ్..."
    "పోనీ లేవోయ్. నా సంగతటుంచు .... తెలీకడుగుతానుగానీ ఆశావాదిని ఈ కోర్స్ లో నువ్వెందుకు జేరావు"    
    అంతటితో అంతా నవ్వేశారు.
    "బోడి బోటనీ గాని.... ఎన్ని తిప్పలు పడే ఈ సీటు!"
    "బోడి బోటనీ కాదురా నాన్నా.....వూ బోడి బోటనీ అను..."
    "మధ్యలో ఏదో నిట్టూ....తిప్పలా- తిప్పలున్నరా.... రేపు వెళ్ళి మార్కెట్ లో గిరాకీ హెచ్చుతుందనేగా..... తెలుసులేవోయ్-
    వాళ్ళలో వాళ్ళు నవ్వుకుంటున్నారు. ఎప్పడూ కలవకపోయినా ఒకే యూనివర్శిటీనించి వెళ్తున్నందువల్ల ఇంజనీరింగు వెటెరెనరీ వాళ్ళు ఒకటై వాగుతూనే వున్నారు.    
    ప్రేమలత మిగతా నలుగురు ఈ సంభాషణను వింటూ ముసి ముసిగా నవ్వుకుంటున్నా విననట్లే- పరాకుగా వున్నట్లు నటిస్తున్నారు.
    అవతలి వాళ్ళలా కళ్ళు పొడుచుకుంటుంటే- సహ బోటనీ విద్యార్దులు వాళ్ళనింకా ఏడిపించాలని అమ్మాయిలతో కబుర్లు పెంచుతూ సరదాగా కాలక్షేపం చేస్తుంటే యికచూడలేక అవతలివారు దాటిపోయారు. ఈలోపల వాళ్ళ రైలుకూడా వచ్చింది. దాదాపు అందరు బెంగుళూరు, నీలగిరి కొండలకు వెళ్ళటం అదే ప్రథమం. ఎంత ఆతృతతో ఈ టూర్ కోసం ఎదురుచూస్తున్న గడియ రానే వచ్చింది. రైలు యింకా ఆగలేదు నెమ్మదిగా నడుస్తోంది. అంతా లేచి నించుని చిన్న చిన్న సామాన్లు చేతుల్లోకి తీసుకున్నారు...
    అంతలోకి ఆ గుంపు దగ్గరగా చిన్న అలజడి ప్రారంభమైంది. ఎందుకో అవి అటుకేసి చూచినవారు విస్తుపోయి చూస్తున్నారు. ఈ గొడవకంతా కారకుడైన నిరంజన్ అక్కడే ప్రత్యక్షం కావడంతో అందరూ ఆశ్చర్యంతో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
    ఈ టూర్ కు రావటాని కి వీలులేదని ఎలాగో ప్రొఫెసర్లను ఒప్పించి తప్పకున్న నిరంజన్ సమయంలో వీలు చూచుకుని రావటం
    అక్కడ జేరిన నలభై ఏదుగురి హృదయాలు నిరంజన్ రాకతో రంజిలాయి. కానీ ఒక్కరూ - కేవలం ఒక్క హృదయం అసంతృప్తితో కోపంతో జుగుప్సతో కుతకుతలాడింది.
    ఇతగాడెందుకు రావాలి? కొంప మునిగిపోయినట్లంత హడావిడిగా వచ్చాడెందుకని? ఇంతకు ముందు కొన్ని గంటలకు రాలేనివానికి ఇప్పుడెలా సాధ్యమైంది? ఎలా రాగల్గాడు? ఇదే ప్రశ్న అతన్ని వేధిస్తోంది. చేతులు కట్టుకుని అందరిలో వున్నా, వుండనట్లే దూరంగా అతి దూరంగా మసులుతూ క్రోధాన్ని అణచుకున్నాడు సుధాకర్, రిజర్వ్ చేసిన కంపార్ట్ మెంటు చూడటానికి ఇద్దరు కుర్రాళ్ళు వెళ్ళారు. అందరు గుంపుగా నిలబడి వారి రాకకోసం ఎదురు చూస్తున్నారు.
    సుధాకర్ దృష్టి కేవలం ప్రేమలతపై వుంది. ఆమె ప్రతి కదలికను అత్యాసక్తితో గమనిస్తూ పరధ్యానంగా నుంచున్నాడు "ఇక కదలండి" అనగానే బిల బిల మంటూ అంతా ముందుకు నడిచారు.
    ఆరు సీట్లు ఆడవారికోసం కేటాయించి- మిగతావి అంతా సర్దుకున్నారు. ఒక వృద్ధ ప్రొఫెసర్ అమ్మాయిలున్న చోటులో పైబెర్త్ మీద హోల్డాలీ పరచి హాయిగా పడుకొని మరుక్షణంలో గుర్రుపెట్టి నిద్రపోయారు-

                                   
    "ఎంత అదృష్ట వంతుడు" అనుకున్నారు చాలామంది విద్యార్ధులు. పెట్టెంతా గోలగోలగా వుంది. ఎవరిస్థలాల్లో వారు కూచుని కబుర్లలోకి దిగారు. ప్రేమలత కనబడేలా సుధాకర్ కూచున్నాడు.
    అతనలా కూచోటం ఆమెకు చాలా నచ్చింది. గుర్తుగా మెల్లగా నవ్వింది. కానీ మాటలు పెంచటానికి విముఖత చూసింది?
    నిరంజన్ ఎక్కడో పై బెర్త్ మీద హోల్డాలో పరచుకుని పెర్రీ మేసన్ తెరిచాడు.
    రైలు కదిలింది. విద్యార్ధులంతా గోలగా ఒక్కసారి అరిచారు. ఫ్లాట్ ఫాం దూరమైంది. రైలు వేగం హెచ్చింది. ఆ చీకట్లో ఆగకుండా సాగిపోతోందా రైలు.
    దానితో ప్రేమలత ఆలోచనలు పోటీ పడ్తున్నాయి. ఆమె తీవ్రంగా ఆలోచిస్తోంది.
    నిరంజన్ ఎందుకొచ్చాడు? రాలేనని నిక్కచ్చిగా చెప్పాడే - ఆడ పిల్లలంతా ఒక చోటచేరి కబుర్లు చెప్పుకుంటున్నా వాళ్ళతో తను కలవలేకపోతోంది.    
    ఆమె ప్రక్కగా తొంగిచూచింది. సుధాకర్ మందస్మితవదనం చూచి హృదయం ఆనందంతో పరవశించింది. చటుక్కున తల తిప్పేసుకుంది.
    జనవరి నెల చల్లని గాలి విసురుగా కిటికీలోంచి వీస్తోంది. ఆమెలేచి కిటికీ మూసింది.
    "ఏం ప్రేమా -అప్పుడే - పక్కమీద జేరావు?" కొంచెం నిరాశగా అంది గీతాంజలి.
    "బాగా అలసిపోయాను....నిద్ర ముంచుకొస్తోంది" అంటూ బ్లూ లైట్ వేసి రగ్గు కప్పుకొని కళ్ళు మూసుకుంది కానీ నిద్రరాలేదు. సుధాకర్ తో మాట్లాడాలని లేదు. అందుకే నటన.
    ప్రేమలత అటుకేసి తిరిగి పడుకుంది. అంటే అందరిదృష్టికి నిద్రపోతోంది. ఆమె ఏం చేస్తున్నట్లు! ఏవేవో ఆలోచనలు!

                            *    *    *

    కొన్నాళ్ళ క్రితం అంటే వాళ్ళంతా క్రొత్తగా బోటనీ అవర్స్ క్లాస్ లో నెలరోజులు గడిపిన తర్వాత గబుక్కున వాళ్ళ సంఖ్య ఒకటి పెరిగింది.    
    అమ్మాయిలకు ఈ వివరాలేవీ తెలియవు.
    ఆ క్రొత్త వ్యక్తి వస్త్రధారణలో. మాట తీరులో. మనిషి నడకలో అంతా నూతనత్వం గోచరిస్తోంది.        ఆ మాతృభాష తెలుగే అయినా ఏదో యాసగా మాట్లాడుతుంటే కోస్తా జిల్లాలవారికి ఎబ్బెట్టుగా వుంది హైదరాబాద్ తెలుగు విని అలవాటు పడిన ప్రేమకు అదేమీ విపరీతంగా తోచలేదు అతని మాటలు వినాలన్న కుతూహలం ఆమెకెప్పుడూ కల్గేది.
    ఆరోజు అమ్మాయిలంతా వచ్చి కూర్చున్నారు ప్రొఫెసర్. వేదాంతి గారు క్లాసులోకి రాగానే ఆ నూతనవ్యక్తి ఏదో కాగితం అందిచ్చి వినయంగా నుంచున్నాడు. ప్రొఫెసర్ గారు ఆ కాగితం మడతలను అతి జాగ్రత్తతో విప్పి చదవడం పూర్తి చేశాక కొన్ని క్షణాలు మౌనంగా అతనికేసి చూస్తూండి పోయారు. నిరంజన్ అన్నగా నుంచుని అతనివైపు సూటిగా చూస్తూ గంభీరంగా జవాబు లిస్తున్నాడు. ప్రొఫెసర్ గబగబా పేరూ, ఊరూ ఇత్యాది ప్రశ్నలు వేశారు. ఆ జవాబులు విన్నవారంతా ఆశ్చర్యంతో చూస్తుండిపోయారు. ఆ జవాబుల సారాంశం ఇది అతని పేరు నిరంజన్. తండ్రి ఆఫ్రికాలో వ్యాపారం చేసేవాడు. రెండు తరాలకు ముందే వాళ్ళవాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. ఇప్పుడు జరుగుతున్న విప్లవాల ధాటికి తాళలేక. తలదాచుకోను చోటులేక. ఆరాజ కత్వాన్ని ఎదిరించే సాహసంలేక. రక్షణానికి వెళ్తే అక్కడి శ్వేత జాతి వారి ఆధిక్యాన్ని సహించలేక తిరిగి వచ్చిన భారతీయ కుటుంబాలల్లో వీరి దొకటి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోగల వ్యవహార దక్షతగల అతని తండ్రి శ్రీనివాసరావు ముందే ఆలోచించి వీలు దొరికిన వెంటనే మొదటి నౌకలో మాతృదేశానికి తరలివచ్చాడు? అంతే.
    అతని కున్న రెండు బంగళాలు, ఒక కారు, ఒక జీప్, నాలుగు గుర్రాలు, బోలెడన్ని సామానులు మాత్రం తెచ్చుకోలేక పోయాడు. కానీ ఒకడ్ని దేహీ
 అనకుండా ఈ జీవితయాత్ర సాగించగలిగినంత ధనంతో- కుటుంబంతో తిరిగొచ్చాడు. భార్య బూవతమ్మ మహా సాధ్వి' ఓర్పుకు భూదేవి తోబుట్టువనే చెప్పుకోవాలి. వారి కిద్దరు కొడుకులు ఒక్క కూతురు.
    హైదరాబాద్ లో చిన్నయిల్లు కొనుక్కుని స్థిరపడిపోయారు. ఆఫ్రికాలో రాజభవనాల్లాంటి గృహాల్లో నివసించి. రాజభోగాలనుభవించి ఇక్కడికి రాగానే సామాన్యమైన జీవితాని కలవాటు పడటం కొంతవరకు కష్టమే అయింది. ఆ సుఖాలన్నింటిని మగవాళ్ళు. తల్లి మర్చిపోగల్గారేమోగాని. కూతురు సరళ మాత్రం ఇంకా గతంలోనే జీవిస్తూ దినాలు గడుపుతూంది.    
    ఆ కొద్దివివరాలు తెలిసిన తర్వాత నిరంజన్ లో క్రొత్తదనం ఎందువల్ల కొట్టవచ్చినట్లు అగుపిస్తోందో అప్పటికి తెలుసుకో గల్గారు.
    పాపం అనుకున్నారు.
    పాఠం మొదలైంది. కానీ మునుపున్నంత శ్రద్ధతో ఎవ్వరు వినటం లేదు.
    ప్రొఫెసర్ సమయం కాకముందే వెళ్ళిపోయాడు. ఆయన కూడా చలించి పోయారా? ఏమో?
    ఎప్పుడూ నిరంజన్ చుట్టూ ఓ గుంపు వుండేది. ఆ గుంపులో దూరి అతను చెప్పే విషయాలు వినాలనే కోరిక ఆడపిల్లల్లో ఎక్కువగా వుండేది. కానీ విధిలేక దూరంగా వుండవలసి వచ్చేది.
    ఆఫ్రికాలో పుట్టి పెరగటం వల్ల ఆఫ్రికా అడవి జాతి వారిపై అత్యంత భక్తి శ్రద్ధలు గౌరవం వున్నాయి నిరంజన్ కు. వారి వేష భాష లపై ఆహార అలవాట్లపై శరీరావయవ సృష్టి విధానంపై ఎవరైనా తీవ్రంగా విమర్శించినా. చులకనగా మాట్లాడినా సహించేవాడు కాడు.
    ఒకరోజు అల్లరివాడు. అందరికన్నా తుంటరివాడైన మనోహర్ ఎగతాళిగా మాట్లాడేడు..." ఏనాటి అనుబంధ బాంధవ్యలో నిరంజన్ - పూర్వ జన్మలో నువ్వు తప్పక ఏదో ఆఫ్రికా జాతివారి బిడ్డవై వుండాలి సుమా!"
    నిరంజన్ కోపంతో రెచ్చిపోలేదు. సీరియస్ గా - మనోహర్ ముఖంకేసి చూచి నెమ్మదిగా అన్నాడు.
    "అందులో తప్పేముంది.... అది కూడా మానవ జన్మ కదా! మానవుని మానవునిగా గౌరవించే రోజులు రాలేదు. ప్రపంచం అన్ని విధాలుగా ఎంత ముందంజ వేస్తున్నా, చంద్రమండలానికి జేరుకున్నా ఈ విషయంలో అది వెనుకంజ వేస్తోంది రామ రామ మనిషికున్న డబ్బును బట్టి విలువ యిస్తున్నారుగని వ్యక్తిగతంగా అతనికి లభించే గౌరవం అతి స్వల్పం.....తెల్ల తోలుండాలి. అందంగా వుండాలి. డబ్బుండాలో. ఆధునిక వస్తు సామాగ్రితో కూడిన అధునాతన గృహంలో నివసించాలి. అప్పుడే ఆ వ్యక్తి మానవుడుగా గౌరవింపొందాడు...వాళ్ళ ననే దానికంటే ముందు మన ఇల్లు చక్కబెట్టుకోవటంలో ఎంతైనా అర్ధం వుంది... భిన్న జాతుల్లో విభిన్న మన స్తత్వాలు గూడు కట్టుకుని స్థిరంగా వున్న వాళ్ళలో ఇలాంటి భేదాభిప్రాయాలుండటంలో అసహజత ఏమీ లేదు... కానీ మన మాటేమిటి? భిన్నత్వంలో ఏకత్వం సాధించుకున్న మనలో ఈ చులకన జేసి మాట్లాడే విధానం- చిన్న చూపు చూచే సంకుచిత స్వభావం ఇంకా ఎందుకు మాసిపోలేదో.... లేదు మనోహర్....మనం మారలేదు..... అంటే మానవుడు మారలేదు. అహం అనేది అతని కిరీటం. తమ తనవారు- తనజాతి- తనశాఖ తన కులం- తను తన-కు ప్రాధాన్యత తన జీవిత విధానంలో ఎటువంటి మార్పునూ సహించలేడు-అనాదిగా మన పూర్వీకులు గిరిగీచిన పరిధిని-ఎన్ని అవాంతరాలొచ్చినా దాటడానికి ధైర్యం చాలని అసమర్ధుడు. పిరికివాడు. అందుకనే ఇన్ని సంవత్సరాలు దాటినా నిఫా, బస్తరీ, మధ్యప్రదేశ్ ఆదిమ నివాసులు ఆదిమ నివాసుల్లానే మిగిలిపోయారు. కారణం, వారిని గూర్చి చింతించిన నాధుడు లేడు. ఒకవేళ వున్నా స్వార్ధం కోసం, వారిని మార్చటానికి వారిలో వుండే దురలవాట్లను, అమానుషత్వాన్ని రూపు మాపటానికెవరైనా ప్రయత్నించాలా? పోనీ ప్రయత్నించిన వారెందువల్ల విఫలురయారు?....సంఘంలో అతని స్థానం మనకంటే తక్కువ అని మనం నిర్ణయించాము. ఎప్పటికీ ఆ తగ్గు స్థితినించి ఎక్కేది లేనప్పుడు వారికి మాత్రం మారాలన్న తాపత్రయం ఎందుకుంటుంది? మాటకారి, కోపిష్టి అయితే ఆమెను మంత్ర గత్తెక్రింద జమకట్టి గప్ చుప్ గా తొలగించేస్తారు, కరువు-అనావృష్టికి కారణం అలాంటి స్త్రీ తమమధ్య వుండటంవల్లనే అవి వాళ్ళ దృఢ నమ్మకం, ఈ నమ్మకం కల్గించేవాడు వాళ్ళు మంత్రగాడైన వైద్యుడు! అతని మాటకు తిరుగులేదు తన భుక్తి గడవాలి-తన హస్తలాఘవంపై నమ్మకం కుదరాలంటే వాళ్ళను తన వశం చేసుకోవాలి. తనపై నమ్మకం, విశ్వాసం కుదరాలి-ఆమె- ఆ స్త్రీ మంత్రగత్తె-ఆమెను చంపాలి - అంటే గ్రామం-గ్రామం ఏకమై ఆమెను చంపుతుంది.....ఇలాంటి సంఘటనలు మనదేశంలో మనమధ్య జరుగుతుంటే ఎవర్నో అనటం దేనికి...


Next Page 

WRITERS
PUBLICATIONS