మృత్యు మందిరం
వసుంధర

"రిక్షా ఇక్కడ అపు--" అన్నదా అమ్మాయి.
రిక్షా ఆగింది. ఆ అమ్మాయి హడావుడిగా రిక్షా లోంచి దిగి వాడి చేతిలో ఓ రూపాయి నోటు పెట్టి -- "చిల్లరక్కర్లేదులే -- వెళ్ళు!" అని ఎదురింటి ముందుకు నడిచి తలుపు తట్టింది.
తలుపు తీసిన పాతికేళ్ళ యువకుడు లుంగీ పంచ ధరించి ఉన్నాడు. వంటి మీద బనియన్ కూడలేదు. అతనా అందమైన యువతిని చూసి కంగారుపడి ముడుచుకు పోతూ ---" ఎవరి కోసమండీ ?" అన్నాడు.
"మీకోసమే -- నన్ను కాస్త లోపలికి రానిస్తారా?" అందా అమ్మాయి చొరవగా. అతను సమాధానమిచ్చే లోగానే ఆమె గదిలోకి ప్రవేశించింది. చేసేదేమీ లేక అతను వెనక్కు తప్పుకున్నాడు. ఆమె గది తలుపులు వేసేసింది.
"ప్లీజ్ ----నేను బ్రహ్మచారిని..." అన్నాడతను కంగారుగా.
"మీరేమీ కంగారు పడకండి. నేను కూడా కన్నె పిల్లను...." అందా అమ్మాయి.
ఆ యువకుడి కేమీ అర్ధం కాక ఆమె వంక వెర్రి చూపులు చూశాడు.
"మీరలా చూస్తుంటే నాకు భయమేస్తోంది. ధైర్యంగా హీరోలా చూడలేరూ?' అందామె నిట్టురుస్తూ.
ఆ యువకుడు చిలక్కొయ్య వద్దకు వెళ్ళి చొక్కా వేసుకుని వచ్చాడు. అ అమ్మాయిని సమీపించి -- "మీ సంగతేమిటో చెప్పండి!' అన్నాడు.
సరిగ్గా అప్పుడే యెవరో తలుపు దబదబా బాదారు.
"ప్లీజ్ -- ఈ ఇంట్లో యెవ్వరూ లేరని చెప్పండి. నేనలా మంచం కింద దాగుంటాను...." అందా యువతి దీనంగా అతని వంక చూస్తూ.
"ఎందుకు?" అన్నాడతను.
"మీరు నాకీ ఉపకారం చేయకపోతే ఈరోజే నా ప్రాణాలు పోతాయి--'
ఆ యువకుడింకా ఆమెను ప్రశ్నించబోయాడు కానీ మళ్ళీ ఎవరో తలుపు దబదబా బాదారు. ఆ యువతి ఒక్క వుదుటున మంచం కిందకు చేరింది.
తప్పేది లేదనుకుంటూ ఆ యువకుడు వెళ్ళి తలుపు తీశాడు.
నిలువెత్తు ఉన్న ఓ యువకుడు అతన్ని చూసి -- "తలుపు తియ్యడానికి కంత అలస్యమా?" అన్నాడు చిరాగ్గా.
గదిలోని యువకుడికి విషయం అర్ధం కాలేదు-- "మీరెవరో చెబుతారా?' అన్నాడు.
"నా పేరు రమేష్! ఇప్పుడే మీ గదిలోకి అమ్మాయి వచ్చింది. ఆమె కోసం వచ్చాను...." అన్నాడు రమేష్. అతని కళ్ళు గదంతా వెతుకుతున్నాయి.
'ఈ గదిలోకి ఎవ్వరూ రాలేదు ...." అన్నాడు మొదటి యువకుడు.
"మీరు అబద్ద మాడుతున్నారని ఇప్పుడే ఋజువు చేస్తాను...." అంటూ రమేష్ గదిలోకి అడుగు పెట్టి తలుపు వేశాడు. తర్వాత యువకుడి వంక చూసి -- "నా పేరు చెప్పాను. మీ పేరు కూడా చెబుతారా?" అని అడిగాడు.
"నా పేరు శరభయ్య --" అన్నాడు గదిలోని యువకుడు.
"పేరును బట్టి మీరు బుద్ది మంతులనిపిస్తోంది. బుద్దిగా ఉంటారు కదూ!" అన్నాడు రమేష్ అదోకలా.
శరభయ్య అతని వంక కోపంగా చూసి -- "నా బుద్ది సంగతి సరే -- మీకు బుద్ది వున్నట్లు నాకు తోచడం లేదు. ముందు గదిలోంచి బయటకు వెళ్ళండి...." అన్నాడు.
రమేష్ అతన్ని లెక్కచేయకుండా - "సుజాతా! --వచ్చిందేవరనుకుని దాక్కున్నావో- నేను రమేష్ ను. నీ కోసం వచ్చాను. నీకింకేం భయం లేదు....' అన్నాడు.
"ఈ గదిలో యెవరూ లేరని చెప్పాను గదా -' అన్నాడు శరభయ్య తీవ్రంగానే.
'అలాగంటారెంటండీ -- అదుగో ఆ మంచం కింద నుంచి సుజాత వస్తుంటేనూ ?" అన్నాడు రమేష్.
శరభయ్య ఆశ్చర్యంగా ఆటే చూశాడు. నిజంగానే సుజాత మంచం కింద నుంచి వస్తోంది. ఆమె ఒక్క అంగలో అతన్ని సమీపించి - "నువ్వా రమేష్! ఎవరో అనుకుని అనవసరంగా భయపదిపోయాను...." అంది.
"రమేష్ , శరభయ్య ను చూపిస్తూ -- "నిన్ను తన గదిలో మంచం కింద దాచి నందుకు ఇతగాడి కేం శిక్ష విధించను?' అనడిగాడు.
"తప్పు పూర్తిగా నాదే....ఆయన్నేమీ చేయకు...."అంది సుజాత నవ్వుతూ.
"సరేనండి -- అయితే మీ జోలికి రాను. బ్రతికి పోయారు....." అంటూ గుమ్మం దగ్గరకు వెళ్ళి తలుపు తీశాడు రమేష్. సుజాత కూడా అతన్ననుసరిస్తూ - "మీకు అనవసరంగా శ్రమ ఇచ్చాను. మన్నించండి...." అంది.
"దానిదేముంది . ఫరవాలేదు ...." అన్నాడు శరభయ్య అదోలా చూస్తూ.
ఆమె అతని వంక చూసి నవ్వి వెళ్ళిపోయింది. ఆమె చూపులు-- 'అలా చూడకండీ -- హీరోలా చూడండీ --" అన్నట్లు శరభయ్యకు అనిపించాయి.
"సుజాత చాలా బాగుంది!" అనుకొన్నాడు శరభయ్య.
2
టైం చూసుకున్నాడు శరభయ్య. టైము సాయంత్రం ఆరయింది.
'అంటే సుజాత వెళ్ళిపోయి మూడు గంటలయిందన్న మాట!" అనుకున్నాడతను.
మూడు గంటల క్రితం ఎక్కడికో వెళ్ళి పోయిందను కున్న సుజాత తన కళ్ళ బడ్డ క్షణం నుంచీ తన ఆలోచనల్లో ఉండిపోవడం అతనికి ఆశ్చర్యంగానే ఉంది. స్వల్ప పరిచయంలో మనసు మీద అంత గాడ ముద్ర వేయగలవారు చాలా తక్కువ మంది వుంటారు.
అయితే వయసులో ఉన్న పెళ్ళి కాని యువకులకు పలకరించిన ప్రతి ఆడపిల్లా కాస్త అందమైనదైతే చాలు మనసులో ఉండి పోవడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఆ అమ్మయలా కాదు -- ఉన్న కాసేపటి లోనూ తను మరిచి పోలేని డైలాగులు కొన్ని చెప్పి మరీ వెళ్ళింది.
నేను బ్రహ్మచారి నైతే తను కన్నె పిల్లనంది. నువ్వు హీరోలా చూడాలంది. అ రమేష్ రాకపోతే ఏమి మాట్లాడేదో ఇంకా....
అసలా పిల్ల ఎవరు? రమేష్ కూ ఆమెకూ ఏమి సంబంధం? ఆమె తన గదిలోకి హడావుడిగా పరుగెత్తుకొచ్చిన కారణం ఏమిటి?"
ఈ ప్రశ్నలు మూడు గంటలుగా బుర్రలో తొలుస్తూనే వున్నాయి శరభయ్య కు. అతనికి జవాబు దొరకడం లేదు. జవాబు దొరకడానికేదైనా అధారమయినా ఉండాలి కదా!
శరభయ్య మళ్ళీ టైము చూసుకున్నాడు. టైము అరుం పావయింది.
అది అతను ఎక్సర్ సైజు చేసే సమయం.
శరభయ్య ప్రతి రోజు ఉదయం, సాయంకాలం ఆరు గంటల పదిహేను నిముషాలకు వ్యాయామం చేస్తాడు. ఆ కారణం గానే అతను మొదటి అట సినిమాకు సాధారణంగా వెళ్ళడు. ఆరుగంటల పదిహేను నిముషాలకు వ్యాయామం చేయడం కుదరకపోతే ఆ పూటకు మానేస్తాడు. తప్పితే మరో సమయంలో చేయడు. ఉదయం పూట వ్యాయామం సంగతెలా ఉన్నా సాయంత్రాలు మాత్రం అప్పుడప్పుడు వ్యాయామం మానేయాల్సోస్తుంటుందతనికి. ఈరోజు అలాంటి అవసరం రాలేదు.
శరభయ్య వ్యాయామం చేసే ప్రదేశంలోనే మంచం వేసుకుంటాడు. వ్యాయామం చేసేటప్పుడు మంచం ఎత్తి గోడవార పెడతాడు. వ్యాయామం కాగానే మళ్ళీ మంచాన్ని యధాస్థానంలో ఉంచేస్తాడు.
వ్యాయామం కోసం మంచాన్నేత్తిన శరభయ్య మంచం కింద కనబడ్డ కాగితాన్ని చూసి ఉలిక్కిపడ్డాడు. ఆ కాగితం మీద పెద్ద పెద్ద అక్షరాలతో ఇలా రాసి ఉంది.
"నేను ప్రమాదం లో ఉన్నాను. రక్షించండి. రాత్రి తొమ్మిది గంటలకు త్రివేణి హోటల్లో నలభై యారో గదికి వస్తే నన్ను రక్షించగలరు-- సుజాత!"
శరభయ్య ఉలిక్కిపడ్డాడు.
సుజాత ప్రమాదం లో ఉందా? ఎవరి కారణంగా ఆమెకు ప్రమాదం కలిగింది?
బాగా ఆలోచించాక శరభయ్య బుర్ర పని చేసింది. సుజాత ను రమేష్ తరుముతున్నాడు. ఆమె పారిపోయి తన గది చేరింది. అయితే రమేష్ బారి నుండి తను ఎంతో సేపు తప్పుంచుకు తిరగలేనని ఆమె గ్రహించి ఉంటుంది. అందుకే తన గదిలో మంచం క్రింద చేరి ఈ వుత్తరం రాసింది. తనకున్న స్వల్ప వ్యవధిలో ఆమె చాలా తెలివైన పని చేసింది. తర్వాత అసహయురాలై రమేష్ తో వెళ్ళిపోయింది. తననేలాగూ రమేష్ కనుగొంటాడని ఆమెకు తెలుసు. అతను కనుగోనేలోగా తనే బయట పడింది.
ఆమె రమేష్ తో మనస్పూర్తిగానే వెడుతున్నాదని అప్పట్లో తననుకున్నాడు. ఆమె కనులు తనవంక చూసిన జాలి చూపుల నా క్షణంలో అర్ధం చేసుకోలేక పోయాడు.
శరభయ్య క్షణం సేపు ఆలోచనలు కట్టిపెట్టి బస్కీ తీయడం ఆరంభించాడు. ఓ యాభై బస్కీలు తీసుక బుల్ వర్కర్ ను తీశాడు. అయిదు నిముషాలు దాంతో వ్యాయామం చేశాడు. ఉబ్బిన తన ఛాతీ వంక, మెలితిరుగుతున్న కండరాల వంక చూసుకుని నిట్టూర్చి -- "ఇంకా కాస్త పోడుగుంటేనా ?' అనుకున్నాడు.
శరభయ్య పొట్టివాడు కాదు. నిలువెత్తు రమేష్ ను సుజాత పక్క చూశాక అతనికి తను పోట్టివాడినని అనిపించింది. రమేష్ ని తననూ చూసి సుజాత తన గురించి ఏమనుకుందో ననిపించింది.
రమేష్ తనకంటే పొడగరి కావచ్చు. కానీ సుజాత వంటి అందమైన అమ్మాయిని అతగాడు, భయపెడుతున్నాడు. ఆ అమ్మాయి తనను రక్షించమని అడుగుతోంది.
శరభయ్య తన కండరాల వంక మరోసారి చూసుకుని "సుజాతను రక్షించ లేకపోతె నా వ్యాయామానికి అర్ధమే లేదు--" అనుకున్నాడు.
3
త్రివేణి హోటల్లో అడుగు పెట్టాక శరభయ్య కు భయం వేసింది.
అతనా హోటల్లోకి అడుగు పెట్టడం అదే ప్రధమం. అందులో అడుగు పెట్టాలని అతడెప్పుడూ కోరుకోలేదు. అక్కడ కాఫీ తాగివస్తే పది రూపాయలవుతుందని -- మసాల దోసె ఎనిమిది రూపాయలనీ యెవరో చెప్పగా విన్నాడతను. శరభయ్య ఇతరుల మాటలు స్వానుభవం లేనిదే నమ్మే రకం కాదు. అయితే మసాలా దోస్ ఖరీదు ఎనిమిది రూపాయలన్న విషయం తెలుసుకోవడానికి ఎనిమిది రూపాయలు ఖర్చు పెట్టడం శరభయ్యకు ఇష్టం లేదు.
