శూర్పనక్కా_మేమడిగేది...." ఎరక్కపోయి వచ్చారాం దేవుడా అనుకుంటూ కోపంగానే అన్నాడు నిఖిల్.
"చెప్తున్నా...చెప్తున్నా అంటూనే__స్రౌజర్ ఎక్సేంజ్స్, క్రాస్ బార్ ఎక్సేంజెస్, ఎలక్ట్రానిక్ ఎక్సేంజెస్ అని రకరకాలుగా మా డిపార్ట్ మెంటు ఎదిగింది. క్రాస్ బార్ ఎక్సేంజ్ లో సెలెక్టర్ లుండవు. ఈ సిస్టమ్ ఒక్క గుంటూరులో వుంది. బొంబాయి, కలకత్తాల్లాంటి మహానగరాల్లో మెయిన్ ఎక్సేంజెస్, శాట్ లైట్ ఎక్సేంజెస్ వున్నాయి.
పెద్దగా ఏమీ అర్ధం కాకపోయినా మౌనంగా తలలూపారిద్దరూ....మరో అరగంటయినా ఈ సుత్తి తప్పుతుందా అన్నట్లు నిఖిల్ దిక్కులు చూస్తున్నాడు తెలిసిన వాళ్ళెవరైనా తొందరగా కన్పిస్తే హలో అని విష్ చేసి అటే వెళ్ళిపోదామని. కానీ ఎవరూ కనబడలేదు.
"ఇలాంటి రకరకాల ఎక్సేంజ్ లు వున్నాయి. ఆటోమాటిక్ ఎక్సేంజీలలోనైతే ఒక పద్దతి ద్వారా అంటే....ఓ జి.ఎన్.ఎల్.ఓ.డి ద్వారా ప్రసారాలు జరుగుతాయి. 'ఓ.జి.ఎన్.ఎల్.ఓ.డి' అంటే తెల్సా?" అనడిగింది శూర్పణఖ.
"తెలీదు" దీనంగా అన్నాడు భార్గవ.
"అంటే...ఔట్ గోయింగ్ సింగిల్ లింక్ ఆపరేటర్ డయలింగ్ సర్క్యూట్ అనే పద్దతి ద్వారా ప్రసారాలు జరుగుతున్నాయన్నమాట....అన్నిటికంటే సులభమైన పద్దతేమంటే..."
"డయల్ లో వేలుపెట్టి త్రిప్పటం" అన్నాడు నిఖిల్ కోపాన్ని అణచుకోలేక. ఆ మాటకు శూర్పణఖ నవ్వటం చూసి, భార్గవ కూడా నవ్వాడు నిర్జీవంగా.
"చాలు శూర్పణఖా నీ సమ్మెట దెబ్బలు మాక్కావల్సిన వివరాలు వేరు. అవి చెబితే వెళ్ళిపోతాం" అన్నాడు నిఖిల్ దీనంగా. అప్పుడు ఏమిటీ అంది నిదానంగా. భార్గవకూడా హమ్మయ్య అనుకొని-
"మేడమ్....మొన్నటి నుండి నాకు కొన్ని 'అబ్నాక్షియస్ కాల్స్' వస్తున్నాయి. మీరేమైనా ట్రేసవుట్ చేయగలుగుతారేమోనని...." అన్నాడు భార్గవ.
"అదీ మాక్కావల్సింది" అన్నాడు నిఖిల్.
"తప్పకుండా చేస్తాం! ఎందుకంటే ఏ ఫోన్ ఎక్కడినుండి వస్తుందో ఏం నంబర్ పోతుందో మేం పట్టించుకోం గాని....మీ ఫోన్ అబ్జర్వేషన్ లో పెడితే...అబ్నాక్షియస్ కాల్స్ వచ్చే నంబర్ ని మేం గుర్తించగలం" అంది శూర్పణఖ నిఖిల్ ను కళ్ళతోనే త్రాగేస్తూ.
"ఆ విషయాలే వివరంగా చెప్పింకా" అన్నాడు నిఖిల్.
"ఈ విషయంలో మనం మా జె ఇ గారిని సంప్రదించటం బెటర్. ఆయనయితే మీకు మరే వివరాలైనా అందించగలరు" అంది జూనియర్ ఇంజనీర్ గదివైపు నడుస్తూ.
అయితే పద అంటూ జె.ఇ. గారిని కలిసి విష్ చేసి పరిచయాలయ్యాక అసలు విషయం తెలిపాడు భార్గవ. ఆయన కొంచెం ఏజ్ డ్ పర్సన్. "సిట్ డౌన్ ప్లీజ్" అనేసి ఓసారి బట్టతల నిమురుకొని "భార్గవ గారూ! మీ ఫోన్ నంబర్ చెప్పండి" అన్నాడు.
"559" భార్గవ చెప్పాక అతను నోట్ చేసుకున్నాడు.
"ఇప్పటి నుంచి మేమీ నంబర్ ని అబ్జర్వేషన్ లో పెడతాం! మీకెవరు ఫోన్ చేసినా ఆ ఫోన్ నంబర్ నోటవుతుంది."
"థాంక్యూ సర్"
"మెన్షన్ నాట్....! కానీ ఇక్కడో సమస్య.... దాదాపుగా మేం సర్క్యూట్ చేస్తాం కానీ...ఇల్లీగల్ గా అబ్నాక్షియస్ కాల్స్ వస్తే మేం కూడా మీకు ఏ నంబర్ నుండి చేస్తుందీ కనుక్కోలేకపోతాం" అన్నాడు జె.ఇ. నిరుత్సాహంగా.
వాళ్ళిద్దరూ క్షణం పాటు ఆశ్చర్యపోయారు.
"మీకు తెలీకుండా ఇల్లీగల్ గా ఎవరు ఎవరికీ చేస్తారు చెప్పండి? నంబర్ లేని టెలిఫోన్ లు ఎక్కడైనా ఉంటాయా సార్" అన్నాడు భార్గవ.
"ఎవరు క్రెడిలెత్తినా నంబర్ ప్లీజ్ అనో, లేక డయల్ తిప్పో ముందు మీకే సూచిస్తారు గదా! అలాంటిది..." అడిగాడు నిఖిల్.
మీరనేది నిజమే! నంబర్ లేని టెలిఫోన్ లు కూడా వుంటాయి."
ఈసారి మరింత నోరు తెరిచారు ఇద్దరూ. శూర్పణఖ తన స్లీవ్ లెస్ జబ్బల్ని పక్కనున్న నిఖిల్ కి అద్దుతోంది.
"నంబర్ లేని టెలిఫోన్ లు కేవలం స్టాఫ్ కి వుండొచ్చు. బయటివారికి వుండవు. వాళ్ళు అబ్నాక్షియస్ కాల్స్ పంపే స్థితికి దిగజారలేదనే అనుకుంటాను. ఇకపోతే ముఖ్యంగా ఇలాంటి బెదిరింపులు చేసే వాళ్ళంటూ ఇల్లీగల్ గా ఎలా చేస్తారంటే....అవుట్ డోర్ లోంచి టెలిఫోన్ స్తంభాలెక్కి లేదా బిల్డింగ్ లకు అతి దగ్గరగా వున్న ఫోన్ తీగెల ద్వారా టెలిఫోన్ సాయంతో డయల్ చేసి బెదిరిస్తుంటారు" చెప్పాడు జె.ఇ. బట్టతల మీద కుడిచేతి వ్రేళ్ళు టపటపలాడిస్తూ.
"కాని నాకు చేస్తున్నది ఆడపిల్ల.... ఆడపిల్ల స్థంభాలెక్కి అబ్నాక్షియస్ కాల్స్ పంపటం అసాధ్యం.... హాస్యాస్పదం కూడా" అన్నాడు భార్గవ.
"అవునవును.... నిజమే" అంది శూర్పణఖ. జబ్బును నిఖిర్ కేసి మరింత హత్తుతూ. నిఖిల్ ఓసారి నిగనిగా మెరిసిపోతున్న ఆ నల్లటి స్లీవ్ లెస్ జబ్బను నిశితంగా చూసి ఆ జబ్బమీద ఎలాంటి మచ్చలు లేకపోవటంతో "చిన్నప్పుడు బి సి జి వాక్సిన్స్, శిల్ పాక్స్ వాక్సిన్స్, మీజిల్స్ వాక్సిన్స్ ఇవ్వనట్టున్నారు. ఏనుగుతొండం లాగే వుంది" అనుకున్నాడు మనసులో.
"ఒకవేళ డైరెక్టుగా అయితే మేమే అబ్జర్వ్ చేస్తాం రైటర్ గారూ....ఆ వెంటనే మీకు తెలుపుతాం కూడా."
థాంక్యూ సర్! చాలా విషయాలు తెలిపారు. వెళ్ళొస్తాం అన్నాడు నిఖిల్.
"ఒన్ మినిట్...కాఫీత్రాగి వెళ్ళండి" అన్నాడాయన వేళ్ళు మళ్ళీ బట్టతల మీద టకటకలాడిస్తూ. వాళ్ళమధ్య మాటలేం లేనట్లు నిమిషం పాటు మౌనం. ఆ మౌనాన్ని చీలుస్తూ జె.ఇ. గారి ఫోను రింగయ్యింది.
ఆయన హలో అని మీకే సార్ అంటూ అందించాడు. భార్గవ ఫోనందుకుని చెవి దగ్గర పెట్టుకోగానే.... ముచ్చెమటలు పోసి వేడి సెగలు తాకుతున్నయింది భార్గవకు- తప్పక అదే వ్యక్తయి వుంటుందని.
