Previous Page Next Page 
బేబి!ఓ బేబి!! పేజి 17

    "గొంతుకు, రూపానికి అసలు పోలిక లేదు తెలుగు టీవీ అనౌప్ప ర్ లా. ప్రామిస్ నిర్లిప్తా! మీ నాన్న ఇచ్చిన గోద్రెజ్ బీరువా మీద ఒట్టు....మళ్ళీ ఇంతవరకూ ఆ పార్క్ దిక్కుక్కూడా వెళ్ళలేదు."

    "మా నాన్న బీరువా పెట్టలేదనే కదా మీరలా దెప్పి పొడిచేది" రోషంగా అని వేగంగా బెడ్ రూంలో కెళ్ళిపోయింది నిర్లిప్త. వెనుకే నిఖిల్ వెళ్ళి చటుక్కున కౌగిలించుకొని-

    "పిచ్చిమొద్దూ...ఆ మాటకు నీ మోము మందారమవుతుంది. ఆ మందారంలోని మకరందాన్ని ఓసారి గ్రోలి..." అంటూ చుంబించాడు.

    ఆమె లోలోపలే పొంగిపోయింది.

    నిఖిల్ బయటకొచ్చాక "మరి మనకు కొన్ని వివరాలు కావాలి చెపుతుందంటావా?" అడిగాడు భార్గవ.

    "చెప్పక చస్తుందా? ఇంతకీ ఏం వివరాలు?" అన్నాడు నిఖిల్.

    "దారిలో అంతా చెపుతాను కాని ముందు పద" అనగానే ఇద్దరూ స్కూటర్ మీద బయల్దేరారు.
   
             
                             *    *    *    *


    వాళ్ళిద్దరూ టెలిఫోన్ భవన్ చేరుకునేసరికి పన్నెండయింది. రిసెప్షన్ లోకి వెళ్ళి పర్మిషన్ తీసుకుని లోపలికెళ్ళారు ఇద్దరూ. ఆపరేటర్స్ ఎవరి పనుల్లో వారున్నారు. కొందరు క్యాంటీన్ కు వెళ్ళి టిఫిన్సూ, మీల్సూ గట్రా చేసి వస్తున్నారు అందరి ముఖాలూ నిశితంగా చూస్తున్న నిఖిల్ కు వెనుకనుంచి హల్లో అని విన్పించింది.

    ఈ ఆఫీసులో ఈ పదం మామూలే అనుకుంటూ మరికొందరి ముఖాలు చూస్తున్నాడు. అంతలో మరోసారి స్వీట్ టోన్ హలో అంది. నిఖిల్ వెనక్కి తిరిగి వులిక్కిపడ్డాడు.

    "శూర్పనఖా..." గారాలుపోతూ మెలికలు తిరుగుతూ మరోసారి హల్లో అంది.

    "న....న....న్నమస్తే....బావున్నారా?"

    "బావెవరూ....మా అక్కయ్యకింకా పెళ్ళే కాలేదు" అంది పల్లికిలించి.

    "అదికాదు! మీరు బాగున్నారా? అని! ఇతను మా ఫ్రెండ్ భార్గవ అని....గొప్ప రైటర్" అన్నాడు పరిచయం చేస్తూ.

    "నమస్తే" అన్నాడు భార్గవ వినయంగా.

    "గ్లాడ్ టు మీట్ యూ..." అంది చేయి ముందుకు చాచుతూ. భార్గవ చేయి చాచలేదు.

    "పర్లేదు....పర్లేదు...నైస్ మీట్ యూ" అన్నాడు నిఖిలే.

    "మరీ నల్లపూసలా తయారయ్యావ్! ఫోన్ చేస్తే నేనే వచ్చేదాన్ని కదా నిఖిల్" అంటూ తాకింది శూర్పనఖ చూపుడు వ్రేలిని రింగులు చుట్టినట్టు తిప్పుతూ అది చూసి నిఖిల్ ఇబ్బందిగా ఫీలయ్యాడు.

    "ఎవరైనా చూస్తే అపార్ధం చేసుకుంటారు. అదేంటి?" అని భార్గవ వైపు చూసి "     ఈ టెలిఫోన్ ఆపరేటర్లందరికీ-ఇదే అలవాటు" అన్నాడు.

    అప్పటి వరకూ తెల్లమొహం వేసిన భార్గవకు అప్పుడర్ధమయింది- ఎప్పుడూ చూపుడు వేలితో డయల్ త్రిప్పీ త్రిప్పీ అదే అలవాటని.

    "నీతో పనిపడింది శూర్పనఖా...ఈ టెలిఫోన్ డిపార్ట్ మెంట్ పనితనం మీద కొన్ని వివరాలు కావాలి" అన్నాడు నిఖిల్.

    "అయితే రండి...ప్రాక్టికల్ గా చూద్దురుగాని..." అంటూ ముందు నడుస్తూనే వుంది శూర్పణఖ. ఆమె భారీఖాయం కదులుతూ వుంటే. సర్కస్ మ్యూజిక్ కొట్టాలనిపిస్తోంది నిఖిల్ కు.

    "అసలు విషయం చెప్పేంత వరకూ ఆగదు. దీంతో ఇదే బాధ" నిఖిల్ విసుక్కుంటూనే ఆమెవెంట నడిచారిద్దరూ.

    వాళ్ళింకేమీ అడగక ముందే....ఒక రూమ్ దగ్గర ఆగి-

    "మా డిపార్ట్ మెంట్ లో అతి ముఖ్యమైంది ఇదే....ట్రాన్స్ మీటర్! బయట ధ్వని తరంగాలు సెకనుకు 330 మీటర్ల వేగంతో పోతే....ఇక్కడి ఎలక్ట్రో మాగ్నటిక్ వేవిస్ సెకనుకు 1,86,000 మైళ్ళ వేగంతో అంటే కాంతితో సమానంగా వెళ్తాయన్నమాట...." అంది టెలిఫోన్ సిస్టాన్ని అంతా ఆపసోపాన పట్టిన ఆరిందలా ఫోజుపెట్టి.

    భార్గవ "అదికాదండీ...మేము వచ్చింది అసలు..." అంటూండగానే అదేం విన్పించుకోకుండా ముందుకు కదిలింది గున్నఏనుగులా శూర్పనఖ. పీరిబద్దల్లా వెనుక వాళ్ళు.

    "ఈ దూరభాషిణి యంత్రంలో హేండ్ సెట్ అనేది అంటే....ట్రాన్స్ మీటర్, రిసీవర్ కల్సివున్న భాగమన్నమాట. అది హుక్ స్విచ్ మీద వుంటుంది. అప్పుడు మా దూరభాషిణి కేంద్రంలో '1' క్రింద వున్న లైటు ఆరిపోయి వుంటుంది. లైటు ఆరిపోయి..."

    "చీకట్లో తతంగం మొదలవుతుంది" తన ధోరణిలో తనే పోతున్న ఆమె ప్రవర్తనకు కోపం వచ్చి అన్నాడు నిఖిల్. ఆ మాటకు కళ్ళు అరమోడ్పులు చేసి కింది పెదవి నొక్కిపట్టి సిల్క్ స్మితలా నవ్వింది శూర్పనఖ.

    భార్గవకు అదో కంప్యూటర్ ప్రపంచంలా వుంది. కనీసం ముందు ముందు తన రచనల్లో పనికిరావచ్చునైనా వింటున్నాడు.

    శూర్పణఖ చెప్పుకుంటూనే పోతుంది. చూపుడు వ్రేలు రింగులు చుడుతూ.

    "ఇక్కడి హేండ్ సెట్ అనేది 'హుక్ స్విచ్' మీదనించి తీయగానే విద్యుత్ షాక్ తగిలి లైటు వెలుగుతుందన్నమాట."

    "ఏ హుక్ తీయాలి? ఏ స్విచ్ తీయాలి?' అన్నాడు నిఖిల్ ఉడుకు మోత్తనంగా.

    "ఏది తీయాలో తెలీదా పాపం? బ్రా హుక్....ఆ స్విచ్...." అంది శూర్పణఖ కొంటెగా నిఖిల్ చెవిలో.

    నిఖిల్ గతుక్కుమని ఇక మౌనంగా వుండటమే మంచిదనుకున్నాడు. అప్పుడప్పుడూ శూర్పణఖ నిఖిల్ ని తాకాలని తాకుతోంది. ఆమె తాకినపుడు జూలో ఏనుగు తొండాన్ని నిమిరినట్లనిపించింది అతనికి.

    "అక్కడ వ్యక్తి తన వద్దనున్న ఫోన్ లో జాక్ లోకి నంబర్ ప్లీజ్ అంటూ మాట్లాడతాడు. ఇక్కడి ఉద్యోగి ఆ వ్యక్తికి కావల్సిన నంబర్ ఫోన్ ఖాళీగా వుందా? ఎంగేజ్ లో వుందా అని చూసి 'జాక్' కు రెండు తీగలతో సంబంధం ఏర్పరుస్తాడు. అప్పుడు మరో అవతలి వ్యక్తి ఫోన్ మ్రోగుతోంది. ఇది పాత పద్దతి. ఇప్పుడు మాత్రం...."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS