Previous Page Next Page 
బేబి!ఓ బేబి!! పేజి 19

    నవ్వు!!!

    ఎదుటివాడి అవస్థ చూసి....పడీ పడీ నవ్వుతున్న నవ్వు....

    అవతలి వ్యక్తి కంఠనరాలు తెగి.... రక్తం కక్కుకుంటుందా అన్నట్లు ప్రేతాత్మ నవ్వు!! ఆ నవ్వాగలేదు....ఆపలేదు కూడా....

    అలా....అలా....

    నిమిషం పాటు నవ్వి....నవ్వీ....

    "మ...వు...ని....క..."

    చెవిలో గుసగుస చెప్పినట్లు చెప్పి....గుర్తుచేస్తున్నట్లుగా మరోసారి నవ్వి....అంతే! మరేమీ విన్పించలేదు భార్గవకి. అవతలి లైన్ కట్టయింది. నీరసం నిండిన దృక్కుల్తో అతడు నిర్జీవంగా ఫోను పెట్టేశాడు.

    ఈలోపుగా వచ్చిన కాఫీలని అందిస్తున్న హడావిడిలో వున్నాడు జె.ఇ. స్లీవ్ లెస్ జాకెట్ జబ్బతో నెమ్మదిగా రాస్తున్న రాపిడికి__జెర్రులు ప్రాకినట్లు ఫీలవుతూ తన బాధలో తనున్నాడు నిఖిల్ స్పర్శా తన్మయత్వంలో తాదాత్మ్యం చెందుతుంది శూర్పణఖ అందుకే వాళ్ళెవరూ ఆ క్షణంలో భార్గవ మొహంలోని బాధని కనిపెట్టలేకపోయారు.

    ఇంతలో ఫోను మరోసారి రింగాయింది జూనియర్ ఇంజనీర్ గారెత్తి ఎవరితోనో మాట్లాడాడు.

    కాఫీలు పూర్తయి థాంక్స్ చెప్పి వెళ్ళిపోయేముందు భార్గవకు చప్పున గుర్తొచ్చింది. అప్పటికీ మరో ఫోన్ కాల్ వచ్చి జె.ఇ. మాట్లాడుతున్నాడు.

    "సార్.... నాకిప్పుడు 'కాల్' ఎక్కడినుండి వచ్చిందో చెప్పగలరా?" అడిగాడు ఆదుర్దాగా భార్గవ.

    "ఏం....? ఇప్పుడొచ్చింది బెదిరింపేనా?" అన్నాడు నిఖిల్ అనుమానంగా.

    "అవును."

    అక్కడున్న మిగతా ముగ్గురూ ఆశ్చర్యంగా చూసారతనివైపు. ముందు తేరుకున్నది జె.ఇ.

    "మీరు చాలా పొరపాటు చేశారు భార్గవగారు. ఈ విషయం ఇంతకుముందే వెంటనే ఎందుకు చెప్పలేదు" ఫైరయ్యాడు ఆయన. ఆ సీరియస్ నెస్ ఆయన మొహానికి బదులు బట్టతల ఎర్రబడి మెరుస్తోంది. అదే ఆయనలోని ప్రత్యేకత.

    "నంబర్ తెలుస్తోందో లేదోనని..." నసిగాడు భార్గవ.

    "షిట్.... ఆ ఫోన్ నాకందించివుంటే... ఆ రాక్షసి సంగతి నేను చెప్పివుండేవాడిని" నిఖిల్ కోపంగా  పళ్ళు పటపటా కొరికాడు.

    ఆ కొరుకుడేదో నన్ను కొరికితే బాగుండునని చూస్తోంది శూర్పనఖ ఇదేదీ పట్టనట్లు.

    జె.ఇ.గారు బట్టతలమీద వేళ్ళను ఈసారి మరింత ఠకఠక లాడిస్తూ.

    "చాలా పొరబాటు చేశావ్ మిస్టర్ భార్గవా! మాది క్రాస్ బార్ ఎక్సేంజ్ కి చెందిన నంబర్ కాబట్టి, మా సర్క్యూట్ ని ఆల్ రెడీగా సిస్టమ్ కి జాయింట్ చేసేవుంచుతాం గనుక, ఆటోమేటిగ్గా నాకు ఏ నంబర్ నించి కాల్ వస్తుందో తెలుస్తుంది. నీకు వచ్చినప్పుడు కూడా తెలిసేదే. నువ్వా విషయం వెంటనే చెబితే నంబర్ గ్రహించేవాణ్ని. కాని మీ తర్వాతః ఇప్పటికే మరో మూడు కాల్స్ వచ్చాయి. ఎన్ని నంబర్లని మాకు గుర్తుంటాయి చెప్పండి? ఇప్పుడు ఎక్కడి నించి వచ్చిందో.. ఏమో.," అన్నాడాయన నిరాశగా.

    భార్గవకు నీరసం మరింత ముంచుకొచ్చి, తన తెలివి మీద తనకే అసహ్యం వేసింది. కసిగా డామిట్...అనుకున్నాడు.

    "సారీ....చేతులారా ఆ వ్యక్తిని జారవిడిచారు" జె.ఇ. గారి బట్టతల మామూలు రంగులోకి వచ్చింది.

    "వెళ్దాం సార్" అన్నాడు నిఖిల్ చేసేదేమీలేక.

   
                                                                               6


    "నిర్లిప్తా! వంటయిందా?" ఆడవాళ్ళు అర్దరాత్రి కలుసుకున్నా అతిచీఫ్ గా అడుక్కునే పదమది.

    ఏదో ఆలోచిస్తున్న నిర్లిప్త ఉలిక్కిపడి చూసింది. గుమ్మంలో సుగాత్రి.

    "అయింది లోపలికి రండి" అంది ఆహ్వానిస్తూ. సుగాత్రి కూచోగానే మీ మామగారి ఆరోగ్యం ఎలా ఉందిప్పుడు" అడిగింది నిర్లిప్త.

    "రాత్రినుండి దగ్గుతూనే ఉన్నారు. వృద్దాప్యానికి తోడు క్షయ. నేను వెళ్ళి ఏదైనా సాయం చేయబోతే. అసలు గడిలోకే రావద్దంటారు. క్షయ అంటురోగమని" అంది సుగాత్రి.

    "టి.బి హాస్పిటల్లో స్పెషలిస్టుకు చూపించలేకపోయారా?"

    "ఆయనకేమో తీరికుండదు. ముసలి వాళ్ళలో పిల్లల్ని చూసుకోవచ్చంటారు పిల్లలు లేని నాకు కనీసం ఆయన సేవ చేసే భాగ్యం కూడా కలగనివ్వరు. హాస్పిటల్ కి తీసికెళదామన్నా ఎంతమాత్రం ఒప్పుకోరు నిర్లిప్తా! 'అని' అరె కుడిచేతి వేలు తెగిందా?" అనడిగింది.

    "కత్తిపీట తెగింది.... పసుపు అద్ది గుడ్డ కట్టాను. సరేకాని..."

    "అలాగని మీరొప్పుకోకండి. క్షయ ముదరకముందే ట్రీట్ మెంట్ చేస్తే మంచిది" ఇంతలో గుమ్మం ముందు నించి వెళ్తున్న ప్రక్కింటి దేవకమ్మ వీళ్ళవైపు ఓ చూపు విసిరి పోతూంటే నిర్లిప్తే పిలిచింది. "వంటయిందా పిన్నీ" అంటూ.

    దేవకమ్మకు గంపెడు పిల్లలు ఆదిలాబాద్ లో ఉన్న వారికి జనరంజని వింటే ఎలా ఖా పెరిబీఖిరి, గా విన్పిస్తుందో, వాళ్ళిల్లు కూడా మరో రేడియో స్టేషనే! ఆమె నోటికి భయపడే ఆ వీధిలో ఎవ్వరూ ఆమెతో మాట్లాడటానికి కూడా సాహసించరు. దేవకమ్మ భర్త రెవెన్యూ డిపార్టు మెంట్ లో పని చేసినప్పటికి. అస్థిపంజరానికి తోలు తొడిగినట్లు బక్కగా రివటలా ఉంటాడు. ఎవరైనా చూడగానే అనుకుంటారు నిజాయితీ పరుడని!!

    నలుగురి తర్వాత పిల్లల్ని కనలేక పెళ్ళానికి తెలీకుండా తనే వేసెక్టమీ ఆపరేషన్ చేసుకున్నా, తర్వాత ముగ్గురు పిల్లలు ఎలా పుట్టారో అర్ధంకాక చివరికి డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల తన ఆపరేషన్ ఫెయిలయి వుంటుందని సరి పెట్టుకున్న అమాయకుడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS