మాన్ ఈటర్
మొదటి అట సినిమా చూసి పాతిక ముపై మంది ఇంజనీరింగ్ విద్యార్ధులు జట్లుజట్లుగా నడుస్తూ చూసిన సినిమాలో కబుర్లు చెప్పుకుంటూ నవ్వు కుంటూ పాటలు పాడుకుంటూ వస్తున్నారు. "సాహు" టీ దుకాణం దగ్గరికి వచ్చేసరికి సడన్ బ్రేక్ వేసినట్టు వాళ్ళ కాళ్ళు ఆగిపోయాయి. వాళ్ళ గోల మధ్య కూడా స్పష్టంగా వినిపించిన "గురువారీ" కేకలకి అందరూ ఒక్కసారి నిశ్శబ్దం అయిపోయారు.
"బాబోయ్ - అమ్మోయ్- నాన్నోయో " అంటూ అరుస్తున్న గురువారీ కేకలు వింటూ అందరూ ఒక్క క్షణం తెల్లబోతూ నిలబడ్డారు. ఆ నిశ్శబ్ధంలో గురువారీ ఏడుపు. వెక్కిళ్ళు. "వదులుబాబూ , వద్దుబాబూ" అంటున్న మాటలు విన్నారు. ఆ వెంటనే సాహు బండ గొంతు "నోర్మూయ్ - ఎందుకలా అరుస్తావు" అని గదమాయించడమూ వినిపించింది.
కొందరు విద్యార్ధులు గబగబ అటు వెళ్ళాడు. బాష సరిగా ఆర్ధం కాని మూర్తి వెంకట్రావుని "ఏమిటి?" అని అడిగాడు. "గురువారీని అసాహుగాడు ఏదో చేస్తున్నాట్లున్నాడు.' అంటూ వెంకట్రావూ పరిగెత్తాడు. అందరూసాహూ గుడిసె దగ్గరికి వెళ్ళి రేకుల తలుపు బాదారు. లోపల ఒక్కసారిగా నిశ్శబ్దం అయింది."
'అరేయి, తీస్తున్నావా లేదా తలుపు తీయి ముందు" అంటూ వాళ్ళ గూప్ లీడరు నిరంజన్ పాత్రో బూటుకాలితో తలుపులు తన్నాడు.
ఒక్కక్షణం తర్వాత తలుపు దగ్గర "ఏటి బాబూ ఏం కావాలి" అన్న సాహు గొంతు వినిపించింది.
"తలుపు తీయి ముందు" అసహనంగా అరిచాడు శరత్ మిశ్రా. మరోక్షణం పోయాక తలుపు గడియ తీసి తల బయటికి పెట్టి అందరిని ఆశ్చర్యంగా చూస్తూ "ఏమిటి బాబూ యింత రాత్రి కాడ వచ్చారు ఏం కావాలి?" అన్నారు వాడి మాటలు వినకుండా "ముందు తలుపు తీయి" అని గద్దించాడు సంతోష్ నందా.
"ఏమిటి బాబూ రాత్రి కాడ యీ గొడవ" అంటున్న సాహుని తోసుకుని నిరంజన్, శరత్ లోపలికి వెళ్ళారు. వాళ్ళ వెంట అందరూ లోపలికి జొరబడ్డారు. "మనకెందుకు ఈ గొడవ వెళ్ళిపోదాం" అన్నాడు మూర్తి వెంకట్రావుతో. మూర్తి క్రొత్తగా వచ్చాడు. అంతా క్రొత్త. భాష రాదు - అన్నింటికి భయం.
'చాల్లే వెళ్ళిపోదామా, పాపం గురువారిని యిలా వదిలి" అన్నాడు వెంకట్రావు - ఏమనలేక తనొక్కడూ వెళ్ళిపోతే అంతా ఏమంటారోనని మూర్తీ జొరబడ్డాడు గుంపులో.
పాకలో మధ్యగా నులకమంచం వుంది. కుళ్ళు బొంత, కుళ్ళు దుప్పటి రేగి అడ్డదిడ్డంగా పడివున్నాయి. పాకలో ఓ రాటని కరుచుకుని పిల్లి నోటి నించి తప్పించుకుని బ్యాతపడిన చిన్న గోరంకలా వణికిపోతూ నిల్చుంది గురువారీ. ఆ పిల్ల వాళ్ళంతా చెమట పట్టేసింది. తలంతా రేగి వుంది. ఏడుస్తుంది. అంతా కందగడ్డలా వుంది. భయంతో వణికిపోతూ వెక్కివెక్కి ఏడుస్తుంది.
ఆ వాతావరణం చూడగానే అందరికి సంగతి అర్ధమయింది. లోపలికి తోసుకొచ్చిన అందరిని చూసి "ఏమిటి బాబూ యిది " అన్నాడు కోపంగా సాహూ.
'ఏమిటా, ఆ పిల్లనేం చేశావు, ఎందుకలా ఏడుస్తుంది గుడువారీ?" అన్నాడు నిరంజన్. సాహూ మొహం సిగ్గుతోనో కోపంతోనో ఎర్రబడింది. కాస్త తడపడి సర్దుకుంటూ "ఏదో మాగొడవ మీకేం బాబూ" అన్నాడు.
"నీ గొడవా , ఏమిటిరా నీ గొడవ , ఆ పిల్ల ఎందుకలా కేకలు వేసింది. ఎందుకలా భయపడ్తోంది, చెప్పు, ఏం చేశావు?" అంటూ హుంకరించాడు సంతోష్.
గురువారీ అందరినీ చూసి ఏడుపు యింకా హెచ్చరించింది. వెక్కుతూ "వీడు....వీడు" అంది.
"ఆ.... ఏం చేశాడు ' ఆరాటంగా అడిగారు కొందరు. గురువారీ ఏదో అనేలోపలె 'నోరుముయ్యి . లోపలికేళ్ళు ముందు" అంటూ గుడ్లెర్రజేసి గురువారీ అంతకంటే చెప్పలేక.
ఈసారి పూర్తిగా అర్ధమయింది. "ఏయ్ సాహు బుద్ది వుందా లేదా నీకు. మనిషిన రాక్షసుడివా, అపిల్లా నీకు దొరికింది..... ఆ చిన్నపిల్లరా నీకు....' తీక్షణంగా అంటూ మీదమీదకి వెళ్ళాడు శరత్. నడ్డిన చేతులుంచుకొని వీరుల్లా నిలబడి తనని దాబాయిస్తున్న వాళ్ళందరిని చూసి ఒక్క క్షణం తెల్ల మొఖం వేసినా తరువాత బింకంగా "నా గొడవ మీ కెందుకు దాన్నేం సేస్తే సేత్తాను, ఇదీ నాసోత్తు మీరేటి సెప్తారు నాకు" అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడాడు సాహు.
'అది నీ సొత్తా, దాని మొగుడి వేమిటిరా నీవు, దానికి తాళిగట్టావా?" అంటూ రెచ్చిపోయారు ముగ్గురూ. తక్కినవాళ్ళు చోద్యం చూస్తూ నిలబడ్డారు.
"తాళేటి పెళ్లేటి . ఆయన్నీ మీకు. మాకేటి , ఏం లేకపోతే రెండొందలిచ్చి దీన్ని మేపడానికా కొన్నాను."
"రెండొందలిచ్చి కొని, నేలంతా చాకిరి చేయించు కుంటున్నావు, అది చాలక యింకా పట్టుమని పదమూడేళ్ళ లేని పిల్లని నాశనం చేద్దామనుకున్నావా."
వాళ్ళ ఆరోపణలకి జవాబియ్యాల్సిన అవసరం లేనట్టు సాహు లుంగీ ఎత్తి కడ్తూ 'ఎల్లండి బాబు, తీరి కూకుని మీ కేల మాగోల - ఎల్లి సదూకోండి.
వాడి నిర్లక్ష్యానికి వాళ్ళందరికీ పౌరుషం వచ్చింది. వాళ్ళని, స్టూడెంట్స్ ని అందులో ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్లని, ఓ టీ కొట్టు వెధవ గడ్డిపోచ చెయ్యనివాడు, వాళ్ళ దయా ధర్మం మీద బ్రతికేవాడు వాళ్ళకి దండాలు పెడ్తూ వాళ్ళ ప్రాపు కోసం ప్రాకులాడే వెధవ యినాడు వాళ్ళని తీసి పారేస్తూ మాట్లాడుతాడా! పోరపాటయింది క్షమించండి అనడానికి బదులు మీ కెందుకు నా గొడవ అనేదాకా వచ్చాడా? అన్యాయాలు ఎక్కడ జరిగినా ఎదుర్కొనడానికి ముందుండే వాళ్ళు ఈనాడు ఓ పసిపిల్లకి జరిగే దురన్యాయాన్ని చూస్తూ వూరుకుంటారా?
