"ఏమిట్రా కూస్తున్నావు వళ్ళు పొగరెక్కిందా? మర్యాదగా మాట్లాడటం తెలీదురా రాస్కెల్ ' సాహు పైగుడ్డ పట్టుకుని లాగుతూ అరిచాడు నిరంజన్.
సాహు అసలే తాగి వున్నాడు. దాంతోడు మంచి గ్రంధంలో వుండగా వచ్చి పాడు చేశారేమో వాడికి తిక్క రేగింది. నిరంజనే చేతి నుంచి విసురుగా గుడ్డ లాక్కుని 'ఇదిగో మాటలు మీరకండి. బాబూ నే నెవరితో పడుకోడానికి మీ పర్మిషన్ కావాలా నాకు, నా యిష్టం వచ్చిన లంజతో పడుకొంటాను. దొంగముండా, మళ్ళా నోరెత్తితే సంపెస్తాను. లంజకానా నిన్ను రెండొందలు పెట్టి కొన్నది తిని కూకో బెట్టుకోవాడాని కనుకొన్నావటే. ఊ ఆ అన్నావంటే యీసారి మక్కే లిరగదంతాను. సిగ్గునేదే - నోరెట్టి వూరు వాళ్ళందరిని పిలుస్తావా ' అంటూ గురువారీ జుట్టు పట్టుకున్నాడు. వాళ్ళ మీద చూపలేని కోపాన్ని గురువారీ మీద చూపించి దాని నడ్డి వంచి నాలుగు గుద్దులు గుద్దాడు.
అంతే? అందరికి ఆవేశం వచ్చేసింది. "ఏయ్ , ముందా పిల్లను వదులు" అంటూ శరత్ ముందుకు వురికి సాహు మెడ పట్టుకున్నాడు. సాహు వెర్రి ఆవేశంతో "ఏళ్ళండేహే, సూస్తున్నాను ఇందాకాడ నించి, నాయింట్లోంచి పోతారా, తన్నమన్నారా, నానసలె మంచోడ్ని గాను, దాని గొడవ మీ కెందుకు" అంటూ తాగిన కైపులో దాన్ని, వాళ్ళని కలిపి బండ బూతులు తిడ్తూ అందరినీ బయటికి నెట్టడానికి ప్రయత్నించాడు.
మీద మీదకి వచ్చి బలంగా తోస్తున్న సాహుని చాచిపెట్టి కొట్టాడు నిరంజన్. సాహు అంతదూరం తుళ్ళి పడ్డాడు. వెంటనే కోపంతో వణుకుతూ లేచి "మిమ్మల్నేం చేస్తానో చూడండి" అంటూ మీదకి వెళ్ళాడు.
"వరేయ్ చూస్తారేమిటిరా ఆ వెధవని కట్టేయండిరా" అని ఆదేశించాడు సంతోష్. నలుగురైదుగురు సాహుని కదలకుండా బంధించారు. మరి కొందరు తాడు కోసం వెదికారు. తాడు కనపడక నులక మంచం తాడు పీకి సాహుని రాటకేసి కట్టేసారు. "నీకింత పోగరేక్కిందిరా , మాకు ఎదురు తిరిగి బ్రతుకగలనను కున్నావా, మేం తలచుకుంటే ఏం చెయ్యగలమో నీకు తెలియదురా" అంటూ జుట్టు పట్టుకు ఎడా పెడా వాయించాడు పాత్రో.
"వదలండి దొంగ వెధవలారా" అంటూ గింజుకుంటూ తిట్టాడు సాహు. "నోర్మూయ్' మరో టంటించాడు నిరంజన్. 'మామ్మల్నే వెధవలనేదాకా వచ్చావా, మా తిండి తింటూ మమ్మల్నే ఎదురిస్తావా . నీవెంత నీ బ్రతుకెంత చూడు యింక యిక్కడేలా బ్రతుకుతావో చూపిస్తాం. వరేయ్ పచ్చడి చేయండిరా వెధవని.... ఊహు --- వాడ్ని తంతే చస్తాడు, వాడు మళ్ళీ లేవకుండా చెయ్యాలి" అంటూ యిటూ అటూ చూశాడు నిరంజన్. గాజు బీరువాలో నిన్నటి సింగడాలు మొన్నటి రసగుల్లాలు పొద్దుటి వడలు అన్నీ వున్నాయి. ఆ బీరువా పళంగా ఒక్కతోపు తోశాడు పెళపెళమని అద్దాలు విరిగాయి. కప్పులు సాసరులు గాజు గ్లాసులు పెట్టిన టేబిల్ ని తోసి క్రింద పడేశాడు. యింకా విరగకుండా మిగిలిన కప్పులని బూటు కాలితో పచ్చడి చేశాడు. ఆ మాత్రం అందించాగానే మిగతా అందరికి ఉత్సాహం వచ్చేసింది. మిగతా అందరూ ఉత్సాహంగా రంగంలోకి దుమికేశారు. యిలాంటి ఎడ్వంచర్ అంటే అందరికీ ఎంతో యిష్టం. సాహు త్రాగిన మత్తు దిగిపోయింది భయంతో గడ్డకట్టిపోయాడు. గుడ్లప్పగించి చూడ్డం మినహా నోట మాట పెగలలేదు. సాహు నోట్లోంచి మాట వచ్చేలోగా హోటలు లో వున్న కుర్చీలు, బెంచీలు విరిగాయి. కప్పులు, సాసర్లు పిప్పి అయ్యాయి. నులకమంచం కాళ్ళూడాయి. గుడ్డలు పీలికలయ్యాయి. పాక తాటాకులు ఎగిరి పోయాయి.
సాహు తేరుకుని కేకలు పెట్టేసరికి అప్పటికే యీ గలాభాకి ఇరుగు పొరుగు గుడిసె వాళ్ళు చేరి భయంభయంగా చూట్టూ చేరి చూడ్డం మినహా ఏమీ చేయలేకపోయారు. వాళ్ళంతా మాట్లాడటానికి నోరు తెరిచే సరికి జరగాల్సింది అంతా జరిగిపోయింది. గురువారీ మరింత భయంతో బిక్కచచ్చిపోయి గోడకి కరచుకుని ఓ మూల వుండిపోయింది. గురువారీ కంటే భయంగా మూర్తి ఓ మూల నించున్నాడు. అంతా చూస్తూ.
అంతా అయ్యాక నిరంజన్ ఠీవిగా చేతులు దులుపుకుని జేబులోంచి రుమాలు తీసి మొహం తుడుచుకుంటూ "ఏం సాహూ , మళ్ళీ ఆ పిల్ల మీద చెయ్యి వేస్తావా, మేం అంటే ఏమిటో తెలిసిందా? మళ్ళీ ఆ పిల్ల జోలికి వెడితే ప్రాణం తీసేస్తాం! యీసారి " అన్నాడు. సాహు చూపులకే శక్తి వుంటే వాళ్ళని మాడ్చేసి వుండేవి ఆ చూపులు. "బుద్దిగా వుండు యింక. ఎప్పుడు ఎదురు చెప్పక. మేం వెళ్ళక దాన్నే మన్నా చేస్తావేమో. జాగ్రత్త." హెచ్చరించాడు శరత్.
"బాబూ !..... నేనిక్కడ వుండను బాబూ, మీరెళ్ళక ఆడు నన్ను సంపెత్తాడు" అంది గురువారీ భయంగా ఏడుస్తూ.
'అదీ నిజమేరా. ఈ కోపం దానిమీద చూపించి చితకకొడతాడు దాన్ని" అన్నాడు సంతోష్.
"ఎడశాడు మళ్ళీ యింకా తలెత్తుతాడా?"
'అది సరికాని దాన్ని చావగోట్టాక మనం ఏం చేసినా ప్రయోజనం ఏమిటి?"
సాహు మాట్లాడకుండా మిర్రిమిర్రి చూస్తున్నాడు. అందరినీ ఎగిసి పడే గుండెలతో. వాడి కళ్ళలో క్రౌర్యం చూస్తె తానేమైనా సరే దాన్ని అంత సుళువుగా వదలను అన్న అర్ధం కనిపించింది. అందరికి 'మరేం చేద్దాం దీన్ని మన మెక్కడికి తీసుకు వెళదాం" సాలోచనగా అన్నాడు నిరంజన్.
"ఒరేయ్ ఈ రాత్రి యీ పక్క వాళ్ళెవరి గుడిసె లోనన్నా పడుకోమందాం.' పాత్రో అన్నాడు.
సాహూకి పోటీగా ప్రక్కనే టీ హోటల్ "సదానంద్' వాళ్ళ షాపు కోసం ప్రాకులాడుతుంటాడు. అదే మంచి సమయం వాళ్ళని ఆకట్టుకోడానికని గ్రహించి ముందుకు వచ్చి "ఆ పిల్లని మా గుడిసెలో పడుకోబెట్టు కొంటాం మరేం భయం లేదు దాని వంటి మీద యీగ వాలనీయను." అన్నాడు వాడికి పెళ్ళాం పిల్లలున్నారు.
"ఆ....అలా చేద్దాం. జాగ్రత్త. వీడేవన్నా గొడవ చేస్తే మా హస్టలుకి వచ్చి చెప్పు" అంటూ ముందికి కదిలాడు నిరంజన్. అందరూ సాహూ వంక గర్వంగా చూస్తూ బయటికి నడిచారు. వెళ్ళేముందర శరత్ సాహు కట్టు విప్పి 'యింక ఏడు" అన్నాడు.
"దొంగలంజా కొడుకు, మనం సమయానికి అడ్డుకోకపోతే ఆ పిల్లని నలిపి పారేసేవాడు .... బండ వెధవ...." తనో ఘనకార్యం చేసినట్లు అన్నాడు నిరంజన్.
"ఏమో ఏం చేశాడో, ఏం లేకపోతే ఆ పిల్ల అంతలా ఎందుకు భయపడ్తుంది జరగాల్సింది జరిగి పోయిందేమో?"
"ఏమో, దొంగ రాస్కెల్. ఏం జేశాడో ఆ పిల్ల కేమన్నా అయితే వాడ్ని బ్రతక నీయను." కోపంగా అన్నాడు నిరంజన్.
వాళ్ళు నిజంగా అన్నంత పని చేస్తారన్న సంగతి తెల్సిన సాహు ఉదయం లేచేసరికి మాయమయిపోయాడు. ఆ వూళ్ళో వాళ్ళని కాదని బ్రతకడం కష్టం అని వాళ్ళు లేకపోతే ఒక్క క్షణం తన హోటలు నడవదన్న విషయం అర్ధం చేసుకుని, యింక ఆ వూళ్ళో బ్రతికే మార్గం లేదని గ్రహించి విరగ్గా మిగిలిన గిన్నెలు బడ్డ పాత మూట తట్టుకొని తెలారేసరికి వెళ్ళిపోయాడు. వెళ్ళేముందు సదానంద్ యింటికి వచ్చి గురువారీని లాక్కేళ్ళడానికి ప్ర్తయత్నించాడు. అది ఏడ్చి గోల పెట్టేసరికి సదానంద్ హాస్టలు కి మనిషిని పంపే సరికి భయపడి గురువారీని కసిదీరా కొట్టి బండబూతులు తిడుతూ వెళ్ళాడు.
పీడా పోయింది అనుకున్నారంతా.
సాహుగాడి గొడవ వల్ల సదానంద్ హోటలుకి గిరాకీ ఎక్కువయింది ఆక్కడికి వెళ్ళే ఆ గ్రూపంతా సదానంద్ కాతాదారులయ్యారు. ఓ రెండు రోజులు ఊరుకుని, గురువారీ విషయం ఎవరూ ఎత్తక పోయేసరికి సదానందే ఒకపూట "బాబూ, మరి గురువారీని ఏం చేస్తారు?" అన్నాడు టీ తాగుతున్న వాళ్ళతో.
