Previous Page Next Page 
తల్లి మనసు కధలు పేజి 4


    ఆఫీసులో ఉన్నంతసేపూ కొడుకు మీదే ప్రాణాలుంటాయి కమలకి. ఏడుస్తున్నాడేమో! జానకి ఆ పాలసీసా సరిగా కదిగిందో లేదో, బట్టలు మార్చిందో , తడి బట్టల్లో నానుతున్నాడో....అసలే ఆ జానక్కి పుస్తకాలుంటే వళ్ళు తెలియదు. బాబుకి వేళకి పాలు కలపడం మరిచిపోయిందో ..... అనుక్షణం కొడుకు మీదే ఆమె మనసంతా వుండేది. పని మీద మనసు నిలిచేది కాదు.
    ఆఫీసు వదలగానే ఉరుకులు పరుగులతో వచ్చి వ్రాలెడి. అంత పసివాడిని వదిలి అన్ని గంటలుండాలంటే ఆమె ప్రాణం గిలగిలలాడేది! కానీ తప్పదు.
    అత్తగారు ఆడబడుచు అస్తమానూ విసుక్కుంటూనే వుంటారు ..... "అబ్బబ్బ వెధవ ఏడుపు వీడూను.... ఎత్తుకు కూర్చోవాలంటాడు ... వెధవ గంటకి నాలుగు సార్లు ఉచ్చ పోస్తాడు.... చస్తున్నాను బాబూ వీడితో, ఒక్క పుస్తకమన్నా చదవనీడు " ఆఫీసు నించి వచ్చేసరికి వీధి గుమ్మం లోనే ఎదురొచ్చి బాబుని కమల చేతిలో కుదేస్తుంది జానకి విసుక్కుంటూ! కమల మనసు చివుక్కుమంటుంది.
    "పిల్లల్ని కానీ పారేయడం వరకే ఆవిడ వంతు. సాకడానికి మనం వున్నాంగా! నేను వంటలక్కని , నీవు పిల్లాడిని చూసే దాదీవి అయ్యావు. ఎవరి పిల్లలు వాళ్ళకే విసుగు, అలాంటిది కుర్రదానికి రోజంతా వాడ్ని చూడాలంటె చిరాకు కాదూ! పెళ్ళి పెడాకులు లేకుండా ఇంట్లో వుందని అందరికి లోకువే అదంటే ' జానకి విసుక్కుంటుంటే కూతుర్ని వెనకేసు కుని కోడల్ని వెనకనించి సాధిస్తుంది. సణుగుతుంది సుబ్బమ్మ.
    కమల ఏమనగలదు. కన్నతల్లి వుండీ , వీళ్ళ చేతుల్లో వాళ్ళ చేతుల్లో వాడ్ని పెట్టి అందరిచేత మాటలు పడవలసిన తన దుస్థితికి తనే నొచ్చుకుంటుంది.
    బాబు ఆరేడు నెలల వాడయ్యాడు. ఓరోజు ఆఫీసునించి ఇంటికొచ్చే సరికి వీధి గుమ్మంలోనే ఆడబడుచు గొంతు గట్టిగా వినిపిస్తుంది. "వెధవా.... ఎందుకురా ఏడుపు .... పాలు త్రాగి చచ్చినట్టు పడుండక .... కొంప మునిగినట్టు ఏడుస్తున్నావు.... ఒక్క నిమిషం క్రిందికి దింపడానికి వీలులేదు....' వెధవ పీడ.... చంపేస్తాను నోర్మూయ్..... " పిర్ర మీద ఒక్కటి అంటించింది. అప్పుడే పచ్చిన పత్రిక చదవనీయలేదని జానకి కోపం.
    కమల చర్రున లోపలికి వచ్చింది .... బాబుని ఎత్తుకుని.... తీక్షణంగా చూసింది.... బుద్ది లేదూ , చంటివాడ్ని కొడతావా ? వాడికేం తెలుసు ..... నీ చేతులెలా వచ్చాయి పసివాడ్నీ కొట్టడానికి .... రోజూ యిలాగే కొట్టి చంపుతున్నావా?' కోపం ఆపుకోలేక అరిచింది.
    వదినగారి కోపం చూసి తను కొట్టడం చూసిందని కాస్త జంకింది . జానకి కాని కూతురి తరపున తల్లి వకాల్తా పుచ్చుకుని కోడల్ని ఎడా పెడా దులిపేసింది. అను అను అనుదాన్నే అను. నీకేమే రోజంతా హాయిగా ఊర్లెలుతావు. అదే కన్నట్టు రోజంతా వాడ్ని అది సాకాలి. చిన్న పిల్ల డానికి ఓ సరదా పడులేకుండా నీ పిల్లాడిని పాకడమేనా పని. ఏదో నీ క్రింద బంట్రోతు లా కాస్త విసుక్కుందని తిట్టిపోస్తున్నావు. నీ పిల్లాడి ఉచ్చళ్ళు, పీతుళ్ళు ఎత్తి పోసే ఖర్మ దానికేమిటి. చాకిరీ చేయించుకోవటమే కాక అధార్టీ కూడా చలాయిస్తున్నావు.' గయ్ మని లేచింది. ఓ అరగంట పట్టుకుని కోడల్ని దులిపింది.
    కమల నోరు మూసుకుంది. తప్పు తనది కాని వాళ్ళది కాదు. నిజమే ఇంకో అమ్మ కన్నపిల్లల్ని సాకాలంటే ఎవరికి మాత్రం విసుగుకాదూ?....
    ఆ రాత్రి సుబ్బారావుతో జరిగిందంతా చెప్పింది కమల, బాబుని అలా వాళ్ళ చేతుల్లో పెట్టి ఉద్యోగం చేస్తూ నానా మాటలు పడలేదని కళ్ళంట నీళ్ళు పెట్టుకుంది.
    సుబ్బారావు ఆలోచించాడు. కమలని శాంత పరిచాడు. 'అమ్మని నేను కేక లేస్తాను. ఉద్యోగం మానేస్తే  ఎలా చెప్పు..." అంటూ ఒదర్పాడు. "మర్నాడు ప్రొద్దున్నే తల్లితో గట్టిగా చెప్పాడు.  
    సుబ్బమ్మ వంటిట్లో చతికిలబడి కళ్ళు వట్టుకుంటూ కూర్చుంది. 'అనండి నాయన అనండి. నీ పెళ్ళానికి నీకు మేము నొకరీవాళ్ళం అయ్యాం. అ మహా రాజేవుంటే మాకీ గతి పట్టెదా? నీవిలా అనేవాడివా? కానీవే అమ్మా, తల్లి మన ఖర్మమే తల్లీ, యీ యింట్లో మనం నోరెత్తడానికి లేదే!' అంటూ కూతుర్ని పట్టుకుని "పోయిన మహారాజుని తలుచుకుంటూ రాగాలు పెట్టింది.
    ఆ రోజు నించి కాస్త అత్తగారి విసుగులు ఎత్తి పొడుపులు తగ్గాయి. జానకి కూడా కమల ఉన్నంతసేపూ బాగానే వుండేది. పిల్లాడిని కసరడం తగ్గించింది. అయినా కమలకి తను అటు గడప దాటగానే వాడిని సరిగా చూడరేమో అనుమానం ఉన్నా గత్యంతరం లేక ఊరుకుంది.
    ఆరోజు ఆఫీసులో ఎవరో గుమస్తా చచ్చిపోయారని ఒంటి గంటకల్లా శలవిచ్చేశారు.
    ఎండలో చెమటలు కక్కుతూ వచ్చింది కమల. వీధి కోసకే బాబు ఏడుపు తారాస్థాయిలో వినిపిస్తుంటే ఎందు కేడుస్తున్నాడో అనుకుంటూ గబగబ నడిచింది కమల. గుమ్మంలో అడుగు పెడుతుండగానే ఉయ్యాలలో బాబు గుక్కపట్టి ఏడుస్తున్నాడు. గభాలున బాబు దగ్గరికి ఉరికింది కమల. ఎంతసేపటి నుంచి ఏడుస్తున్నాడో గాని బాబు మొహం అంతా తడిసిపోయి ఎర్రబడి పోయింది. ఏడ్చి ఏడ్చి యింక ఏడవడానికి ఓపిక లేనట్టు కమలని చూడగానే చేతులు చాపాడు తొమ్మిది నెలల బాబు. గబుక్కున ఎత్తుకుని గుండెల కడుముకుంది కమల జానకి కోసం చూసింది. ఎందుకేడుస్తున్నాడో కారణం తెలియక అత్తగారిని అడగడానికి వంటింట్లోకి వెళ్ళింది.
    ఆ రోజేదో ఉపవాసం వుండి అప్పుడే సుబ్బమ్మ ఇంత చలిమిడి అరటిపళ్ళు , వడపప్పు, వగైరాలు చుట్టూ పెట్టుకుని ఫలవారం చేస్తుంది. కోడలని చూడగానే కాస్త గతుక్కుమంది. "వచ్చావా కిందికి దింపడానికి లేదు. నేను మది గట్టుకున్నాను. జానకి పక్కింటి వెళ్ళింది .
    'పాలా! యిప్పుడెం పాలు, పన్నెండింటికి పట్టలేదూ? ఆశ్చర్యంగా అడిగింది కమల. తను ఆఫీసుకి వెళ్ళేటప్పుడు తొమ్మిదింటికీ పట్టి వెడుతుంది. తరువాత పన్నెండుకి మళ్ళీ టైము.
    "లేదే!' అప్పుడు పడుకున్నాడు. పుస్తకాలు తెచ్చుకోస్తానని వెళ్ళింది. ఎంతకీ రాదు, ఇదిగో యీ ఫలహారం కాస్త తిని మైలపడి పడదామనుకుంటున్నాను. రానే వచ్చావు.' నిర్వికారంగా అంది సుబ్బమ్మ.
    కమల నోటమాట రాకుండా నిలబడి పోయింది, తొమ్మిదింటికి త్రాగిన పాలు, దగ్గిర దగ్గిర రెండు అవుతుంది.... అంటే బాబు ఎంత లేదన్నా గంట నించి ఆకలికి ఏడుస్తున్నాడన్న మాట ! కడుపు తరుక్కు పోయింది కమలకి.
    కమల తల తిరిగిపోయింది. పసివాడు ఆకలికి ఏడుస్తుంటే ఎంత నిశ్చింతగా కూర్చుని ఫలహారం చేస్తుంది. రోజూ ఇలాగే ఆకలికి అలమటిస్తుంటే వాళ్ళకి తోచినపుడు ఎప్పుడో పాలు పడ్తున్నారన్నమాట. దుఃఖం పొంగి పొర్లింది కమలకి. తనని తనే తిట్టుకుంది. భుజం మీద నిస్త్రాణ వచ్చినట్టు వాలిపోయిన బాబుని గుండెల కదుముకుంది.
    అ క్షణాన్న కమలకి అత్తగారి మీదే కాదు, మొగుడు మీదే కాదు, తనమీదే కాదు, అందరి మీద యీ ప్రపంచం మీద, మనుష్యుల మీద చెప్పలేని ఏవగింపు కలిగింది. అత్తగారిని ఆవిడ తింటున్న చలిమిడి ముద్దలా చేసి మింగాలనిపించింది.
    బాబుకి పాలు కలుపుతుంటే అలా చెంపలబడి కారిపోతున్న కన్నీటిని తుడుచుకునే ప్రయత్నం చెయ్యలేదు కమల.
    
                                        *    *    *    *
    ఆ రాత్రి కమల కచ్చితంగా సుబ్బారావుతో చెప్పేసింది.
    'ఇంకో అమ్మ కన్నబిడ్డల సుఖాల కోసం నా కన్నబిడ్డను బలిపెట్టుకునేటంత త్యాగాలు చేయడం నావల్ల కాదు. నేను మీకేమన్నా చేయగల్గిన సహాయం వుంటే అది నా వంతు తిండి ఒక్క పూట మానడం మినహా నేనేం చెయ్యలేను. బాబు పెద్ద వాడయ్యే వరకు మళ్ళీ ఉద్యోగం ప్రసక్తి నా దగ్గిర తేకండి."
    
                                                 ***


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS