కథల్లో వస్తు ప్రధానమైనవి, శిల్ప ప్రధానమైనవి అని రెండు రకాలుగా విశ్లేషకులు చెబుతారు. బహు కొద్దిమంది రచయితలు మాత్రమే ఈ రెండు అంశాలకూ న్యాయం చేకూరుస్తారు. అలాంటి వాళ్ళు పాఠకులకు అభిమాన పాత్రులుగా ఎదుగుతారు. శిల్పం పాత్ర తక్కువేమీ కాకపోయినా ప్రధానంగా వస్తు ప్రాధాన్యత ఉన్న కథలు చాలా కాలం నిలబడతాయి.
కామేశ్వరి గారు అధికంగా వస్తుప్రాధాన్యత ఉన్న కథలే రాశారు. శిల్పాన్ని అవసరమైన చోట, అవసరమున్నంతవరకే చక్కగా ఉపయోగించారు. అదువల్లనే ఆమె కథలు చాలా వరకు గుర్తుండి పోయే కథలుగా ఉన్నాయి.
భర్త ఉద్యోగరీత్యా రాష్ట్రం దాటి వెళ్ళి ఒరిస్సాలో చాలా ఏళ్ళు జీవించడం వల్లనూ, కొత్త ప్రదేశాలు చూడడం వల్లనూ రచయిత్రికి వివిధ రకాల వ్యక్తులను దగ్గరగా చూసే అవకాశం లభించింది. ఇది ఆమె రచనకు కొత్త చూపునిచ్చింది ఇటు ఆమె కుటుంబ సభ్యుల్లోనూ, బంధువుల్లోనూ, స్నేహితుల, తెలిసిన వాళ్ళ కుటుంబాల్లోనూ చాలా మంది ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం అమెరికా తదితర విదేశాలకు వెళ్ళడం, అక్కడి జీవన విధానం, జీవితాల్లో వేగం.....మనవాళ్ళ జీవనశైలిలో తెచ్చిన మార్పులు.... ఇవన్నీ దగ్గరగా పరిశీలించిన కామేశ్వరి గారు ఆ కథాంశాలతో ఎన్నో కథలు రాశారు.
భారత దేశంలో కూడా.....ఐటి ఉద్యోగాలు, నగర జీవితం, భార్యా భర్తలిద్దరూ సంపాదించడం, సమానంగా లేని బాధ్యతలు, పిల్లల పెంపకాలు, వ్యక్తిత్వ వైరుధ్యాలు, స్త్రీలలో కొత్తగా పెరిగిన చైతన్యం, కొత్త రంగాలలో సమయ పరిమితి లేని ఉద్యోగాలు, ఈగో క్లాషెస్ తో కొత్త సమస్యలు..... వీటి పైన కామేశ్వరి రాసినన్ని కథలు రచయిత్రులెవరూ రాసి ఉండరేమో అనిపిస్తుంది.
ఎనభయ్యవ దశకంలోనే పరిశోధనాత్మక రచనలు మొదలయ్యాయి. అంతకు ముందు దాకా పరిశోధన అంటే అపరాధ పరిశోధన నవలలే! ఈ దశలో మనకు తెలియని, పరిచయం లేని కొత్తరంగాలకు చెందిన సరికొత్త విషయాలకు రచయితలు స్వయంగా శోధించి, అధ్యయనం చేసి రాయడం ప్రారంభించారు. వీటిని పరిశోధనాత్మక రచనలు అనడం మొదలుపెట్టారు.
మరో ప్రక్కన ప్రేమలూ, పెళ్ళిళ్ళూ, అనుమానాలూ, అపోహలూ, అపార్దాలూ, ఉద్వేగాలూ...ఈ అంశాలను దాటి అట్టడుగు అల్పాదాయ వర్గాల వారి గురించి, పీడిత ప్రబల ఘోషల గురించి రచనలు రావడం మొదలయింది. ఈ పరిణామం నవలల కన్నా ఎక్కువగా కథలలో సంభవించింది.రచయిత్రిగా డి. కామేశ్వరి తన లక్ష్యం పట్ల ఎంతో స్పష్టతతో ఉండి... తనకు ఎదురైన, తన అనుభవం లోని, తను పరిశీలించిన జీవితాలను.... ముఖ్యంగా మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి జీవితాల్లోని సంఘర్షణలను గురించి రాయడం ప్రారంభించారు. ఆమె ఈ విషయంలో ఎంతో సఫలీకృతురాలయ్యారు కూడా. అందువల్ల డి. కామేశ్వరిని పరిశోధనాత్మక రచనలు చేసిన రచయిత్రిగా కంటే పరిశీలనాత్మక రచయిత్రిగా పేర్కొనడం సబబుగా ఉంటుంది.
ముఖ్యంగా మారుతున్న కాలంలో స్త్రీవిద్య, ఉద్యోగాలు పెరిగి, మహిళలకు సంపాదన, దాని మూలంగా కొంత ఆర్ధిక స్వావలంబన లభించాక, స్త్రీ పురుష సంబంధాలు, వారి మధ్య వైరుధ్యాలు, ఈగోలూ, డబ్బుకూ, గుర్తింపుకూ మధ్య అనుబంధాలు నలిగిపోవడం.....ఇవన్నీ ఆమెకు కథావస్తువులయ్యాయి. కామేశ్వరి గారి కథలను వస్తుపరంగా స్త్రీల కథలు, కుటుంబ సంబంధాలు, సామాజిక కథలు, స్త్రీ పురుష సంబంధాలు, హాస్య వ్యంగ్య కథలు, ఇతరాలు అనే ప్రధాన విభాలుగా వర్గీకరించవచ్చు. కొన్ని కథలు ఒక్కోసారి రెండు విభాగాలకూ చెంది ఉన్నప్పుడు కథలో చర్చించిన ప్రధానాంశం ప్రకారమే విభజించడం జరిగింది.
స్త్రీల కథలు
బహుళ ప్రాచుర్యం పొందిన స్త్రీవాదం వేళ్ళూనుకున్న ఎనభైల కంటే ముందే స్త్రీల ఆలోచనలు, ఆశలు, ఆవేదనలు, అనుభవాలు కథాంశాలుగా ఎన్నో కథలు రాశారు కామేశ్వరి. నిజానికి ఆమె తానే ఎన్నో మార్లు చెప్పుకున్నట్లుగా మొదట్లో మానవ సంబంధాల మీద, కుటుంబ సమస్యల మీద, ప్రేమల మీద రాసినా తరువాత రాసిన కథలన్నీ స్త్రీల సమస్యల మీద రచించినవే.
స్త్రీలు నిశ్శబ్దంగా పురుషుల జీవన ప్రవాహంలో అంతర్వాహినుల్లా కలిసిపోతూనే తమ కలలను నెరవేర్చుకోవడానికి, కళలను నిలబెట్టుకోవడానికి నిరంతరం పరితపిస్తూ ఉంటారు. సమస్యల్లో సంయమనం, భాధల్లో ధైర్యం, ఆపదల్లో సాహసం స్త్రీల సహజ లక్షణాలు. డి, కామేశ్వరి గారి అనేక కథల్లో గుడిసెల్లో ఉండే స్త్రీలు మొదలుకొని మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి స్త్రీలు కూడా తమ ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి, స్వేచ్చను నిలుపుకోవడానికి ఎంతో తెగువను పదర్శించడం, త్యాగానికి సిద్ధపడడం వంటివాటిని చూపారు. తద్వారా స్త్రీలలో స్ఫూర్తిని నింపారు.
దంపతుల మధ్య ఫర్టిలిటీ అనేది పెద్ద సమస్య. సంతానం లేని స్త్రీలు చుట్టూ ఉన్న సమాజం నుండి ఎన్నో ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పిల్లలు పుట్టకపోవడానికి భార్యాభర్తల్లో ఎవరి సమస్యయినా కారణం కావొచ్చు, ఇంకా చెప్పాలంటే పురుషుల ఫర్టిలిటీ ప్రధాన కారణం అయినప్పటికీ అవమానాలకు, అవహేళనలకు గురయ్యేది మటుకు ఎక్కువగా స్త్రీలే. సంతానం కలగని సందర్భాలలో వైద్య పరీక్షలకు మానసికంగా సిద్ధపడని పురుషులు నూటికి తొంభై శాతం ఉన్న దేశంలో లోపం వారిదే అయిన సందర్భంలో నిజాయితీగా అంగీకరించేవారు దాదాపు మృగ్యం అని చెప్పవచ్చు. పిల్లలు లేని సుజాతా, ప్రభాకర్ దంపతులు విడివిడిగా సుజాత అక్క స్నేహితురాలైన డా. అన్నపూర్ణ వద్ద పరీక్షలు చేయించుకుంటారు. సుజాత రిపోర్ట్ నార్మల్ గా ఉందని తెలిశాక తన స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉందని సుజాతతో కూడా చెప్పడానికి న్యూనత పడిన ప్రభాకర్ ఒక ఫేక్ రిపోర్ట్ చూపిస్తాడు భార్యకు.
కొన్నాళ్ళ తరువాత ఇంగ్లాండ్ వెళ్ళివచ్చిన ఆ డాక్టర్ ద్వారానే విషయం తెలుసుకున్న సుజాత భర్త తనకు అబద్దం చెప్పాడని తెలుసుకుంటుంది. డాక్టర్ ను బతిమిలాడి కృత్రిమ గర్భధారణ విధానాన్ని ఆశ్రయిస్తుంది. తెల్లబోయి ఖంగు తిన్న భర్తతో మందులు వాడిన ఫలితమేమో అంటుంది. 'నాకు అబద్దం చెప్పి మోసం చేసినందుకు జీవితాంతం అనుమానంతో బాధపడుతూ, పైకి ఏమీ చెప్పలేని ఆ శిక్ష అతనికి చాలు' అంటుంది డాక్టర్ తో, ఈ తరం స్త్రీలు ప్రతి దానికీ బెంబేలు పడకుండా యుక్తితో సమస్యలకు పరిష్కారం చూసుకుంటారనే విషయాన్నీ, చాలా సందర్భాలలో స్త్రీలే ధైర్యంగా, కాలానుగుణంగా ప్రవర్తిస్తారనే నిజాన్నీ 'ఈ శిక్ష చాలు' అనే కథద్వారా చెబుతారు రచయిత్రి.
