మాయా సంసారం
వసుంధర

అప్పుడే స్నానం చేసి వచ్చింది జ్యోత్స్న. కాసేపు అద్దం ముందు నిలబడి తన అందాన్ని చూసుకుని మురిసిపోయింది.
పిల్లలిద్దరూ బడికి వెళ్ళిపోయారు. భర్త ఆఫీసుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు జ్యోత్స్న తనూ బయటకు వెళ్ళేదానిలా బట్టలు వేసుకుంది, అయితే ఇప్పుడామె బయటకు వెళ్ళబోవడం లేదు. ఎక్కడున్నా పువ్వులా వుండాలన్నది ఆమె తత్వం. ఎంత పనిలో ఉన్నా ఆమె ముఖంలో చెరగని చిరునవ్వుంటుంది.
జ్యోత్స్న డ్రాయింగు రూంలోకి వెళ్ళి సోఫాలో కూర్చుని ఓ తెలుగు నవల తీసుకుని చదవసాగింది. చాలా మంది ఆడవాళ్ళకులా పడుకొని చదవడం అమెకలవాటు లేదు. తెలుగు నవలలంటే ఆమెకు ప్రాణం. తీరిక ఉన్నప్పుడల్లా ఆమె నవలలు చదువుతుంటుంది.
నవలల కోసం తీరిక చేసుకుంటుందని భర్త ఆమెను తరచూ వేళాకోళం చేసినా అది సరదాకు మాత్రమే! ఏ పనీని ఆమె ఆలక్ష్యం చేయదనీ , వాయిదా వేయదనీ ఆమె భర్త జగదీష్ కు తెలుసు. అ విషయం అతడి కళ్ళు చూసి తెలుసుకోవచ్చు.
జ్యోత్స్న కిద్దరు పిల్లలు. పెద్దవాడు రణధీర్ కు పదేళ్ళు. రెండో వాడు రవి శంకర్ కు ఏడేళ్ళు. పిల్లల వయసును బట్టి ఆమెకు ముప్పై ఏళ్ళు అయినా ఉండాలను కోవాలి తప్పితే చూడడాని కామె మరీ పద్దెనిమిదేళ్ళ యువతిలా -- ఆ పిల్లల అక్కలా ఉంటుంది. జగదీష్ మాత్రం అ పిల్లలకు తండ్రిలాగే ఉంటాడు.
ఆ యింట్లో అందరూ ఒకరి కోసమొకరు జీవిస్తుంటారు. అందువల్ల ఆ చుట్టుపక్కల ఆ కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అలా చెప్పుకునే వారిలో కొందరిది కాలక్షేపం, కొందరిది ఆశ్చర్యం కొందరిది అసూయ.
ఇలాంటి వారు కాక మరోరకం వారు కూడా ఉన్నారు. వారందరూ యువకులు, జ్యోత్స్నకు జగదీష్ తగడని వారనుకుంటారు. తామే కాక జ్యోత్స్న కూడా అలా భావిస్తోందని వారనుకుంటారు. ఆమె ఎవరినైనా చిరునవ్వుతో పలకరిస్తే అదే తమకు ఆహ్వానమనుకుంటారు. ఆ ఆహ్వానాన్నందుకునే అవకాశం రావడం లేదని వాపోతుంటారు. ధైర్యం చేయడానికి జ్యోత్స్న మరింత డైరెక్టుగా ఆహ్వానిస్తే బాగుండుననుకుంటారు. ఇవన్నీ బైటకు చెప్పకపోయినా ఆమె అందం గురించి యువక బృందం చర్చలు జరుపుతూనే ఉంటుంది. వారందరూ ఏకగ్రీవంగా తీర్మానించిన విశేషం -- సుకుమార్ అదృష్టవంతుడని!
సుకుమార్ ఇంట్లోనే జగదీష్ అద్దె కుంటున్నాడు.
తన అదృష్టం సుకుమార్ కి తెలుసు.
ఇంట్లో తండ్రి అతడు ఉంటున్నారు. అతడి తల్లి రెండేళ్ళ క్రితం చనిపోయింది. ఉదయం, సాయంత్రం వంటమనిషి వచ్చి వంట చేసి వెడుతుంది. ఆమె వయసు యాభైకి దరిదాపుల్లో వుంటుంది. సుకుమార్ తండ్రి పదింటికి ఆఫీసుకు వెడతాడు. ఆయనకింకా రెండేళ్ళ సర్వీసుంది.
జగదీష్ తొమ్మిదిన్నరకే ఆఫీసుకు వెడతాడు. అతడు తిరిగి వచ్చేది సాయంత్రం ఆరింటికి. అతడికి స్కూటరుంది.
జ్యోత్స్న పిల్లలిద్దరూ ఎనిమిదింటికే స్కూలుకు వెడతారు. వాళ్ళు సాయంత్రం నాలుగింటికి తిరిగి వస్తారు. వాళ్ళకు స్కూలు బస్ ఉంది.
ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం నాలుగు వరకు జ్యోత్స్న ఇంట్లో ఒంటరిగా వుంటుంది. ఆమె బయటకు రావడం ఆ సమయంలో అరుదు.
ఉదయం పదింటి నుంచి సుకుమార్ ఇంట్లో ఒంటరిగా ఉంటాడు. సాధారణంగా అతడా సమయంలో బయటకు పోయేవాడు. ఆర్నెల్ల క్రితం జగదీష్ కుటుంబం ఆ ఇంట్లో అద్దె కొచ్చినప్పట్నించీ అతడి కార్యక్రమాలు మారిపోయాయి.
జ్యోత్స్న ఇప్పుడతడి ఆలోచనలను పూర్తిగా ఆశ్రయించుకుంది. ఇటీవల మన ఆలోచనల్లో, సంస్కారంలో వస్తున్న మార్పు ఇది, ఇది తప్పో ఒప్పో చెప్పలేము గాని ఆలోచించాల్సిన విషయమే!
నచ్చిన మనసైన యువతి పై ఆశలు పెంచుకోవడం యే సంప్రదాయం లోనూ తప్పు కాదు. ఎటొచ్చి అటుపైన ఒక స్త్రీకి ఒకే పురుషుడన్న సిద్దాంతాన్ని మన సంప్రదాయం చెబుతోంది. వైవాహిక బంధం నుంచి విడివడే వరకూ , వైవాహిక బంధంలో ముడి పడేవరకూ-- స్త్రీ పురుషులు విచ్చలవిడిగా సంచరించడాన్ని పాశ్చాత్య సంప్రదాయం హర్షిస్తుంది.
ప్రస్తుతం యువతరానికే సంప్రదాయాన్ని స్వికరించాలో తెలియడం లేదు. వారు బ్రహ్మచారులుగా పాశ్చాత్య సంప్రదాయాన్నభిమానిస్తూ , వివాహం కాగానే భారతీయ సంప్రదాయాన్నాభీమానిస్తున్నారు. మన సంప్రదాయాలను నిర్ణయించేది పురుష ప్రపంచమే కావడంతో ఈ విషయంలో స్త్రీల అభిప్రాయానికి విలువే వుండదు.
ప్రతి యువకుడూ తానూ స్త్రీ మనసు నర్దం చేసుకున్నాననే భావిస్తాడు. నిలువుటద్దం వంటి ఆమె స్వచ్చతలో తన కోరికల ప్రతిబింబాలు చూస్తాడు. అందుకు ప్రస్తుతం సాహిత్యం కూడా యెంతగానో సహకరిస్తోంది. అరుదైన వ్యభిచార భావాలను స్త్రీకి సహజమైనవిగా వర్ణించడంతో -- ఎందరో యువకులు మనసులు తప్పు దారిలో నడిపిస్తున్నారు. ఇప్పుడు సుకుమార్ విషయం లోనూ అదే జరిగింది.
ఒకరోజుతడోక్కడూ ఇంట్లో వుండగా డ్రాయింగ్ రూం తలుపు తట్టింది జ్యోత్స్న. అతడు తలుపు తీయాగానే ఆమె అతడిని తెలుగు నవలలు కావాలని అడిగింది. ఆ రెండిళ్ళ కూ లోపలనుంచి ఉన్న మార్గమది.
అప్పటికి జగదీష్ కుటుంబం ఆ యింట్లో అద్దెకొచ్చి సరిగ్గా వారం రోజులయింది. వచ్చిన వారం రోజుల్లోనే రెండు రాత్రులు సుకుమార్ నీ తండ్రినీ భోజనానికి పిలిచాడు జగదీష్.
"ఎందుకయ్యా మీ ఆవిడకు శ్రమ....నాకు వంట మనిషుందిగా --' అన్నాడు సుకుమార్ తండ్రి.
"ఇందులో శ్రమంటూ ఉంటె అది నాదే...." అన్నాడు జగదీష్.
"అంటే నువ్వే వంట చేస్తావా?" అన్నాడు సుకుమార్ తండ్రి.
"అబ్బే -- అది కదండీ. పిలవమన్న పట్టుదల మా ఆవిడదే! అంటే తనకేమీ శ్రమ లేదన్న మాటే గదా -- వంటకు సంబంధించినంతవరకూ . వంట చేయడానికి సిద్దపడ్డ మనిషి తనే మిమ్మల్ని పిలవొచ్చుగా. అలా పిలవడం లేదంటే శ్రమంతా పిలవడం లోనే ఉందన్న మాట.... ఆ పని నేను చేస్తున్నాగా......" అన్నాడు జగదీష్.
మర్యాదకు జగదీష్ అన్న ఈ మాటలు సుకుమార్ పై ఇంకొకలా పని చేశాయి. జగదీష్ కు తమను భోజనానికి పిలవాలని లేదు. అతడి భార్య జ్యోత్స్న పట్టుబట్టగా ఈ ఆహ్వానం వచ్చింది. ఈ ఆహ్వానం తప్పనిసరిగా తన గురించే అయుంటుంది.
సుకుమార్ ఆరడగుల పొడవుంటాడు. పచ్చని చాయ. చాలామంది అతణ్ణి హీరో అని పిలుస్తారు. తన పెర్సనాలిటీ కి ఆడపిల్లలు పడి చస్తారన్న అభిప్రాయమతడిలో ఉంది. అందులోని నిజానిజాలు తెలుసుకునేందుకతడేప్పుడూ ఆడపిల్లలతో మాట్లాడి ఉండలేదు. అందమైన ఆడపిల్ల కతడేప్పుడూ కాస్త దూరంలోనే ఉండి ఆమె తన వెంట పడుతుందేమోనని ఆశిస్తూ యెదురు చూస్తూండడం వల్ల ఇంతవరకూ అతడికి గర్లఫ్రెండ్స్ లేరు. అయినా ఆడపిల్లలు తనంటే పడి చస్తారనీ- తన ప్రయత్నలోపం వల్ల అది జరగడం లేదని సుకుమార్ సరిపెట్టుకుంటాడు.
సుకుమార్ తనను జగదీష్ తో పోల్చుకొని -- తను అతడి కంటే బాగా ఉన్నత స్థానంలో ఉంచుకొని-- "ఐ అండర్ స్టాండ్ యూ జ్యోత్స్న--" అనుకున్నాడు.
మొదటిరోజున భోజనం చేసినపుడు మొహమాటంతో అతడు సరిగా భోచేయలేదు. వంటలు బాగోలేవా అని జ్యోత్స్న నొచ్చుకుంటే బదులివ్వడాని క్కూడా మొహామాటపడ్డాడు సుకుమార్. అప్పుడతడి తండ్రి - "వాడికి చాలా కూరలు సహించవు. వంటలకేం బ్రాహ్మండంగా ఉన్నాయి--" అన్నాడు.
"అయ్యో-- అనవసరంగా భోజనానికి పిలిచి కడుపు మాడ్చానన్నమాట-- అసలేం తింటాడేమిటి మీ అబ్బాయి-- " అనడిగింది జ్యోత్స్న.
"అరటికాయ వెపుడూ, వంకాయ కూడా ------......అంతే ఇంకే కూరలు తినడు. అందరూ ప్రాణం పెట్టె కొబ్బరి పచ్చడి ఇంట్లో అయితే నాలిక్కి క్కూడా రాసుకోడు. వాడికి పెసరపచ్చడి ఇష్టం. సంబారు వాడికి నచ్చదు. చారైనా ఫరవాలేదు. ఉల్లిపాయలు పులుసైతే యిట్టె జుర్రెస్తాడు. వీడి రుచుల వల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంటోంది. అస్తమానూ రెండేసి రకాల వంటకాలెక్కడ చేసుకోగలం. అందుకని తరచుగా నేనే నా రుచులను చంపుకోవలసోస్తోంది...." అన్నాడు సుకుమార్ తండ్రి.
ఆ తర్వాత రెంద్రోజులకే మళ్ళీ వాళ్ళను బోజనానికి పిలిచింది జ్యోత్స్న. ఈసారన్నీ సుకుమార్ కిష్టమైనవే చేసేసరికి అతడిలో ఆశలు చిగురించాయి. తర్వాత నుంచి సుకుమార్ కిష్టమైన ఆయిటమ్స్ చేసినపుడు వాళ్ళింట్లో ఇస్తుండేదామె. అవన్నీ సుకుమార్ తండ్రి ఉండగానే జరిగాయి.
