Previous Page Next Page 
తల్లి మనసు కధలు పేజి 3


    తనేం ఉద్యోగం చేయాలని ఉవ్విళ్ళురిందా? సంసార భారాన్ని ఒక్కడూ మోయలేక స్కూలు పైనలు ప్యాసాయి వున్న తనని ఉద్యోగం చేయమని ప్రోత్సహించింది అయన కాదూ? ఎవరెవరి దగ్గరకో తిరిగి తిరిగి ఉద్యోగం వేయించింది ఆయనేగా!
    ఇప్పుడెందుకు మాట మాట్లాడితే ఉద్యోగస్తురాలని ఎత్తి పొడవడం! తనకీ ఓ ఏడాది ఉద్యోగం సరదాగానే వుండేది! కాస్తో కూస్తో సంపాదించి అయన భారాన్ని తనూ పంచుకుంటుందని గర్వంగా తృప్తిగా వుండేది.
    ఆ అనందం యింట్లో ఈయన గారి మాటలతో చేష్టలతో అణగారి పోతుంది! ఎందుకీ ఉద్యోగం అనిపిస్తుంది.
    తోటి ఉద్యోగితో మాట్లాడితే అనుమానం! తన సంపాదనతో ముచ్చటపడి ఓ చీర కొనుక్కుంటే మొగుడంటే లేక్కలేనట్టు నానామాటలు అనడం. ఆఫీసు నించి ఆలస్యం గా వస్తే సవాలక్ష సంజాయిషీలు చెప్పుకోవాలి. అనుమానంగా ఎగాదిగా చూడడం ఓ ఐదు నిమిషాలు ముందెళ్ళలంటే లక్ష ప్రశ్నలు. ఎన్ని అన్నా మాట్లాడకపోతే , ఉద్యోగం చేస్తున్నానని తలబిరుసుతనం అనడం. జవాబు చెబితే 'అవును మొగుడంటే లేక్కఎమిటి మాటకి మాటకి జవాబు చెప్తున్నావు' అని కోపం. ఒక్క పదిరూపాయలు జీతంలోంచి ఖర్చు పెడితే ఇదిమాత్రం నాకెందుకు నీ సంపాదన నీ యిష్టం. నాకెందుకు అని డబ్బు పుచ్చుకోకుండా తనేదో ఘోరాపరాధం చేసినట్టు క్షమాపణలు చెప్పించుకోడం.
    అడుగడుగునా యిలాంటి సంఘటనలు ఎన్నో ఈరెండేళ్ళలో! ఓసారి గాబోలు, సరదాగా తన ఆఫీసు  వాళ్ళందరూ కార్తీక సోమవారం పిక్నిక్ వనభోజనాలకి వెళ్ళడానికి ప్రోగ్రాం వేశారు. నిజమే ముందు ఆయనతో చెప్పడం మరచిపోయింది. వెళ్లబోయే ముందు చెపితే ఆరోజు అయన, అత్తగారు ఎన్ని మాటలన్నారు? 'ఉద్యోగం చేసినంత మాత్రాన పెళ్ళాం పెళ్ళామే అవుతుంది . మొగుడ్ని లెక్క చేయ నక్కరలేదని ఎక్కడా లేదుట ! ఎంత ఉద్యోగం చేసినా ఆడది ఆడదేట! అడదేప్పుడూ మగాడి ఆధీనంలోనే వుండక తప్పదని గుర్తుంచుకోవాలిట తను. కట్టుకున్న మొగుడ్ని లేక్కచేయ్యకపోతే ఆ భార్య ఎంత సంపాయిస్తున్న ఏ మగాడూ సహించడట! అయన తర్వాత అత్తగా రందుకుంది.... ఆడది మెలగవలసిన రీతులు. అడ దుండవలాసిన చోటు వైగారాలు వల్లించి, వాళ్ళ కాలంలో వాళ్ళ మొగుళ్ళఅంటే ఎంత భయభక్తులతో మెలిగెవరో ఎలా గడగడలాడే వారో వర్ణించి , మొగుడంటే ఇంత లెక్కలేక పోవడం ఎక్కడా చూడలేదని బుగ్గలు నొక్కుకుని.... దానికి అలుసుచ్చి నెత్తి కెక్కించుకున్నావు అనుభవించు అంటూ కొడుక్కి మరింత పుర్రెక్కచింది. ఆరోజు యెన్నడూ రానంత కోపం వచ్చింది కమలకి. నూటికోనాడు సరదాగా గడపడానికి ఇంత గొడవా? ప్రతిదానికి నీతులు, ఉపదేశాలు ! ప్రతిదానికి బెదిరింపులు. ఏం చేస్తారు బెదిరించి, మహా అయితే ఉద్యోగం మానేయమంటారు? మరీ మంచిది, ఈ పీడ, గోల వదులుతుంది. హాయిగా ఆనందంగా ఒకరోజు గడిపే అవకాశాన్ని యీ మాత్రం డానికి ఎందుకు వదులుకోవాలి! కమల నీతులు వల్లిస్తున్న తల్లి, కొడుకులని వదిలివెళ్ళి పోయింది. కమలకి తెలుసు ఇవన్నీ ఉత్తిత్తి బెదిరింపులు. ఉద్యోగం మానమనరని తెలుసు! అలాగే జరిగింది. అట్నించి వచ్చాక సుబ్బారావు వారం రోజులు మాటలు మానేయడం మినహా ఏం అనలేదు.
    ఇవన్నీ ఓ ఎత్తు! మూడు నెలల నించి తన వంట్లో బాగులేని సంగతి సుబ్బారావుకి తెలియని సంగతి కాదు! తెలిసినా కమల పరిస్థితి . అవస్థ చూస్తూ కూడా చూడనట్లు నటిస్తున్న మొగుడ్ని చూస్తుంటే కమలకి పట్టరాని కోపం వస్తుంది. 'కమలా వంట్లో బాగులేదు, కొన్నాళ్ళు శలవు పెట్టు' అంటే తనెంత సంతోషించేది.
    అదేం లేకపోగా మరీ నీరసం అనిపించి, ఉద్యోగం చెయ్యలేనని అనిపించి తనంతట తనే అంది. సుబ్బారావు వింత సంగతి విన్నంత ఆశ్చర్యం నటించాడు..... ఉద్యోగం మానేస్తావా? ... ఈ మాత్రానికి ఉద్యోగం మానేస్తావా? మీ ఆడవాళ్ళకి లేకపోతే ఉద్యోగం ఏమిటి? ఏ కాస్త కష్టానికి ఓర్చుకోలేరు! ఈనాటికి నీవే పిల్లల్ని కనబోతున్నట్లున్నావు.... యింత హడావుడి చేస్తున్నావు....' అని ముందు కాస్త విసురుగా మాట్లాడాడు. తన మొహం చూసి చప్పున సర్దుకుని శాంతంగా నచ్చజెప్పడం ఆరంభించాడు. 'కమలా ....ఈ ఉద్యోగం వదిలేస్తే కావాలన్నప్పుడు మళ్ళీ దొరుకుతుందా? ఈ ఉద్యోగం కోసం ఎన్నోచోట్ల ప్రయత్నం చేసానో మరిచిపోయావా?..... ఆ వేళకి ఎలాగో మెటర్నిటీ ,లీవు ఉంటుంది. ఉద్యోగం మానేస్తే యెలా చెప్పు.....' యెంతో ప్రేమగా అన్నాడు.
    కమల ఏమంటుంది? ఇంటి పరిస్థితి తెలియందిగాదు. తన ఉద్యోగం లేక ముందు అవస్థలు గుర్తుకొచ్చి ఆ మాట నిజమే అనిపించింది. తరువాత మళ్ళీ సుబ్బారావు దగ్గిర ఎన్నడూ తన ఆరోగ్యం సంగతి ఎత్తలేదు కమల.
    
                                          *    *    *    *
    ఇన్నాళ్ళూ ఎలాగో గడిచిపోయాయి రోజులు. కాని బాబు పుట్టాక ఉద్యోగం చెయ్యాలంటే కమల మనసు అంత చంటివాడిని వదిలి వెళ్ళడానికి వప్పుకోలేదు. అసలు ఉద్యోగంలో చేరేటప్పుడు 'పిల్లలు పుట్టేవరకు ఇంట్లో వూరికే కూర్చుని ఏం చేస్తావు అమ్మా, జానకి వుండనేవున్నారు పని చూసుకోడానికి' అన్నాడు సుబ్బారావు. ఆ మాట నిజమే గనక అప్పుడు ఉద్యోగం చేయడానికి తనకేం అభ్యంతరం లేదు.
    కాని....యిప్పుడు బాబు పుట్టాడు. ఒక్క నెలరోజులు మాత్రమే. ఇంటిపట్టున వుంది కమల. "ఎలాగండీ బాబుని వదిలి ఆఫీసు కి వెళ్ళడం . ప్రొద్దున వెళ్ళిన దాన్ని సాయంత్రం వరకు ఎలా వదిలి వుండడం , పని మానేస్తాను " కమల అంది శలవు అయిపోయాక. సుబ్బారావు కాస్త మొహం చిట్లించాడు.
    "ఏం పిల్లలున్న వాళ్ళెవరూ ఉద్యోగాలు చేయడం లేదా ఏమిటి? వాడికి యెలాగో పోతపాలేగా! అమ్మ, జానకి ఆ మాత్రం చూడలేరా ఏమిటి వాడిని! అసలే పురిటికి డానికి బోలెడంత ఖర్చు అయింది. ఇప్పుడు బాబుకి పాలడబ్బాలు అవి మరింత ఖర్చు పెరిగింది .... మానేస్తే ఎలా, ... అన్నాడు.
    కమల ఏమనగలదు? నిట్టూర్చింది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS