మెట్టు దిగిన జగన్.. కలిసి పనిచేద్దాం రా!!

 

వైసీపీలో నెలకొన్న వివాదాలను చక్కదిద్దేందుకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఓ మెట్టు దిగినట్లు కనిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ మద్దతు కాంగ్రెస్ పార్టీకేనని వైసీపీ వ్యవస్థాపకుడు శివకుమార్ ప్రకటించారు. శివకుమార్ నిర్ణయంతో ఆగ్రహం చెందిన జగన్ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీలో చర్చించకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడాన్ని ఖండిస్తూ ఆయనపై వేటు వేసినట్లు తెలిపారు. అయితే తన బహిష్కరణపై శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ జనరల్ సెక్రటరీగా మద్దతు పలికానని అందులో తప్పేంటని ప్రశ్నించారు. దేశ చరిత్రలో ఒక పార్టీ వ్యవస్థాపకుడిని బహిష్కరించిన ఘనత జగన్ కే దక్కుతుందంటూ మండిపడ్డారు. తనపై విధించిన బహిష్కరణ వేటును ఎత్తివేయాలని లేనిపక్షంలో వైసీపీ నుంచి జగన్ బయటకు పోవాలి అంటూ అల్టిమేటం జారీ చేశారు. తాను పెట్టిన పార్టీ నుండి పొమ్మనటానికి మీరెవరు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీనిపై శివకుమార్ న్యాయపోరాటానికి కూడా సిద్ధమయ్యారు. న్యాయపోరాటంలో భాగంగా ఆయన కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. తన పార్టీ నుండి తనని బహిష్కరించడం ఏంటని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం జగన్ కు నోటీసులు జారీ చేసింది. శివకుమార్ సస్పెన్షన్ వేటుపై  మార్చి11లోపు సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ తలనొప్పులు ఎందుకని భావించిన జగన్.. శివకుమార్ తో రాజీకి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా కలిసి పనిచేద్దాం రావాలంటూ శివకుమార్ కు జగన్ తన సన్నిహితుల ద్వారా కబురు పంపారట. దీంతో గురువారం శివకుమార్, జగన్ తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అంతా కలిసి పనిచెయ్యాలని, పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చెయ్యాలని జగన్ శివకుమార్ కు కబురుపంపినట్లు సమాచారం.