ఉగ్రవాదుల శవాలు చూపించండి: అమర జవాన్ల కుటుంబీకులు

 

పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం పాక్ లోని బాలాకోట్ లో జైషె మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 300 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని వార్తలొచ్చాయి. అధికార పార్టీ బీజేపీ కూడా అదే చెప్పింది. అయితే పాక్ మాత్రం భారత్ ఖాళీ ప్రదేశాల్లో బాంబులు వేసి వెళ్లిపోయిందని అంటోంది. మరోవైపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏమో టార్గెట్ ఫినిష్ చేయడమే కానీ.. మృతదేహాలు లెక్కపెట్టడం మా పని కాదని అన్నారు. దీంతో అసలు ఆ దాడిలో ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారనే దాని మీద సస్పెన్స్ కొనసాగుతుంది. విపక్ష నేతలు కొందరు ఈ దాడికి సంబంధించి స్పష్టమైన వివరాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే బీజేపీ వారి డిమాండ్ ను రాజకీయ డిమాండ్ గానే భావించింది. కానీ ఇప్పుడు పుల్వామా దాడిలో మరణించిన సీఆర్పీఎఫ్ అమర జవాన్ల కుటుంబీకులు కూడా బాలాకోట్ లో మరణించిన ఉగ్రవాదుల మృతదేహాలు చూపించాలని కోరుతున్నారు.

తమ ఆప్తులను పొట్టన పెట్టుకున్న జైషె మహమ్మద్ ఉగ్రవాదుల మృతదేహాలను కళ్లారా చూసిన తరువాతే తమ మనసుకు శాంతి కలగుతుందని, తమ కడుపుకోత చల్లారుతుందని సీఆర్పీఎఫ్ అమర జవాన్ల కుటుంబీకులు కేంద్రాన్ని కోరుతున్నారు. పుల్వామా దాడిలో 42 మంది జవాన్లు అమరులయ్యారు. వారిలో ఇద్దరు ఉత్తర్ ప్రదేశ్ మొరాదాబాద్ జిల్లా షామ్లీ ప్రాంతానికి చెందిన ప్రదీప్ కుమార్, మణిపూర్ కు చెందిన రామ్ వకీల్ కూడా ఉన్నారు.

ప్రదీప్ కుమార్ తల్లి సులేలత మాట్లాడుతూ వైమానిక దాడులతో తాము సంతృప్తి చెందట్లేదని తేల్చి చెప్పారు. ఉగ్రవాదుల మృతదేహాలను తమకు చూపించాలని డిమాండ్ చేసారు. ప్రదీప్ లాగే పుల్వామా దాడిలో ఎందరో కుమారులు అమరవీరులయ్యారని, వారి తల్లులకు కడుపుకోతను మిగిల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని, కనీసం ఒక్క ఉగ్రవాది మృతదేహాన్నయినా తమకు చూపాలని అన్నారు. ఉగ్రవాదుల మృతదేహాలను టీవీల్లో చూసి తమ కడుపుకోతను చల్లార్చుకుంటామని సులేలత చెప్పారు.

పుల్వామా ఉగ్రవాదుల దాడిలో తన సోదరుడు కన్నుమూశాడని, ఆ దిగ్భ్రాంతి నుంచి తాము ఇప్పటికీ కోలుకోలేకపోతున్నామని రామ్ వకీల్ సోదరి రామ్ రక్ష చెబుతున్నారు. తమలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయని అన్నారు. పుల్వామా దాడి అనంతరం సీఆర్పీఎఫ్ జవాన్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తాము ప్రత్యక్షంగా చూశామని చెప్పారు. సీఆర్పీఎఫ్ అమర జవాన్లలో ఒకరు చేతులు కోల్పోయి, మరొకరు కాళ్లు కోల్పోయి.. దీనస్థితిలో ఉన్న దృశ్యాలు చూశామని అన్నారు. వైమానిక దాడుల సందర్భంగా కూడా బాలాకోట్ లో కూడా ఉగ్రవాదులు కూడా ఛిద్రమైన శరీరాలతో పడి ఉండి ఉంటారని రామ్ రక్ష అన్నారు. అలాంటి దృశ్యాలు, ఫొటోలను చూసిన తరువాతే తమకు మనసుకు శాంతి లభిస్తుందని, కడుపుకోత చల్లారుతుందని చెప్పారు. మరి ఉగ్రవాదుల మృతదేహాలు చూపించాలని అమర జవాన్ల కుటుంబాలు చేస్తున్న డిమాండ్ పై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu