నీటి ఎద్దడి నివారణకు బోర్ పిట్స్.. కేంద్రం సహకారంతో ఏపీ ముందడుగు
posted on Jul 9, 2025 2:02PM

నీటిఎద్దడి ప్రమాదఘంటికలు మ్రోగిస్తోంది. నీటి వినియోగం రోజురోజుకూ పెరిగిపోవడం, వృధాగా నీరు మురికి కాలువలో కలిసిపోవడం.తో నీటి ఎద్దడి రోజురోజుకూ తీవ్రమౌతోంది. పట్టణాలు,నగరాలు విస్తరణ కారణంగా ఏటికేడు నీటి వినియోగంవిపరీతంగా పెరిగిపోతోంది. ఈ కారణంగా వేసవితో సంబంధం లేకుండానే నీటి ఎద్దడి ఏర్పడుతోంది. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని కొందరు నీటి ట్యాంకర్ల దందా చేస్తూ కోట్లు వెనకేసుకుంటున్నారు. అలాగే మినరల్ వాటర్ మినరల్ వాటర్ ప్లాంటు లను నెలకొల్పి నీటిని తోడేస్తున్నారు.
నగరాల్లో నీటి ఎద్దడి రాకుండా ఉండాలంటే వర్షాకాలంలో కురిసిన నీరు వృధాగా పోకుండా భూమిలోకి ఇంకేలా ఏర్పాట్లు ఉండాలి. ఇంకుడు గుంతల విధానం తో కొంతవరకూ భూగర్భజలాలను కాపాడవచ్చు. అయితే వర్షంపు నీరు ప్రతి చుక్కా భూమిలోకి వెళ్లేలా చర్యలు తీసుకోవలసి ఉంటుంది. అందుకు ప్రతి ఇల్లు, ప్రతి కాలనీ, ప్రతి అపార్ట్ మెంట్ లలో ఖాళీ ప్రదేశాలలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయ్యాలి. అయితే అందుకు భిన్నంగా ఇళ్లు, కాలనీలు, అపార్ట్ మెంట్ల నిర్మాణం జరుగుతోంది. మొత్తం గచ్చు చేయించి నీరు భూమిలోకి ఇంకే అవకాశం లేకుండా చేస్తున్నారు. దీంతో నీటి ఎద్దడి డేంజర్ బెల్స్ మోగించే పరిస్థితి ఏర్పడుతోంది.
ఇది అరికట్టాలంటే ఇంకుడు గుంతలు తో పాటు బోర్ పిట్ల ద్వారా నీరు భూమిలోకి ఇంకేలా మరింత మెరుగైన విధానానికి శ్రీకారం చుట్టాల్సి ఉంది. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. బోరు బావులను తవ్వి దాని చుట్టూ ఇంకుడు గుంతల తరహాలో పెద్దపెద్ద గోతులు తవ్వి వాన,వృధా నీటిని ఒడిసి పట్టి బోరు ద్వారా భూమిలోకి పంపించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లా, రాయలసీమలో పలు ప్రాంతాల్లో ఈ తరహా బోర్ పిట్ లను నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నది .మోడల్ ప్రాజెక్టు గా విజయనగరం, సీమ జిల్లాల్లో బోర్ పిట్ల నిర్మాణం చేపట్టారు. ఇందు కోసం కేంద్రం నిధులు సమకూరుస్తుంది.
భవిష్యత్ తరాలకు నీటికొరత రాకుండా వాననీటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా రాష్ట్రప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఇందుకుగాను భూగర్భ జల శాస్త్ర వేత్త లతో ఏపీ సర్కార్ విస్తృతంగా సమాలోచనలు చేసింది. ఈ విధానం వల్ల 80 శాతం అదనంగా భూగర్భజలాలు అందుబాటులో ఉంటాయని నిపుణులు అంటున్నారు.