ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అందుకే లంచం తీసుకొంటున్నాను : జేసి
posted on Oct 24, 2015 8:38AM
.jpg)
జేసి దివాకర్ రెడ్డి, జేసి ప్రభాకర్ రెడ్డి ఇరువురూ కూడా ఏదో ఒక సంచలన లేదా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. ప్రత్యేక హోదా రాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా కాలం క్రితమే తెలుసని కానీ ప్రజలను, పవన్ కళ్యాణ్ న్ని తృప్తి పరిచేందుకే పార్లమెంటు ముందు తాము ధర్నా చేసామని తెదేపా ఎంపీ జేసి దివాకర్ రెడ్డి చెప్పినప్పుడు తెదేపా చాలా ఇబ్బందికరమయిన పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఆయన సోదరుడు తాడిపత్రి తెదేపా ఎమ్మెల్యే జేసి ప్రభాకర్ రెడ్డి నిన్న చాలా వివాదస్పద ప్రకటన చేసారు.
తన తాడిపత్రి నియోజక వర్గం అభివృద్ధి చేసుకొనేందుకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేకపోవడం చేత తను కాంట్రాక్టర్ల దగ్గర లంచం తీసుకొంటున్నానని ప్రకటించారు. చనిపోయిన తరువాత కూడా తనను ప్రజలు గుర్తుంచుకోవాలనే ఉద్దేశ్యంతోనే ప్రజలకు ఉపయోగపడే కొన్ని మంచి పనులు చేయడానికి కాంట్రాక్టర్ల దగ్గర లంచం తీసుకొంటున్నానని ప్రభాకర్ రెడ్డి మీడియాకి తెలిపారు. అయితే ఆ డబ్బుని తను డీడీల రూపంలో తీసుకొంటూ దానికి ఆడిట్ లెక్కలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తానేమీ దీనిని రహస్యంగా దాచిపెట్టడం లేదని పూర్తి పారదర్శకతతో లెక్కలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎవరయినా ఆ లెక్కలు చూసుకోవచ్చని తెలిపారు.
అధికార పార్టీకి చెందిన ఒక ప్రజా ప్రతినిధి అయిన ప్రభాకర్ రెడ్డి తను లంచం తీసుకొంటున్నట్లు బహిరంగంగా ప్రకటించడం పైగా అదేమీ నేరం కాదన్నట్లు చెప్పడం, తన నియోజక వర్గం అభివృద్ధికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని చెప్పడం ప్రతిపక్షాలకు బలమయిన ఆయుధం అందించినట్లయింది. ఆయన మాట్లాడిన ఈ మాటలకు తెదేపా ప్రభుత్వం ప్రజలకు, ప్రతిపక్షాలకు సంజాయిషీలు చెప్పుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆయన ప్రభుత్వాన్ని వారి ముందు దోషిగా నిలబెట్టారు. రాష్ట్రంలో ఒక్క నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేనప్పుడు అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి అన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చేయి? ఎందుకు అంత ఖర్చు చేసింది? అని ప్రతిపక్షాలు నిలదీయకమానవు.