ఇద్దరు చంద్రులు దగ్గరయితే కాంగ్రెస్ కి అభ్యంతరం ఎందుకు?
posted on Oct 23, 2015 8:03PM
(1).jpg)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ చూపడం, అందుకు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా సానుకూలంగా స్పందించడం ఇదే మొదటిసారి అని భావించవచ్చును. రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, వైకాపాలు అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి హాజరు కాలేదు. కానీ ఇంతవరకు రాష్ట్రంతో యుద్ధం చేస్తున్న కేసీఆర్ హాజరయ్యారు. హాజరయినందుకు ఆయనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సముచితంగా గౌరవించింది. అందుకు ఆయన కూడా మరింత హుందాగా స్పందించారు. అది చూసి రెండు రాష్ట్రాల ప్రజలు చాలా సంతోషించారు. కానీ బద్ధ శతృవులయిన వారిద్దరి కలయిక చూసి కాంగ్రెస్ నేతలు కంగారు పడుతున్నట్లున్నారు. అందుకే అదేదో పెద్ద కుట్ర అన్నట్లుగా షబ్బీర్ అలీ మాట్లాడారు. వారిద్దరినీ కలిపింది ఎవరో తనకి తెలుసని సమయం వచ్చినప్పుడు వారి పేరు బయటపెడతానని అన్నారు. నిజానికి అదేదో ఇప్పుడే బయటపడితే అటువంటి మంచిపని చేసినందుకు రెండు రాష్ట్రాల ప్రజలు ఆ వ్యక్తిని అభినందించేవారు.
ఇంతవరకు కత్తులు దూసుకొంటున్న వారిద్దరినీ కలపడానికి చాలా మంది ప్రయత్నించి విఫలమయ్యారు. కానీ ఎవరయితేనేమి వారి మధ్య రాజీ కుదిర్చగలిగారు. దాని వలన రెండు రాష్ట్రాలకు మేలు జరుగుతుందే తప్ప కీడు జరుగదు. మరి అటువంటప్పుడు వారి మధ్య సయోధ్య కుదర్చడం అంటే ఏదో పెద్ద కుట్ర జరిగినట్లు షబ్బీర్ అలీ చెప్పడం హాస్యాస్పదం. వారిరువురు సఖ్యతగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సఖ్యత ఏర్పడుతుంది. దాని వలన గోటితో పోయే సమస్యల కోసం ఇదివరకులాగా గొడ్డలి వాడకుండా గోటితో తొలగించేందుకు అవకాశం ఏర్పడుతుంది. దాని వలన రెండు రాష్ట్రాల మధ్య, ప్రభుత్వాల మధ్య, ప్రజల మధ్య మళ్ళీ సత్సంబంధాలు పెరుగుతాయి. ఇంతవరకు ఒకరిపై మరొకరు కత్తులు దూసుకోవడంపైనే దృష్టి పెట్టిన ఇరువురు మంత్రులు ఇక నిశ్చింతగా తమతమ రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేయవచ్చును. ప్రజలు కూడా అదే కోరుకొంటున్నారు. కనుక వారిద్దరికీ మధ్య రాజీ కుదిర్చిన వ్యక్తి పేరు తెలిసి ఉండి ఉంటే షబ్బీర్ అలీ వెంటనే బయటపెట్టగలిగితే అందరూ తెలుసుకొని సంతోషిస్తారు.