ప్రమాదంలో అమరావతి... ‘టీవోఐ‘ వార్నింగ్ స్టోరీ
posted on Oct 24, 2015 12:38PM

నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది, అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారే తప్ప, అక్కడ రాజధాని నిర్మాణం చేపట్టాలనుకునే ముందు కనీస జాగ్రత్తలు తీసుకోలేదని, గుంటూరు జిల్లాలో భూతత్వం, అక్కడి భౌగోళిక పరిస్థితుల గురించి అధ్యయనం చేయలేదని, చివరికి ఎన్జీఆర్ఐని కానీ, భూకంప శాస్త్రవేత్తలను గానీ సంప్రదించలేదని రాసుకొచ్చింది.
గుంటూరు జిల్లాలోని చాలా ప్రాంతాలు భూకంప ప్రమాదంలో ఉన్నాయన్న టైమ్స్ ఆఫ్ ఇండియా... నవ్యాంధ్ర రాజధాని అమరావతి అయితే మూడో సెస్మిక్ జోన్ ఉందంటూ హెచ్చరించింది, మూడో సెస్మిక్ జోన్లో రిక్టర్ స్కేల్ పై 7.0 పాయింట్ల తీవ్రతతో భూకంపాలు సంభవిస్తాయని, అవి ఒక్కోసారి మరింత ప్రమాదకరమైన స్థాయిలో ఉండే అవకాశముందని రాసుకొచ్చింది. దీనికి గతంలో జరిగిన భూకంపాల నివేదికలను టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రస్తావించింది, 1950లో ఒంగోలులో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.2గా నమోదైందని, అదే భూకంపం అమరావతిలో సంభవిస్తే దాని ప్రభావం 5.5గా ఉంటుందని విశ్లేషించింది.
అయితే అమరావతిలో రాజధాని నిర్మాణం చేపట్టాలని నిర్ణయించాక ఏపీ ప్రభుత్వం... ఎన్జీఆర్ఐ, భూకంప శాస్త్రవేత్తలను సంప్రదించలేదని టైమ్స్ ఆఫ్ ఇండియా రాసుకొచ్చినా, అమరావతిని ఎంపిక చేసిన సమయంలోనే నిపుణులు, శాస్త్రవేత్తలు... ముందుస్తుగానే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చినట్లు తెలుస్తోంది. భూకంప ప్రమాదాల జోన్ లో అమరావతి ఉన్నందున అక్కడ 9 పాయింట్ల భూకంప తీవ్రతను తట్టుకునేలా నిర్మాణాలు చేపట్టాలని, అప్పుడే ఎలాంటి భూకంపాలనైనా తట్టుకోగలుగుతాయని నిపుణులు, శాస్త్రవేత్తలు అంటున్నారు.