జి.హెచ్.యం.సి. ఎన్నికల తరువాతే తలసాని రాజీనామా?

 

హైదరబాద్ లో సనత్ నగర్ నియోజక వర్గం నుండి తెదేపా టికెట్ మీద అసెంబ్లీ కి ఎన్నికయిన తలసాని శ్రీనివాస్ యాదవ్, తను నైతిక విలువలకి చాలా ప్రాధాన్యం ఇచ్చేవాడినని అందుకే పార్టీకి, తన ఎమ్మేల్యే పదవికి కూడా రాజీనామా చేసిన తరువాతనే తెరాసలో చేరుతున్నానని చాలా గొప్పగా చెప్పుకొన్నారు. కానీ ఏడు నెలలు గడిచిపోయినా స్పీకర్ ఆయన రాజీనామాను ఆమోదించలేదు. ఆయన ఆమోదించక పోతే ఆ తప్పు తనది కాదని తలసాని వాదిస్తున్నారు కానీ నైతిక విలువల గురించి మాట్లాడిన ఆయన తన రాజీనామాను ఆమోదింప జేసుకొనే ప్రయత్నం చేయలేదు. ఇతర పార్టీలకి నీతులు చెప్పే తెరాస ఆ నీతి తనకు వర్తించదని అనుకొందో ఏమో తెలియదు కానీ నేటికీ ఆయన తెరాస ప్రభుత్వంలో తెదేపా ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. స్పీకర్ కి తెదేపా ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఆయన వాటిని పట్టించుకోలేదు. కనుక తెదేపా హైకోర్టులో పిటిషన్ వేయవలసి వచ్చింది. ఇటువంటి అనైతిక పద్దతులను అమలుచేస్తున్నప్పుడు వాటిని నియంత్రించవలసిన వారు కూడా పట్టించుకోకపోవడం వలన అదే ఒక సంప్రదాయంగా మారే అవకాశాలున్నాయి.

 

ఏదో చీమ కదా చెప్పుకొన్నట్లుగా అయితే తలసాని రాజీనామాను ఎప్పుడు ఆమోదిస్తారు? అంటే జి.హెచ్.యం.సి. ఎన్నికల తరువాత అని తెరాస వర్గాల నుండి జవాబు వినిపిస్తోంది. అయితే ఉపఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు అంటే వార్డుల పునర్విభజన జరిగిన తరువాత అంటున్నారు. వార్డుల పునర్విభజన ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుంది అంటే వచ్చే జనవరి నాటికవుతుందేమో? అనే చెపుతున్నారు. కనుక తలసాని రాజీనామా కూడా ఆ తరువాతే అంటే ఏ మార్చి, ఏప్రిల్ నెలలోనో ఆమోదిస్తారేమో?

 

ఒకవేళ ఆయన ఇప్పుడు రాజీనామా చేసినట్లయితే ఆరు నెలలలోగా ఉపఎన్నికలలో గెలవవలసి ఉంటుంది. కానీ జి.హెచ్.యం.సి. ఎన్నికలలో ఎలాగయినా గెలవాలని తెరాస చాలా పట్టుదలగా ఉంది కనుక అవి పూర్తయ్యేవరకు ఆయన చేత అటువంటి ప్రయోగాలు చేయడం అంత మంచి ఆలోచన కాదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ దైర్యం చేసి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సిద్దపడినా ఆయన ఒకవేళ గెలవలేకపోతే ఆ ప్రభావం జి.హెచ్.యం.సి. ఎన్నికల మీద పడుతుంది. ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయవలసి వస్తుంది. అది తెరాస ప్రభుత్వానికి చాలా నష్టం కలిగిస్తుంది కనుకనే ఈ జి.హెచ్.యం.సి. ఎన్నికల కార్యక్రమం ఏదో ముగించిన తరువాత అప్పుడే ఆయన రాజీనామా గురించి ఆలోచించవచ్చని తెరాస భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఒకవేళ ఈ లోగా గవర్నర్ లేదా హైకోర్టు ఆయన రాజీనామాను ఆమోదించమని స్పీకర్ ని కోరితే ఏమి చేస్తారో? తలసానిని పార్టీలో చేర్చుకొన్నంత మాత్రాన్న ఆ నోయోజక వర్గ ప్రజలు కూడా తెదేపా నుండి తెరాసకు ఆయనంత విజీగా షిఫ్ట్ అయిపోతారా? అని పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్న కూడా ఆలోచించదగ్గదే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu