ఏపీకి టోపీ...!
posted on May 5, 2016 4:29PM
.jpg)
అంతన్నారు..ఇంతన్నారు. అదిగో హోదా...ఇదిగో స్పెషల్ స్టేటస్ అంటూ ఆశ కల్పించారు. చివరికి ఏం చేశారు "ఏపీకి హోదా ఇవ్వం పొమ్మన్నారు". గత ఏడాది డిసెంబర్ 21వ తేదిన లోక్‌సభ సమావేశాల్లో భాగంగా జీరో అవర్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలని తెలుగుదేశం ఎంపీ అవంతి శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు...కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. గత నెల 25వ తేదీన అవంతి శ్రీనివాస్‌కు లేఖ ద్వారా వివరాలు తెలిపారు.
హోదా గురించి చట్టంలో లేదు 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో ఏపీ పునర్విభజన బిల్లుపై జరిగిన చర్చలో అప్పటి ప్రధాని జోక్యం చేసుకుంటూ కేంద్ర సాయం నిమిత్తం 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లపాటు ప్రత్యేకహోదా కల్పిస్తామన్నారు. కానీ అదే ఏడాది జూన్ 2న అమల్లోకి వచ్చిన చట్టంలో ప్రత్యేకహోదా గురించి ఏమీ పేర్కొనలేదన్నారు....ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అవసరమైన నిబంధనలను సవరించాలని ఆర్ధిక సంఘం చెప్పలేదు అని లేఖలో వివరించారు. దీనిని బట్టి మా వైఖరి మీకు స్పష్టంగానే అర్థమై ఉంటుంది అంటూ లేఖను ముగించారు. రెవెన్యూ లోటును కూడా భర్తీ చేయాలని చట్టంలో లేదని..అయినప్పటికీ, అవసరమైనంత వరకు ప్రత్యేక సాయం అందిస్తున్నామని సన్నాయి నొక్కులు నొక్కారు.
2014 ఎన్నికల సమయంలో తిరుపతి, భీమవరంలలో జరిగిన ఎన్నికల ప్రచారసభల్లో నరేంద్రమోడీ ఏపీ మీద ప్రేమ ఒలకబోశారు. "తల్లిని చంపి బిడ్డను బతికించారని" విభజన విషయంలో ఏపీకి జరిగిన అన్యాయానికి నేను న్యాయం చేస్తానంటూ తెగ బాధపడ్డారు. అయినా ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకునే ఉద్దేశ్యం "మోడీకి" ఏ కోశానా లేదు. "ఏరు దాటేకా తెప్ప తగలేసినట్టు" ఎన్నికల వేళ ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తామంటూ నినదించిన ప్రధాని, ఇప్పుడు ఏపీ కోసం నిబంధనల్ని మార్చలేం అంటూ ప్రకటించారు...సారి "ప్రకటింపచేశారు". అయినా మన పిచ్చిగాని ఏపీకి ప్రత్యేక "హోదా ఇవ్వలేం..ఇచ్చే ఉద్దేశ్యం మాకు లేదు" అని మోడీ తన టీం చేత పదే పదే చెప్పిస్తున్నా..అర్థం చేసుకోకపోవడం మన అమాయకత్వానికి నిదర్శనం. మొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌదరి, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని తేల్చి చెబితే, తాజాగా కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా అదే మాట స్పష్టం చఏశారు. ఇంకా ఎంతమంది చేత చెబితే మనవాళ్లకు అర్థమవుతుంది.
మోడీ సంగతి పక్కనబెడితే మరి పొద్దున్న లేగిస్తే ఢిల్లీలో తెలుగువాళ్ల పెద్ద దిక్కునని ఏ కష్టం వచ్చినా తీరుస్తానని చంకలు గుద్దుకునే వెంకయ్యనాయుడు మరి తెలుగువాళ్లకి ఏం సమాధానం చెపుతారు. నిన్న మొన్నటి వరకు మోడీ తమపై దయ చూపిస్తారని ఆశ పడ్డ కోట్లాది ఆంధ్రులకు ఈ వార్త శరాఘాతమే. పార్లమెంట్ సాక్షిగా ఒకసారి అన్యాయానికి గురైన మనం మరోసారి అదే పార్లమెంట్ సాక్షిగా దగా పడ్డాం.