బీజేపీ "అగస్టా"ను ఎందుకు తవ్వుతోంది..?
posted on May 5, 2016 2:46PM

గత కొద్ది రోజులుగా భారత పార్లమెంట్ ఉభయసభలను దద్దరిల్లేలా చేస్తున్నఅంశం అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణం. ప్రతిరోజు దీనిపై అధికార, ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసుకుంటూ ఉభయసభలను కుదుపేస్తున్నాయి. తొలిసారి కాంగ్రెస్‌పై బీజేపీ దాడికి దిగింది. దీంతో కాంగ్రెస్ ఇరుకునపడింది. మారుతున్న అవసరాల దృష్ట్యా, మన వైమానికి దళానికి కొత్తరకం హెలికాఫ్టర్లు అవసరమయ్యాయి. దేశంలోని ప్రముఖుల పర్యటనలకే కాకుండా, సియాచిన్ వంటి ఎత్తైన ప్రాంతాల్లో బాధ్యతలు నిర్వహించేందుకు మరింత సమర్థవంతమైన హెలికాఫ్టర్లు కావాల్సి వచ్చాయి. ఇందుకోసం ఇటలీకి చెందిన అగస్టా సంస్థ రూపొందించిన హెలికాఫ్టర్లకు అనుగుణంగా అప్పటి ఎయిర్ చీఫ్ మార్షల్ త్యాగి నిబంధనల్లో మార్పులు చేశారని దానికి కేంద్రంలోని కాంగ్రెస్ పెద్దలు పావులు కదిపినట్టు తేలింది.
అగస్టా హెలికాఫ్టర్లను మనకు అంటగట్టేందుకు గానూ దళారులు రంగంలోకి దిగారు. కీలక నిర్ణయాలు తీసుకునే అధినేతల నుంచి మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, సలహాదారులు..ఇలా అధికారంలో ఉన్న ప్రతీ అంచెలన్నింటికి ముడుపులు అందినట్టు బీజేపీ ఆరోపించింది. ఈ మాట తాము అనడం లేదని సాక్షాత్తూ ఇటలీ సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని కమలం ఆధారాలు చూపిస్తోంది. అగస్టా యాజమాన్యం కూడా తాము భారత అధినాయకత్వానికి లంచాలు ఇచ్చామని కోర్టులో ఒప్పుకుంది. ఈ నేపథ్యంలో లంఛం ఇచ్చేవారు బయటపడ్డారని, తీసుకున్నవాళ్లేవరో తెలియాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
అటు తిరిగి ఇటు తిరిగి ఈ మ్యాటర్‌లోకి సోనియా గాంధీ రావడంతో ఆమె దీనిపై సీరియస్ అయ్యారు. ప్రభుత్వం ఈ ఆరోపణలను నిరూపించాలని సవాల్ చేశారు. అయితే అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఒక్కసారి కూడా నోరు విప్పని బీజేపీ ఇంత అకస్మాత్తుగా ఇప్పుడు మరుగునపడిపోయిన అగస్టా కుంభకోణాన్ని తలకెత్తుకుంది. హెచ్‌సీయూ జేఎన్‌యూ, శ్రీనగర్ నిట్, ఉత్తరాఖండ్, అరుణాచల్‌ప్రదేశ్ సంక్షోభాలు, రాష్ట్రపతి పాలన, లాతూర్ కరువు ఇలా పలు విషయాల్లో కేంద్రంలోని బీజేపీ పనితీరు సరిగా లేదని ప్రతిపక్షాలు, మీడియా దుమ్మెత్తిపోశాయి. ఉన్నపళంగా ప్రజల దృష్టిని డైవర్ట్ చేయాలంటే ఏదో ఒక వంక కావాలి.
అదే అగస్టా కుంభకోణం. అందుకే దీనిపై చకచకా పావులు కదిపింది. సుబ్రమణ్యస్వామిని రాజ్యసభకు ఎన్నుకోవడం కూడా అగస్టా వంటి కుంభకోణాలను తిరగతోడటమే లక్ష్యంగా కనిపిస్తోంది. పైగా ఇలాంటి విషయాల్లో స్పెషలిస్ట్ అయిన సుబ్రమణ్యస్వామి సహజంగానే రెచ్చిపోయారు. ఆయన దాటికి తట్టుకోలేక కాంగ్రెస్ డిఫెన్స్‌లో పడిపోయింది. ఎవరి రాజకీయ స్వప్రయోజనాల కోసం వారు తహతహలాడుతున్నారు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. దేశానికి కుంభకోణాలు కొత్తకాకున్నా..సాక్షాత్తూ రక్షణశాఖలోనే ఇలాంటి కుంభకోణాలు బయటపడుతుంటే మన సైనికుల నైతిక స్థైర్యం ఏమైపోవాలి. దేశం లోపల మనం తిట్టుకున్నా, కొట్టుకున్నా, మన స్వేచ్ఛ కోసం తమ ప్రాణాలను బలిపెట్టే వారి ధైర్యం ఏమైపోవాలి.