మళ్లీ మొదలైన శశికళ పొలిటికల్ గేమ్

గత వారం రోజులుగా ముఖ్యమంత్రి కుర్చీ కోసం తమిళనాట జరుగుతున్న గేమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. ఎత్తులు..పై ఎత్తులు, కౌంటర్లు..రీకౌంటర్లు ఇలా ఒక సినిమాకు కావాల్సినన్ని కోణాలు ఈ వ్యవహారంలో ఉన్నాయి. ఏ రోజుకారోజు తమకు గవర్నర్ నుంచి పిలుపు వస్తుందని ఇటు శశికళ..అటు పన్నీర్ సెల్వం ఎదురుచూపులు చూశారు.  నిన్న మొన్నటి వరకు ఇద్దరి బలబలాలు సమంగానే ఉన్నాయి..కానీ ఇవాళ్టీ సుప్రీం తీర్పుతో అంతా పన్నీర్ చేతుల్లోకి వచ్చేసింది. అక్రమాస్తుల కేసులో ఆమెను అత్యున్నత న్యాయస్థానం దోషిగా తేల్చడంతో..ఇక చిన్నమ్మ సీఎం అయ్యే అవకాశం లేదు.

 

 

అంతేకాదు మరో పదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు లేకుండా అనర్హత వేటు పడింది. సీన్ కట్ చేస్తే మరికాసేపట్లో చిన్నమ్మ అరెస్ట్..సరే ఇదంతా పక్కనబెడితే ఇంత జరిగినా..చివరికి తాను అరెస్ట్ కాబోతున్నా కూడా శశికళ తన ఓటమిని అంగీకరించడం లేదు. కింద పడ్డా తనదే పై చేయి అన్నట్లు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూనే ఉంది. తన స్థానంలో సీఎం అభ్యర్థిగా పళనిస్వామిని తెరమీదకు తీసుకువచ్చి గవర్నర్‌‌తో భేటీ అయ్యేలా ప్లాన్ గీశారు.

 

 

ఇప్పుడు స్వామి అన్నాడీఎంకే శాసనసభాపక్షనేత...129 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆయనకు ఉంది..అప్పుడంటే చిన్నమ్మకు "కోర్టు తీర్పు" పెండింగ్‌లో ఉంది కాబట్టి గవర్నర్ విద్యాసాగర్‌ రావు వేచి చూశారు..కానీ పళనిస్వామి విషయంలో మాత్రం ఆ అవకాశం లేదు. అసెంబ్లీలో బలనిరూపణ కోసం స్వామిని తప్పక పిలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు పన్నీర్ సెల్వం పరిస్థితి క్లిష్టమవుతుంది..ఏది ఏమైనప్పటికి పన్నీర్ మాత్రం ముఖ్యమంత్రి కాకూడదన్నది చిన్నమ్మ టార్గెట్.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu