ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌పై సచిన్ చిన్నచూపు?

 

ఎంతోమంది ప్రతిభావంతులైన క్రికెటర్లని దేశానికి అందించిన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌ని భారత మాజీ క్రికెట్ కెప్టెన్, ‘భారతరత్న’ సచిన్ టెండూల్కర్ చిన్నచూపు చూస్తున్నారా? ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సభ్యులను కలవటానికి కూడా ఇష్టపడటం లేదా? ప్రస్తుతం తలెత్తిన పరిస్థితులను చూస్తుంటే ఈ ప్రశ్నలకు ‘అవును’ అని సమాధానం చెప్పక తప్పడం లేదు. ఇంతకీ సచిన్ టెండూల్కర్‌ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు ఏవైనా మణులు, మాణిక్యాలు అడిగారా? ఆచరణ సాధ్యం కాని గొంతెమ్మ కోరికలేవైనా కోరారా? అలాంటివేమీ లేదు.. కేవలం సచిన్ టెండూల్కర్ని ఒక్కసారి కలవాలనుకున్నారు. భారతీయ క్రికెట్‌కి ఎంతో సేవ చేసిన ఆయనను సత్కరించి, తమను తాము సత్కరించుకున్నట్టు ఫీలవ్వాలని అనుకున్నారు. అయితే వారి ఈ కోరికని సచిన్ టెండూల్కర్ పట్టించుకోవడం లేదని సమాచారం. కనీసం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సభ్యులను కలవటానికి కూడా సచిన్ ఇష్టపడటం లేదని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్వాపరాలను పరిశీలిస్తే....


సచిన్ టెండూల్కర్ ఆగస్టు ఒకటో తేదీన విజయవాడకి రాబోతున్నారు. వ్యాపారవేత్త, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ విజయవాడలో నిర్మించిన ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సచిన్ టెండూల్కర్ వస్తున్నారు. సచిన్ ఆంధ్రప్రదేశ్‌కి వస్తున్న నేపథ్యంలో ఆయన్ని కలవాలని, సత్కరించాలని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు ఆశించారు. అయితే సచిన్ దీనికి అంగీకరించలేదు. దీని వెనుక వున్న మూల కారణాన్ని పరిశీలిస్తే, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు గంగరాజుకి, సచిన్ టెండూల్కర్‌ విజయవాడకు రావడానికి సహకరిస్తోన్న చాముండేశ్వరీనాథ్‌కి పాత గొడవలు ఏవో వున్నాయి. దాంతో గంగరాజు అధ్యక్షుడిగా వున్న ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సభ్యులను సచిన్ కలవకుండా చాముండేశ్వరినాథ్ అడ్డుపుల్ల వేసినట్టు తెలుస్తోంది.

 

పొట్లూరి వరప్రసాద్ షాపింగ్ మాల్‌ను ప్రారంభించిన అనంతరం సచిన్ చాలా గంటలు విజయవాడలోనే వుండబోతున్నారు. ఆయనకు ఈ సందర్భంగా పొట్లూరి వరప్రసాద్ సత్కార కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. తమకు ప్రారంభోత్సవంలో లేదా సత్కార కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇవ్వాలని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు కోరినప్పటికీ పొట్లూరి వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది. పొట్లూరి వరప్రసాద్‌ని కూడా చాముండేశ్వరినాథ్ ప్రభావితం చేశారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ విషయం మీద ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐ అధికారులను సంప్రదించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని తెలుస్తోంది. మొత్తమ్మీద ఇద్దరు వ్యక్తుల మధ్య వున్న వ్యక్తిగత విభేదాల కారణంగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు సచిన్ టెండూల్కర్‌ని కలసి స్ఫూర్తిని పొందే అవకాశం లేకుండా పోతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu