రాబర్ట్ వాద్రాకు కూడా కష్టకాలం మొదలయినట్లేనా?
posted on Jul 15, 2014 9:39PM
.jpg)
రాబర్ట్ వాద్రాకు కూడా కష్టకాలం మొదలయినట్లేనా? కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమె కుమారుడు రాహుల్ గాంధీలకు నేషనల్ హెరాల్డ్ ఆస్తుల దుర్వినియోగం కేసులో ఆదాయపు శాఖ నోటీసులు జారీచేసింది. సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా పేరు కూడా అనేక భూ కుంభకోణాలలో వినిపించింది. అయితే ఇంతవరకు కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉండటం వలన ఈ కేసులేవీ వారిని ఏమీ చేయలేకపోయాయి. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ అవినీతిపై ఉక్కుపాదం మోపేందుకు సిద్దమవడంతో అవినీతిపరులకు గుండెల్లో గుబులు మొదలయింది.
కేంద్రంలో యూపీయే, హర్యానా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే అశోక్ ఖిమ్కా అనే ఐఏయస్ అధికారి రాబర్ట్ వాద్రాకు చెందిన స్కై లైట్ హాస్పిటాలిటి మరియు డీయల్.యఫ్. సంస్థల మధ్య రూ.58కోట్లు విలువ చేసే భూమార్పిడి వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించి దానిని రద్దు చేయడమే కాక దర్యాప్తుకు కూడా ఆదేశించారు. దానితో ఆగ్రహం చెందిన హర్యానా ముఖ్యమంత్రి భూపేంద్ర హుడా ఆయనను బదిలీ చేయడమే కాకుండా ముగ్గురు ఐఏయస్ అధికారులతో కూడిన ఒక కమిటినీ కూడా వేసి క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ ఆయనపై చర్యలకు సిద్దమయింది. అయితే నిజాయితీపరుడైన తన 22సం.లలో 44సార్లు బదిలీలు అయ్యారు. కనుక హర్యాన ప్రభుత్వ బెదిరింపులకి భయపడకుండా, హర్యానాలో జరిగిన, జరుగుతున్న అనేక కుంభకోణాలను పేర్కొంటూ ప్రభుత్వానికి 105 పేజీలతో కూడిన ఒక లేఖ వ్రాసారు. ఆ తరువాత ఆయన తనను కేంద్రానికి బదిలీ చేయవలసిందిగా ఏప్రిల్ నెలలో దరఖాస్తు చేసుకొన్నారు. కానీ అప్పటికి కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ఆయనను కేంద్రానికి రప్పిస్తే పక్కలో పామును పెట్టుకోన్నట్లే అవుతుందని ఆయన విన్నపాన్ని పట్టించుకోలేదు.
కానీ ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వాలు మారి నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చెప్పట్టడంతో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు వ్యతిరేఖంగా పోరాడిన అశోక్ ఖిమ్కాను త్వరలోనే కేంద్ర సర్వీసులకు బదిలీ చేసేందుకు మోడీ అంగీకరించినట్లు ఉన్నతాధికారులు చెపుతున్నారు. బహుశః మరొకటి రెండు వారాల్లో అశోక్ ఖిమ్కా కేంద్రానికి బదిలీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే రాబర్ట్ వాద్రాకు కూడా కష్టకాలం మొదలయినట్లే భావించవచ్చును. హర్యాన ముఖ్యమంత్రి నిజాయితీపరుడైన అశోక్ ఖిమ్కాను వేదించి శిక్షించబోతే, ఆయనకు మోడీ ప్రభుత్వం పదోన్నతి కల్పించి గౌరవించడం చాలా హర్షణీయం.