పీవీ స్మృతి చిహ్నం... కాంగ్రెస్‌కి చెంపదెబ్బ



కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా జరిపిన విధ్వంసం నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఇది దేశం మొత్తానికీ శుభవార్త. అయితే దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన కాలంలో కొన్ని ప్రయోజనాలు కూడా జరిగాయి. అయితే ప్రయోజనాలకంటే విధ్వంసాలే ఎక్కువ కావడంతో ఆ ప్రయోజనాలన్నీ మరుగున పడిపోయాయి. పీవీ నరసింహారావు కాంగ్రెస్ నాయకుడిగా, ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆయన తెచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించాయి. మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన దేశ ప్రజలు రుణపడి వున్న ప్రధానమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఆ తర్వాత ఆయనను కాంగ్రెస్ పార్టీ సోనియాగాంధీ ఆదేశాల మేరకు ఘోరంగా అవమానించింది. పీవీ దేశాన్ని ఎంత ముందుకు తీసుకెళ్ళారో, సోనియాగాంధీ దేశాన్ని అంతకు వందరెట్లు తిరోగమన బాట పట్టించారు. అలాంటి మహానుభావుడికి దేశ రాజధానిలో స్మృతి చిహ్నం ఏర్పాటు చేయాలన్న ఇంగిత జ్ఞానం కూడా కాంగ్రెస్ పార్టీకి లేకుండా పోయింది. స్మృతి చిహ్నం సంగతి తర్వాత... దేశానికి నాయకత్వం వహించిన ఆయన అంత్యక్రియలు ఢిల్లీలోనే నిర్వహించాలనే బాధ్యతని అప్పుడు మరచిపోయింది. హైదరాబాద్‌లో అత్యంత అవమానకరంగా జరిపిన పీవీ అంత్యక్రియలను దేశ ప్రజలు మరచిపోలేరు. అయితే దేశానికి, కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేసిన పీవీ నరసింహారావును కాంగ్రెస్ పార్టీ విస్మరించినా, దేశం విస్మరించలేదు. ఢిల్లీలో పీవీ నరసింహారావు స్మృతి చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిర్ణయించడం అభినందనీయం.

పీవీ స్మృతి చిహ్నం ఏర్పాటు చేయాలన్న మోడీ ప్రభుత్వ నిర్ణయాన్ని పీవీ కుమార్తె, ప్రముఖ విద్యావేత్త వాణీదేవి స్వాగతిస్తున్నారు. మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇంతకాలం పీవీ నరసింహారావును నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్ పార్టీకి చెంపదెబ్బ లాంటిదని ఆమె అభివర్ణిస్తున్నారు. తన తండ్రి మరణించిన సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరించిన తీరు ఇప్పటికీ తమకు బాధను కలిగిస్తూ వుంటుందని, అప్పటి కేంద్రమంత్రులు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి పీఠం మీద వున్న వైఎస్ రాజశేఖరరెడ్డి తమకు పీవీ స్మృతి చిహ్నం విషయంలో ఎన్నెన్నో వాగ్దానాలు చేసి వాటన్నిటినీ విస్మరించారని ఆమె గుర్తు చేసుకున్నారు. తమ తండ్రి మరణించిన వెంటనే ఆయన భౌతిక కాయాన్ని ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కి పంపించేంతవరకూ కాంగ్రెస్ నాయకులు తమని హడావిడి పెట్టేశారని ఆమె చెప్పారు. తమ తండ్రికి ఢిల్లీలో స్మృతి చిహ్నం ఏర్పాటు  విషయంలో తమ కుటుంబం మొత్తం ఆశలు వదులుకున్న సమయంలో ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయం తమకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని ఆమె అన్నారు. ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వానికి వాణీదేవి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.