కడప వైసీపీలో ముసలం
posted on Apr 6, 2015 6:26PM

వైసీపీ నాయకుడు జగన్ వైఖరి రాష్ట్ర ప్రజలకు చిరాకు తెప్పిస్తోంది. ఇటీవలి కాలంలో మరీ ముదిరిపోయిన ఆయన వ్యవహార శైలి జనానికి చిరాకు తెప్పిస్తోంది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ ప్రాజెక్టుల విషయంలో జగన్ అనుసరిస్తున్న విధానాన్ని జనం జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా రాయలసీమ ప్రజలు ఈ ప్రాజెక్టుల విషయంలో జగన్ తీరును తప్పుపడుతున్నారు. రాయలసీమ ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు పట్టిసీమ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అయితే జగన్ మాత్రం ఆ ప్రాజెక్టువల్ల రాయలసీమకు ఎంతమాత్రం ఉపయోగం లేదని వాదించడం మొదలుపెట్టడంతోపాటు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రిని కలిసి, పట్టిసీమ ప్రాజెక్టు వేస్టు అని చెప్పడం ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పించింది. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులను వ్యతిరేకించడంతోపాటు ఆ ప్రాజెక్టులను ఇరుగు పొరుగు రాష్ట్రాలు అడ్డుకునేలా ఐడియాలు కూడా ఇస్తున్న జగన్ని ఏమనాలో అర్థంకాక ఆయన వైఖరిని గమనిస్తూ వున్నారు. అయితే జగన్ వ్యవహార శైలి ప్రజలకు ఎంత ఇబ్బందిగా మారిందో, ఆయన పార్టీలోని నాయకులకు కూడా అంతే ఇబ్బందిగా మారింది. జగన్ ఎలాంటి వృధా ఆందోళనలు చేసినా ఆయన వెంట నిలిచిన ఎమ్మెల్యేల్లోనే ఇప్పుడు తిరుగుబాటు వస్తోంది. ముఖ్యంగా పట్టిసీమ విషయంలో రాయలసీమలోని వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ వైఖరిని సమర్థించడం లేదు. మొన్నటి వరకూ గుంభనంగా వున్న ఆ నిరసన ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. అది వైసీపీ పాలిట ముసలంగా మారే అవకాశాలను కూడా తీసిపారేయలేం.
వైఎస్ జగన్ పట్టిసీమ ప్రాజెక్టును వ్యతిరేకించడాన్ని జీర్ణించుకోలేని వైసీపీ ఎమ్మెల్యే జగన్ వైఖరికి వ్యతిరేకంగా గళం విప్పారు. జగన్ కంచుకోటగా భావించే కడప జిల్లాకి చెందిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు) జగన్ వైఖరిని పరోక్షంగా తప్పుపడుతూ, పట్టిసీమ ప్రాజెక్టుకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల రాయలసీమకు మేలు జరుగుతుందని ఘంటాపథంగా చెప్పడంతోపాటు పట్టిసీమ కోసం ప్రత్యేక నిధుల కేటాయించాలని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టిసీమపై ప్రత్యేక చట్టం తెచ్చి ప్రాజెక్టును పటిష్టం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. జగన్‌కి వ్యతిరేకంగా ఆదినారాయణరెడ్డి పట్టిసీమను సమర్థించడం జగన్‌కి పెద్ద షాక్. ఇప్పుడు ఆదినారాయణరెడ్డి ఒక్కరే బయటపడ్డారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా జగన్ వైఖరిని వ్యతిరేకిస్తున్నారని, సమయం, సందర్భం చూసుకుని వారు కూడా జగన్ని వ్యతిరేకిస్తారని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ జగన్ పార్టీలో ముసలం పుట్టింది... ఇక ముందు ముందు ఏం జరగబోతోందో వేచి చూడాలి.