తెలంగాణ ప్రజలు వైకాపాను ఆదరిస్తారా?
posted on Apr 6, 2015 7:14AM
.jpg)
జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల ఆంద్ర, తెలంగాణాలలో వైకాపాను కాపాడుకొనేందుకు చేసిన కృషి గురించి అందరికీ తెలుసు. అందుకోసం షర్మిల ఏకబిగిన 3000 కిమీ పాదయాత్ర చేసారు కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయం వలన తెలంగాణాలో కోలుకోలేని విధంగా పార్టీ దెబ్బతినడంతో ఆమె కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరయింది. మడమ తిప్పనని గొప్పగా చెప్పుకొనే జగన్మోహన్ రెడ్డి ఒకసారి తెలంగాణాను విడిచిపెట్టేసి వచ్చేసిన తరువాత మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్లాలని భావిస్తున్నారో తెలియదు కానీ మళ్ళీ తెలంగాణా తన పార్టీని బలపరిచే బాధ్యత సోదరి షర్మిలకే అప్పగించడం విశేషం.
ఆ ప్రయత్నంలో భాగంగా ఆమె పరామర్శ యాత్ర పేరిట తెలంగాణాలో రెండు జిల్లాలలో పర్యటించారు. కానీ మళ్ళీ ఏమయిందో ఏమో గానీ చాలా కాలంగా ఆ ఊసేలేదు. ముందు పార్టీ నిర్మాణం చేసుకొన్న తరువాతనే ఆమె తెలంగాణాలో పర్యటించినట్లయితే పూర్తి ప్రయోజనం ఉంటుందని వైకాపా భావిస్తున్నందు వల్ల కావచ్చు ఆ ప్రయత్నాలు మొదలుపెట్టింది.
వైకాపా పార్టీ రాష్ట్ర కమిటీలో ఏడుగురు కార్యదర్శులు, 8 మంది సంయుక్త కార్యదర్శులు, ఇద్దరు కార్యనిర్వహక సభ్యులను నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జాబితాను విడుదల చేసారు. అదే విధంగా పార్టీ ఐటీ వింగ్, గ్రీవెన్స్‌సెల్, పబ్లిసిటీ అండ్ కల్చరల్ వింగ్, ప్రోగ్రాం కో-ఆర్డినేషన్ వింగ్, ట్రేడ్ యూనియన్ వింగ్, యువజన, మైనారిటీ, మహిళా విభాగం వంటి అనుబంధ సంఘాలలోనూ మొత్తం 24 మందిని నియమించారు. తెలంగాణా ప్రజలు వైకాపాను ఆదరిస్తారో తెలియదు కానీ త్వరలో జరుగబోయే జి.హెచ్.యం.సి ఎన్నికలలో దృష్టిలో ఉంచుకుని కమిటీలను విస్తరించినట్లు కనబడుతోంది. ఆ ఎన్నికలలో విజయం సాధించగలిగినట్లయితే తెలంగాణాలో క్రమంగా బలపడవచ్చని వైకాపా భావిస్తున్నట్లుంది.
హైదరాబాద్ జంటనగరాలలో ఆంద్ర ప్రజలు ఎక్కువగా ఉన్నారు గనుక జి.హెచ్.యం.సి ఎన్నికలలో వైకాపా కొన్ని సీట్లు గెలుచుకొనే అవకాశం ఉంది. కానీ ఆ కారణంగా అధికార తెరాసకు, ప్రతిపక్ష పార్టీలయిన తెదేపా, బీజేపీ, కాంగ్రెస్ లకు మంచి పట్టు ఉన్న మిగిలిన జిల్లాలకి వైకాపా విస్తరించగలదని ఆశించడం కష్టం.